"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

28 January, 2022

అపార ప్రేమమూర్తి ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ ( మరణించిన సందర్భంగా 28.1.2022)

 అరమరికలులేని అపార ప్రేమమూర్తి ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌


- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 

 అధ్యక్షులు, తెలుగుశాఖ

  యూనివర్సిటి ఆఫ్‌ హైదరాబాద్‌, హైదరాబాద్‌.

ఫోన్‌: 9182685231



ఒక మృదువైన కలం

ఒక పదునైన భావం

ఒక సున్నితమైన హృదయం

ఒక బలమైన భావజాలం

అరమరికలు లేని అపారమైన ప్రేమ స్వరూపం

బుధులు మెచ్చే పాండిత్యం

సుధలు కురిసే సాహిత్య జలపాతం

ఒక అమృతభాండం

ఇలా అర్ధాంతరంగా పగిలిపోతే ఏమనాలనిపించిందని ప్రముఖ కవి, అధ్యాపకుడు ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ గారు మరణించారని తెలిసిన వెంటనే నాకు కలిగిన అభిప్రాయమిది.  ఈనెల 28 వతేదీన (28.1.2022) తెల్లవారుతుందనగా గం.4.25 నిమిషాలకు వాళ్ళమ్మాయి మానస నాకు ఫోన్‌ చేసింది. ఆమె గొంతు బరువుగా, బాధగా ఎక్కడో లోతైన బావిలో నుండి  మూలుగుతున్న స్వరంలా అనిపించింది. ‘‘అంకుల్‌ నాన్నగారు మనల్ని వదిలివెళ్ళిపోయారు...’’ నమ్మలేకపోయాను. ఆమె మాట్లాడుతున్నదేమిటనే అయోమయంలో పడిపోయాను. ఆ మాట నమ్మబుద్ధి కాలేదు. నాకే కాదు, ఇలాగే తెలుగు సాహిత్య లోకానికీ అనిపించింది. ‘‘మొన్ననే కదా వాళ్ళమ్మాయి పెళ్ళి చేశాడు’’. ’’నిన్ననే కదా రిసెప్షన్‌ లో కలిశాం’’ ఇంతలోనే ఏమయ్యిందని నాకెన్నో ఫోన్లు. మనిషి బ్రతికినంత కాలం ఏదో ఒక తపన. మనిషి చుట్టూ ఏవేవో భావజాలాలు. ఎవరెవరితోనో కోపతాపాలు. ఎవరిరెవరితోనో ప్రేమానురాగాలు. ఈ లక్షణాలు మానవులందరికీ ఉన్నట్లే ఎండ్లూరి సుధాకర్‌ గార్కీ ఉన్నాయి. వీటివల్లనే ఆయన కొంతమందికి మంచివాడయ్యాడు. వీటివల్లనే ఆయన ఇంకొంతమందికి శత్రువయ్యాడు. దళిత కవిత్వం రాసి దళితులకు ఇష్టమైనవాడయ్యాడు. ఆ దళిత కవిత్వం రాయడం వల్లనే దళితేతరుల్లో కొంతమందికి అయిష్టుడయ్యాడు.

‘‘నేనింకా నిషిద్ధ మానవుణ్నే!

నాది బహిష్కృత శ్వాస

నా మొలకు తాటాకు చుట్టి

నా నోటికి ఉమ్మిముంత కట్టి

నన్ను నలుగురిలో

అసహ్య మానవ జంతువుని చేసిన మనువు

నా నల్లని నుదిటి మీద బలవంతంగా

నిషిద్ధ ముద్ర లేసినపుడే

నా జాతంతా

క్రమక్రమంగా హత్య చేయబడిరది.’’ ఇలా రాసిన ‘వర్తమానం’ తన తొలి కవిత సంపుటి నాటికే మంచి కవిగా పేరు పొందాడు.  కొత్త గబ్బిలంలో మాదిగ హక్కుల దండోరా ప్రభావం కనిపిస్తుంది, నల్లద్రాక్ష పందిరి (ణARఖ్‌) ఉభయ భాషా కవిత్వంలో దళిత సౌందర్యం అభివ్యక్తమైంది. ప్రబంధనాయిక కన్న దళితస్త్రీ అందమ్కెంది అని సుధాకర్‌ రాసిన కవిత ఆత్మగౌరవప్రకటనలో అత్యుదాత్త స్థాయిలోది.

‘‘ఓ నా చండాలికా

నీ వెండికడియాల కాళ్ళ ముందు

వెయ్యేళ్ళ కావ్యనాయికలు వెలవెలబోతున్నారు

అలంకారశాస్త్రాలన్నీ

నీ పాటిమట్టి మెరుపు ముందు బలాదూర్‌

నా నల్లపిట్టా

నిన్ను వరాంగివనీ, కృశాంగివనీ

లతాంగివనీ మభ్యపెట్టను

నీనెత్తి మీది యినుపగమేళం

విశ్వసుందరి కిరీటాన్ని సైతం వెక్కిరిస్తోంది

నా నల్ల కావ్యానికి నిన్ను

నాయికగా ప్రకటిస్తున్నాను’’

 వర్గీకరణీయం దీర్ఘకవితలో ఎస్సీ వర్గీకరణ కవిత్వం తీవ్రస్థాయిలో వచ్చింది. ‘‘ఆటా ‘‘జనికాంచె...అమెరికా యాత్రా కవితలులో విదేశాల్లో దళితులు, ఇతర సామీప్య వర్ణ, వర్గాల వారి కవిత్వం కనిపిస్తుంది. గోసంగిదళిత దీర్ఘ కావ్యంలో దళిత సంస్కృతిలోని విస్మరింపబడిన ఉపకుల చైతన్యం ప్రకటితమైంది. తర్వాత కొత్తగబ్బిలం, వర్గీకరణీయం, గోసంగి పుస్తకాల్ని కావ్యత్రయంగా ప్రచురించారు. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే దళిత కవిత్వం రాసినప్పుడు శిరస్సుపై పెట్టుకున్న దళితుల్లోని ఒక వర్గమే మాదిగ హక్కుల దండోరా ఉద్యమం, ఎస్సీ వర్గీకరణ కవిత్వం ప్రభావంతో  ఆయన కవిత్వం రాసినప్పుడు దాన్ని తీవ్రస్థాయిలో  నేలకేసి కొట్టిన వాళ్ళున్నారు. దాన్ని తమ జీవితమని నమ్మి నెత్తునపెట్టుకున్నవాళ్ళున్నారు. ఇక్కడా మళ్ళీ స్వ-పర భేదాల్లో చిక్కుకోక తప్పలేదు. దళితుల బాధలన్నీ ఒకేలా ఉంటాయని చెప్తూనే, మాదిగ, ఉపకులాల బాధలు మరింత కఠినంగా ఉన్నాయంటూ...

‘‘ మన బతుకంతా

అన్నం వెతుక్కోవడంతోనే సరిపోయింది

బుక్కెడు మెతుకులు కళ్లజూడటమే

ఈ జీవితానికి గొప్పవరమైపోయింది

మన బతుకులే కాదు

చివరికి మన మెతుకులు కూడా

అంటరానివే అయ్యాయిరా దాసూ’’ అని ‘మాదిగ చైతన్యం’ లో వర్ణించాడు కవి. 

అయినప్పటికీ ఆయన వ్యక్తిగతంగా ఉన్నప్పుడు శత్రువుని కూడా ముద్దాడగల ఆత్మీయుడు. ఆయన శత్రు శిబిరంలో నిలబడి కూడా తనదైన గొంతుని పలికించగల నేర్పరి. తన వ్యక్తిగత అభిప్రాయాలు తాను చెప్పట్లేదనీ, తన జాతి మూగబాధను తన గొంతుతో వినిపిస్తున్నానని ఒప్పించి, వాళ్ళతోనూ సఖ్యంగా మసలగలిగేవాడు. మహారాష్ట్రలోని ఖైర్లాంజి గ్రామంలో ఆధిపత్య వర్గపు స్త్రీలు రెచ్చ గొట్టి ఒక దళిత కుటుంబాన్ని సామూహికంగా చంపించిన నేపథ్యంలో రాసిన కవితలో భారతదేశంలోని దళితులందరివీ అవమానాలు, అత్యాచారాలు, హత్యాచారాలేనంటాడు కవి.

‘‘కత్తులతో బరిసెలతో కర్రలతో

వూరు ఊరంతా పూనకంతో

శరీరాంగాల్ని మర్మాంగాల్నీ

పవసపోట్టులా తరుగుతుంటే

ఇంత దారుణాన్ని

ఆ రాత్రి రాతి గుండెలతో

ఎంత నిబ్బరంగా చూడగలిగారు తల్లీ?

రాక్షస స్త్రీలు కూడా మీముందు బలాదూరే

అయ్యో! ఆపలేకపోయారా తల్లీ!

అపర దేవతల్లా మిమ్మల్ని పూజించే వాళ్ళం

ఏ ఆర్త నాదాలూ తల్లి పేగుల్ని కదలించలేదా తల్లీ!’’ అని నిలదీస్తాడు. అది అగ్రవర్ణాలనే దళితేతరులతోనైనా, దళితుల్లోని తన సోదరులతోనైనా ఆ సఖ్యాన్ని అలాగే కొనసాగించేవాడు. భావజాలం పట్ల ఒక స్పష్టతను ప్రదర్శిస్తూనే దళితులకు కులసమస్యే ప్రధానమైనా, వర్గ సమస్యను ప్రధానంగా భావించే మార్క్సిస్టులనూ కలుపుకుపోవాలనేవాడు. ఆయన సెంట్రల్‌ యూనివర్సిటీలో 2018 జూలై 19 వతేదీన ప్రొఫెసరుగా చేరారు. అప్పటి నుండే ఆయన్ని నేను దగ్గరగా చూడగలిగాను. అంతకు ముందు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య పీఠం, రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో పనిచేశారు. దానికంటే ముందు సికింద్రాబాద్‌ లోని వెస్లీ బాయ్స్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్‌ గా తెలుగు పండిట్‌ గా పని చేసారు. 1959 జనవరి21 వతేదీన ఆయన శ్రీఎండ్లూరి దేవయ్య, శ్రీమతి శాంతాబాయి. గార్లకు సుధాకర్‌ ప్రథమ సంతానంగా పుట్టాడు. 

సుధాకర్‌ గారి పూర్తి పేరు హాజరు పట్టీ, సర్టిఫికెట్స్‌ లో ఎండ్లూరి సుధాకరరావు అని ఉంటుంది. కానీ, సాహిత్య రచనల్లో మాత్రం ఆయన తన పేరులోని ‘రావు’ని తీసేసి ఎండ్లూరి సుధాకర్‌ అని మాత్రమే రాసుకుంటారు. ఆయన పూర్వీకుల గురించి మల్లెమొగ్గలగొడుగు కథల్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందినవారమని చెప్పారు. అక్కడ నుండి ఉపాథి వెతుక్కుంటూ మహారాష్ట్ర, తర్వాత ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలో వాళ్ళ అమ్మమ్మగారింటిలో ఆయన పుట్టాడు. అందువల్ల ఆయన ఆంధ్రాప్రాంతానికి చెందుతాడా? తెలంగాణా ప్రాంతానికి చెందుతాడా? అని ఎవరైనా అడిగితే తాను అన్ని ప్రాంతాలకూ చెందినవాణ్ణననేవారు. తాను షెడ్యూల్డు కులంలోని ఉపకులం మాదిగకు చెందిన వారైనా, తాను వివాహం చేసుకున్న పుట్ల హేమలత గారు మాత్ర షెడ్యూల్డు కులంలోని ఉప కులం మాల. తమకి మాల, మాదిగ భేదాలు లేవనీ, తమని చర్చి, ఆ క్రైస్తవమే కలిపిందనేవారు. తామేనాడూ ఈ ఉపకులాల గురించి చర్చించుకునేవాళ్ళం కాదనేవారు. కానీ, ఎండ్లూరి సుధాకర్‌ గారి కవిత్వం మాదిగ హక్కుల్నీ, మాదిగ సంస్కతినీ ప్రతిఫలించేలాగా ఉంటుంది. నాకు ఆయన కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సాహిత్యం వల్ల ముందుగా ఎండ్లూరి సుధాకర్‌ గారే నాకు ముందు పరిచయమైనా, అంతకంటే ముందు పరిచయమైనట్లుగా డా.పుట్ల హేమలతగారు ఆత్మీయంగా ఉండేవారు. ఆ కుటుంబ సభ్యులు కూడా అలాగే ఉండేవారు. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు. మానస పెద్దమ్మాయి. కవయిత్రి, కథారచయిత్రిగా రచనలు చేశారు. కానీ,  కేంద్రసాహిత్య అకాడమీ యువపురస్కారాన్ని పొంది తాను కథారచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన పిల్లల కోసం రాసిన కవితలు ‘వర్తమానం’ కవితాసంపుటిలో అనేకం ఉన్నాయి. అప్పుడు ఆ పిల్లలు చిన్నవాళ్ళు. తర్వాత పెళ్ళీడుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళపై కవితలు రాస్తూనే ఉన్నారు. కానీ, ఆ కవితలు వాళ్ళ పిల్లలకు మాత్రమే కాకుండా, సాధారణీకరించడం వల్ల పాఠకులంతా తమ తమ పిల్లల్ని ఆ కవితల్లో చూసుకోగలుగుతారు. ఆదివారం  ఆంధ్ర జ్యోతి అనుబంధం (3.10.2010) లో ‘వరాన్వేషణ’ పేరుతో ఒక కవిత రాశారు. ప్రతి తల్లీ, తండ్రీ తన కూతురికి ఎలాంటి సంబంధం కావాలనుకుంటారో తనకు బాగా తెలిసిన సాహిత్య పాత్రలతో ఇలా వర్ణిస్తాడు కవి.

‘‘ప్రవరాఖ్యుడు కాకపోయినా

ఫరవా లేదనిపించాలి

కుబేరుడు కాకపోయినా

నగలను కుదవబెట్టనివాడు కావాలి

సత్యవంతుడు కాకపోయినా

నిత్య సంతోషితుడూ

మా అమ్మాయికి హితుడు, సన్నిహితుడు కావాలి’’ అంటాడు. మనుచరిత్రలో ప్రవరుడు ఎంతో అందగాడు. ఆమెను అప్సరసలే మోహిస్తారు. అంత అందగాడు. ఆ పాత్రను పోలుస్తూ అంత అందంగా లేకపోయినా, ఒకవేళ కుబేరుడులా ధనంతుడు కాకపోయినా మంచి గుణాలున్నవాడైతే చాలునంటాడు. దీనిలో ఎంతో సౌందర్య సిద్ధాంతముంది. ఇలా మొత్తం తన కూతుర్ని ఎలా చూసుకునేవాడు కావాలో చెప్తూనే కొన్ని ఛమత్కార ప్రయోగాలను చేస్తాడు. పారిజాతాపహరణంలో సత్యభామ, శ్రీ కృష్ణుడికి తమ ఎడమ పాదం తగిలించిన ద్రుశ్యాన్ని స్ఫురింపజేస్తూ ... 

‘‘ఎప్పుడ్కెనా

మా అమ్మాయి ఎడమకాలితో తన్నినా

ఏమీ అనుకోని సరసుడు కావాలి

ఏడడుగుల బంధంతో ఏడిపించేవాడు కాదు

ఎప్పుడూ నవ్వించే స్నేహితుడు కావాలి’’ అంటాడు కవి. ఈ సన్నివేశంలో ఎంతో శ్రుంగార భావన ఉంది. శ్రీకష్ణదేవరాయకు జరిగిన ఒక చారిత్రక కథ ఉంది. ఇలాగే బైబిల్‌ లో కథల్ని కూడా చెప్పి, ఎంతో ముసలివయసులో పిల్లలు పుట్టినా ఎంతో అనురాగంతో జీవించిన అబ్రహాం, శారా లను గుర్తుచేస్తూ...

‘‘అబ్రహాము శారాల్లా

అపురూప దంపతుల్లా ఉండాలి

ఒక జీవితకాలం తోడుగా నిలవాలి’’ అని వర్ణిస్తాడు.  ఆ తర్వాత ముంతాజ్‌ బేగమ్‌ ను  ప్రేమించిన ప్రేమికుడు జహంగీర్‌ లాంటి వాడు తనకు అల్లుడు కావాలంటాడు. 

‘‘మా అమ్మాయిని ముంతాజ్‌లా చూసుకోకపోయినా

అనార్కలీలా సజీవ సమాధి చేయనివాడు కావాలి

పిడికిట తలంబ్రాలు పట్టేవాడే తప్ప

కత్తులు కటారులు పట్టే కసాయి కాకూడదు

ధారణాయంత్ర ధురీణుడు కాకపోయినా

సాధారణ ఉద్యోగియ్కెనా అభ్యంతరం లేదు

అమెరికా వాడో

ఐరోపావాడో అక్కర్లేదు

తెలుగువాడ్కెతే చాలు

మీ దృష్టిలో ఎవర్కెనా ఉంటే

మా అమ్మాయికి సరిపడే

వరుణ్ణి వెతికి తెస్తారా

వంద వచన కవితల సంపుటి అంకితమిస్తాను

ఇన్ని మాటలెందుకుగానీ

మా అమ్మాయిని భరించే మంచి బకరా కావాలి’’ అని చివరిలో మెరుపులాంటి చురకను వేసి బిగబట్టి చదివిన ఊపిరినంతా హాయిగా వదిలేసి నవ్వుకునేలా చేస్తాడు. మొత్తం కవిత అంతా అల్లుడు గుణగణాల్ని వర్ణించి, చివరిలో ఒక్కవాక్యంతో కవితను మెరిసేలా చేస్తాడు. ఇందులో చక్కని వ్యంగ్యంతో పాటు, తమ పిల్లల్ని మురిపెంతో చూసుకొనేవాళ్ళకోసమే తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారని ధ్వనింపచేయడం వల్ల ఈ కవిత సాధారణీకరించాడు.  సుధాకర్‌ గారి కవిత్వంలో పదాల్ని కవి ఎలా వాడుకోవాలో ఆయనకు తెలిసినట్లుగా మరివ్వరికీ తెలియదేమో అనిపిస్తుంది. లలితమైన, రసభరితమైన గజల్స్‌ వినిపిస్తూ తన్మయుడవ్వడమేకాదు,  శ్రోతల్నీ ‘ఆహా’ అనిపించేవాడు. గజల్‌ మాత్రమే కాదు, ఆయన కవితా చదివినా దాని నేపథ్యాన్ని చెప్తూ తనదైన బాణీలో చదువుతుంటే శ్రోతలెంతో ఆనందంగా ఉండేది. ఆయనకు ఉర్దూ, హిందీ భాషల్లో మంచి పుట్టుంది. దానివల్ల గజల్‌, రుబాయిలను తెలుగులో ఎంతో మాధుర్యంగా అనువదించేవారు. 

‘‘సదా  నా  హృదయం  నిన్నే  స్మరిస్తోంది

నీ జ్ఞాపకాల దీపంతో చీకట్లో చరిస్తోంది

తొలినాటి తీపి వలపు  తొలగిపోదు నేస్తమా!

నిన్ను  తలచుకున్నప్పుడల్లా  నా జన్మ తరిస్తోంది ’’ అని అనగలిగిన కవే, అగ్నినీ కురిపించే కవిత్వాన్ని రాశాడు. 


( భూమిపుత్ర దినపత్రిక, 28-1-2022 సౌజన్యంతో...)


No comments: