"బాబూ జగ్జీవన్ రామ్ - బంగ్లాదేశ్ - మోడీ"
బంగ్లాదేశ్ విముక్తి కోసం తాను సత్యగ్రాహం చేశానని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారు గుర్తుకు వచ్చారు.
పైగా ఇదే నెలలో 'ఏప్రిల్ 5' న ఆయన జయంతి కూడా రానుంది. అందుకే ఆయన గురించి చర్చ సందర్భానుసరంగా ఇప్పుడు అవసరం.
1971 లో ఇండియా పాకిస్థాన్ యుద్ధం లో ఇండియా విజయం, పాకిస్థాన్ నుండి బంగ్లాదేశ్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది.
అప్పుడు డిఫెన్స్ మినిష్టర్ గా ఉన్నది బాబూ జగ్జీవన్ రామ్ గారే. కానీ క్రెడిట్ అంతా ప్రధాని ఇందిరా గాంధీ ఖాతాలోకి వెళ్ళింది. ఆమెకు ఆమె హయాంలోనే భారత రత్న వచ్చింది. కానీ జగ్జీవన్ ఘనత నేటికీ విస్మరించబడుతుంది.
బంగ్లాదేశ్ ఏర్పాటు సందర్భంలో ఏ ఉద్యమ నేపధ్యం కానీ, లేక పోరాట చరిత్ర కానీ లేని మోడీ గారు కూడా ఇది తాను సత్యాగ్రాహం చేసినట్టు తెలిపారు. నాటి రక్షణ మంత్రి విస్మరించ బడుతూనే ఉన్నారు.
ఈ సందర్భంగా ఆయన గురించి నేను రాసిన విషయాలు మీకోసం..
"జగమెరుగని జగ్జీవన్ ఘనత"
బోర్డర్లలో ఏ నెహ్రు నో
ఏ ఇందిరా గాంధీ నో
ఏ వాజ్ పాయో
ఏ మోడీయో
ఏ రాజ్ నాధో వెళ్లినప్పుటి ఫోటోలే కనబడతాయి ..
బాబూ జగ్జీవన్ రామ్ గారు రక్షణ శాఖ మంత్రిగా 1971 ఇండో - పాక్ యుద్ధం సందర్భంగా సైనికుల్లో నైతిక స్థైర్యం నింపడానికి వెళ్ళినప్పుటి ఫోటో కానరాదు.
ఆ యుద్ధం బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారి తీసింది.
ఆ యుద్ధంలో ఇండియా గెలిచాక, నాటి ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ గారికి "భారత రత్న" వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ఇచ్చుకుందేమో.
కానీ "డిఫెన్స్ మినిష్టర్ కు ఆ అవార్డ్ ఎందుకు రాలేదు" అన్న ప్రశ్న ఇంకా అందరి మదిలో వేలాడుతుంది అన్న డాక్టర్ సరోజిని మహిషి అభిప్రాయం అందరిలో ఉంది.
ఇండియా ఏ అవార్డు ఇవ్వలేదు కానీ
నాటి డిఫెన్స్ మినిష్టర్ గ ఉన్న ఆయనను "బంగ్లాదేశ్" కృతజ్ఞతతో "Friends of Liberation War" పురస్కారం (2012) ఇచ్చి గౌరవించింది.
1971 Western Command లెఫ్టినెంట్ జనరల్ కెండెత్ మాటల్లో చెప్పాలంటే
"జగ్జీవన్ రాం, యుద్ధం సమయం లో కూడా మానవత లో ఆలోచించే వారు. దేశాన్ని కాపాడుతున్న సైనికుల గౌరవం కాపాడే ఆలోచనతో ఉండేవారు. ఆనాడు యుద్ధం లో గాయపడి వికలాంగులుగా మారిన జవాన్లు, అధికారులకు "షెల్టరెడ్ అపాయింట్మెంట్స్", అవి వీలు కాకుంటే "ది ఇంజురీ పే" అనే కొత్త విధానం ద్వారా వారికి ఉపశమనం కల్గించడం, కొత్తగా పెన్షన్స్ విధానం ( యుద్ధం లో భర్తలను కోల్పోయిన వారికి ) యుద్ధం వల్ల తమ భర్తలను కోల్పోయిన వారికి భూమి విషయం, మిలిటరీ హాస్పటిల్స్ లో వైద్య సదుపాయం అందించడం, వీర మరణం పొందిన సైనికుల పిల్లల చదువు కోసం కార్యక్రమాలు అమలు చేయడం ఈ సదుపాయాలు 1947-48, 1962, 1965 యుద్ధాలలో పాల్గొన్న వారికీ వర్తింప జేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.
"A Commemorative Volume - Babu Jag Jivan Rao In Parliament" అని పార్లమెంట్ లోని లోక్ సభ ప్రచురణ చేసిన పుస్తకం లో పై వివరాలు చూడొచ్చు..
అంతే కాదు, ఆయన ఎమర్జెన్సీ సమయం లో ఇతర సందర్భాల్లో ఆయన గొప్పతనం మీరే చదవండి..
”Babu Beats Bobby” ఇది భారత దేశం లో ఎమెర్జెన్సీ (1975-77) సమయం ముగిసిన అనంతరం ఎన్నికలకు సిద్ధమైన ప్రతిపక్షాల ప్రచారం సందర్భంగా జరిగన ఒక సంఘటన ఆధారంగా ప్రచురితమైన వార్త.
ఇందులో బాబూ, జగ్జీవన్ రాం కాగా, “బాబీ” అప్పట్లో పేరు మోసిన ఒక బాలీవుడ్ సినిమా. ఇటీవల మరణించిన రిషి కపూర్ ఆ సినిమా హీరో.
ఈ వార్త నేపధ్యం ఏమిటంటే ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి – 1975-77) ముగిసిన తరువాత, ఎన్నికలకు ఏకమైన ప్రతిపక్షాల్లో బాబూ జగ జీవన్ రాం ప్రధానమైన నాయకుడు.
స్వాతంత్రానికి పూర్వం నుండే పేరు పొందిన దళిత నేతగా ఉన్న ఆయన, ఎమర్జెన్సీతో ఇందిరా గాంధీ గారితో వ్యతిరేకించి కొత్తగా తానే కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పేరుతో పార్టీ పెట్టి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తన ప్రచారం మొదలు పెట్టాడు.
డిల్లీలోని రాం లీలా మైదానంలో ఆయన ఏర్పాటు చేసిన సభకు జనాలు వెళ్ళకుండా ఉండాలని నాటి కాంగ్రెస్ నాయకులు, దూరదర్శన్ (అప్పటి ఏకైక న్యూస్ కమ్యూనికేషన్ సాధనం) లో సూపర్ హిట్ మూవీ ప్రసారం చేయించి, జనాలను ఆ సభకు వెళ్ళకుండా ఆపాలనేది వారి ఆలోచన.
కానీ ప్రజలు అవేమీ లెక్క చేయకుండా తండోప తండాలుగా ఆయన సభకు వెళ్ళారు.
ఆ మరుసటి రోజు ఒక వార్తా పత్రికలో వచ్చిన హెడ్ లైన్ “Babu Beats Bobby”. ఇది నాటి ఆయన ఫాలోయింగ్ కు మచ్చుకు ఒక ఉదాహరణ.
ఆయన జీవితం లో ఇటువంటి విషయాలు అనేకం. దేశ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, విద్యా ఉపాధికి అందుబాటులో ఉన్న రిజర్వేషన్స్ అంశం అమలులో కూడా చాలా చిత్తశుద్ధితో ఆయన పని చేసేవారు. దానికి సంబధించిన ఒక చిన్న ఉదాహరణ చూద్దాం.
1971 లో పాకిస్థాన్ తో యుద్ధం సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న బాబూ జగ్జీవన్ రామ్ ఆ యుద్ధం అనంతరం, గత ప్రస్తుత అనుభవాల నేపథ్యంలో చైనా నుండి ముప్పు రావచ్చు అని ఆర్మీని పెంచాలని భావించారు. ఆ సమయంలో ఆర్మీ అధికారిగా మెకెన్ షా అనే అతను ఉన్నాడు. ఒక రోజు ఐఎమ్ఏ (ఇండియన్ మిలిటరీ అకాడెమీ అయ్యుండొచ్చు) క్యాడేట్స్ లిస్ట్ చూసి ఇందులో ఎంత మంది ఎస్సీలు ఉన్నారు అంటే 1 శాతం అని నాటి లెఫ్టినెంట్ "సిన్హా" బదులిచ్చారు.
అదేంటి ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించి 15 శాతం, మరియు ఎస్టీలకు 7.5 శాతం కేటాయించింది కదా, మీరెందుకు అలా నియామకాలు చేయలేదు అని మాకేన్ షా కి స్ట్రాంగ్ నోట్ రాసారు జగజీవన్ రామ్.
సిన్హా మంత్రి గారికి రిప్లై ఇవ్వాలని మీకెన్ షా కి చెబితే "మినిష్టర్ కి పిచ్చి పట్టిందా" అని అన్నాడట. తరువాత ఫైల్స్ చూస్తే ఒక క్లాజులో రిజర్వేషన్స్ ఆర్మీకి వర్తించవని ఉందట వారి ఫైల్స్ లో.
కానీ అప్పటికే కొన్ని చోట్ల 15 శాతం రిజర్వేషన్స్ అమలైన ఆర్మీ వింగ్స్ ఉన్నాయి. ఆర్మీలో పై ర్యాంకుల్లో దళితులకు ఇప్పటికీ బహుశా పెద్ద స్థాయి లో అధికారం అప్పగించలేదని తెలుస్తుంది. ఇందుకు పంజాబ్ ఆఫీసర్లు కొంచెం భిన్నం. కారణం భౌగోళికమైనవని అందరికీ తెలిసిందే.
రిజర్వేషన్స్ అమలు చేయలేదేం అన్నందుకు ఆయన పిచ్చోడు అనిపించుకోవలసి వచ్చింది. ఆ రిజర్వేషన్స్ అమలుకు ఆయన కట్టుబడిన తీరు అభినందనీయం. ఇదే కాదు ఆయన ఏ శాఖలో ఉన్నా ఆ శాఖలో దళితుల రిజర్వేషన్స్ పక్కాగా అమలు చేసి వారి అభ్యున్నతికి పాటు పడ్డారని వారికున్న పేరు.
చిన్నతనంలోనే ఆయన అనుభవించిన వివక్ష ఆయనలో ఎదురుతిరిగే స్వభావాన్ని నేర్పింది. దళితులు నీళ్ళు తాగడానికి అందరితో పాటు కాకుండా ప్రత్యేకంగా కుండ పెడితే దానిని పగలగొట్టి ధిక్కారాన్ని ప్రదర్శించిన వాడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రాం.
బాబూ జగ జీవన్ రాం గారి గురించి మరొక విషయం తెలుసుకుందాం.
దళితులకు ఆ రోజుల్లో దేవాలయ ప్రవేశం నిషిద్ధం. హిందూ మతంలో ఉన్న అసమానతలతో ఆ మతాన్ని వదిలి వేయడానికి సిద్ధ పడతారు డాక్టర్ అంబేద్కర్.
దళితులకు ఉన్న సమస్యలను గురించి డిమాండ్ చేస్తూ జగ జీవన్ రాం 30 మందితో కలిసి ఆల్ ఇండియా మహాసభ 1936 డిసెంబర్ లో పూనే సమావేశానికి వెళ్లి విషయాలు వివరిస్తారు.
హరిజనులకు (అప్పటి వ్యవహారిక భాష) ఎదురౌతున్న పరాభావాలన్నిటినీ తొలగించాలి అని నాటి అల్ ఇండియా మహాసభ అద్యక్షులు మాలవ్యా అప్పీల్ చేస్తారు.
అయితే హరిజనులు దేవాలయం లోకి రావచ్చు కానీ, ప్రధాన మందిరానికి రాకూడదు అని అమెడ్మెంట్ ప్రతిపాదిస్తారు. దీనితో కోపోద్రిక్తుడైన జగ్జీవన్ రాం వెళ్ళిపోవడానికి సిద్దపడటం తో మాలవ్యా వెనక్కి తగ్గి , ఆ సవరణను ను వెనక్కి తీసుకుంటారు. దీనితో ఆయన మరింత మందికి చేరువయ్యారు.
సహజంగా ఏ మనిషి మీదైనా కొన్ని ఆరోపణలు అపోహలు సహజం. దేశంలో దళితులకు సంబంధించి నాడు అంబేద్కర్, గాంధీ ముఖ్య నాయకులుగా ఉన్నారు. సమస్య ఒక్కటే అయినా, వారి విధానాలు వేరు. దేశంలో జాతీయ నాయకుడిగా ఉన్న గాంధీ తమ సమస్యలు పరిష్కరించగలరు అనేది అప్పట్లో ఉన్న దళిత నాయకుల నమ్మకం.
దళితులు ముందుగా గాంధీ గారిని, తదనంతరం మార్కిజం ను , అ తరువాత అంబేడ్కరిజం ను హత్తుకున్నారు. మీరు గమనిస్తే స్వాతంత్రానికి పూర్వం తెలుగులో వచ్చిన సాహిత్యం లో కూడా దళితుల విషయాల పట్ల గాంధీ గారి ప్రస్తావన ఉండేది. గుర్రం జాషువా, బోయి భీమన్న, కుసుమ ధర్మన్న గార్ల రచనల్లో ఈ పోకడ ఉంది.
ఆనాటి పరిస్థుతుల మేర జగ్జీవన రాం గారు కూడా దళితుల విషయంలో జాతీయ నాయకుడుగా ఉన్న గాంధీ గారే తమ సమస్యలు పరిష్కారం చేయగలరు అని అందరిలాగానే విశ్వసించారు.
నాటి పరిణామాలు పరిస్తుతుల బేరీజు లేకుండా జగ్జీవన్ రాం గారిని ఈ విషయం లో అదే పనిగా విమర్శించే వారు చరిత్రను నిష్పక్షపాతంగా గమనిస్తేగానీ బహుశా నాటి పరిస్థితులు అర్ధం కావేమో.
నిజమే 80 వ దశకం దాకా పెద్దగా తెలుగు రాష్ట్రాలకే పరిచయం లేని అంబేద్కర్ గారి గురించి ఇంకా తెలుసుకుంటున్న మనం, 90 వ దశకం చివరిలో ఇక్కడ పరిచయం అయిన జగ్జీవన్ రాం గారి గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనడం లో సందేహం లేదు.
ఈ నేపధ్యంలో డైరెక్టర్ దిలీప్ రాజా, బాబూ జగ్జీవన్ రాం గారి జీవితం మీద ఒక సినిమా తీయడానికి సిద్ధం కావడం శుభ పరిణామం.
ఈ వ్యాసం లో ముందుగా ప్రస్తావించిన కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీ, జగ్జీవన్ గారు స్థాపించిన పార్టీ.
ఆయన ఆ పార్టీ ద్వారా సీట్లు సాధించి, ఒకానొక దశలో ప్రధాన మంత్రి పదవికి కూడా పోటీ పడ్డారు. కానీ ఈ భారత రాజకీయం ఆయను ప్రధాని కానివ్వలేదు.
ప్రభుత్వం లో చేరడానికి కూడా అయిష్టత గా ఉన్న ఆయన, సోషలిస్ట్ దిగ్గజం జయ ప్రకాష్ నారాయణ గారి చొరవతో ఉప ప్రధాని గా ఎన్నికయ్యారు.
తన పార్టీని జనతా పార్టీలో విలీనం చేసారు. తరువాత ఏర్పడిన పరిణామాల నేపధ్యంలో కాంగ్రెస్ (జగ్జీవన్) ను ఏర్పాటు చేసి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు.
ఆయన చనిపోయే నాటికి భారత దేశ స్వతంత్రం ముందు ఏర్పడ్డ మధ్యంతర ప్రభుత్వం లో సభ్యుడిగా ప్రమాణం చేసి బ్రతికున్న చిట్ట చివరి మనిషాయన.
సైమన్ కమీషన్ సమయం లో కూడా విద్యార్థి నేతగా ఆయన కలకత్తా లో కీలకంగా వ్యవహరించారు.
50 ఏళ్ళ చట్ట సభల జీవితం, 30 ఏళ్ళకు పైగా క్యాబినెట్ మంత్రి, రెండు పార్టీల స్థాపకుడు, భారత దేశానికి ఉప ప్రధానిగా, అగ్రికల్చర్ , డిఫెన్స్, రైల్వే, కార్మిక, కమ్యునికేషన్ తదితర శాఖలకు మంత్రిగా పని చేసిన ఆయన హరిత విప్లవం, యుద్ధ విజయాలు వంటి ఘనతలలో తనదైన పాత్ర పోషించారు.
కానీ ఈ దేశాన్ని ఏళ్ళ తరబడి పాలించిన ఇందిరా గాంధీ గారికి ఎదురు తిరిగారు అన్న ఒకే ఒక్క కారణంతో ఆయన చరిత్ర మరుగున పడిపోయింది.
తనతో విభేధించినందుకు గాను సోనియా గారు, దేశ ప్రధానిగా సేవలు అందించిన పీవీ గారి సమాధి కోసం డిల్లీ లో రాజ్ ఘాట్ లో(ప్రముఖుల సమాధులు ఉన్న స్థలం) స్థలమే లేదన్నట్టు ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ కు పంపేసిన కాంగ్రెస్ పార్టీ ఘనత తెలిసిందేగా.
తదనంతర పరిణామాల్లో మీరా కుమార్ గారు, కాంగ్రెస్ లో చేరడం లోక్ సభ స్పీకర్ దాకా ఎదగడం మనకు తెలిసిందే. ఆమె భారత దేశ సామాజిక న్యాయా శాఖ మంత్రి గా ఉన్న సమయంలోనే 2008 లో జగ్జీవన్ రాం గారి శత జయంతి సందర్భంగా, డాక్టర్ బాబూ జగ జీవన్ రాం ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఆయన జీవిత చరిత్ర మీద పరిశోధన ఆయన సిద్దాంతాల వ్యాప్తి అనే సద్దుదేశాలతో ఏర్పడ్డా కానీ ఆ ఫౌండేషన్ అందరిలాగే జయంతి వర్దంతులకు మాత్రమే పరిమితం అయిపోయింది. వారి ఆధ్వర్యంలో ఆసక్తి ఉన్న వర్సిటీల్లో బాబూ జగ్జీవన్ రామ్ అధ్యయన కేంద్రాలు కూడా కొన్ని వర్సిటీలకు మంజూరయ్యాయి. కానీ అక్కడ కూడా సిబ్బంది కార్యకలాపాల లేమితో పరిశోధన ఒక కలగా మిగిలిపోయింది.
ఇప్పటికైనా ఆయన జీవితం పట్ల పరిశోధన అవగాహన అందరిలో పెరగాలి. 1936 నుండి 1986 దాకా 50 ఏళ్ళ చట్ట సభల జీవితం, 1946 నుండి 1979 దాకా ౩౦ ఏళ్ళకు పైగా మంత్రిగా సేవలు, దేశ అభివృద్ధి విజయాల్లో కీలక పాత్ర, ఎమర్జెన్సీ సమయం లో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, నాటి ఎన్నికలలో ప్రతిపక్షాలతో కలిసి పోరాడటం, దళితుల రిజర్వేషన్ సరైన రీతిలో అమలయ్యేలా చర్యలు చేపట్టడం, ఇవన్నీ వెలుగులోకి రావాలి.
బాబూ జగ్జీవన్ రాం అంటే దళిత నేత కాదు. 1936 నుండి 1986 దాకా నడిచిన భారత దేశ చరిత్ర లో ఒక అధ్యాయం. ఒక సుదీర్ఘ అధ్యాయం. దురదృష్టవశాత్తూ ఆయన జీవితం దేశ ప్రజలకు అందుబాటులో లేని ఒక చరిత్ర. అశ్రద్ధ వహించబడ్డ ఒక పెద్ద అధ్యాయం.
ఏపీ రాజధాని అమరావతిలో 10 కోట్ల తో స్మృతి వనం ఏర్పాటు చేస్తామని, గత ప్రభుత్వ నేతలు 2018 లో ప్రకటించారు.
అదేమైందో ఇప్పటికీ తెలియదు. దాని ఏర్పాటుకు మన నాయకులు కృషి చేయవలసిన ఆవస్యకత ఎంతైనాఉంది.
దాదాపు దశాబ్దకాలంగా ఆయన పేరు మీద పధకాలు, ఆయన జయంతికి సెలవు ఇవ్వడం మొదలైంది.
ఆంధ్రా లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పధకం ఆయన పేరు మీదనే ఉంది. పధకాలు, సెలవులే కాదు, నేటి విద్యార్థులు కూడా ఆయనను స్మరించుకునేలా విద్యార్థులకు వ్యాసరచన లాంటి పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం, జీవితచరిత్ర పుస్తకాలు ముద్రించి అన్ని గ్రంథాలయాల్లో కూడా ఉండేటట్లు చూడడం ఆయనకు ఇచ్చే అతి పెద్ద నివాళి.
(ఈ వ్యాసం "రాత నా దండోరా" లో కూడా ప్రచురితం అయ్యింది.)
- పచ్చల రాజేష్
డా: బాబూ జగ్జీవన్ రామ్ గారి 113 వ జయంతి ఏప్రిల్ 5 వ తారీఖు..
ఈ విషయాలన్నీ యావత్ భారతావనికీ తెలియవలసిన ఆవస్యకత ఎంతైనా ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి