"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

24 September, 2021

నాగబు తొలి తెలుగు పదం కాదు!

 తొలి తెలుగుపదం అది కాదట!


క్రీ.పూ. 6వ శతాబ్దికి ముందు నుంచి జనపదాల్లో వాడుకలో ఉన్న ప్రాకృత భాషే మన భాషలన్నింటికీ మూలమన్న చారిత్రక సత్యాన్ని మనం ఆలస్యంగా గుర్తించాం. చాలామంది తెలుగు భాషా పరిశోధకులు తమకు తోచిన ఆలోచనలు బయటపెట్టారే తప్ప అందరికీ ఆమోదయోగ్యమైన ఆధారాల్ని చూపించలేదు. ‘నాగబు’ అనేది తొలి తెలుగు పదం కాదంటూ ఆ విశేషాలను తెలియజేస్తున్నారు స్థపతి ఈమని శివనాగిరెడ్డి.

భాష మూలాల్ని, వెదుక్కోవలసి వచ్చినపుడు, ఆ జాతి మాటలు, పాటలు, సాహిత్యం(నోటి, రాత), శాసనాలను ప్రమాణంగా తీసుకోవటం ఆనవాయితీగా వస్తున్నదే. ఒక జాతి ఔన్నత్యాన్ని వివరించడానికి ఏదేని తొలి సాహితీ రూపం దొరుకుతుందోనని వెతుక్కుంటాం. తెలుగు భాషకు సంబంధించినంతవరకూ ఇప్పటివరకూ చాలామంది పరిశోధకులు వారికి తోచిన ఆలోచనలు బయటపెట్టారే తప్ప అందరికీ ఆమోదయోగ్యమైన ఆధారాల్ని చూపించని మాట నిజం. తెలుగు నేల, తెలుగు జాతి, తెలుగు భాష అనే పదాలు వాడుకలోకి రాకమునుపు ఆంధ్రదేశం, ఆంధ్ర జాతి, ఆంధ్ర భాష అనే పదాలే శాసనాల్లోనూ, తొలి సాహిత్యంలోనూ పేర్కొనబడినాయి. అనేకమంది చరిత్రకారులు, భాషావేత్తలు ఆంధ్రుల ప్రాచీనతను చెప్పటానికి ఐతరేయ బ్రాహ్మణాన్ని చూపిస్తూ వచ్చారు. మన దేశంలో ప్రాకృతమే ప్రజల భాషగా ఉండేదని బౌద్ధ, జైన సాహిత్యాలు రుజువు చేస్తున్నాయి. క్రీ.పూ. 6వ శతాబ్దికి చాలా ముందు నుంచీ, జనపదాల్లో వాడుక భాషగా ఉన్న ప్రాకృత భాషే మన భాషలన్నింటికీ మూలమన్న చారిత్రక సత్యాన్ని మనం ఇటీవల కాలం వరకూ గుర్తించలేకపోయాం.

బ్రిటిషువారి పుణ్యమా అని తెలుగునేల నలుచెరగులా మరుగున పడివున్న అనేక శాసనాలను వెలుగులోకి తేవడం జరిగింది. 1837లో జేమ్స్‌ ప్రిన్సెప్‌ కోల్‌కతాలో తొలిసారిగా బ్రాహ్మీశాసనాలను కనుగొనడంతో, అప్పటివరకూ అంతుచిక్కని అక్షరాలు, ఒక్కసారిగా మెరిసిపోయాయి. అప్పటినుండి విదేశీ శాసన పరిశోధకులతో పాటు, మన దేశానికి చెందినవారు కూడా శాసనాల నకళ్ళు తీయడం, అక్షరాలను చదవటం, చరిత్రను తిరగరాయటం మొదలుపెట్టారు. ఆ కోవలోనే, గుంటూరు జిల్లాలో ధరణికోట అని పిలువబడిన అమరావతి బౌద్ధ స్థావరం వద్ద బయల్పడిన దాదాపు 200 వరకూ గల బ్రాహ్మీ శాసన శకలాల్ని పరిశీలించారు శాసన పరిశోధకులు.

వాటిని పరిశీలించిన ఆర్పీ చందా శాసనాల నకళ్ళతో పాటు వాటిలోని వివరాలను 1920వ సంవత్సరంలో భారత పురాతత్వ సంస్థ శాసన విభాగ సంచిక ‘ఎపిగ్రాఫియా ఇండికా’లో ప్రచురించారు. ఆ శాసనాలను పరిశీలించిన ప్రముఖ సాహితీవేత్త, శాసన పరిశోధకులు వేటూరి ప్రభాకరశాస్త్రి గారి దృష్టిని ‘నాగబు’ అన్న పదం ఆకర్షించింది. మూడక్షరాలు గల ఈ ‘నాగబు’ అన్న పదంపై 1928లో ‘భారతి’ మాస పత్రికలో ఆయన ఒక వ్యాసాన్ని ప్రచురించారు. అటు తరువాత, ‘ప్రభాకర స్మారక’లో ప్రాచీనాంధ్ర శాసనములు ‘ఇంచుమించు రెండువేలేండ్ల క్రిందటి తెనుగు’ అన్న పేరుతో మరో వ్యాసాన్ని ప్రచురించారు. శాసనాల నకలు తీసిన ఆర్పీ చందా ‘నాగ’ ఒక పదంగానూ, ‘బు’ మరో పదంగానూ గుర్తించగా, ప్రభాకరశాస్త్రిగారు మాత్రం అది ఒకే పదమని, అది కూడా తెలుగు ప్రత్యయాంతమైన తత్సమ పదమని పేర్కొన్నారు.

అటు తరువాత ఆరుద్ర ‘సమగ్ర సాహిత్యం-1’లో కూడా ‘నాగబు’ అనేదే మనకు లభించిన మొదటి తెలుగు మాట అనీ, ఈ పదమే నాగమ్బు, నాగంబు, నాగమ్ము, నాగము, నాగంగా మార్పులు చెందిందని పేర్కొంటూ, ఈ విషయంలో ప్రభాకరశాస్త్రిగారిని నూటికి నూరుపాళ్ళు అనుసరించారు. మరో అడుగు ముందుకేసి, ఈ పదం అసలు ఆంధ్ర లిపికే మూలంగా భావించి, దాని స్వరూపాన్ని (అక్షరాలను) ‘సమగ్రాంధ్ర సాహిత్య’ గ్రంథాలకు రంగపీఠికగా తీసుకొని, అట్టమీద అగ్రశీర్షికగా అగ్రపీఠమిచ్చినట్లు స్వయంగా రాసుకొన్నారు. అటు తరువాత తెలుగు సాహిత్య చరిత్ర, తెలుగు భాషా చరిత్రలపై పుస్తకాలు రాసిన చేయి తిరిగిన, తలపండిన రచయితలందరూ ప్రభాకరశాస్త్రిగారినీ, ఆరుద్రగారినీ వినయపూర్వకంగా అనుసరించారు

అసలు విషయానికొస్తే బౌద్ధం పట్ల ఆకర్షితులై సమసమాజాన్ని కోరుకొన్న వివిధ వృత్తులకు చెందిన ప్రజలు, స్థూపాన్ని అలంకరించటానికి అవసరమైన కట్టడ భాగాలను, శిలా ఫలకాలను చెక్కించి బహూకరించారు. కొందరు వారి పేర్లను కూడా ఆ శిలాఫలకాల్లో చెక్కించుకున్నారు. శాసనాల్లో ‘నాగ’ అన్న పదం చాలాసార్లు కనబడింది. ఉదాహరణకు నాగసేన, నాగనిక, నాగసిరి, నాగమిత, నాగ చంపకి, భదంత నాగ, నాగోపాఝాయ, నాగబోధి, నాగబుద్ధి. కొన్ని శాసనాల్లో కేవలం నాగ, అలాగే బుద్ధి, కొన్ని సందర్భాల్లో ఈ రెండు పదాలు కలిసిన ‘నాగబుద్ధి’ (ధనగిరి వత్తవ నాగబుద్ధి వనియపుతో), నాగబుద్ధు అన్న పేర్లు కూడా ఉన్నాయి. పైన వివరించిన ‘ధనగిరి వత్తవ నాగబుద్ధి వనియపుతో’ అన్న శాసనంలోనూ, అమరావతిలో దొరికిన మరో శాసనంలోనూ, ‘నాగబు’ ఒక వరుసలోనూ, దాని కిందగల రెండో వరుసలో ‘ద్ధి’ చెక్కి ఉండటాన ‘నాగబు’ ఒక అసమగ్ర పదమనీ, ‘నాగబుద్ధి’ అనేది ఒక వ్యక్తి పేరనీ ఖచ్చితంగా చెప్పటానికి వీలు చిక్కింది. ఈ నేపథ్యంలో దాదాపు 88 ఏళ్ళుగా పండితులు, పరిశోధకుల నోళ్ళలో నానుతున్న ‘నాగబు’ తొలి తెలుగుపదం కాదన్న విషయంపై అటు సాహితీవేత్తలు, ఇటు చరిత్రకారులు దృష్టినీ సారించి ఇకముందు రాసే రచనల్లో, నాగబు ప్రస్తావన లేకుండా చూడాల్సిన అవసరముంది.

ఇక తొలి తెలుగు పదం, పదాల గురించి ఆలోచించే ముందు కరీంనగర్‌ జిల్లాలోని కోటలింగాలలో దొరికిన శాతవాహన కాలాని కంటే కొంచెం ముందు కాలానికి చెందిన స్థానిక రాజులు విడుదల చేసిన నాణేలను లెక్కలోకి తీసుకోవాలి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన ప్రముఖ న్యూరోసర్జన, నాణేల పరిశోధకులు డా. దేమె రాజారెడ్డి, కోటలింగాల తవ్వకాల్లో శాతవాహన పొర కంటే కింది పొరలో దొరికిన గోబద, నరన, కంవాయ, సమగోప అనే పేర్లున్న నాణేలపై గల లిపి క్రీ.పూ. 3వ శతాబ్ది నాటిదనీ, అందుచేత ఆ రాజుల పేర్లు తెలుగులో ఉన్నాయని తేల్చి చెప్పారు. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న పురావస్తు ఆధారాల ప్రకారం ఇవే తొలి తెలుగు పేర్లు, పదాలు. ‘నాగబు’ అసలు పదమే కాదని, తొలి తెలుగు పదమని ప్రకటించిన ప్రభాకరశాస్త్రిగారి అభిప్రాయం అంగీకార యోగ్యం కాదని మొదటిసారిగా చెప్పిన కీ.శే. బి.ఎస్‌.ఎల్‌. హనుమంతరావు గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

(వాట్సాప్ నుంచి సేకరణ... విద్యార్థులు, పరిశోధకుల కోసం)

No comments: