"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

22 September, 2021

ఊహలకు రెక్కలు వచ్చిన ఊసులు ( ముందుమాట)

 ఊహలకు రెక్కలు వచ్చిన ఊసులు






పిల్లలు ''ఉంగా ఉంగా...'' అంటూ ఏవేవో మాట్లాడుతుంటారు. సాధారణంగా అవి వాళ్ళ అమ్మ కు తప్ప మిగతా వాళ్ళకి తెలియడం అంత సులభం కాదు. కానీ, అమ్మతో పాటు ఆ మాటల్నీ అర్థం చేసుకోగలిగే శక్తి అమ్మలా ఆదరించే టీచర్స్ కూడా ఉంటుంది. అలా పిల్లల ఊహలను అర్థం చేసుకొన్నారు టీచర్ శ్రీమతి షర్మిల.  సెంట్రల్ యూనివర్సిటీ లో చదువుకునేటప్పుడు ఆమె నా క్లాస్మేట్. ఆ చనువుతో ఈ చిన్నారి ఊసులు  ఒకసారి చదవమని నాకు పంపించారు.  ఆ ఊహల్లో అద్భుతమైన ప్రపంచం ఉంది. ఆ ఊహల్లో అందమైన అనుభవాలు ఉన్నాయి.  ఆ ఊహల్లో చిన్న చిన్న నీతులు దాగున్నాయి.  ఆ ఊహల్లో అందమైన కథలు కాగలిగిన సంఘటనలు కూడా ఉన్నాయని చెప్పాను. ''ఆ మాటల్నే రాసి పంపించండి. వాటిని  మా విద్యార్థులు కూడా చదువుకుంటారు'' అని అన్నారు. ఆమె మాటల్లో నాకు ఆ విద్యార్థుల పట్ల ఎంతో అనురాగం కనిపించింది. విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దాలనే సంకల్పం కనిపించింది. తన స్వంత పిల్లలు చెప్పే మాటల్లా వాళ్ళ విద్యార్థుల మాటల్ని నాతో ఎంతో ఆనందంగా  పంచుకున్నారు. ఆ విద్యార్థుల మాటల్లో మహోన్నతమైన ఊహల్ని గమనించారు.నిజమే ఆ వయసులో నాలుగు మాటలు మాట్లాడితే చాలు. వాటిని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ హృదయాల్లో ముత్యాల్లా దాచుకుంటారు. కథలు కథలుగా తమకు కావలసిన వాళ్ళకు కూడా ఉప్పొంగుతున్న ఆనందంతో చెబుతుంటారు.  పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత కూడా సందర్భాన్ని బట్టి వాటిని చెబుతుంటారు. తల్లిదండ్రులు మాత్రమే కాదు. తాము కూడా అలాంటివన్నీ చేయలేకపోయినా, కొన్నింటినయినా చేయవచ్చుననుకున్నారు.

 అందుకే వాటిని శ్రీమతి షర్మిళ ఇలా ఒక పుస్తకంగా ఒకచోటుకి చేర్చారు. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత అవి గొప్ప జ్ఞాపకాలవుతాయి. వాళ్ళు వాటిని చూసి మురిసిపోతారు.

చిన్న పిల్లల్లో గొప్ప సృజనాత్మక ప్రతిభ ఉంటుంది. ఈ పుస్తకంలో ఒకరు (అందమైన కల- ఆద్య కశ్యప్) తనకు వచ్చిన కలను  చెప్పారు. ఆ కలలో పిల్లలు  తినాలని ఇష్టపడేవాటిని అలా కల ద్వారా వివరించడం ఒక అద్భుత కథనం. మనోవైజ్ఞానిక సిద్థాంతాల ప్రకారం  తమ ఆలోచనలను బట్టి కలలు వస్తుంటాయంటారు. ఆ సిద్దాంతాలు ఏవీ ఈ పిల్లలకు తెలియవు. స్వచ్ఛంగా తమ కలల్ని ఒక వరుసలో చెప్పడం మాత్రం తెలుసు. దాని వల్ల ఒక కథనంగా మారింది. ముగింపులో  అది కల అని చెప్పడంలో ఒక మెరుపు మెరిసినట్లు ఆ పిల్లల కళ్ళల్లో వెలుగులు కురుస్తాయి. ఎత్తుగడ, ముగింపులో కనిపించే. నైపుణ్యం దాన్ని కథగా మార్చగలిగింది. 

ఇంకొంతమంది  జంతువులు, పక్షులు మాట్లాడుకుంటున్నట్లు చెప్పారు. కుక్క, పిల్లులతో మాట్లాడింది గౌతమి.  పీత- కుక్కలతో సాత్విక్,  కుక్క, జిరాఫీ, ఏనుగు, నక్కలతో గణేష్ కథ చెప్పించాడు.  కుందేలు పిల్లలు, ఎలుగుబంటులను పాత్రలుగా చేసి తన్వి.డి చక్కని నీతిని వివరించింది. తస్విక కోతిపిల్ల చేత స్నానమాడిస్తూ మురిసిపోయింది. జంక్ ఫుడ్ మంచిదికాదని ఒక నక్కకు ఎద్దు అనే డాక్టర్ చెప్పించాడు వేదాంశ్. వృషాంక్ ఒక పక్షి నుండి నత్తను కాపాడాడు. నత్త తనను తాను రక్షించుకోవడానికి చేసిన తెలివైన పనిని చెప్పాడు. సమయానుకూలంగా తెలివి తేటలతో ఉండటమెలాగో సూచించాడు. పిల్లి, ఎలుక, కుక్కల దాహాన్ని తీర్చింది మాయ. పిల్లలకు జంతువులు, పక్షులు అంటే ఎంతో ఇష్టం.వాటితో ఆడుకుంటుంటారు. ఒక్కోసారి తెలియక వాటిని చంపేస్తుంటారు.అటు పిల్లలు వాటికి అప్పుడప్పుడు నీళ్ళు తాగిస్తుంటారు. వాటిని తమ ప్రక్కనే వేసుకొని పడుకుంటారు. అలాంటి వాటిలో ఒక భాగాన్ని చెబుతూ జంతువులు, పక్షులకు ఎప్పటికప్పుడు దాహం వేస్తుంది.దాన్ని గమనించాలని అంటుంది. ఇక్కడ మాయ చెప్పింది చిన్న విషయంలా అనిపిస్తుంది.కానీ, పెద్దవాళ్లు కూడా ఆచరించవలసిన నీతి ఉంది. పర్యావరణంలో పక్షులు, జంతువులు, వృక్షాలు, మొక్కలు...ఇలా ఎన్నో భాగం.వాటిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేసింది. విక్రమ్ కార్తికేయ తన నేస్తం ఉడుతకు ఆహారాన్ని పెడుతుంటాడు. తాము పడేసేవి ఇతరులకు అవి ఎంతో ఇష్టమైన ఆహారం అవుతుంటాయని గమనించమంటున్నాడు. ఆద్య టి. కలిసి ఉంటే కలదు సుఖం అంటుంది. అలా కలిసి ఉంటే తమకంటే బలవంతులను కూడా ఓడించవచ్చునంటుంది. అలా ఓడించాలంటే అమ్మా, నాన్నలు పెట్టే ఆహారం తినాలి. వాళ్ళు పిల్లలకు ఏమి పెట్టాలో వాళ్ళకు తెలుసు. ఈ విషయాన్ని ఆద్య టి రెండు ఎలుగు బంటులు, ఒక పులిని పాత్రలు చేసి చెప్పింది. తన పిల్లలకు లడ్డూని పట్టుకొని వెళ్ళాలనుకుందట బొద్దింక.కానీ, బల్లివల్ల అది సాధ్యం కాలేదంటుంది అమూల్య. ఒక్కోసారి తమకంటే బలవంతులు ఎదురైనప్పుడు వాళ్ళకి తలవంచాలని చిన్న సంఘటన ద్వారా చెప్పింది. తమకు అనుకూలంగా లేనప్పుడు తిరగబడకూడదు. తమ తమ బలాలు, తమ తమ స్థలాలను బట్టి వాళ్ళ బలాబలాలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా గమనించాలి. ఈ చిన్నారి ఇవన్నీ ఉద్దేశించకపోవచ్చు. కానీ తనకు తెలిసో, తెలియకో ఎంతో గొప్పగా చిన్న సంఘటనలాగే చెప్పింది.

రోజూ దొంగతనం చేసే కాకికి ఉడుత, కొంగలు ఎలా బుద్ధి  చెప్పి కాకిలో మార్పు తీసుకొచ్చాయో దిత్య చక్కని కథ చెప్పింది.

అలా కోతి, కుక్క, కాకి, ఎలుక, ఉడుత, కొంగ వంటి వన్నీ పాత్రలయ్యారు. అలాంటి కథ చదువుతుంటే పిల్లల్లో ముసి ముసి నవ్వులు... పూర్తయ్యే సరికి తాము ఏ పాత్ర లో ఉన్నారో చెప్పేస్తారు. ఆ పాత్రలను, ఆ సన్నివేశాలను రంగు రంగుల చిత్రాల ద్వారా వివరించడం వల్ల దానిలో చెప్పిన సత్యాన్ని మర్చిపోకుండా కూడా గుర్తుపెట్టుకుంటారు.

పంచతంత్రం కథలు, అలాంటి కథలే    బాలమిత్ర, చందమామ వంటి పత్రికల్లో రావడం వెనుక మనవాళ్ళ అనుభవ జ్ఞానం ఎంత గొప్పదో తెలుస్తుంది. అది పిల్లల మనస్తత్వాన్ని గుర్తించిన జ్ఞానం. ఆ సంప్రదాయాన్ని ఈ పిల్లలు కొనసాగిస్తున్నారు. ఈ పిల్లలు ద్వారా తల్లిదండ్రులు, టీచర్లు, కళాశాల యాజమాన్యం చక్కని ప్రోత్సాహం ఇస్తున్నారు. 

మరికొంత మంది తమ అనుభవాలనే చెప్పారు. అలా చెప్పడంలో ఊసులు ఊహలుగా మారాయి.ఆ ఊహలు కథలుగా మారాయి. ఆద్య కశ్యప్ మంచి మనుషులు ఎలా ఉంటారో చెప్పింది. దర్శిని తన తాత ఉంగరం కనపడకపోతే పడిన హడావిడికి ఎంతో కూల్ గా చెప్పింది. వస్తువుల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పింది. తాత్త్విక  కొత్త అమ్మాయి తన స్నేహితులతో ఎలా సంతోషంగా కలవగలిగిందో వివరించింది. శ్రీహాన్... చిన్న పిల్లలు నిత్యం చేసే అల్లరి ఎలాంటిదో చెప్పాడు. పిల్లలకు వస్తువుల్ని క్రింద పడేయడం సరదా. వంట గదిలో వస్తువుల్ని అలాగే కింద పడేస్తుంటారు. నాన్న గదిలో పుస్తకాల్ని పడేస్తారు. చేతికి దొరికిన వన్నీ చెల్లా చెదారం చేస్తారు.వాళ్ళకి అదో సరదా. వద్దనే కొద్దీ మరీ చేస్తుంటారు. కొడతానంటే పళ్లు ఈకలిస్తూ పారిపోతుంటారు. మొదట్లొ సరదాగానే అనిపిస్తుంది.తర్వాత వాటిని సర్దుకోవడం కష్టమవుతుంది. అలా సర్ది ఇలా వచ్చామో లేదో మళ్ళీ క్రింద పడేస్తుంటారు. అలాంటప్పుడు తల్లికి సహనం కూడా నశిస్తుంది. నేను చేయలేను. మీరేమి చేసుకుంటారో మీ ఇష్టమంటూ ఇంట్లో వాళ్ళమీద అరుస్తుంటారు. ఆ అరుపులకు అమాయకంగా కళ్ళు పెట్టి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఒకోసారి దాకుంటారు. ఒక్కోసారి వాళ్ళే మళ్ళీ పెద్ద ఆరిందాల్లా సర్దాలని ప్రయత్నిస్తుంటారు. ఇది పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ నిత్యం జరిగేదే. వాళ్ళ అల్లరిలో తల్లికి ఆనందం కూడా ఉంటుంది. వాటిని తమ బంధువులతో కథలు కథలుగా కూడా చెబుతారు. కానీ, ఆ అల్లరిని అలాగే వదిలేయకూడదు. వాళ్ళ చేతే ఆ పనిని మానిపించాలి. శ్రీ హాన్ మంచి కథ రాశాడు. చింటూ, టామీల ద్వారా అపాయానికి కూడా ఓ ఉపాయం ఉంటుందని చక్కని పరిష్కారం సూచించాడు. ఆరుష్, భవ్యనిత్య, విహాన్, తన్వి సాయి, తస్విక...అందరు వినాలనిపించే ఊసులు చెప్పారు. ఈ కేసుల్ని ఇలా పుస్తక రూపంలోకి తీసుకురావడం వెనుక ఎంతో శ్రమ ఉంది.ఎంతో బాధ్యత ఉంది. పిల్లల్లో సృజనాత్మకతను పెంచాలనే తపన ఉంది. ఈ పిల్లలందరికీ ఆ భగవంతుడు మంచి ఆయరారోగ్యాల్ని, మరిన్ని తెలివి తేటల్నీ ప్రసాదించాలని కోరుతున్నాను. ఈ పుస్తకంలో ఉన్న మన బాల రచయితలు, రచయిత్రుల పేర్లు ఎంతో వైవిధ్యంగా ఉన్నాయి. ఈ పేర్లు సాధారణంగా కనిపించే, వినిపించే పేర్లుకాదు. బహుశా ఆ పేర్లు పెట్టడానికి తల్లిదండ్రులు ఎంతకాలం రీసర్చ్ చేశారో!  ఈ పిల్లల తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నాను. ఈ పిల్లల చక్కని భావుకతను భద్రపరుస్తున్నవారందరినీ అభినందిస్తున్నాను. ఈ పిల్లలు భవిష్యత్తులో గొప్ప ప్రొఫెసర్లు,  సైంటిస్టులు, సివిల్ సర్వెంట్లు,  వ్యాపారవేత్తలు, పాలకులు ..ఇలా అనేక ఉన్నత రంగాల్లో స్థిరపడినా,  వారి ఈ ఊసులు గొప్ప సృజనాత్మక నైపుణ్యానికి తొలి మెట్టులుగా  భావించవచ్చని అనుకుంటున్నాను. ఈ పిల్లలు అందరికీ అభినందనలు.

- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

శ్రీకృష్ణ జన్మాష్టమి , 31.8.2021

 తెలుగు శాఖాధిపతి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ), హైదరాబాద్-500 046. ఫోన్:9182685231

(https://tsushyderabad.com/flip-book.php  శ్రీరామ్ యూనివర్సిల్ స్కూల్, హైదరాబాదు వారు రెండవతరగతి విద్యార్థుల కోసం రూపొందించిన ‘చిన్నారి ఊసులు’ కథలకు రాసిన ముందుమాట) 


No comments: