"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

28 ఏప్రిల్, 2021

తెలుగు సాహిత్య విమర్శ పద్ధతులు – ఆచార్య శరత్ జ్యోత్స్నారాణి పరిశోధన

 ప్రముఖ కవయిత్రి, కథా రచయిత్రి, విమర్శకులు, పరిశోధకులు, మా గురువు గారు ఆచార్య ఎస్.శరత్ జ్యోత్స్నా రాణి గారు తమ డి.లిట్ పట్టా కోసం సమర్పించిన గ్రంథం ‘ఆధునిక తెలుగు విమర్శకులు- విమర్శనా పద్ధతులు’ ఆధారంగా ఈ వ్యాసాన్ని రాస్తున్నాను. ఒరిస్సా రాష్ట్రం, బరంపురం  విశ్వవిద్యాలయానికి సమర్పించిన ఈ గ్రంథానికి 2017 లో డి.లిట్  పట్టా వచ్చింది. వెంటనే ఆ గ్రంథాన్ని  ముద్రించి, ప్రముఖ కవయిత్రి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య సి. ఆనందరామం గార్కి అంకితం చేశారు.’ఈ గ్రంథం విద్యార్థులకు నిత్యోపయోగకరమైంద’ని, ‘విజ్ఞుల ప్రశంసలందుకున్నద’ని ఎంతో ఆనందంగా ఆచార్య ఆనందారామం ఈ గ్రంథాన్ని అంకితం తీసుకున్నారు.’తెలుగు సాహిత్యంలో సరికొత్త వెన్నెల’ శీర్షికతో దీనికి ముందుమాట రాస్తూ ఆచార్య ఆనందారామం గారు ‘విమర్శ జగత్తులో కొత్త వెన్నెలలు కురిపించిన గ్రంథం’గా దీన్ని వ్యాఖ్యానించారు.

ఈ గ్రంథంలో సుమారు 21 మంది తెలుగు సాహిత్య విమర్శకుల విమర్శనా పద్ధతులను ఆచార్య శరత్ జ్యోత్స్నా రాణి గారు సమీక్షించారు. ఆధునిక తెలుగు విమర్శ- పరిచయం, ఆధునిక తెలుగు విమర్శ- విమర్శనా రీతులు,  ఆధునిక తెలుగు విమర్శకులు- విమర్శనా పద్ధతులు అనే పేర్లతో మూడు అధ్యాయాలుగా అధ్యయన సౌలభ్యం కోసం ఈ గ్రంథాన్ని  ఆచార్య ఎస్. శరత్ జ్యోత్స్నా రాణి గారు విభజించుకున్నారు. ఆ 21 మంది సాహిత్య విమర్శకుల విమర్శనా పద్ధతులను ఎలా గుర్తించారో ముందుగా పరిశీలిద్దాం.

1.గురజాడ అప్పారావు (1862-1915) గారితో ఈ గ్రంథం ప్రారంభమవుతుంది. సాహిత్య విమర్శకు సంబంధించిన గ్రంథాలు ప్రత్యేకంగా గురజాడ రాయకపోయినా, వివిధ సందర్భాలలో ఆయన వెల్లడించిన అభిప్రాయాలు సాహిత్య విమర్శకు సంబంధించిన విలువైన విషయాలు ఉన్నాయని (పుట : 42) పరిశోధకురాలు అన్నారు.’గురజాడ సాహిత్య విమర్శలో ఆయన సాహిత్య దృక్పథం, సాహిత్యం పట్ల ఆయన వెల్లడించిన సాహిత్య విలువలు,  సాహిత్య విమర్శ సూత్రీకరణలే కాక సమన్వయ విమర్శకు కూడా ప్రధానాంశంగా కనిపిస్తుందని (పుట: 46) చెప్పారు.తెలుగు సాహిత్య విమర్శను కందుకూరి వీరేశలింగం గారి విగ్రహతంత్ర విమర్శనం ( 1874-76) నుండి విమర్శ అవతరణగానూ, తర్వాత కట్టమంచి రామలింగారెడ్డి గారి ‘కవిత్వతత్వ విమర్శనం’ (1948)నుండి పాశ్చాత్య సాహిత్య విమర్శ పద్ధతలతో ప్రారంభమైనట్లు పరిశోధకులు భావిస్తారు. అయితే, ఈ గ్రంథ పరిశోధకురాలు ఆచార్య ఎస్. శరత్ జ్యోత్స్నారాణి గారు గురజాడ అప్పారావు నుండి తీసుకోవడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. తన సిద్ధాంత గ్రంథం పేరులో ఆధునిక విమర్శకులనడం వల్ల, తెలుగు సాహిత్యాన్ని ఆధునికత వైపు తిప్పిన గురజాడను ఒక మైలురాయిగా తీసుకోవడం ఎంతో ఔచిత్యంగా ఉంది.

2.కట్టమంచి రామలింగారెడ్డి (1880-1951)గారి విమర్శ పద్ధతిని గురించి వివరిస్తూ ‘ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు ఆయన మార్గదర్శకులు’ అని అన్నారు. కట్టమంచి వారి ‘కవిత్వ తత్వ విచారము’ ఉపన్యాసాలు, వ్యాసాలు, పీఠికలల్లో ఆయన సాహిత్య విమర్శ పద్ధతి మనకు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఆయన ఉపన్యాస వ్యాసాలలో రాజకీయంలో విమర్శ పద్ధతి సాహిత్య విమర్శ పద్ధతి అని రెండు రకాలుగా కనిపిస్తుందని (65) వర్గీకరించారు.తెలుగు సాహిత్య విమర్శకు ఒక శాస్త్రీయతను ఇచ్చిన వారు కట్టమంచి. సామాజిక విషయాల్ని పట్టించుకొంటూనే, భావనాశక్తి గురించి ఆయన లోతైన విశ్లేషణ చేశారు. భాషలో గ్రాంథిక వాసనలున్నా, భావాల్లో ఆధునికులు. కవిత్వతత్వ విచారం వెలువడిన తర్వాత సంప్రదాయ పండితులు ఆయనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దానికి కారణాల్లో భారతీయ అలంకారశాస్త్రాన్ని కట్టమంచి తీవ్రంగా దుయ్యబట్టడం, పాశ్చాత్య సాహిత్యధోరణిని సమర్థించడం ఒక ప్రధాన కారణం.

3.రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు(1893-1979) సాహిత్య విమర్శ ప్రస్థానంలో తనదైన ఒక స్థానాన్ని నిలుపుకున్న రసిక విమర్శకశేఖరులు (పుట: 70) గా ఆయన్ని అభివర్ణించారు. ఈయన విమర్శలో సౌందర్యాన్ని అభిలషించి వినూత్న మార్గాన్ని నిర్మించారని, సంగీత, సాహిత్యాల లోని సౌందర్య రహస్యాలను వస్తు, భావ, రాసే రచనా కవులుగా సమన్యయించి, తెలుగు విమర్శ కు నూతన సిద్ధాంతాలను అందించారని విశ్లేషించారు. రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ అనగానే ప్రబంధాల్లో కనిపించే రసికత గురించి సాహిత్య విమర్శకులు ప్రస్తావిస్తుంటారు. సాహిత్యానికి సంగీతాన్ని సమన్వయించిన పరిశోధనాత్మక విమర్శకులు రాళ్ళపల్లి అనంత కృష్ణశర్శ.

4.దువ్వూరి రామిరెడ్డి (1895- 1947) సాహిత్యవ్యాసాలు కొత్త కోణాల్ని ఆవిష్కరిస్తాయని, స్వతంత్ర విమర్శకి అవి నిదర్శనంగా నిలుస్తాయ ని (పుట: 85) లో చెప్పారు. దువ్వూరి వారు కవిత్వతత్వాన్ని, సౌందర్య తత్వాన్ని కూడా తన విమర్శలో భాగం చేసుకున్నారు.

5.నోరి నరసింహశాస్త్రి (1900 – 1978) చారిత్రిక ప్రమాణాల ఆధారంగా చేసుకుని విమర్శ కొనసాగిందని అన్నారు. (పుట: 88)

6.కొడవటిగంటి కుటుంబరావు (1909- 1980) సాహిత్య విమర్శ ప్రయోజనం కూడా అభ్యుదయ పంథాలో కొనసాగాలని భావించి, విజ్ఞానశాస్త్రాన్ని, మార్క్సిజాన్ని ఆధారంగా చేసుకొని విమర్శించారని ఆయన గురించి చెప్పారు. (పుట:99). కుటుంబరావు గారి సాహిత్య ప్రయోజనం, కళా ప్రయోజనం, సామాజిక విమర్శల గురించి సుదీర్ఘంగా ఈ గ్రంథంలో చర్చించారు.

7.శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాస రావు 1910 -1983) కవిత్వం రాయడమే కాకుండా సాహిత్య విమర్శ కావాల్సిన అనేక ఆధునిక భావనలను అందించారని పరిశోధకురాలు విశ్లేషించారు. తెలుగు సాహిత్యంలో తిక్కన, వేమన, గురజాడ లు తనకు నచ్చిన కవులని చెప్పాలనీ, రససిద్ధాంతానికంటే మించిన ఒక మౌలిక భావన ‘రసన’ను ప్రతిపాదించారని పేర్కొన్నారు. (పుట:115).

8.కుందుర్తి ఆంజనేయులు (1922- 1982) ఆధునిక జీవితాన్ని వచన కవిత్వమే చిత్రించగలదని నమ్మి వచనకవితా రూపాన్ని ప్రోత్సహించిన గొప్ప విమర్శకుడిగా వ్యాఖ్యానించారు. భాషా సంప్రదాయాలపైన, వ్యాకరణ ఛందోబంధాలపై అభ్యుదయ కవులు తెచ్చిన మార్పులను సమర్ధించిన అభ్యుదయ విమర్శకుడిగా నిరూపించారు.

9.కె.వి.రమణారెడ్డి (1927- 1998) పేరు చెప్పు గాని మహోదయం గుర్తుకొస్తుంది. అది కవి జీవిత సాహిత్య విమర్శకు ఒక నిదర్శనంగా నిలుస్తుంది. అందుకనే తెలుగులో రచయిత జీవిత సాహిత్య విమర్శను కె.వి.ఆర్ లాగా శాస్త్రీయంగా నిర్వహించిన వారు ఎవరూ లేరని పరిశోధకురాలు పేర్కొన్నారు (పుట:130). ఈయన కూడా మార్క్సిస్టు తాత్విక భూమికతో అనువర్తిత విమర్శ సమర్థవంతంగా నిర్వహించారని, సామాజిక శాస్త్రాల అధ్యయనం పునాదితో ఏ కాలం నాటి సాహిత్యాన్నైనా విమర్శించవచ్చునని ఆయన తన విమర్శ పద్ధతి ద్వారా నిరూపించారని (పుట:144 )లో అన్నారు.

10.ఆర్.ఎస్.సుదర్శనం (1927-2001) సంప్రదాయంగా వస్తున్న సమన్వయ విమర్శకు తాత్విక దృష్టి కోణాన్ని పరిచయం చేసి విమర్శకు సరికొత్త అర్థం చెప్పిన సాహిత్య విమర్శకుడు సుదర్శనం (పుట: 146) అన్నారు.’తెలుగు సరైన విమర్శ లేదన లోపాన్ని గురించిన నవల విమర్శకులుగా మనో వైజ్ఞానిక నవల గురించి రాసిన సాహిత్య విమర్శకుడిగా (పుట:163) సుదర్శనం గారిని పేర్కొన్నారు.

11.గుంటూరు శేషేంద్ర శర్మ (1929- 2007)కు తెలుగు సాహిత్య విమర్శ రంగంలో విశిష్టమైన స్థానం ఉందని, ఆయనది ఉపరితల విమర్శ కాదని, ఆయన ఏదైనా ఒక గ్రంథాన్ని లోతుగా పరిశీలించి బహుముఖంగా దర్శించి తన దైన శైలిలో విమర్శిస్తారని, ప్రాచీన సాహిత్యమైనా, ఆధునిక సాహిత్యమైనా ఆయన లోతుగా పరిశీలించి విమర్శిస్తారని (పుట: 178) పరిశోధకురాలు వ్యాఖ్యానించారు. కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ లో ఆయన విమర్శలో ఆవేశం పాళ్ళు ఎక్కువగా కనిపిస్తుందని అన్నారు. తెలుగు లోప్రక్రియా, ప్రతీకాత్మక విమర్శకు ఆయన విమర్శ ప్రాతినిధ్యం వహిస్తుందని (పుట: 180) వ్యాఖ్యానించారు.

12.వేల్చేరు నారాయణరావు (1933- ) ఉత్తమ పరిశోధకుడు విమర్శకుడే కాదు. తెలుగు ప్రాచీన, ఆధునిక కావ్యాల అనువాదాలతో విదేశీయులకు తెలుగు భాషా సాహిత్య సంస్కృతిని పరిచయం చేస్తున్న సాహిత్య రాయబారిగా (పుట :185) పరిశోధకురాలు వ్యాఖ్యానించారు.

12.కోవెల సంపత్కుమారాచార్య ( 1933 2010 ) విమర్శలో దేశీయత దృష్టి ఎక్కువ (పుట:196) అన్నారు. ఆయన వచనం, ఛందస్సు లక్షణాలపై చేసిన విమర్శను సోదాహరణంగా విశ్లేషించారు.

13.సి. ఆనందారామం (1935- 2021) నవలా విమర్శను విస్తృతంగా చేశారని, దీనితోపాటు తులనాత్మక సాహిత్య విమర్శ కూడా ఆమె చేశారని అన్నారు. బుచ్చిబాబు గారి ‘చివరకు మిగిలేది’ నవల అస్తిత్వవాద నవలగా విశ్లేషించడంలో ఆమె విమర్శ లోతు స్పష్టంగా కనిపిస్తోందని పరిశోధకురాలు పేర్కొన్నారు. (పుట:205)

14.జీవి సుబ్రమణ్యం (1935 -2006) రస వివేచన, ప్రభావ పరిశీలన, ప్రతీక విశ్లేషణ, ప్రక్రియ పరిణామ పరిశీలన, నవ్య సంప్రదాయ కవిత్వోద్యమ దర్శనం,నూత్నాంశ ప్రతిపాదన దిశగా ఈయన విమర్శ కొనసాగిందన్నారు.

15.కోవెల సుప్రసన్నాచార్య (1936- ) సాహిత్య విమర్శలో సమకాలీన అంశాలను, మానసిక సౌందర్యానుభవాలను విశ్లేషించడంతో ఆగిపోక, ఆధ్యాత్మిక పార్శ్వాన్ని కూడా జోడించడం వలన అది సాహిత్య విమర్శకు కొత్తవాటిని తెరిచిందని (పుట: 225 ) అన్నారు.

16.అద్దేపల్లి రామమోహనరావు (1936-2016) తెలుగు కవితా రంగంలో ఎప్పటికప్పుడు ప్రచలితమౌతూ వస్తున్న ప్రగతిశీల సామాజిక ధోరణులు, ప్రక్రియలు అయిన వచన కవిత, మినీ కవిత, స్త్రీవాదం, దళితవాదం, సామ్రాజ్యవాద వ్యతిరేకత, హైకూ, గజల్ వంటి వాటి విలువ కట్టి, వాటి చారిత్రక అవసరాన్ని గుర్తించి, అది బలం పుంజుకునేలా విరివిగా విమర్శ వ్యాసాలు రాయడమే కాకుండా, అవి సామాన్య ప్రజానీకానికి సైతం అర్థమయ్యేలా వివరిస్తూ రాసిన ప్రజా విమర్శకుడుగా (పుట: 228) అభివర్ణించారు.

17.వల్లంపాటి వెంకటసుబ్బయ్య (1937-2007) సాహిత్య విమర్శ కాలక్షేప వ్యవహారం కాదని అదొక ప్రాపంచిక దృక్పథం కలిగిన సాహితీవేత్త నిర్వహించి సామాజిక బాధ్యతలను గుర్తించి నిబద్ధతతో సాహిత్య విమర్శ కొనసాగించిన విమర్శకుడు” (పుట:247) అని పేర్కొన్నారు.

18.కె.కె. రంగనాథాచార్యులు (1940-) సాహిత్యాన్ని చారిత్రక, సామాజిక నేపథ్యాల దృక్పథంతోనూ, గత కాలపు చరిత్ర అంతా గతి తార్కిక భౌతిక వాద దృష్టితో విశ్లేషించడం ఈయన విమర్శలో ప్రధానంగా కనిపిస్తుంద”ని (పుట:256) లో అన్నారు.

19.ఎస్.వి.రామారావు (1941-) సాహిత్య విమర్శ అవతరణ వికాసాలు పై పరిశోధన చేసిన ఈయన, చారిత్రక దృష్టితో పరిశీలించడం, అలభ్యంగా ఉన్న విమర్శ గ్రంథాలు సేకరించి ఆ విమర్శకు ఒక ప్రక్రియా స్థాయిని కల్పించడం వీరి ప్రత్యేకత అని (పుట: 273 ) పేర్కొన్నారు.

19.ముదిగొండ వీరభద్రయ్య (1942-) సాహిత్యంలోని వస్తు రూపాలను విశ్లేషించడంలోనూ, అనువర్తిత విమర్శ ద్వారా విలువలు నిర్ణయించడం లోనూ, భావ చిత్రం, ప్రతీకల ద్వారా సాహిత్య విలువల్ని , సాహిత్యం గొప్పతనాన్ని తెల్పడంలోను,  విమర్శలో మౌలిక లక్షణాలను గుర్తించడంలో నూ ఈయన ఎంతో కృషి చేశారని (పుట: 275) అన్నారు. విమర్శ ఎన్ని నూతన పంథాల్లో పయనించినా సాంప్రదాయిక ఆలంకారిక సిద్ధాంతాలను, ఆ ప్రస్థానాలను సమకాలీన విమర్శకు అనువర్తిస్తూ కొత్త కోణాల్లో ఆధునిక సాహిత్య ప్రక్రియలను విశ్లేషించడం ఈయన విమర్శ లో కనిపించే ఒక  పద్ధతిగా  ఆ అంశాలన్నీ సాధికారికంగా వివరించారు.

తెలుగు సాహిత్య విమర్శలో గురజాడ అప్పారావు, శ్రీ శ్రీ, ఆర్వీయస్ సుందరం, కొడవటిగంటి కుటుంబరావు మొదలైన వారి ప్రభావం తీవ్రంగా ఉందని ఈ పరిశోధకురాలి విమర్శను గమనించిన వారికి స్పష్టమవుతుంది. ఈ గ్రంథంలో ప్రధానంగా పరిశోధకురాలు రెండు ధోరణులను గమనించారు. సంప్రదాయ ఆలంకారిక విమర్శను కొనసాగించిన వాళ్ళు శిల్పానికి ప్రాధాన్యాన్నిచ్చారని నిరూపించారు. సాహిత్యంలో వస్తు, రూపాలు గురించి మాట్లాడినా వస్తువే ప్రధానమని భావించినటువంటి వాళ్లు మార్క్సిస్టు విమర్శకులని నిరూపించారు. మార్క్సిస్టు విమర్శకులు వచన సాహిత్యాన్నీ, వచన సాహిత్యంలో రూప వైవిధ్యాన్ని ఆహ్వానించారని కూడా ఆ విమర్శల ద్వారా నిరూపించారు. పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాలను విమర్శకు సమర్థవంతంగా ఉపయోగించుకున్న వాళ్ళు మార్క్సిస్టు విమర్శకులు చెప్పారు. మార్క్సిస్టు విమర్శకులు సిద్ధాంతాలను వ్యతిరేకించడంలో కావ్య నాయకుల్ని వ్యతిరేకించడంలో సామాజిక వాస్తవికతకు ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యతనివ్వడం ప్రధాన కారణంగా పరిశోధకురాలు గుర్తించారు. కొడవటిగంటి కుటుంబరావు, అద్దేపల్లి రామమోహనరావు మొదలైన వాళ్ళ  స్త్రీవాద, దళిత భావజాలాల్ని గుర్తించినప్పటికీ వాటిని కూడా మార్క్సిస్టు తాత్విక భూమిక తోనే సమన్వయించడం ఒక ప్రత్యేకత కూడా ఈ గ్రంథం ద్వారా తెలుస్తుంది. ఆరుద్ర రాసిన గురజాడ గురుపీఠం గ్రంథానికి ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథం పురస్కారం వచ్చింది. ఆయన  సమగ్ర ఆంధ్ర సాహిత్యం మార్క్సిస్టు దృక్పథంతో రాసింది. దీనివల్ల సంప్రదాయ సాహితీ వేత్తలు, సాహిత్య విమర్శకులు ఆయన్ని సరిగ్గా పట్టించుకోలేదు. అభ్యుదయ సాహిత్య విమర్శకులు మాత్రం అక్కడక్కడ పట్టించుకున్నారు. కానీ ఈ గ్రంథంలో ఆరుద్ర గురించి ప్రస్తావన చేస్తే బాగుండేది. బహుశా మరి పుస్తకరూపంలో రానిమూల గ్రంథంలో వీటి గురించిన వివరాలేమైనా ఉన్నాయేమో కూడా ఆలోచించాలి. ఇలాంటి కొన్ని పరిమితులు, పరిధులతో ఈ పుస్తకాన్ని చూడాలి.

ఈ గ్రంథంలో పేర్కొన్న ఒక్కొక్క విమర్శకుడు పైనే అనేక మంది పరిశోధనలు చేశారు. అనేక విమర్శ వ్యాసాలు కూడా రాశారు. ఆ పరిశోధనల సారాంశాన్ని ఈ గ్రంథంలో ఒకచోటకు క్రోడీకరించి ఒకచోట చదువుకోడానికి అనుకూలంగా ఏర్పాటు చేసిన గ్రంథంగా దీన్ని భావించవచ్చు. మన తెలుగు సాహిత్య విమర్శకులు పాటించినటువంటి పద్ధతులను ఒక చోట పెట్టిన గ్రంథంగా కూడా దీన్ని వ్యాఖ్యానించుకోవచ్చు. అయితే, ఈ గ్రంథంలో ఆయా విమర్శకులపై జరిగిన పరిశోధనల గురించిన ప్రస్తావన చాలావాటికి పెట్టారు. బహుశా డి.లిట్ కోసం సమర్పించిన సిద్ధాంత గ్రంథం రాత ప్రతిలో ఆ పూర్తి విషయాలు ఉన్నాయేమో పరిశీలించవలసిన అవసరం ఉంది. బహుశా అందకనేనేమో, కొంతమంది విమర్శకులు గురించి చెప్పినప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి పరిశీలనలను, వారి విమర్శ పద్ధతులను  పూర్వం జరిగిన పరిశోధ గ్రంథాలు, విమర్శ వ్యాసాల్లో ఉన్నవాటిని యథాతధంగా తీసుకున్నట్లుగా వాటిని కొటేషన్ రూపంలో ప్రకటించారు. నిజానికి సాహిత్య విమర్శలో  కొంత మంది గురించి తీసుకోవడమనేది  చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. అయినప్పటికీ సాహిత్య వాదాలను బట్టి ఖచ్చితంగా కొంత మందిని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. సాహిత్య విమర్శలో విశ్వనాథ సత్యనారాయణ గారి కృషి సామాన్యమైంది కాదు. అలాగే స్త్రీవాద సాహిత్యంలో ఆచార్య కాత్యాయనీ విద్మహే, ఆచార్య సి.మృణాళిని, ఆచార్య ముదిగంటి సుజాతా రెడ్డిలను ప్రస్తావించకుండా ఉండలేనిపరిస్థితి ఉంది. మార్క్సిస్టు సాహిత్య విమర్శను, దళిత సాహిత్య విమర్శను రాసిన ప్రముఖులలో ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డిగార్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్త్రీవాద సాహిత్యాన్ని, భాష నిర్మాణం దృష్టితో విశ్లేషించడంలో ఆచార్య చేకూరి రామారావు,  దళిత సాహిత్య విమర్శ లో కవిత్వ నిర్మాణ పద్ధతుల ద్వారా ఒక సంచలనం తీసుకువచ్చినటువంటి వారు జి. లక్ష్మీనరసయ్య,  ప్రాంతీయ సాహిత్య విమర్శలో డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి,  కాసుల ప్రతాపరెడ్డి, ఆచార్య బన్న ఐలయ్య తదితరులను మాట మాత్రంగానైనా ప్రస్తావించకుండా తెలుగు సాహిత్య విమర్శ గురించి మాట్లాడుకునే పరిస్థితిలేదు. అలాగే తొలితరం దళిత సాహిత్య విమర్శకుల్లో ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి కృషి సామాన్యమైంది కాదు. వీరే కాదు, ఇంకా చాలామంది సాహిత్య విమర్శకులున్నారు. వారందరినీ ఈగ్రంథంలో పేర్కొనడానికి కొన్ని పరిధులు, పరిమితులు ఉన్నాయనేది కూడా గుర్తించాలి.

 ఆచార్య ఎస్.శరత్ జ్యోత్స్నారాణి గారి  పరిశీలనలో ఆధునిక సాహిత్య విమర్శను ప్రధానంగా  ప్రభావితం చేసినటువంటి సిద్ధాంతాలు, సూత్రాలుగా ఆలంకారిక సిద్దాంతాల నేపథ్యంలో దేశీయతాభూమిక పై జరిగిన సాహిత్య విమర్శ మొదటిది కాగా, రెండవది మార్క్సిస్టు సైద్ధాంతిక భూములతో జరిగినటువంటి విమర్శ ఎక్కువగా ఈ గ్రంథంలో కనిపిస్తుంది. ఈ గ్రంథంలో పేర్కొన్న ఆర్వీయస్ సుదర్శనం, ముదిగొండ వీరభద్రయ్య తదితరులు కూడా మనోవైజ్ఞానికి, అస్తిత్వవాద ధోరణులతో సాహిత్య విమర్శను చేశారు. వాటిని కూడా ప్రస్తావించినా, దాన్ని ప్రధానంగా తీసుకోలేదనిపిస్తుంది. అలాగే, మార్క్సిస్టు సాహిత్య విమర్శకు వ్యతిరేకంగా వచ్చిన విమర్శధోరణుల్లో పోస్ట్ మాడర్నిజమ్ ఒకటి. దీని గురించి కూడా ఈ విమర్శకుల కాలంలోనే పరిశీలన చేయదగిన అవసరం ఉంది. కానీ, ఇవన్నీ చెప్పాలంటే గ్రంథ విస్తరణ పెరగవచ్చు. బహుశా, ఇవన్నీ తాను విశ్వవిద్యాలయం వారికి సమర్పించిన మూల గ్రంథంలో ఉన్నాయనుకుంటున్నాను.

 మొత్తం మీద సాహిత్యం పట్ల ఆచార్య ఎస్. శరత్ జ్యోత్స్నారాణిగారికున్న లోతైన అధ్యయనం, విమర్శ పట్ల వారికున్న నిశితమైన పరిశీలన ఈ గ్రంథాన్ని బట్టి స్పష్టమవుతుంది. సుమారు 140 సంవత్సరాల తెలుగు సాహిత్య విమర్శ పరిణామ వికాసాలన్నీ ఒక గ్రంథంలో అంచనా వేయడం చాలా కష్టం. అయినప్పటికీ తెలుగు సాహిత్య విమర్శలో మైలురాళ్లుగా నిలిచినటువంటి వారిలో కొంతమంది గురించి కొంతమంది ముఖ్యమైనటువంటి భావనలు, సిద్ధాంతాలను ఈ గ్రంథంలో పరిశీలన చేయడం వారిని ఎన్నుకోవడం వారి పరిశోధనా దృష్టికి నిదర్శనం.

( ఆచార్య ఎస్. శరత్ జ్యోత్స్నారాణి గారి దగ్గరే  నేను ఎం.ఫిల్., పిహెచ్.డి పూర్తిచేశాను. మరలా వారు తెలుగుశాఖలో ఉండగానే నేను ఆ శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరి, ప్రొఫెసర్ గా పదోన్నతులు పొందాను. వారు  2021 ఏప్రియల్ నెలాఖరుకి పదవీవిరమణ చేస్తున్న సందర్భంగా వారి శిష్యుడిగా ఈ వ్యాస కుసుమాన్ని వారికి సమర్పిస్తున్నాను.)

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

తెలుగుశాఖ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ ( సెంట్రల్ యూనివర్సిటి,)

 గచ్చిబౌలి, హైదరాబాద్-500 046,


Email: darlash@uohyd.ac.in

( భూమిపుత్ర దినపత్రిక, 27 ఏప్రిల్, 2021 సౌజన్యంతో...)

కామెంట్‌లు లేవు: