పిల్లలు...
దేవుడితో
సమానం అంటారు.
ఎందుకని?
మన భారతీయ
తాత్వికచింతనలో సత్యం, శివం,
సుందరం అనే ఒక భావన ఉంది. దీని సారాంశం దైవత్వంలో కనిపించే
నిష్కల్మషత్వం. అది పిల్లల్లో కనిపిస్తుంది. అందుకే పిల్లల్ని దేవుడితో సమానం
అన్నారు. అదే నిష్కల్మషతత్వం ఈ కథల్లోనూ కనిపిస్తుంది. చిన్నపిల్లలు ఒక పదమో,
ఒక వాక్యమో మాట్లాడితేనే మనకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. అటువంటిది
నాలుగు మాటలు భావయుక్తంగా మాట్లాడితే మనకు ఇంకెంత ఆనందంగా ఉంటుంది? అటువంటి వాళ్ళే ఒక సన్నివేశాన్ని కల్పించారు. ఒక సంఘటన చుట్టూ దాన్ని
నడిపించారు. దాని ద్వారా ఏదో ఒక నీతిని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అది కూడా
వాళ్ళ బుల్లి బుల్లి అడుగుల్లాగే, చిన్న చిన్న వాక్యాల్లో
చక్కని తెలుగులో నడిపించారు. అక్కడ ఇంగ్లీషు మీడియంలో చదువుతూ కూడా ఇంత స్వచ్చమైన తెలుగులో ఈ కథలు రాయడం
ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకరిద్దరు ఉత్తమ పురుషులో కూడా తమ అనుభవాలనే చెప్తున్నట్లు
ఆసక్తిగా చెప్పారు. అందుకనే ఈ కథల్లో అనుభవాలున్నాయి. అనుభూతులున్నాయి. అమ్మమ్మలు,
తాతయ్యలతో గడిపిన తీపి జ్ఞాపకాలున్నాయి. వాళ్ళు పిల్లలకు
చెప్పినట్లే, పిల్లలు కూడా సృజనాత్మకంగా చెప్పారు.
పిల్లలకు జంతువులు మాట్లాడినట్లు చెప్తే ఆసక్తిగా వింటారు. తమదైన
ఊహాప్రపంచంలో మునిగితేలుతుంటారు.అద్భుత కథనాలైతే మరీ ఆసక్తి చూపుతారు. కలువల్లాంటి
ఆ కళ్ళు మరింతగా ఆశ్చర్యం, సంతోషాల్ని పెనవేసుకొని విచ్చుకుంటాయి. అదే రీతిలో తాము
కూడా తమ స్నేహితులకు, తమ బంధువులకు చెప్తుంటారు. అలా చెప్పడంలో గొప్ప సృజనాత్మక
నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. అది వాళ్ళకు తెలియకపోవచ్చు.కానీ, దాన్ని గుర్తించాలి. అలా ఉపాధ్యాయులు
గుర్తించగలిగారు కాబట్టే ‘చిన్నారి ఊహలు’ పేరుతో వాటిని
బంధించగలిగారు. పిల్లలు తమ అనుభవాల్ని, అనుభూతుల్ని అక్షరరూపంలోకి
తీసుకురాగలిగారు.
తాము తమ అమ్మమ్మ, నాన్నమ్మ,
తాతయ్య, అమ్మా, నాన్నల ద్వారా విన్న కథనాలు ఇక్కడ పిల్లల ఊసుల్లో కథలుగా మారాయి.
వాళ్ళు చెప్పిన ఆ జంతువుల మాటలు తమవేనని మాత్రం వాళ్ళు అర్థం చేసుకున్నారు. అలా, పశు పక్ష్యాదుల్నే వీళ్ళు కూడా
పాత్రలు చేశారు. వాటిచేత మాట్లాడించారు. ఆ మాటల్లో తమ భావాల్ని చక్కగా పొదిగారు.
అలా చెప్పడంలో ‘కథకులు’గా ఒదిగిపోయారు.
ఒకటి రెండు కథల్ని బాలమిత్ర,
చందమామ కథల్లా కూడా అనిపించగలిగారు.
ఒకపిల్లవాడి ఊహలో తాను పెంచుకోవాలన్న కుక్కపిల్ల కోసం నిరీక్షణ ఉంది. ఆ
నిరీక్షణలో మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరోనా సమస్యను వివరించడం ఉంది. అనేకమంది
తాము కరోనా వల్ల కోల్పోతున్న సంతోషాన్ని తిరిగి పొందాలనే తపన ఉంది. తమ ఇంటిలో, తమ చుట్టూ ఉండే వాతావరణాన్ని,
ఆ వాస్తవాల్ని వివరిస్తూనే సున్నితంగా సమస్యల్ని అవగాహన చేయించే
సృజనాత్మక నైపుణ్యం ఉంది. అది నీటి సమస్య
కావచ్చు, అది తాను ఆడుకోవాలనుకొనే స్నేహితులు కావచ్చు. ఆ
వస్తువుల్ని స్వీకరించడంతో, వాటిని వర్ణించడంలో వాస్తవంతో
పాటు సహజత్వం కథకు కావలసిన వాతావరణాన్ని కలిగిస్తుంది. అది వాళ్ళకు తెలియకపోవచ్చు. కానీ వాస్తవాల్ని
తమ ఊసుల్లో కథలుగా మార్చగలిగారు.
సుశీల్ తాను తిన్న కూరగాయలు ఎందుకు రుచిగా లేవో గ్రహించి, తన పెరటిలో
నాన్నగారు మొక్కల్ని ఎందుకు పెంచాడో అనుభవపూర్వకంగా తెలిసిన దాన్ని తన స్నేహితులకు
చెప్పడం ఒక చిన్న సంఘటనగానే ఉండొచ్చు. కానీ దానిలో జీవితమంత సత్యాన్ని
ఆవిష్కరించాడు లితేష్. రవి, గోపి ఒక రోజు
బడికి ఆలస్యంగా వచ్చారు. కారణం తెలియక ఉపాధ్యాయులు కోప్పడ్డారు. కానీ, ఆలస్యంగా ఎందుకు వచ్చారో తెలిసిన తర్వాత ఆ
ఉపాధ్యాయులే అభినందించడం కథలో పెట్టిన చక్కని మలుపు. దీని ద్వారా ఆపదలో
ఉన్నవాళ్ళను ఆదుకోవాలనే ఆలోచనను చక్కగా అందించగలిగాడు ఆరవ్. చిన్నపిల్లకు పెంపుడు
జంతువులంటే చాలా ఇష్టం. కుక్కనో, పిల్లినో పెంచుకోవాలనుకుంటారు. దానితో
ఆడుకుంటారు. దాన్ని పక్కనేసుకొని పడుకుంటారు కూడా! కానీ, దాన్ని
పెంచడం సామాన్యవిషయం కాదు. మరి వరీష్ తాను కోరుకున్న కుక్కపిల్లను తమ
తల్లిదండ్రులు తెచ్చి ఇచ్చారా? ఒక నిరీక్షణ... ఆ నిరీక్షణలోని ఆనందాన్ని అంతే
అందంగా చెప్పడంతో మనమే ఓ కుక్కపిల్లను కొనివ్వాలనిపించదూ! తాము
చాలా తెలివైన వాళ్ళమనుకుంటూ అబద్దాలు చెప్తున్న వాళ్ళకు వాళ్ళ ఉపాధ్యాయుడు పెట్టిన పరీక్ష మనల్ని
ఛమత్కారంలో ముంచేలా చేస్తూనే, చక్కనినీతిని కూడా మర్చిపోకుండా ఉండేలా బోధించింది
చంద్రలేఖ. పుచ్చకాల వ్యాపారస్తుడి ద్వారా తమలో ఉండే నైపుణ్యాన్ని బయటపడేలా చేసి,
స్నేహితుల మధ్య అసూయా ద్వేషాల్ని పోగొట్టిన హరిణి సునిశితమైన దృష్టిని
మెచ్చుకోవాల్సిందే. కాకి-ఎద్దుల సంభాషణ ద్వారా ప్రతివారిలోనూ గొప్పతనం ఉంటుందనే
తాత్వికవిషయాన్ని చిన్న కథగా అందించిన నివృతి ప్రతిభ అనన్యసామాన్యం. కరోనా సమయంలో
మాస్క్ పెట్టుకోకపోతే వచ్చే అనర్థాలేమిటో తన జీవితానుభవాలుగా రాజు చేత చెప్పించిన
సుహాస్ మాటలు ప్రతి ఒక్కరూ ఆచరించదగినవి. కలిసిమెలిసి ఉండడంలోని మనిషి తత్వాన్ని
చిన్న సంఘటన ద్వారా చెప్పిన దిత్యావర్షిణి మనుషులు-జంతువులను కథాసామాగ్రిగా
తీసుకోవడం ఎంతో ఔచిత్యంగా ఉంది. తమ సుఖసంతోషాల నుండి మాత్రమే కాకుండా, ఇతరుల
అవసరాలు, వాటికి అనుగుణంగా మనం కూడా కొన్ని త్యాగం చేస్తూ జీవించాలనే సత్యాన్ని ఒక
వైద్యుని పాత్రద్వారా చక్కగా చెప్పాడు నితిన్ సాయి. తన తాతయ్య ద్వారా తాను
తెలుసుకున్న విషయాల వల్ల చారిత్రక విషయాలతో పాటు తనలో దేశభక్తిని పెంపొందించిన
తీరును రోహన్ చక్కగా ఆవిష్కరించాడు. ఒక చందమామ పత్రికలో కథలా అనిపించిన కథ తన్వి కళిగ రాసిన ‘తగినశాస్తి’ ఒకటి రెండు అవకాశాలు ఇవ్వడం, అప్పటికీ మారకపోతే
కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని, కుందేలు,
ఏనుగు, జింక ఒక బాలుడు రాము ద్వారా అద్భుతంగా కథను నడిపిన తీరుని చూస్తే
తన్వి ఎంతో పరిణతి సాధించిన కథకురాలులా అనిపిస్తుంది. ఆర్యన్ ఎంతో సహజంగా చెప్పిన
మాటల్లో ఒక కథని ఇమడ్చగలిగాడు. దేశభక్తిని రగిలేలా చేశాడు. పిల్లల మనస్తత్వాన్ని
తోటి పిల్లలకు చదువు చెప్పడం ద్వారా అందించాడు. చిన్నపిల్లల చిలిపిచేష్టల్ని
అత్యంత సహజంగా చెప్తూ విశ్వక్ నీటిని వృధాచేయకూడదనే స్ఫృహను కలిగించాడు. ఆ చిలిపి
చేష్టలు ప్రతి పిల్లవాడూ చేస్తుంటాడు. కానీ, దాన్ని ఎలా మాన్పాలో చాలామందికి
తెలియదు. వాళ్ళు ఈ కథను చదవాల్సిందే! కరోనావల్ల బడికి
వెళ్ళలేకపోతున్నవాళ్ళు, మాస్క్ పెట్టుకోవడానికి మారాం చేసేవాళ్ళు, మరలా మంచిరోజులు
వచ్చి, అందరం కలుసుకుంటామా అని ఆందోళన పడేవాళ్ళకు చక్కని పరిష్కారాల్ని
సూచిస్తూ గాడిద, సింహం సంభాషణ ద్వారా ఒక
చైతన్యాన్ని, ఆశనూ చిన్ని కథలోనే అందించాడు అఖిల్. ‘మా ఊరి ముచ్చట్లు’ అంటూ రోహన్
చెప్పిన మాటల్లో కథకు కావలసిన చక్కని వాతావరణం, కథనం, సన్నివేశ కల్పన, వస్తువుని
ఇతివృత్తంగా మార్చిన తీరు చాలా బాగుంది.
ఈ ‘చిన్నారి ఊహలు’ పుస్తకంలోని కథలన్నీ వాస్తవజీవితాల
నుండి వచ్చినవి. ప్రతి కథలో ఒక సజీవచైతన్యం, నిష్కల్మషమైన జీవితం ప్రతిబింబించేలా
చేయగలిగారు. ఇవి చిన్నపిల్లలు చెప్పిన కథలంటే కొంత ఆశ్చర్యపోతాం. నీతినే కేంద్రంగా
చేసుకున్నా, దాన్ని చెప్పిన తీరు సమకాలీన సమస్యల్ని, ముఖ్యంగా పిల్లల జీవితాల
నుండే తీసుకుని, పరిష్కారాల్ని కూడా సూచించడం ఈకథల్లోని ప్రత్యేకతలు. ఒకటి రెండు
కథల్లో భాష కొంత గ్రాంథికంలో ఉన్నా, మిగతా కథలన్నీ చక్కని తెలుగు నుడికారంతో,
పిల్లలు చదువుకోవడానికి వీలైన వ్యావహారికంగానే రాశారు. తమ కథల్లో ఇంగ్లీషు పదాల్ని
రాకుండా జాగ్రత్తపడ్డాన్ని చూస్తే, ప్రతి ఒక్క తెలుగువాడూ సంతోష పడతాడు. వాళ్ళకు
చెబుతున్న తెలుగు ఉపాధ్యాయుల శ్రద్ధ కూడా ఈ కథల్లో కనిపిస్తుంది.
ఈ విపత్కర సమయంలో కూడా పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించే ప్రయత్నం
చేయడం, దాని ద్వారా కరోనా బాధితులకు సహకరించవచ్చుననే స్ఫృహను కలిగించడం ఒక గొప్ప
ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసే పని. ప్రార్థించే పెదవుల కన్నా, సహాయం చేసే చేతులు
మిన్న అనే సామెతను పిల్లల ద్వారా నిరూపించాలనే ఈ ప్రయత్నానికి శ్రీకారం ఎవరు చుట్టినా
వాళ్ళు అభినందనీయులే. మా ఎం.ఏ., క్లాసుమేట్ దారపునేని మోహన్ ఈ ప్రయత్నం గురించి
వివరించి, ముందుమాట రాయాల్సిందేనని, ‘నీచేత రాయించుకునే హక్కు నాకుంద’న్నాడు.
నాకెన్ని అత్యవసరపనులున్నా, మా మిత్రుడి మాట కాదనలేకపోయాను. తీరా ఈ కథలు చదివి
నేను చాలా ఆశ్చర్యానికీ, ఆనందానికీ గురయ్యాను. పదవతరగతి కూడా చదవని విద్యార్థినీ,
విద్యార్థులే ఇంత సృజనాత్మకంగా ఆలోచించడం, ఆ ఆలోచనను అక్షరరూపంలో పెట్టడం, అదీ ఒక
మహోన్నతమైన పనికి ముందుకు రావడం అనే లక్ష్యాల వల్ల నేను కూడా నాలుగు మాటలు రాసే
అవకాశం వచ్చినందుకు మా మోహన్ కి ఇప్పుడు నేనే కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తుంది. ఇంత
మంచి పుస్తకాన్ని డిజిటల్ ఎడిషన్ గా చక్కని సాంకేతికతతో అందిస్తున్న శ్రీరామ్
యూనివర్సల్ స్కూల్ యాజమాన్యానికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత
మంచి కథల్ని రాసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ, ఆ దేవుడు వారికి ఆయురారోగ్యాల్ని,
సుఖ సంతోషాల్ని పరిపూర్ణంగా అందించాలని, వారు ఇలాంటి మరిన్ని మంచి కథలు,
సాహిత్యాన్ని వివిధ ప్రక్రియల్లో అందించి, గొప్ప రచయితలు కావాలని
ఆకాంక్షిస్తున్నాను.
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
తెలుగుశాఖ,
మానవీయ శాస్త్రాల విభాగం,
హైదరాబాదు విశ్వవిద్యాలయం,
గచ్చిబౌలి, హైదరాబాద్ – 500046
తేది: 27.04.2021
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి