"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

05 ఫిబ్రవరి, 2022

ఆచార్య పులికొండ సుబ్బాచారి గారి‘అదృశ్య రూపగ్రాహి’ విశ్లేషణ: ఒక పరామర్శ

 

ఆచార్య పులికొండ సుబ్బాచారి గారి

అదృశ్య రూపగ్రాహి’ విశ్లేషణ:  ఒక పరామర్శ

-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

తెలుగు శాఖాధిపతి,

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్,

 హైదరాబాద్ – 500 046

ఫోన్: 9182685231

 


ఒక్కో దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే భయమూ, జుగుప్సో కలుగుతుంది. అదే దృశ్యాన్ని ఒక చిత్రంగానో, ఒక శిల్పంగానో చూస్తే ఎక్కడలేని ఆనందం. అదే దృశ్యాన్ని కవిత్వంగా చదివితే జీవితాంతం దాకా అది మనల్ని వెంటాడుతుంది. వెంటాడుతూ వేస్తుందో వెంటాడుతూ మనసుని మాయ చేస్తుంది. వ్యక్తావ్యక్త ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తుంది. ఈ కవిత చదవండి. దీన్ని మువ్వాశ్రీనివాసరావుగారు రాశారు.

"బాల్యంలో

అనుకొంటుండగా నే విన్నది వందేమాతరం

 యవ్వనంలో నేనన్నది

 ప్రపచం కార్మికులారా ఏకం కండి 

ఇప్పుడు ప్రపంచ ప్రజలందరితో

 నీవు అనిపిస్తున్నది లాక్డౌన్

 కరోనా... కారణ జన్మమే నీది”.

 

రోసెట్టా రాయినుండి

మాసిపోయిన భాషనే బతికించుకున్నోళ్ళం

 మహా అయితే.. ఏమవుతుంది.

 మాలో మాకు యుద్ధాల పేరుతో

గతంలో

 పోయినంతమంది మళ్ళీ పోతాం 

అప్పుడు ద్వేషంతో కొట్టుకున్నోళ్ళం

 ఇప్పుడు ఐకమత్యంతో పోరాడుతున్నాం 

కరోనా... కారణ జన్మమే నీది”.

 

ఇలాంటి కవిత్వాన్ని ఆస్వాదించాలి. కానీ...ఆ కవిత్వాన్ని విశదీకరించి చెప్పమంటే సాధ్యమా? అలా చెప్పలేని వాళ్ళో అలా చెప్పకూడదనిపించిన వాళ్ళో మళ్ళీ కవిత్వం మీద కవిత్వం చెప్తారు. ఆ ఆవేశాన్ని అణుచుకొని ఆ అనుభవాన్ని పొదుగుకొని మళ్ళీ పాఠకులు మూలాన్ని ఆకర్షించేలాగానో మళ్ళీ పాఠకులు మూలాన్ని పరీక్షించే లాగానూ చేయాలంటే ఆవేశాన్ని అణచుకోవాలి. అనుభవాన్ని అందంగా పంచుకోగలగాలి.          

మువ్వా శ్రీనివాసరావు గారు, వైరాయణం (మూడో ప్రపంచ యుద్ధ కవిత) పేరుతో 2020లో తన కవిత్వాన్నంతా ఒక పుస్తకంగా ప్రచురించారు. దీన్ని కొంతమంది దీర్ఘకావ్యం అన్నారు. ( ఆచార్య మేడిపల్లి రవికుమార్, కరోనాతో కవిత్వం జతకలిసిన వేళ...! ‘వైరాయణం’ పుస్తకానికి రాసిన ముందుమాట, పుట: 105) కానీ, ‘ఈ కావ్య నిర్మాణం ఇతర దీర్ఘ కావ్య నిర్మాణం కంటే కొంత భిన్నంగా ఉంటుంది’ (పుట: 106) అని, ఒకే అంశానికి చెందిన వివిధ పార్వ్శాలు శకలాలు శకలాలుగా, దేనికది స్వతంత్రంగా  ఉంటాయన్నారు. ఏ భావశకలానికీ శీర్షిక ఉండదు. ఇవన్నీ ఒకేదారానికి గుచ్చబడి ఉంటాయి. కాబట్టే ఇది దీర్ఘకావ్యమయింద’ (పుట: 107)ని ఆచార్య మేడిపల్లి రవికుమార్ తన వాదాన్ని సమర్ధించుకుంటూనే దీన్నొక కావ్యప్రయోగంగా వ్యాఖ్యానించారు. (పుట: 112)

దీన్ని కొంతమంది ఆధునిక శతకం అన్నారు.  మువ్వా శ్రీనివాసరావు గారు వచన కవిత్వంలోనూ హృదయాలింగనం చేయగలిగారు. ‘‘నాలుగు రోజులు మాత్రం పిక్నిక్ లా యమాసరదాగా గడిచింది. క్రమక్రమంగా మబ్బులు విడిపోవడం మొదలయ్యింది. ఏదో తెలియని ఉక్కుపోత, బాధ, బందీలయ్యామన్న భావన విశ్వరూపం ప్రదర్శించడం మొదలయ్యింది. వాట్స్ అప్ లోంచి, యు ట్యూబ్ లోంచి, టీవీలోంచి, గూగుల్లోంచి ప్రపంచాన్ని చూడడానికి అలవాటుపడ్డా. కానీ అదీ ఎంతోకాలం. సాగలేదు.

క్షణాలు బరువెక్కడం, రోజులు పొడుగవ్వడం మొదలయ్యింది. కేవలం కిటికీ పక్క దృశ్యాలతో సహజీవనం, నన్ను నా లోపలికి బలంగా నెట్టేసింది. ప్రతిరోజూ లోపలినుండి, బయటకు బయటి నుండి లోపలకు క్యాట్వాక్ షురూ! అది... అప్పుడే రోజు రాసే కవితా వాక్యాలు దారిమళ్లాయి.‘‘(కరో‘నామాట’, వైరాయణం కవి మాట, పుట: 13)

ఆ హృదయాన్ని, ఆ కవిత్వ మర్మాన్ని, ఆ కవిత్వ నిర్మాణం వ్యూహాన్ని, ఆ అదృశ్యరూపాన్ని పట్టుకున్నారు -మన ఆచార్య పులికొండ సుబ్బాచారి గారు . ఇప్పుడు వీటి గురించేమి మాట్లాడాలి.కవిత్వంపై కవిత్వం...మెటాపోయెమ్ చెప్పాలా... ఆ కవిత్వం హృదయాన్ని అలా ప్రతిస్ఫందించేలా చేస్తుంది. విమర్శపై విమర్శ ...మెటాక్రిటిసిజమ్? చేయాలా? కవిత్వంపై కవిత్వం చెప్పడం అంటే తప్పించుకోవటం... కవి ఏమి చెప్తున్నాడు తెలియకుండా తన ప్రతిభను  ప్రదర్శించుకోవడం.

దానివల్ల ఆ కవికి గానీ, ఆ కవిత్వానికి గానీ ఒరిగేదేమీ ఉండదు. అందువల్ల కవిత్వంలో ఆ కవి  ఏం చెప్పాడో చెప్పాలి. దాన్ని విమర్శకుడు ఏ విధంగా అర్థం చేసుకున్నాడో, దాన్ని ఏ విధంగా అర్థం చేసే ప్రయత్నం చేశాడనేది మెటా క్రిటిక్  చేయాల్సిన పని. వాటిలో ఉన్నటువంటి వాస్తవాన్ని  మెటా క్రిటిక్ చెప్పగలగాలి. నేను మెటా క్రిటిక్ గా కంటే ఒక సామాన్య పాఠకుడిలా, కవిత్వాన్ని, ఆ విమర్శని చదివిన పాఠకుడిగా స్పందిస్తాను.

కాబట్టి కవిత్వం అంటే మూల రచన చదవాలి. చదివాను. మువ్వా శ్రీనివాసరావుగారి ఫోటో పదేపదే చూస్తూ చదివాను. ఆచార్య సుబ్బాచారిగారు మొహమాటం లేకుండా చెప్పారు. ఆయన రూపం, ఆ రూపం వెనుకు ఉన్న అపురూపాన్ని... ఆ పసి హృదయాన్ని. నేనూ ఆ కవిత్వం చదువుతుంటే, కవిత్వాన్ని ఎంత అపురూపంగా రాశారనిపించింది.  ఆ రచనను విమర్శకుడు ఎలా అర్థం చేసుకున్నాడో రెండింటినీ తులనాత్మకంగా చెప్పాలి. పాఠకుడిగా నా అభిప్రాయం చెప్తాను.

ఇది తెలుసు కాబట్టే మువ్వా శ్రీనివాసరావు గారు రెండు పుస్తకాల్నీ పంపించారు. రెండు పుస్తకాలు ఒకదాన్ని మించి ఒకటి  అందంగా కనిపిస్తున్నాయి. వాటిని చదవడం కంటే ముందు ఆ పుస్తకాల్ని చాలాసేపు ఒక పసి పిల్లని హృదయానికి హత్తుకునంత హాయిగా అటూ ఇటూ తిప్పాను. ఇంత ఈస్తటిక్ సెన్స్ ని పాటించి పుస్తకాల్ని ప్రచురించినందుకు వాళ్ళని మనసులోనే అభిందించాను. మువ్వా శ్రీనివాసరావు గారు ఏ పుస్తకాన్ని వేసినా వాటిని ఎంతో ఈస్తటిక్ లుక్ తో తీసుకొస్తారు. ఒక పుస్తకాన్ని ఎంత అందంగా తీసుకురావాలో తెలియాలంటే మువ్వా శ్రీనివాసరావు గారి పుస్తకాలు చూడాలేమో అనిపిస్తుంది.

మా  పిల్లలమర్రి రాములు గారు చెప్తూ ఉంటారు.. .ఒక పుస్తకం తీసుకు వచ్చే ముందు దానికి కచ్చితంగా ఒక ఎడిటర్ ఉండాలి అని. ఆయన ఆంగ్ల సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేస్తారు. కవి సీతారామ్ గారు చెప్పారు. దీనికి (వైరాయణం కవిత్వానికి) ఎడిటింగ్ అవసరం పడలేదని. అంటే ప్రతిపుస్తకాన్ని ఎంత జాగ్రత్తగా తీసుకొస్తారో తెలిసింది. ఆయన ఒక పద్యాన్ని చెప్పినా, ఒక సన్నివేశాన్ని వివరించినా, ఒక పదార్థాన్ని తిని దాని రుచిని పరిచయం చేస్తున్నా వెంటనే మనం ఆకర్షితులవుతాం.మా రాములు గారు అంత బాగా చెప్పగలుగుతారు. ఆయన మాటల్లో అంత శక్తి ఉంది. ఆయనకి అంత శక్తి రావడానికి గొప్ప సహృదయత కారణం. అసలు ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే అత్యంత ముఖ్యమైంది...సహృదయతే. సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే అది ఇంకా అవసరం.

ఏమిటీ సహృదయత? మనం ఆలంకారికులు ఎంతో చక్కగా వివరించారు.

యేషాం కావ్యానుశీలనాభ్యాసవశాత్

విశదీభూతే మనో ముకురే

వర్ణనీయ తన్మయీభవనయోగ్యతా

తే హృదయసంవాదభాజః ’

ఆనందవర్థనుని లక్షణాన్ని వ్యాఖ్యానించిన అభినవగుప్తుని సహృదయత ఇది! ఒక కవి రాసిన కవిత్వాన్ని లక్షణాలు, శాస్త్రాలు తెలిసినంత మాత్రాన ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకోలేం.

మరేం కావాలి?

సహృదయత కావాలి.

దీంతో పాటు సృజనానుభవం ఉండాలి.

మువ్వా శ్రీనివాసరావు గారి వైరాయణం కవిత్వానికి విమర్శ రాస్తూ దానికి ఆచార్య పులికొండ సుబ్బాచారి పెట్టిన పేరే సృజనాత్మకంగా ఉంది. ‘ అదృశ్యగ్రాహి’ అని పేరు పెట్టారు. దీన్ని కేవలం వైరాయణంలోని వస్తువు ‘కరోనా’ మాత్రమే అదృశ్యగ్రాహికాదు; ఆ కవిత్వం రాసిన కవి కూడా కరోనా సమయంలో ప్రజల మనోభావాల్ని కూడా మనకి అందించడంలో ఆ మాట సరిపోతుందనుకుంటున్నాను. మనందరి అనుభవాల్ని, మనందరి ఊహల్ని, మనందరి భావాల్ని ఆ కవి మననుండి మనకు తెలియకుండానే  గ్రహించి కవిత్వం చేయడంలో కవి కూడా ‘అదృశ్యగ్రాహి’గానే అనిపిస్తారు.

‘‘ఇప్పుడే కిటికీలోంచి వీచిన చిరుగాలి

 స్వేచ్ఛకు కొత్త నిర్వచనం చెప్పిపోయింది

ఇప్పుడే ఇప్పుడంటే ఇప్పుడే

కిటికీ బయట రెక్కలు విదిల్చిన పక్షి

స్వాతంత్ర్యానికి కొత్త రేకులు విప్పి పోయింది

కిటికీ పక్కనే

పక్కనంటే పక్కనే

సూర్యుడు చెట్టు గుబురుల్లోంచి నడిచివచ్చి

నీడలో వెలుగు సున్నాలు చుట్టి పోయాడు

 పూర్ణమదః పూర్ణమిదం అని చెప్పిపోయాడు".

కిటికీ పక్క నాకింత సమయమిచ్చావుకదా

కరోనా కారణ జన్మమే నీది”

          ఈ ఖండికలో కవి కరోనా వల్ల ప్రజలు రకరకాల తాత్విక చింతనలు చేస్తున్న స్థితిని సహజంగా వర్ణించారు. దీన్ని ఈశావ్యాసోపనిషత్తు తాత్వికచింతనతో కూడా చూడాలి. ‘సూర్యుడు చెట్టు గుబురుల్లోంచి నడిచివచ్చి/నీడలో వెలుగు సున్నాలు చుట్టి పోయాడు/పూర్ణమదః పూర్ణమిదం అని చెప్పిపోయాడు’’ అనడం ద్వారా భారతీయ తాత్విక చింతనను కవి ప్రస్తావించారు. దీని గురించి విమర్శకుడు ఆచార్య సుబ్బాచారి గారు వ్యాఖ్యానిస్తూ...‘‘ పరిపూర్ణమైన భగవంతుని నుండే పరిపూర్ణమైన జగత్తు పుట్టింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణం తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది. మార్క్సిస్టు తాత్త్వికతని ఎన్నో ఏండ్లుగా తలకెత్తుకున్న మువ్వాకి ఈ తాత్త్వికతని కూడా పూర్ణమనసుని నింపేలా చేసింది కరోనా.’’ (పుట:27) దీన్ని కవి భావజాలంతో అన్వయించి చూడ్డం సరైనదేనా అనేదొక చర్చనీయాంశం. కరోనా గురించి ప్రజల మనస్తత్వాల్ని ఒడిసిపట్టుకొని కవిత్వీకరించే సమయంలో ఆ తాత్వికత ఉన్నవాళ్లను కూడా కవిత్వం చేయడంలో కవి మువ్వా విజయవంతమయ్యారని విమర్శకుడు అంటే బాగుండేదేమో.  

  *

అదృశ్య రూపగ్రాహి! ఆచార్య పులికొండ సుబ్బాచారి గారు గొప్ప కవి. ఆయన రాసిన కవిత్వాన్ని చదివాను. ఆయన రాసిన పద్యాలూ చదివాను. ఆయనకు ప్రాచీన సాహిత్యం మీద ఉన్న పట్టు కూడా నాకు తెలుసు. ఒకసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుగు పద్యంలో ఉన్నటువంటి శిల్ప రహస్యాల్ని వివరిస్తే ఆశ్చర్యమేసింది. ఇది కదా శాస్త్రీయమైనటువంటి విధానం అనిపించింది. ఇందుకు కదా తెలుగు పద్యానికి అంత గౌరవం లభించిందనిపించింది. ఆయన కులపురాణాలు మీద చేసిన సిద్ధాంత గ్రంథాన్ని చదివాను.ఆయన జానపద సాహిత్యం లో అద్భుతం కథా నిర్మాణాన్ని గురించి రాసిన పుస్తకాన్ని చదివాను. ఆయన క్షేత్ర పర్యటన చేసి సేకరించిన జాంబపురాణాన్ని చదివాను. ఆయనలో ఒక గొప్ప కవి ఉన్నాడు. ఆయనలో గొప్ప విమర్శకుడున్నాడు. ఆయనలో ఒక శాస్త్రీయమైనటువంటి గొప్ప పరిశోధకుడున్నాడనిపించింది. అందుకే ఆయనంటే నాకు ఎనలేని గౌరవం... ఎనలేని ప్రేమ. ఆ ప్రేమను అలా పెట్టుకున్నప్పటికీ, నేను ఒక విమర్శకుడిగా ‘అదృశ్య రూపగ్రాహి! ని చదివాను. అనేక ప్రశ్నలకు హేతుబద్దమైన సమాధానాలు ఆ పుస్తకంలో కనిపించాయి. కానీ ఇంకా వైరాయణం గురించి చెప్పాల్సినవి ఎన్నో ఉన్నాయని కూడా అనిపించింది.

*

మువ్వా శ్రీనివాసరావు గారు తన కవిత్వానికి 'వైరాయణం' అని పేరు పెట్టారు. నాలోని వ్యాకరణ వేత్త అది సరైందేనా? అని పదేపదే గోలచేశాడు. దాన్నంతా చర్చించి, అదొక ప్రయోగంగా విమర్శకుడైన సుబ్బాచారిగారు వివరించారు.' ప్రయోగ శరణం వ్యాకరణం' 'కవయః నిరంకుశః' వంటి లాక్షణిక ప్రవచనాలు కూడా నాలోని వ్యాకరణశాస్త్రిగార్ని మాట్లాడకుండా చేశాయి. వైరాయణం అంటే వైరస్ ప్రయాణం చేసిన దారి, ప్రయాణం చేసిన కాలం... (పుట: 16) గా సుబ్బాచారిగారు స్పష్టం చేశారు.

**

మరిదెలా మూడవ ప్రపంచ యుద్ధ కవిత్వం అయ్యింది?  ఈ కవిత్వానికి ఆ టాగ్ ఎందుకు పెట్టారనేదో అనుమానం ఇంతవరకూ ప్రత్యక్షంగా రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ప్రపంచ యుద్ధం అంటే  ఆ యుద్ధంలో ఎక్కువ దేశాలు పాల్గొనాలి. ప్రపంచంలోని అన్నిదేశాలను తాకి అన్ని దేశాల్లోవేలు... లక్షల సంఖ్యలో మరణ విధ్వంసం చేసిన శక్తి కరోనా. అందుకే దీన్ని ప్రపంచయుద్ధం అని తన పుస్తకానికి ‘మూడో ప్రపంచయుద్ధ కవిత’ అని పేరు పెట్టారని వివరించారు. (పుట: 10)

వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల మీద దాడి చేసింది. ఇంచుమించు అన్ని దేశాలు దాన్ని ఓడించడానికి యుద్ధం చేస్తున్నాయి. జన నష్టం కూడా ప్రపంచ యుద్ధంలో జరిగే జన నష్టం కంటే ఏ మాత్రం తక్కువ జరగలేదు. అందువల్ల ఇది మూడవ ప్రపంచ యుద్ధం అని కవి పెట్టినటువంటి రెండో అంశాన్ని కూడా హేతుబద్ధంగా ఈ విమర్శకుడు  సమర్థించాడు. వస్తువు... వైరస్ తో మానవుడు పయనిస్తూ, దానితో నిశ్శబ్ద యుద్ధం చేయడం. దీన్ని సుమారు నూట పన్నెండు వచన ఖండికలుగా కవి మువ్వా అభివర్ణించారు.

రూపపరమైన చర్చ:

ఈ సంఖ్య తో పాటు ప్రతి వచన కవిత చివరా కవి ఒక మకుటం  పెట్టడం వల్ల ప్రక్రియ కాదు గానీ రూప చర్చ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రక్రియ పరంగా అది కవిత్వం. అది పద్యం కావచ్చు; వచనం కావచ్చు; కవిత్వానికి సంబంధించింది. కాబట్టి కవిత్వం విషయంలో చర్చ అవసరం లేదు. కానీ, కావాల్సింది రూపమైనటువంటి చర్చ అని విమర్శకుడు గుర్తించాడు. ఇక్కడే విమర్శకుడు మరలా కట్టమంచి వారు కవిత్వతత్వవిచారంలో చెప్పినటువంటి కొన్ని కొత్త అంశాలు లాంటివాటిని ఇక్కడ చెప్పారు. ఇదే ఒక రకంగా అంటే రూపపరమైన చర్చకోసమైనా వైరాయణం కవిత్వాన్ని చదివించి సాహిత్యంలో దానికి శాశ్వత స్థానాన్ని కల్పించేలా చేస్తుంది. విమర్శకుడు కేవలం కవిత్వ సమన్వయంతో సరిపెట్టలేదు. నూతన సూత్రీకరణ చేసే ప్రయత్నం చేశాడు. కొంత అతిశయోక్తి అనుకుంటారేమో గానీ, ఆధునిక వచన కవిత్వాన్ని విశ్లేషిస్తూ, కేవలం ఒక పుస్తకానికి మాత్రమే సరిపడే సమన్వయాలు కాకుండా, వచన కవిత్వానికి సరిపడే అనేక సూత్రీకరణలు దీనిలో ఉన్నాయి. అందువల్ల మరలా కట్టమంచి వారి భావనాశక్తి లాంటి కొన్ని ప్రతిపాదనలున్నాయి. వాటిలో భాషాకల్పన, భావకల్పన ... పదాల పొందిక, పదచయనం, విభిన్న వాక్యరచనానైపుణ్యం, అర్థ వాక్యరచన, వాక్యాలుగా కనిపించని పదగుచ్ఛాలు...ఇవన్నీ భాషాకల్పనలో భాగాలవుతాయన్నారు. (అదృశ్య రూపగ్రాహి, పుట: 11)  భావకల్పన... కవిత్వరచనకు సంబంధించింది. కవిత్వమంతా నిండిఉండేది. అంటే వస్తువు, దాన్ని కవి తీసుకెళ్ళిన తీరు అంతా భావకల్పనకు చెందింది. పసిబిడ్డల చిరునవ్వుల్లో స్వర్గం చూసే పసితనపు మనస్సు దాక్కున్న అంతరంగం మువ్వాది’’ ( పుట: 12)  నగ్నముని గారి కొయ్యగుర్రం అనే ఆధునిక మహాకావ్యం ఒక సంఘటనాత్మక కవిత్వంగా వచ్చిందని చెప్తూనే, సుమారు 140 భావాంగాలు గల వైరాయణాన్ని అంతా ఒక యూనిట్ గానే తీసుకోవాలంటారు. కరోనా ఒక అదృశ్య శక్తి... దానిరూపాన్ని కవిత్వంగా గ్రహించిన కవి మువ్వా శ్రీనివాసరావు. ఈయనే అదృశ్యరూపగ్రాహి. ఒకప్పుడు ప్రపంచంలో తానొకడై ప్రపంచాన్ని చూసిన మనిషి ప్రపంచాన్ని ఒక కిటికీ రంధ్రం ద్వారా చూసే పరిస్థితిని కరోనా కలిగించిందంటూ కవి.

“చూపులను

 నాలుగు గోడలు పంచుకున్నాక

ఖాళీ అయిపోయి

బాల్కనీ బాదుషా నైపోతాను

 చలిపులి వెంటాడగానే

కిరీటాన్ని ధరించి... కాస్సేపు

 కిటికీ పక్క

సింహాసనం పైనుండి ప్రపంచాన్ని ఏలేస్తాను

కట్టేసి రాజును చేశావు కదా....

కరోనా... కారణ జన్మమే నీది”

కరోనా పై రాయడం ఒక మిషగా చేసి, నేటి ప్రపంచ సంక్షోభాన్నీ, మనిషి ప్రయాణాన్నీ, శాస్త్రం, మతం, దైవం, అతీంద్రియ శక్తులు మొదలైన వాటన్నింటినీ మానవుడెలా అర్థం చేసుకుంటున్నాడో, అర్థం చేసుకోవడానికి సంఘర్షణ పడుతున్నాడో, ఆ సంఘర్షణ అంతా కవి మువ్వాశ్రీనివాసరావు పడ్డారనేది విమర్శకుడిగా ఆచార్య పులికొండ సుబ్బాచారి గారి సూత్రీకరణ, సమన్వయం.

ఈ అదృశ్యరూప గ్రాహిలో నేను గమనించిన అంశం... విమర్శకు మరలా కవితాత్మకమైన పేరు పెట్టడం. ఒక శక్తివంతమైన కావ్యానికి అంతేశక్తివంతమైన పేరు పెట్టడం ఎంతో సమంజసంగా, అర్థవంతంగా ఉంది. మొదట పుస్తకానికి పెట్టిన పేరు దగ్గర, దాని టాగ్ గురించీ వివరించి, తర్వాత దాని రూపచర్చ చేశారు. ఆయన రూపసారాంశాన్ని దీన్నొక శతకంగా భావించలేమనీ, ఒక సంఘటనాత్మక దీర్ఘకవిత లేదా దీర్ఘకావ్యంగానే భావించవచ్చుననీ, దానికి కావలసిన ఏకసూత్రత ఉందనీ నిరూపించారు. ఇదంతా ఒకభాగంలో చేసి, రెండవ భాగంలో భావాంగాలుగా ఆ పుస్తకంలోని వివిధ భావాంగాల్లోని కవిత్వ తాత్త్వికతను విశ్లేషించారు. నా ప్రసంగాన్ని వైరాయణంలోని ఒక కవితతో ముగిస్తాను.

"విషవాయువు వీచే వేళ

ఆమె ముంగురుల నాట్యానికి

అక్షర చప్పట్లు కొట్టలేను

నదిమీద నుండి నడిచొచ్చే

తడిపాదాల నిర్వాణానికి

కొత్తగా వాక్యాలు నేయలేను

 కదలికకో రూపంతో

కన్నులను మేసే మేఘాలను వాక్యాలలో చుట్టలేను

 ఇప్పుడు మాస్కులోనుండి మాట్లాడే మాటలన్నీ అస్పష్టమే కదా.

వర్తమాన కాలంలో మనమంతా అనుభవిస్తున్న కరోనా జీవన సంఘర్షణను కవి మువ్వా శ్రీనివాసరావుగారు ఔచిత్యమంతంగా వర్ణిస్తే, ఆ కవిత్వంలోని జీవన సత్యాల్ని ఆ అదృశ్య రూపాల్ని మనకి దృశ్యంలో చూపినట్లు వివరించిన ఆచార్య పులికొండ సుబ్బాచారిగార్కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

( ప్రముఖకవి, విద్యావేత్త మువ్వా శ్రీనివాసరావుగారు రాసిన ‘వైరాయణం’ కావ్యానికి ప్రముఖ విమర్శకుడు ఆచార్య పులికొండ సుబ్బాచారిగారు ‘అదృశ్యరూపగ్రాహి’ పేరుతో ఒక విమర్శగ్రంథాన్ని రాశారు. దీన్ని 7.7.2021 వ తేదీన అంతర్జాల సమావేశం ద్వారా ఆవిష్కరణ సందర్భంగా చేను చేసిన ప్రసంగంలోని సారాంశం)

 

1 కామెంట్‌:

daelynfaaborg చెప్పారు...

How to Play Online Casino - Casinos in Nigeria
All you marathonbet need to 트 위치 룰렛 do 해적 룰렛 is register at one of the most popular betting sites, such as BookMaker and bet365. The process 온라인 카지노 게임 is fast, 스 크릴 but you can still find