"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

31 అక్టోబర్, 2021

నవలీకరించబడిన దళిత ఉద్యమ చరిత్ర ‘చంద్రవంక’ (ముందుమాట)

నవలీకరించబడిన దళిత ఉద్యమ చరిత్ర  చంద్రవంక’

‘The novelist is neither is historian nor prophet: he is an explorer of existence’’(The Art of the Novel, Milan Kundera, Perennial Classics.2000 : 44) అని  చారిత్రక సంఘటనల్ని నవలగా తీర్చిదిద్దేటప్పుడు రచయితలు పాటించవలసిన సృజనాత్మక నైపుణ్యం గురించి చెక్ దేశపు ప్రసిద్ధ నవలా రచయిత మిలన్ కుందేరా చెప్పిన మాటలు ‘చంద్రవంక’ నవలా రచయిత కూడా అక్షరాలా పాటిస్తున్నారనిపిస్తుంది. భారతీయ సమాజంలో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తాను జీవిస్తున్న తెలుగు నేలపై దళితులపై జరిగిన  కొన్ని దాడుల్నీ, ఆ సంఘటనల్నీ చరిత్రగా చిత్రించే క్రమంలో చరిత్రనూ రాయడంలేదుఆ సంఘటనల్ని ఆధారంగా చేసుకొని ఒక ప్రవక్తలా నీతిబోధనలూ చేయడంలేదు. ఆ చరిత్ర సంఘటనల నేపథ్యంలో జరిగిన దళితుల అస్తిత్వాన్ని ‘చంద్రవంక’ నవల ద్వారా అన్వేషిస్తున్నారు రచయిత. తమ ఉనికే ప్రశ్నార్థకమై భయం భయంగా జీవించిన దళితుల నుండి పుట్టిన ఉద్యమ చైతన్యాన్ని సృజనీకరిస్తున్నారు. చరిత్రకారుడికీ, సాహితీవేత్తకూ మధ్య స్ఫష్టంగా కనిపించాల్సిన విభజన రేఖ కూడా అదే.

సాహిత్యం సమాజాన్ని ప్రతిబింబిస్తుందని మనం సర్వసాధారణంగా అనుకునే మాట. అయితే అది ఏ సమాజాన్ని ప్రతిబింబిస్తుంది? అది  ఏసమాజంలోని ఏ వర్గాలను చైతన్య పరుస్తుంది? అది ఏ దృక్పథంతో వెలువడుతుందనే ప్రశ్నలను బట్టి  ఆ రచనను విలువ కట్టాలి. దీన్ని బట్టే ఆ రచన బాధ్యతతో కూడిందా? కేవలం ఉబుసుపోక రాసిందా ? అనేది కూడా తెలుస్తుంది. ఈ ప్రశ్నల పరంపరనే లోతుగా గమనిస్తే ‘బాధ్యత’ అనేది భావజాలానికి సంబంధించిందని కూడా స్పష్టమవుతుంది. సాధారణంగా సమాజం పురోగమించాలనుకునేవాళ్ళు  భౌతికవాద దృక్పథంతోనూసమాజంలో కొన్ని వర్గాలు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తూ సాహిత్యం కూడా కొందరికి మాత్రమే సంబంధించిందని భావించే కొంతమంది  భావవాద దృక్పథాన్ని ప్రదర్శిస్తూ రచనలను కొనసాగిస్తుంటారు.  వీళ్ళు సాహిత్యాన్ని వస్తువు కంటే శిల్పవిలువలకే ప్రాధాన్యాన్నివ్వాలంటారు. సాహిత్యాన్ని సాహిత్యంగానే చూడాలంటారు. సాహిత్యంతో రాజకీయ సంఘటనల్ని కలపకూడదంటారు. కానీ, రాజకీయాలకు అతీతంగా సాహిత్యం రాయడమంటే, సమాజం కంటే, ఒక కాల్పనిక ప్రపంచంలో జీవించేలా చేయడమేనంటే ఒప్పుకోరు. దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి బాధ్యతగల కవి, రచయిత. చైతన్యపరుడైన ఉద్యమకారుడు. అన్నింటికీ మించి దేశంపట్ల ప్రేమగల భారత పౌరుడు. ఈ దేశం నాదనుకున్న వాడు ఈదేశంలోని ప్రజలందర్నీ నా వాళ్ళే అనుకుంటాడు. ఎజ్రాశాస్త్రి ఈ దేశం నాదనుకున్నారు. నా దేశంలో అందరూ బాగుండాలనుకుంటారు. తానొక ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ కేవలం తన పిల్లల్ని, తమ తల్లిదండ్రుల్ని, తమ బంధువుల్ని, వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వాళ్లతోనే సుఖంగా సంతోషంగా గడిపేయలేకపోతున్నారు. అవకాశం ఉండి కూడా ఆ వ్యక్తిగతమైన సుఖ సంతోషాలకంటేదేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రకాల దుర్మార్గాలను, చూస్తూ ఉండలేకపోతున్నారు. తనలో పెల్లుబుకుతున్న ఆవేశం, ఆలోచనలు అక్షరాలుగా సంధించాలనుకున్నారు. అందుకే అనుభవించగలిగిన వైయక్తికమైన సుఖాల్ని కూడా  అనుభవించలేకపోతున్నారు. దేశంలో  ఆధిపత్య వర్గాలు, ఆధిపత్య కులాలు, మతం పేరుతో, కులం పేరుతో, అధికారం పేరుతో కొనసాగిస్తున్న దుర్మార్గాలను, మారణకాండను చూస్తూ చలించిపోతూ కవిత్వమవుతున్నారు. కథకుడవుతున్నారు. నవలాకారుడవుతున్నారు. ప్రత్యక్ష కార్యాచరణలో ఉద్యమకారుడవుతున్నారు. తాను చదువుకుంటున్న పుస్తకాల్లోచరిత్రనుతాను ప్రత్యక్షంగా భాగస్వామిగా జీవించిన  చరిత్రను నిరంతరం పోల్చుకుంటున్నారు. వాస్తవాలు తొక్కివేయడుతున్నాయని గమనిస్తున్నారు. చరిత్రలో, సృజనాత్మక రచనల్లో  ఒక దుర్మార్గం కొనసాగుతోందని గ్రహిస్తున్నారు. పాలకవర్గాల చరిత్రలో శాసనాలు, తారీఖులు, దస్తావేజుల్ని మాత్రమే  ప్రధాన ఆధారాలుగా తీసుకుంటారనీ, ప్రజల చరిత్రలోనే నిజమైన సమాజం ప్రతిబింబిస్తుందనీ చాలామంది వాదిస్తూ ఉంటారు. అది పాటల రూపంలో, ప్రజల మౌఖిక కథల రూపంలో, సాహిత్య సృజన రూపంలో ప్రతిబింబిస్తుందని అంటారు. నిజమే. కానీ, ప్రజల చరిత్రని చెప్పుకునే దానిలో కూడా వాస్తవం వక్రీకరింపబడుతుందని గుర్తించిన పరిశోధనాత్మక చరిత్రకారుడు, సృజనశీలి ఎజ్రాశాస్త్రి. ఆ వక్రీకరణలన్నింటికీ చెల్లుచీటిరాయలేకపోవచ్చు. కానీ, తన కళ్ళముందు జరిగిన ఉద్యమాల్ని, అవీ దళిత కోణంలో జరిగిన ఒక ఉద్యమ వాస్తవ చరిత్రల ఉద్వేగాల్నీ సృజనీకరించాలనుకున్నారు. అదే చంద్రవంక నవలగా మనచేతిలో ఉంది.

     రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన ఎజ్రాశాస్త్రి ఇంతకు ముందొక నవల రాశారు. దానిపేరు ‘‘మా ఎర్ర ఓబన్న పల్లె". దీనిలో దళితులు, మాదిగలు, మాలలు, శ్రమజీవుల జీవన్మరణ సంఘర్షణాత్మక పయనాన్ని ఒక ఏడు తరాల్లో ఎలా ఉందో  మనకళ్ళముందుంచారు. ఈ నవలలలో ఎర్రఓబయ్య, ముత్యాలమ్మ పాత్రల్లోని చైతన్యాన్ని మర్చిపోలేం. భూమికోసం పోరాడిన ఆ శ్రమతత్వాన్ని కీర్తించడానికి మాటల చాలవు. అవి ఈ దేశంలో మూలవాసుల పాత్రలు. వైయక్తికంగా కనిపిస్తూనే, ఒక జాతికి ప్రాతినిథ్యం వహించే పాత్రలు. ఈ తెలుగు నేలలో  దళితజీవితాల్ని చిత్రించిన సజీవ పాత్రలు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మాదిగ జీవన మూలాలు. మాదిగ కళల్నీ, వారి సాహసాల్నీ కళ్ళముందుంచిన పాత్రలు. ఒక బీడుపడిన బంజరు భూమిని సాగుచేసి, పంటపండించి, మనుష్యులకు నివాసమయ్యే ఊరుగా చేస్తే, దాన్ని ఆక్రమించుకోవడానికి ఆధిపత్య కులాలు, వర్గాలు చేసే ప్రయత్నాలు... ఆ ప్రయత్నాల్ని తిప్పికొట్టేందుకు నిరంతరం తమ జీవితాల్ని త్యాగం చేస్తూ మూలవాసుల్ని గుర్తుకుతెస్తాయి.  ఈ దేశంలో తమ అస్తిత్వం కోసం పోరాడిన మట్టిమనుషుల స్వచ్ఛమైన ఆత్మకథలుగా సాగిన ‘‘మా ఎర్ర ఓబన్న పల్లె ’’ ఆధిపత్య కులాలు, వర్గాలతో ఎలా సంఘర్షణ పడిందో, ఎలా తన అస్తిత్వాన్ని నిలుపుకుందో తెలిపితే, చంద్రవంక నవలలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆ దళితుల అస్తిత్వ చైతన్యమెలా విజయవంతంగా ప్రవహించిందో ప్రతిబింబిస్తుంది. తొలి నవల దళితుల ఉనికీ, రెండవ నవల దళితుల సంఘర్షణ చైతన్యంతో ఉద్యమంగా మారిన పరిణామాల్ని సాహిత్యీకరించింది.

సాహిత్యం వాచ్యం చెయ్యకుండానే, ఆ స్పృహను కల్గిస్తుంది. అది కవిత్వంలో మాత్రమే కాదు, కథల్లోనూ, నవలల్లోనూ చేయాలి. అలా చేయడంలో ఎజ్రాశాస్త్రి విజయవంతమయ్యారు. తాను కవిత్వం రాసినా, నవల రాసినా తన జీవనమూలాల్ని మర్చిపోకుండా రాస్తారు. 2005లో ‘కర్రముక్క’ దీర్ఘకవితగా, 2006లో ‘ఏరవాకై తిరిగిలేస్తా’ కవితా సంకలనంతో, 2008లో ‘ నిప్పుల్లో నడిచే తప్పెట’ కవితాసంపుటిగా, ఇవే కాకుండా, నిరంతరం సమకాలీన సమాజంలో దళితులపై జరిగే హత్యాకాండలు, అత్యాచారాలకు, దోపిడీలకు, దుర్గార్మార్గాలకు ప్రతిస్పందిస్తూ కవిత్వమవుతున్నారు. ఒకవైపు తన మాదిగ మూలాల్ని మర్చిపోకుండా, దళితులుగా, బహుజనులుగా సమైక్యంగా పోరాడాల్సిన కర్తవ్యాన్నీ విస్మరించన చైతన్యంతో అక్షరమవుతున్నారు. అందుకే సమకాలీన దళిత సాహిత్య అధ్యయనానికి ఒక ప్రతినిథిగా హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ, ఎం.ఏ. తెలుగు, దళిత సాహిత్యం విద్యార్థులకు పాఠ్యాంశమయ్యారు. ఆయన రాసిన మా ఎర్ర ఓబన్న పల్లె ’’ నవలను విద్యార్థులు పరిశోధనకు తీసుకున్నారు.  మద్రాసు విశ్వవిద్యాయలంలో ఆయన రచనలపై ప్రత్యేకంగా ఎం.ఫిల్. పరిశోధన చేశారు. ఇంకా అనేక విశ్వవిద్యాలయాల్లో నేడు ఎజ్రాశాస్త్రి రచనలు అధ్యయనానికి తీసుకోవడం వెనుక ఆ సాహిత్యంలో వాస్తవికత, కళాత్మక విలువలే ప్రధాన కారణాలయ్యాయి. ఆ సాహిత్యంలో దళితుల జీవితం ఉంది. ఆ రచనల్లో స్వచ్ఛమైన, అచ్చమైన దళిత పలుకుబడి ఉంది. అన్నింటికీ మించి దళిత భావజాలం, తాత్త్వకత, సమకాలీన సమాజం కనిపిస్తుంది. విద్యార్థులు వీటిని అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ‘‘చంద్రవంక’’ నవల కూడా ఒక చారిత్రక వాస్తవం, కళాత్మకంగా మారినప్పుడు ఎలాంటి సృజనాత్మకపద్ధతుల్ని అవళంబిస్తారో అధ్యయనం చేయడానికి ఒక గొప్ప ఆకరం కాబోతుంది.

చంద్రవంక సాహిత్య పరంగా చూస్తే ఒక నవల. చరిత్ర పరంగా చూస్తే ఒక వాస్తవ చరిత్ర. సామాజిక శాస్త్రపరంగా చూస్తే వివిధ వర్గాలు, కులాలు, మతాల సంఘర్షణల ప్రతిఫలనం. రాజకీయంగా చూస్తే కొన్ని ఆధిపత్య వర్గాలు మరికొన్ని పీడిత వర్గాల్ని తమ పాలనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకుంటారని గుర్తించగలిగే రాజకీయ శాస్త్రం. ఆ దాడుల వెనుక దాగిన ఆర్థికశాస్త్రాన్ని చెప్పిన నవల. వస్తుపరంగా అన్ని పార్శ్వాలీ నవల్లో ఉన్నాయి. సాహిత్యపరంగా పరిపూర్ణమైన నవలా లక్షణాలతో పాఠకుణ్ణి ఏకబిగిని చదివిస్తుంది. ఉద్యమకారుణ్ణి పిడికిలి బిగిసేలా చేస్తుంది. దీనిలోని రచనాశైలి అంతశక్తివంతంగా ఉరికిపడింది. సన్నివేశాలు అంత బలంగా పెనవేసుకొన్నాయి. వాస్తవం మనకళ్ళముందు తిరుగుతున్నట్లనిపిస్తూ, పాఠకుణ్ణి ఆ నవల వెంటాడేలా చేస్తుంది.

 కారంచేడు, చుండూరు, పదిరికుప్పం..ఇలా పేర్లు వేరు వేరు.కానీ దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. ఆధిపత్య వర్గాలకు కొమ్ము కాసే వాళ్ళు ఎవరు? దళితుల్ని భయాందోళనకు గురి చేస్తున్నదెవరు? ప్రజాస్వామ్యంలో పాలనా యంత్రాంగం ఎలా పనిచేస్తుందిదళితుల ఉనికిని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ నెల పై దళితులు బతకాలంటే ఏం చేయాలి? రాజ్యాంగం ఉంది. చట్టం, న్యాయం, శాసన వ్యవస్థ...అన్నీ ఉన్నాయి. కానీ, వాటిని అమలు చేసే వాళ్ళు ఎవరుఇలాంటి ప్రశ్నలెన్నింటినో ఈ నవల మనకందిస్తుంది. ఆ ప్రశ్న నుండి సమాధానాల్ని అన్వేషించమంటుంది.

 దీనిలో కారంచేడు, చుండూరు తదితర సంఘటనల నేపథ్యంలో  ఏర్పడిన దళిత మహాసభ, దాన్ని నడిపించిన నాయకులు, ప్రజలుఆ సమయంలో మావోయిస్టుల పాత్ర, తదనంతరం దళితులలో ముఖ్యంగా మాల-మాదిగల్లో వచ్చిన చీలికలు, దానికి కారణాలు, వాటికి ప్రభుత్వాల స్పందన, అనంతర దళిత, బహుజన ఉద్యమాల స్థితిగతులు ఇవన్నీ మనకు తెలియాలంటే ఈ నవల చదవాలి. ఈ నవల రచయిత ఎజ్రాశాస్త్రి కూడా అదే పేరుతో ఒక పాత్రగా ఈ నవలలో కనిపిస్తారు. తాను ప్రత్యక్షంగా చూసిన సమాజాన్ని సమాజంలో జరిగిన అనేక చారిత్రక సంఘటనల్నివ్యక్తుల వ్యక్తిగత అనుభూతుల్ని దీనిలో అక్షరరూపంగా మార్చారు.Every true novelist listens for the Suprapersonal wisdom, which explains why great novels are always a little more intelligent than their authors. ( పుట:158) అని మనీలా కుందేరా అన్నట్లు, చంద్రవంక నవలే ఎజ్రాశాస్త్రిని నడిపించింది. తాను కూడా దానిలో ఒక పాత్రగా ఉన్నా, తన కంటే నవలలో ఉద్యమం, ఆ ఉద్వేగాలు, ఆ సామాజిక స్వరూపాన్ని చెప్పాల్సినప్పుడు తనపాత్ర కంటేవాస్తవిక సామాజిక ఉద్యమాల్ని ప్రతిఫలించడంలో విజయవంతమైంది.


భారతదేశంలో ఆదివాసులది మాతృస్వామ్య వ్యవస్థ. ఆ భావజాలాన్నే నేటికీ దళితులు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో సాగిస్తున్నారు. ఈ సంస్కృతిలోని ఔన్నత్యాన్ని చంద్రవంక పాత్ర ద్వారా రచయిత తీర్చిదిద్దిన క్రమ వికాస పరిణామాలు చూస్తే దళితులు మాతృస్వామ్య వ్యవస్థకు ఇచ్చిన ప్రాధాన్యం స్పష్టంగా తెలుస్తుంది. ఈనవలలలో చంద్రవంక పాత్ర మాక్సిం గోర్కీ అమ్మ పాత్రను తలపింప చేస్తుంది.

చంద్రవంక పాత్ర తెలుగునేలలో జరిగిన మార్క్సిస్టు, దళిత, బహుజన ఉద్యమాల పరిణామ వికాసాన్ని మన కళ్ళముందుంచుంది. చారిత్రక వాస్తవాలను నవలగా తీర్చిదిద్దడంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాస్తవాల్ని, ఆ సంఘటనల చారిత్రిక క్రమాన్ని స్పురింపజేసేలా ఆ కథనాన్ని సృజనాత్మకంగా కొనసాగించాలి. కేవలం వాస్తవ విషయాలు మాత్రమే చెబుతూ ఉంటే దానిలో కళా నైపుణ్యం కనిపించదు. సృజనాత్మకత నైపుణ్యం వలన వాస్తవాన్నే చదువుతున్నామనే విషయాన్ని మరిచిపోయి ఒక కాల్పనిక కథ చదువుతున్నట్లుగా అనుకుంటేనే పాఠకుడు దానికి ఆకర్షితుడవుతాడు.  కథంతా పూర్తయిన తర్వాత దానిలో కళాత్మకంగా చెప్పిన  వాస్తవిక సత్యం పాఠకుడికి  మొదట అనుభూతి రమ్యత నిచ్చి, ఆ  తర్వాత ఆలోచనకు ప్రేరేపించాలి. ఆ సంఘటనలు ఆ సన్నివేశాలు రచయితల ఎందుకు తీర్చిదిద్దాడని ఆలోచనలో పడేయాలి. చంద్రవంక పాత్ర అలాగే అనిపిస్తుంది. ఉద్యమంలో పనిచేసేవారికి చంద్రవంక అనేక మంది ఉద్యమకారులకు ప్రతిబింబంగా అనిపిస్తుంది. ఉద్యమాలతో మమేకం కాకపోతే అలాంటి పాత్రను సృష్టించలేరు. రచయితకు చిన్ననాటి నుండే అనేక ఉద్యమాలతో పనిచేసిన అనుభవం ఈ పాత్ర సజీవంగా వెలువడ్డానికి ఒక ప్రధానకారణమనిపిస్తుంది. చారిత్రక సంఘటనలు, వాస్తవాలు సృజన రచనల్లో నీడలా వెంటాడాలి. మేఘంలా కరిగిపోతాయి. జీవితానుభవాలు ఉద్యమాల్లో ఉపయోగించి చంద్రవంక పాత్రను రచయిత తీర్చిదిద్దారని స్పష్టంగా తెలుస్తుంది. తలుపులమ్మ పాలు పొంగడం మంచిదే కదా అంటే నాకు ఇటువంటి నమ్మకాలు లేవనటం ద్వారా చంద్రవంక భావజాలపరంగా భౌతికవాదదృక్పథాన్ని, ఆ భావజాలాన్ని చెప్పడంలో రచయిత సునిశిత నైపుణ్యం తెలుస్తుంది. చంద్రవంక ఒక ఉద్యమానికి నిలువెత్తు ప్రతీక. తాను పెళ్ళి చేసుకోవడంలో, పిల్లల్ని కనాలా వద్దా? ఆ నిర్ణయాధికారం ఎవరిదని ప్రశ్నించుకునేవాళ్ళకి దీనిలో స్త్రీవాదిగా, ఉద్యమకారిణిగా చంద్రవంక భిన్నపార్శ్వాల్లో కనిపిస్తుంది. తెలుగు నేలపై పోరాడిన ఒక చంద్రశ్రీ, ఒక బెల్లి లలిత, ఒక మేరీమాదిగ... ఇలా ఎందరో చంద్రవంకలో కనిపిస్తారు. అయితే, దళిత ఉద్యమాలు గానీ, మాదిగ హక్కుల దండోరాలో గానీ, మహిళలు తమ వంతు ఉద్యమానికి తోడ్పడినా, ఆ ఉద్యమంలో నిమగ్నమైనా, నాయకత్వంలో పురుషులకు దక్కినంత గౌరవంగానీ, స్థానంగానీ మహిళా నాయకత్వానికి దక్కిందా? మరి, ఒక మహిళని ప్రధాన పాత్రగా ఈ నవలను నడిపించడంలో చారిత్రక వాస్తవాల్ని వక్రీకరించడం కాదా? అనుకొనేవాళ్ళూ ఉండొచ్చు. కానీ, దళిత ఉద్యమాల్లో కూడా స్త్రీ నాయకత్వాన్ని విస్మరించిన తీరుని నిరసిస్తూనే, ఒక వేళ స్త్రీ నాయకత్వంలో ఆ ఉద్యమాలు నడిస్తే ఎలా విజయవంతమయ్యేవో చంద్రవంక పాల్గొన్న అనేక ఉద్యమాల్ని ఈ నవలలో వర్ణించారు రచయిత. ఆ విధంగా స్త్రీ పక్షపాతిగా, ఒక దళిత అభ్యుదయ రచయిత స్వాప్నికతను ఈ నవల ద్వారా స్ఫురింపజేయడం నవలలో కనిపించే ఒక ప్రత్యేకత.  

నవలలో కేవలం సామాజిక ఉద్యమ స్ఫురణే కాదు, సాంస్కృతిక ఉద్యమ స్ఫురణను కూడా కల్గించడం చంద్రవంక నవలలో కనిపించే మరో ప్రత్యేకత.మన దేశంలో పండుగలు, జాతర్లు కూడా మతానికీకులానికీ అనుగుణంగా జరుగుతూ ఉంటాయి. కానీ పైకి చూడడానికి అందరూ కలిసి మెలిసి ఉన్నట్లే అనిపిస్తోంది. ఆ జాతర్లూ, ఆ పండుగలూ, ఆ తీర్థాలూ కొంతమందికి తమ పెత్తందారీ తనాన్ని మరి ఇంత పెద్ద చేసుకోవడానికి ఉపయోగించుకుంటారో చెప్పకనే చెప్పారు. ఒక వ్యక్తి చనిపోతే దళితుల్లో, ముఖ్యంగా మాదిగల్లో ఆ సంస్కారాలు చేసే ఒక సాంస్కృతిక సంఘటన చాలు, రచయిత నిశితమైన పరిశీలనాదృష్టిని చెప్పడానికి. మరికొంత మందికి వాళ్ళ కక్షలూ, కార్పణ్యాలూ తీర్చుకోవడానికి ఉపయోగపడతాయి. కలిసిమెలిసి నట్లు కనపడే దాంట్లో కలవనివ్వని మను‌షుల మనస్తత్వాల్ని, ఆ సందర్భంలో బయటపడే కుల, వర్గాధిపత్యాల్ని ఈ నవలలో  సాంస్కృతిక సమైక్యతలోని డొల్లతనాన్ని '' చైతన్య'' వాళ్ళ క్లాస్ మేట్, స్నేహితులు కలిసిన ఒక సన్నివేశాన్ని ఒక్కదాన్ని చూసినా రచయితకున్న సాంస్కృతిక దృక్పథం స్పష్టమవుతుంది. ఇలాంటి అనేక సాంస్కృతిక సంఘటనల ద్వారా భారతీయ సాంస్కృతిక సమైక్యత లోని భిన్న కోణాలను అవగాహన చేసుకోవచ్చు.



కొంతమంది జీవితాల్లో త్రాగుడికి బానిసలు కావడం... భార్యోభర్తో చనిపోవడం...మరలా రెండో వివాహం చేసుకోవడం... ఇవన్నీ ఎంతో సహజంగా జరిగిపోతుంటాయి. అంతే సహజంగా ఈ నవలలోనూ వాటిని చిత్రించారు రచయిత. కొన్నిసార్లు కులాంతర , మతాంతర వివాహాలు కూడా అలాగే జరిగిపోతుంటాయి. కానీ మరి కొన్నిసార్లు అవే కులాంతర మతాంతర వివాహాలు జరగాలంటే హత్యలకు దారితీస్తాయి. దానికి ప్రధాన కారణం వర్గం, అధికారం డబ్బు ఇచ్చే మదం. దళితులకు సహకరిస్తున్నట్లే ఉంటూ, వాళ్ళనెలా తమ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటారో, దానికి చదువుకున్న దళిత విద్యావంతులు కూడా బలైపోతున్నారో ఎంతో సునిశితంగా గుర్తించారు రచయిత.

విజయ్, చైతన్య ...ఇద్దరు ఫ్రెండ్స్. ఇద్దరూ దళితులే. విజయ్ ఒకవైపు దళిత ఉద్యమానికి సహకరిస్తూనే, మరొకవైపు తన జీవిక కోసం  ఒక ప్రైవేట్ కాలేజీలో చేరాడు. ఆ కాలేజీ నడుపుతున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళుఇండియన్ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష పాసై, ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్న చైతన్య... కలెక్టర్ అయ్యాడా? తాను ప్రేమించిన, తన కులం గాని ఒక అంతస్తులో పైనున్న ఓ బి.సి కులానికి చెందిన  శోభనను తాను పెళ్లి చేసుకున్నాడా? శోభన పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయనడంలోని శిల్పరహస్యమేమిటితన భర్తని కోల్పోయినాతన కొడుకుకోసమే బ్రతుకుతున్న తల్లి తన కొడుకుని కలెక్టర్ గారు చూడాలనుకున్న కోరిక నెరవేరిందా?   ఇక్కడ  చైతన్యశోభన పాత్రల వైయక్తికం కాదు, వ్యవస్థలకు ప్రతీకలు.

  మనీలా కుందేరా Historiography writes the history of society,  not of man. That is why the historical events my novels talk about forgotten by historiography. (37) అన్న మాటలతోనే నా అభిప్రాయాన్ని ముగిస్తాను. దీన్ని బట్టి మనిషి చరిత్ర వేరు సమాజ చరిత్ర వేరు. చరిత్ర రచనలో సమాజ చరిత్రను రాయడం ప్రధానం, మనిషి చరిత్రను, మనిషి ఉద్వేగాలను కాదు.  ఆ చారిత్రక సంఘటనలో జరిగిన విషయాల్ని మాత్రమే చరిత్ర రికార్డు చేస్తుంది. కానీ ఆ చారిత్రక సంఘటనల ఉద్వేగాన్ని రికార్డ్ చేయవలసిన బాధ్యత సాహిత్యానిది. ఆ బాధ్యతను చంద్రవంక నవల ద్వారా రచయిత ఎజ్రాశాస్త్రి పరిపూర్ణంగా నెరవేర్చాడనుకుంటున్నాను. ఈ నవలలోని కథను చెప్పడమో, కథను వ్యాఖ్యానించడానికో ఈ ముందుమాటను రాయడంలేదు. ఎజ్రాశాస్త్రినీ, ఎజ్రాశాస్త్రిని నడిపిన నవలనూ, ఆ చైతన్యాన్ని గుర్తించడానికే నాలుగు మాటలు రాస్తున్నాను. నా అభిప్రాయాల్ని ఇలా చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన ఎజ్రాశాస్త్రిగార్కి నమస్కారాలు తెలియజేస్తూ, నవలలో కనిపించే దళిత ఉద్యమ నాయకుల్నీ, వారు నడిపిన ఉద్యమాన్ని, ఆ సందర్భంగా వెలువడిన ఉద్వేగాల్నీ, అంతే తాజాగా, అంతే వాస్తవికంగా, అంతే స్వచ్ఛంగా మీరూ ఆస్వాదించమని కోరుతూ, ఈ నవలను చదవమని మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. 

-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

 తెలుగు శాఖాధ్యక్షుడు,

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ( సెంట్రల్ యూనివర్సిటీ),హైదరాబాద్.

darlahcu@gmail.com


 


కామెంట్‌లు లేవు: