'కాలం కలగన్న కవిత్వం' గొలుసు కట్టు నవలకు రాసిన ముందుమాట.
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖాధ్యక్షుడు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్
ఈ కవిత్వం ఒంటరి దుఃఖం కాదు, ఈ కవిత్వం వైయక్తికం సంఘర్షణా కాదు. కొన్ని వర్గాల నిర్ణయాలతో జీవితమంతా అతలాకుతలమవుతున్న ఒక సామూహిక దుఃఖం. ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవాలనే ఒక సామూహిక స్వప్నం. ఈ కవిత్వ ఖండికల్ని ఎవరేది రాశారనేది మనకు తెలియకపోయినా వీళ్లందరి హృదయస్పందన ఒకటేనని మాత్రం మనకనిపిస్తుంది. ఈ కవిత్వం మూడు పొరలు పొరలుగా కనిపిస్తుంది. కనీస అవసరాల క్రమానుగతశ్రేణి సిద్ధాంతంలా అమరిపోయింది. భౌతికంగా, మానసికంగా స్వేచ్చలేని, అస్తిత్వాన్ని ధ్వంసం చేసే ఒక ఆధిపత్యాన్ని సామూహికంగా అడ్డుకోకపోతే, పీల్చేగాలినీ, ఇప్నటికే సొంతం చేసుకొని మార్కెట్లో పెట్టేసిన మంచినీళ్ళనీ, బట్టనీ, గుప్పెడు మెతుకుల్నీ, తలదాచుకోవడానికి అడుగునేలనీకూడా దక్కనివ్వకుండా తన్నుకుపోతున్న గద్దలనుండి తమపిల్లల్నీ, తమనీ కాపాడుకోవాలనే సంఘర్షణ రణనినాదమై ధ్వనిస్తుంది. బంజరు భూముల్ని దున్ని బంగారు పంటల్ని పండించేదొకరు. ఆ పంటల్ని తమ ఇండ్లకు తోలుకుపోయేది మరొకరు. సమస్తకళల్ని కనుగొని, వాటిని ప్రదర్శించి, ఆ వ్యక్తికి, ఆ కళకీ, ఆసంఘానికీ, ఆ సమాజానికీ ఒక అందమైనరూపురేఖల్ని ఇవ్వడానికి నిరంతరం- పగలు-రాత్రి అనే భేదంలేకుండా సమాజనిర్మాణంలో సమిధలయ్యేదొకరైతే, చరిత్రలో నిలిచేది మాత్రం మరొకరు. ఈ చారిత్రక వక్రీకరణను మరొక పొరను లోతుగా తవ్వి గుర్తించారీకవులు. చరిత్రను, సమస్త శాస్త్రాల్నీ పునర్మూల్యాంకనం చేయాలనే చైతన్యపు కెరటాలపుతున్నారు. తమ చరిత్రను తాము దక్కించుకొనే యుద్ధాల్లో విజయపతాకాల్ని ఎగరేస్తున్నారు. ఈ చరిత్ర పునర్నిర్మాణంలో తలల్నీ, మొండాల్నీ, కాళ్ళనీ,, చేతుల్నీ, అంగాంగాల్నీ రక్తంకారుతూ చెల్లాచెదురుగా పడివున్న వాటన్నింటినీ ఒక్కొక్కటిగా, ఇటుకలు పేర్చినట్లు, భవనాలు నిర్మించినట్లు పునర్నిర్మాణం చేస్తున్నారు. ఈ పొరలన్నీ కనిపించాలంటే మీ కళ్ళకున్న వ్యక్తీకరణ సౌందర్యపుటద్దాలను తీసెయ్యాలి. పసిబిడ్డను అప్యాయంగా ఎత్తుఠున్నట్లీ కవిత్వాన్ని మీ హృదయానికి హత్తుకోండి. ఆ స్పర్శలో ఒక్కోపొర ఒక్కొక్కపొరా మీకు తాకుతున్నప్పుడల్లా మానవత్వం పరిమళిస్తున్న అనుభూతిని పొందుతారు. పొరలు పొరలుగా కనిపించే జీవితశకలాలు మిమ్మల్ని పరిపూర్ణమైన మనిషిని చూపిస్తాయి. ఈ కాలం కన్న కలల్ని ఒక్కొక్క దృశ్యంగా కనుగొంటారు.
ఇది కవిత్వప్రయోగంలా కనిపించే జీవనసౌందర్యం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి