"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

20 మార్చి, 2022

అత్యాధునిక తాత్విక కవి, విమర్శకుడు సాగర్ శ్రీరామ కవచం ( భూమిపుత్ర దినపత్రిక, 20.3.2022 సౌజన్యంతో)


 20.3.2022 భూమి పుత్ర దినపత్రిక సౌజన్యంతో

అత్యాధునిక తాత్విక కవి, విమర్శకుడు సాగర్ శ్రీరామ కవచం


 ‘‘నాకు నేనే ఒక సమస్య

నా పొడ నాకే గిట్టదు

నాలో నిరంతరం ఓ రణరంగం

.... .... .......

ఈ రభసలో నించి కవిత్వం నా నించి మీ దాకా!’’ ( జిప్సీ, పుట: 19) అంటూ నీ భావాల్నీ, నా భావాల్నీ తన భావాలుగా కవిత్వీకరించిన గొప్పకవి సాగర్ శ్రీరామ కవచం.   ఈయన ప్రముఖ కవి, నవలా రచయిత, విమర్శకుడు, సంపాదకుడుగా ప్రసిద్ధిపొందారు. ఒక కవి కవిత్వం రాయడానికి పడే అంత: సంఘర్షణను ఒక యుద్ధంలా, తనలో తానే పోటీ పడే యుద్ధంలా వర్ణిస్తూ రాసిన కవితా ఖండిక అది.  ఈయన అసలు పేరు ఎస్ రామమోహనరావు. ఈయన వచన కవిత్వం రాయడంతో పాటు, దానిలో ‘‘ముక్కాణీలు’’ అనే కొత్త కవిత రూపాన్ని సృష్టించారు. వీటీతో పాటు కొన్ని  నవలలు, కథలు, విమర్శ వ్యాసాలు రాశారు. సృజన పత్రిక నాడు-నేడు లో ఒక కవి రాసిన ఒక కవితను తీసుకుని, ఆ కవిత లోని వివిధ నిర్మాణాంశాలను వివరిస్తూ ఒక చక్కని శీర్షికను కూడా నిర్వహిస్తున్నారు. సాగర్ శ్రీరామకవచం రచనా క్రమాన్నిలా గమనించవచ్చు.

1) కొలిమి (1980), 2) చర్య (1982), 3) చెక్ పోస్ట్ (1999),4) ఇదేదో చాటు మాటు వ్యవహారమే (2001) (దీర్ఘ కావ్యం (యన్. శైలజ, జెవియన్ మూర్తిలతో సంయుక్తంగా రాశారు., 5) ముఖ్యంగ (2003), 6) జిప్సీ ' ముక్కాణీలు' (2013) కవితా సంకలనాలుగా వచ్చాయి. 1) దహనం (1999-2002), 2) మూలుగు (2005), 3) అవస్థ (2010), 4) యాతన (2015), 5) మగత (2016), 6) కుదుపు (2018), 7) వెలితి (2018), 8) నిర్వేదం (2020)మొదలైనవన్నీ నవలలు. వీటితో పాటు ‘‘ కలలోని వ్యక్తి (2001) మరో అరడజన్ కథలు’’ రాశారు. ఈయనను గుర్తించే ఒక సాహిత్య విమర్శ గ్రంథం ‘‘ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు (2020)’’ వీటితో పాటు 'ప్రకృతి సాహితి' అనే సాహిత్య మాస పత్రికను  నవంబరు 1998 నుండి జనవరి 2007 వరకు నడిపారు.దీనిలో ఎంతోమంది సాహిత్యాన్ని ప్రచురించారు. ఈ పత్రికల్లో సాగర్ చేసిన సాహిత్య ఇంటర్వ్యూలు, వ్యాసాలు ఎంతో విలువైనవి. వృత్తిరీత్యా పోస్టల్ డిపార్ట్మెంట్లో పని చేసి  పదవీ విరమణ పొందినా ప్రవృత్తి రీత్యా ఉత్తమ అభిరుచిగల నిరంతరం రాస్తున్న సాహితీవేత్త. ఈయన తెలుగు సాహిత్యంలో ఆధునిక, అత్యాధునిక ధోరణులతో కవిత్వం రాశారు. కవిత్వంలో ‘ముక్కాణీలు’’ పేరుతో ఒక కొత్ర రూప ప్రయోగం చేశారు. దాన్ని జిప్సీ పేరుతో ప్రచురించారు.

ముక్కాణీలు-ఒక తాత్విక రూప ప్రయోగం:

           తెలుగు సాహిత్యం అనేక ప్రయోగాల కూడలి. ప్రాచీన తెలుగు సాహిత్యంలో చాటువులుపంచరత్నాలునవరత్నాలుఖండకావ్యంఉదాహరణకావ్యంచక్రవాళంబిరుదావళిమంజరిపంచాననావళి మొదలైనవెన్నో కనిపిస్తాయి. ఇలా ప్రాచీన తెలుగు పద్యాన్ని అనుసరిస్తూనే ముక్కాణీలను సృష్టించానని కవి సాగర్ శ్రీరామ కవచం అంటున్నారు. ఈ ముక్కాణీల గురించి వివరిస్తూ కవి ఇలా సూత్రీకరిస్తూ ‘‘ప్రాచీన పద్య రూపాన్ని ఆధునిక వచన కవిత్వాన్ని కలిపి నేనీ రూపాన్ని ఎంచుకున్నాను. ఒక ముక్కాణీలో నాలుగేసి పాదాలతో నడిచే మూడు వచన పద్యాలు వుంటాయి. ప్రతి వచన పద్యంలో మూడు పాదాల తర్వాత విరామం వుంటుంది. నాలుగో పాదం - వై మూడు పాదాలతో సంభాషిస్తుంది. తీసుకున్న వస్తువు విస్తృతిని బట్టి 12 పాదాల నుంచి 36 పాదాలు - చివరికి 108 పాదాల దాకా ముక్కాణీలు విస్తరిస్తాయి. గాఢత, వస్తు విస్తృతి ముక్కాణీలలో సాధారణ అంశంగా పాఠకులు గమనించాల‘‘న్నారు. ఈ ముక్కాణీల్లో ఎక్కువగా జీవుని వేదన పలుకుతుంది. మనిషి జనన మరణాలు, మానవులు సాధించి పెట్టిన వారసత్వాలు, వాటిని కాపాడాలనుకొనే వాళ్ళు కొందరైతే, వాటిని భూస్థాపితం చేసి ఆధునికంగా పయనించాలనే వాళ్ళు మరికొంతమంది కనిపిస్తారు. ‘‘శతాబ్దాల తరబడి వెంటాడుతున్న గీతం/భుజాన కొందరు.../కావడిలో కొందరు.../..../మోస్తున్న తీరం యిది...’’ (పుట: 7)

ఆధునికత పేరుతో కుటుంబాలు విచ్చిన్నమై, మానవ సంబంధాలు ప్రశ్నార్థమౌతున్నాయి. ఇదంతా గమనించేవాళ్లకు అదొక సంఘర్షణ. ఆ సంఘర్షణను ఈ ముక్కాణీల్లో బాగా అభివ్యక్తం చేశారు కవి. మనిషికి శ్వాస ఆశ. ఆశ ఎక్కడ నుండి పుడుతుంది. తనని ప్రేమించేవాళ్ళుండాలి. తన చుట్టూ నలుగురు స్నేహితులైనా ఉండాలి. నావాడనే కుటుంబ సభ్యులైనా ఉండాలి. నావాడనే సమాజమైనా ఉండాలి. లేకపోతే ఈ జన్మకు అర్థమేంటి? తన కోసం ఒక తండ్రో, ఒక తల్లో, ఒక భార్యో, ఒక బిడ్డో... ఎవరొకరు ఎదురు చూస్తుండాలి. వాళ్ళ కోసం ఎలాగైనా బ్రతకాలనిపిస్తుంది. కుటుంబమనేది ఇచ్చే గొప్ప అనుబంధం ఇదే. ఆ కుటుంబమే లేకపోతే, ఆ సమాజమే తన కుటుంబమవ్వాలి. తన జీవితానికో పరమార్థముండాలి. లేకపోతే తాను జీవించడమెందుకు? తాను జీవించడం మాత్రమే జీవితమవుతుందా? తన చుట్టూ ప్రవారీకట్టేసుకొని తానొక్కడే ఈ సమాజంలో జీవించగలడా? తాను జీవించడానికి డబ్బుండవచ్చు. తనకు సేవకులుండవచ్చు. కానీ, తనని ప్రేమించే మనిషి దొరకాలి కదా. అలా దొరకాలంటే హృదయానికున్న గేట్లు తెరవాలి. తనలోని ద్వేషాన్ని వదిలేయాలి. తనలోని అరిషడ్వార్గాల్ని పారద్రోలాలి. తన మనసు నిండా మానవత్వమనే పరిమళాల్ని నింపాలి. నటన నుండి వాస్తవం వైపు పయనించగలగాలి. వాస్తవం జీవిత సత్యం వైపు చేరుకోవాలి. జీవిత సత్యమంటే, ఈ మానవుడు శాశ్వతమా? అశాశ్వతమా? ఈ తాత్విక చర్చలో, ఈ తాత్విక సంఘర్షణలో మానవుడెన్ని సార్లు మరణిస్తున్నాడో, ఎన్ని సార్లు మళ్ళీ జన్మిస్తున్నాడో... ఇటువంటి ఒక తాత్వకాంశాన్ని గేటు, పుట్టడం, శవం కావడం వంటి పదాలు వేసి... చివరిలో సత్యం తనని గెలిపిస్తే ఒక్కొక్క రంగులో కొత్త కొత్త లోకాల్ని చూడగలిగే ద్వారాన్ని తెరుస్తాడని కవి తన లక్ష్యాన్ని ప్రతీకాత్మకంగా వదిలేస్తాడు.‘ఈ గేటు మూస్తా తెరుస్తా- తెరవకుండా/నేను చాలా సార్లు పుట్టడం నేర్చుకున్నాను/రాత్రిళ్ళు నిండా శవమై మరణిస్తున్నవాడ్ని/.... .... ...../ఏ సీతాకోక చిలుకో నా కాలం గేట్లపూ ఓ లేపనంతో ( జిప్సీ, 28)



ఇలా జిఫ్సీ’’ పేరుతో ప్రచురించిన ఈ ముక్కాణీలన్నీ మనిషి పుట్టిన దగ్గర నుండి అమ్మ, కుటుంబం, సమాజం, లౌకికమైన ఆనందాలు, అనుభూతుల నుండి ఒక స్వచ్ఛమైన, అచ్చమైన మానవుడు ఆవిర్భవించేవరకూ కవి అత్యాధునిక అభివ్యక్తులతో అందించారు. మధ్యలో మనకు నిత్య జీవితంలో కనిపించే అమ్మా, నాన్న, ఇల్లు, వాకిలి, మన చుట్టూ మసలే మనుషులు, చెట్టులూ –పుట్టలూ, రైతులూ- పొలాలు, ప్రయాణికులూ- రైలు... ఇవన్నీ కవి తాత్వికతను అందుకోవడానికి ప్రయోగించిన పద చిత్రాలు. ఈ ముక్కాణీల నిండా పరుచుకున్న అనేకపదాల్ని గమనిస్తే కవి లక్ష్యాన్ని గుర్తించగలుగుతాం. తనకు కవిత్వమెలా చేయాలో తెలుసు. ఆ కవిత్వం కోసం నిద్రలేని రాత్రుల్ని గడిపినట్లే, మంచి పదం కోసం, మంచి అభివ్యక్తికోసం, మంచి భావన ప్రవహించడం కోసం ఎంతో పరిశ్రమించనట్లు ఈ ముక్కాణీయే చెప్తుంది. ‘‘కవితని ఎక్కడ్నించి ప్రారంభించాలి – బహుశ/ ముగింపు తెలియని వాడు కవితని రాయలేకపోవచ్చు/ అసలు కవితకి ప్రారంభం వుందా - అంతం వుందా...? / కొంతమంది కవులు ఈ కవితలు తాము రాసామనుకుంటారు!/కొంతమంది కవులు ఒకో కవితని పనస తొనలుగా ఒలిచి/ ఆ కవిత తమదిగానే భావించి మూర్ఛపోతారు/అంతకుముందు ఎవరో రాసిన కవిత్వం తనకోసమేనని/తాను అనుసరించిట్లుగా భావించే వాడే నిజమైన కవి’’ (పుట: 63) కవి సాగర్ తన కవిత్వ లక్ష్యాన్ని మరింత స్పష్టం చేయడానికి ఈ మాటలు చాలనుకుంటాను.

ముక్కాణీలతో పాటు వచన కవిత్వాన్నీ, దీర్ఘ కవిత్వాన్నీ కూడా విడివిడిగా చాలా రాశారు. ఇదంతా ఒక కవిగా ఒక అత్యాధునిక కవిలోని తాత్వికుడ్ని చూపిస్తే, సాహిత్య విమర్శలో ఈయన రాసిన వ్యాసాల పుస్తకం ‘ ప్రచ్ఛన్న వస్తు, శిల్పాలు’’ (2020) ఈయనలోని నూత్నసిద్ధాంతాలు కూడా చేయాలనే తపనను తెలియజేస్తుంది. దీనిలో సాహిత్య విమర్శ మూల్యాంకనంలో కొన్ని కొత్త పద్ధతులున్నాయని ప్రతిపాదిస్తున్నారు. వీటిని లోతుగా చర్చించాలి. దానికి ఇది సందర్భం కాదు.

‘‘రచనలో వస్తువు యొక్క వస్తువు ప్రచ్ఛన్న వస్తువు! శిల్పం యొక్క శిల్పం ప్రచ్ఛన్న శిల్పం! ఇదే ప్రచ్ఛన్న వస్తుశిల్పాల ప్రచ్ఛన్న రహస్య యాత్ర’’ అని చెప్తూ, దీన్ని సుదీర్ఘంగా చర్చించారు. తెలుగు సాహిత్య విమర్శలో ఇదొక నూతన ఆలోచన. అయితే, దీన్నింతవరకు అకడమిషియన్స్ పట్టించుకోలేదు. విశ్వవిద్యాలయ స్థాయిలో చర్చలూ జరగలేదు. ఈ సిద్ధాంతాన్ని పరిశీలించినప్పుడు ధ్వని సిద్ధాంత ంంగుర్తుకొస్తుంది.  ధ్వని సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు స్ఫోటవాదం గురించి వివరిస్తారు. ఒక పదం, ఒక వాక్యం, ఒక పద్యం, అనేక పద్యాలు, ఒక భాగం (ఆశ్వాసం), ఒక ఆఖ్యానం, చివరికి ఒక కావ్యం చదివేసరికి పాఠకుడికి ఏర్పడే అనుభూతి వివిధ స్థాయిల్లో ఉంటుంది. కానీ, దీన్ని విడివిడిగా చూసినప్పుడు కవి లక్ష్యం తెలియదు. పోనీ, కావ్యం/రచన చదవడం పూర్తి అయినంత మాత్రం చేత పాఠకుడికి సద్య: స్ఫురణ కలిగేదే కవిలక్ష్యం కాదని శబ్ద శక్తిని అభిధ, లక్షణ, వ్యంజన వంటి సాహిత్య పారిభాషిక పదజాలంతో లాక్షణికులు ఎంతో లోతుగా చర్చించారు. ఆ చర్చలో కూడా ఆ సిద్ధాంత వేత్తలు అన్నింటికీ ఇవ్వలేకపోయినా,కొన్నింటికైనా ఉదాహరణలిచ్చారు. అలాగే ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు గ్రంథంలోని విషయాలను దృష్టిలో ఉంచుకొని దీన్నీ చర్చిస్తే బాగుండేది.

సాగర్ శ్రీరామ కవచం గారు తన సాహిత్య జీవితంలో ఎంతోమందిని సాహిత్యానికి పరిచయం చేశారు. అనేకమందికి ముందుమాటలు రాసి ప్రోత్సహించారు. అనేకమంది రచనలను సమీక్షించారు. ఎంతోమంది రచనలను సైద్ధాంతికంగా చర్చిస్తూ మంచి వ్యాసాలు రాశారు. అలాగే, సాగర్ శ్రీరామకవచం గారి ప్రతిపాదనలు కూడా సాహితీవేత్తలు చర్చిస్తే బాగుండేది. ఇదే ఒక ఆంగ్ల గ్రంథమైతే దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చర్చించేవారు. మన తెలుగులో ఏదైనా ఒక నూత్న సిద్ధాంతం, నూత్న ప్రయోగం, నూత్నమైన ఆలోచన చేసేలా రచనలు చేస్తే, ఆ రచనలు చేసిన వారిని బట్టి చర్చ చేస్తుంటారు. అయినా, భవిష్యత్తులో దీనిపై సాహిత్యలోకంలో చర్చజరుగుతుందని ఆశిస్తూ, కవి, విమర్శకుడు, సాహిత్య సిద్ధాంతవేత్త అయిన  సాగర్ శ్రీరామ కవచం గారి సప్తతి మహోత్సవం  సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

తెలుగు శాఖాధ్యక్షుడు, మానవీయ శాస్త్రాల విభాగం,

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్,

 హైదరాబాద్-500 046

ఫోన్: 9182685231

కామెంట్‌లు లేవు: