తెలుగు ప్రాచీన సాహిత్యంలో దైవం, పోషకులను ఆశ్రయించుకొంటే ఆధునిక సాహిత్యమంతా సామాన్య ప్రజల అస్తిత్వ సంఘర్షణలను ప్రతి ఫలించిందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు వ్యాఖ్యానించారు. మంగళవారంనాడు (1.2.2022) అంతర్జాలం ద్వారా న్యూఢిల్లీలోని యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర కళాశాల, తెలుగు శాఖ ఆధ్వర్యంలో *ఆధునిక తెలుగు కవిత్వం- ధోరణులు* అనే అంశంపై ముఖ్య వక్తగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. తెలుగులో సమకాలీన సమాజానికి అనుగుణమైనటువంటి సాహిత్యం వచ్చిందని, ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని కూడా ఆ నేపథ్యంలో నుండే అవగాహన చేసుకొని, దాని పునాదుల మీదనుండేఆధునిక సాహిత్యాన్ని, వివిధ ధోరణులను అవగాహన చేసు కోవాలన్నారు. నన్నయ మహాభారతాన్ని తెలుగులోకి దార్శనికానువాదంతో తీసుకొని రావడం ఆనాటికి అది ఎంతో సాహసంతో కూడిన పనిగా వెంకటేశ్వరరావు అభివర్ణించారు. తెలుగులో ఒకవైపు భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం నడుస్తున్న కాలంలోనే తెలంగాణ ఉద్యమ సాహిత్యం కూడా వచ్చిందన్నారు. అభ్యుదయ కవిత్వం లో కనిపించని ఆచరణ విప్లవ కవిత్వంలో విప్లవ కవిత్వంలో విస్మరించిన అంశాలు స్త్రీవాదం లోను వీటన్నింటిలోనూ విస్మరించిన అంశాలు దళిత, మైనారిటీ కవిత్వధోరణుల్లో ప్రతిఫలించాయని ఆ విధంగా తెలుగువారి అస్తిత్వ సంఘర్షణ ప్రతి ఉద్యమంలోనూ ప్రతిఫలిస్తుందని ఆయన సోదాహరణంగా వివరించారు. ఈ వెబినార్ ని ప్రారంభిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి శీలా రెడ్డి మాట్లాడుతూ 1857 తర్వాత కందుకూరి, గురజాడ, గిడుగు లతో ఆధునిక తెలుగు సాహిత్యం ప్రారంభమైందని అన్నారు. ఆధునిక సాహిత్యం శాస్త్రీయంగా పయనించడంలోను, దానితోపాటు సంప్రదాయ సాహిత్యపరమైన అంశాలు కనిపిస్తుంటానయని,వీటిని ఆధునిక సాహిత్యం లో జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలని, ఆధునికతను ఈ రెండు కోణాల నుండి అర్థం చేసుకోవాలని వైస్ ప్రిన్సిపాల్ వెంకట్ కుమార్ పేర్కొన్నారు. తెలుగు అధ్యాపకులు డాక్టర్ ఈ.శిరీష , డాక్టర్ డి.సుజాత సమన్వయకర్తలుగా ఈ వెబినార్ నిర్వహించారు. ఈ ఈ సమావేశంలో ప్రొఫెసర్ శ్రీనివాస్, ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఇతర అధ్యాపక బృందం విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి