జీవన వాస్తవిక కథనాత్మక దృశ్యాలు
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
తెలుగుశాఖ,
యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, ( సెంట్రల్ యూనివర్సిటి)
హైదరాబాద్.
ఆచార్య విస్తాలి శంకరరావు నాకెంతో ఆత్మీయుడు. ప్రేమతో ఆయన్ని నేను ‘అన్న’ అనే పిలుస్తాను. మేమిద్దరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఏ. నుండి డాక్టరేట్ పట్టా తీసుకొనే వరకు ఓకే డిపార్ట్మెంట్ లో చదువుకున్నాం. ఆయన జానపద సాహిత్యంలో పరిశోధనలోనూ, నేను సాహిత్య విమర్శ రంగంలోను పరిశోధన చేశాం. ఏ విశ్వ విద్యాలయంలో అయితే చదువుకున్నానో నేను అక్కడే ప్రొఫెసర్ గా పని చేయడం నాకు దక్కిన ఒక అదృష్టం. ఆచార్య విస్తాలి శంకరరావు ఏ విశ్వవిద్యాయలంలో చదువుకున్నారో, ఆ విశ్వవిద్యాలయానికే పిహెచ్.డి. మౌఖిక పరీక్షలు నిర్వహించడానికి సబ్జెక్ట్ ఎక్సఫర్ట్ గా రావడం ఆయనకు లభించిన గౌరవం. ఆయన మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖలో ప్రొఫెసర్, తెలుగు శాఖాధ్యక్షులుగా పనిచేస్తున్నప్పటికీ, మేము విడివిడిగా, వేరే వేరే చోట్లలో పనిచేస్తున్నామనే అనుభూతి నాకేనాడూ కలగలేదు. దానికి కారణం మేము నిరంతరం మాట్లాడుకోవడం. దానికి కారణం నిరంతరం అనేక సమావేశాలలో కలిసి పత్ర సమర్పణలు చేయడం. ఇంచుమించు దేశంలోని తెలుగు శాఖలున్న విశ్వవిద్యాలయాలన్నింటితోనూ ఆయన పత్ర సమర్పణ రూపంలోనో, ముఖ్య అతిథిగానో, ప్రత్యేక ప్రసంగాల రూపంలోనో ఎలాగోలా ఒక పటిష్టమైన అనుబంధాన్ని పెనవేసుకున్నారు. దేశంలోని అనేక తెలుగుశాఖలున్న కళాశాలల్లోనూ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్స్ సభ్యులుగా, సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే, డాక్టరేట్ పట్టాల కోసం అనేక ఎడ్యుకేషన్ రిపోర్టులు రాయడం, మౌఖిక పరీక్షలు నిర్వహించి, డాక్టరేట్ పట్టాలివ్వడమనేది మాకు మా జీవితంలో ఒక నిత్యకృత్యంగా మారిపోయింది. దీని గురించి మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడుల్లా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఇచ్చిన గొప్ప ఆయుధం చదువని, ఆ చదువు వల్లనే మనం ఇంత ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోగలిగామని అనుకుంటూ డా.బి.ఆర్.అంబేద్కర్ ని గుర్తుచేసుకుంటుంటాం. పద్యాన్ని పాడినా, పాటల్ని ఆలపించినా, భావయుక్తంగా రాగయుక్తంగా వీనులవిందుగా చేయగలిగినటువంటి మధురమైన స్వరం ఆచార్య విస్తాలి శంకరరావు గారు ఒక ప్రత్యేకమైన బాణీ ఏర్పరుచుకున్నారు. దానికి కారణం- ఆయన కుటుంబంలో వాళ్ళ నాన్నగారు, మరికొంతమంది బంధువులు గొప్ప కళాకారులు కావడం కావచ్చు. చదువుకున్న తొలి తరానికి చెందిన మేము విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ స్థానానికి రావడానికి కారణమైన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ని సహజంగానే నిత్యం స్మరించుకోవడం మా జీవితంలో ఒక భాగంగానే భావిస్తాం. ఆ స్ఫూర్తినే ఆచార్య విస్తాలి శంకరరావుగారు ఈరోజు తన కథలు ‘తడి ఆరని బ్రతుకులు’ ద్వారా అందిస్తున్నారు.
ఈయన కథలు కూడా రాస్తారని ఈ కథలు చదివేవరకూ నాకు తెలియదు. ఆయన రాసిన అనేక వ్యాసాలు చదివాను. ఆయన రాసిన అనేక పరిశోధనా పత్రాలు చదివాను. ఆయన రాసిన వచన కవిత్వాన్ని చదివాను. ఆయన రాసిన దీర్ఘ కావ్యాన్ని చదివాను. కానీ, జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా, లోతుగా పరిశీలిస్తూ, సంక్షిప్తంగా, పాఠకుల్ని ఆకట్టుకునే వచనంలో, రెండు మూడు పాత్రల్ని సృష్టించి, ఒక ప్రధానమైన సంఘటనను కేంద్రీకరిస్తూ తనదైన శిల్ప చాతుర్యంతో వాస్తవాన్ని కళాత్మకంగా చెప్పగలిగే ప్రక్రియ కథ. అలాంటి మంచికథను రాయడం అంతసులభమేమీకాదు. ఒకరోజు మాటల సందర్భంలో తాను కథల పుస్తకం వేస్తున్నానని, దానికి అభిప్రాయాన్ని రాసి పంపించమన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఒక అధ్యాపకుడుగా, ఒక కవిగా, ఒక కళాకారుడుగా, ఒక పరిశోధకుడుగా, ఒక విమర్శకుడుగా తెలిసిన ఆచార్య విస్తాలి శంకరరావు ఒక కథకుడిగా కూడా పరిచయం కాబోతున్నందుకు ఆశ్చర్యపోయాను. ఆయనలో ఉన్న ఏ ప్రక్రియకు ఆ ప్రక్రియే అన్నట్లుగా రచనను కొనసాగించే ప్రక్రియా స్వభావాన్ని, ఆ ప్రక్రియ ప్రత్యేకతను గుర్తించి రాయగలిగినటువంటి శక్తికి నేను ఆశ్చర్యపోతున్నాను. ఈ కథలు చదువుతుంటే అనేక సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకున్నాను. అనేక కథల్లో నాజీవితం, నాకు తెలిసిన జీవితం కనిపించింది. అందుకే దగ్గరుంటే ఆయన్ని హృదయానికి హత్తుకోవాలనిపించేది. ఆయనలోని సున్నితత్వం, లోక పరిశీలన, మానవత్వం పట్ల కరిగిపోయే గుణం వంటివన్నీ ఈ కథల్లో మనకి కనిపించడమే దీనికి కారణం. ఈ కథలన్నీ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ప్రధానంగాను, ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు ఇక్కడ నుండి మద్రాసు వెళ్లిన వాళ్ల జీవితాలు, మద్రాసులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి విషయాలు కథల్లో కనిపించే కొన్ని ప్రాంతాలు. ఈ కథలు చదువుతుంటే మరలా మనల్ని నాస్తాల్జియా లోకి తీసుకెళ్ళి పోయి, బాల్యం, సొంత ఊరు, సొంత కుటుంబం, మన చిన్న నాటి స్నేహితులు, ఆ తెలుగు ప్రాంతాలను గుర్తుచేసుకుంటున్నటువంటి అనుభూతులెన్నో ఒక ఆత్మీయమైనటువంటి బంధంతో ఈకథలు మనల్ని పెనవేస్తుంటాయి.
ఆకలి-అంజలి కథలో భార్య ప్రాధాన్యాన్ని మహోన్నతంగా చిత్రించాడు రచయిత. కుటుంబంలో పిల్లలు బంధువులు చుట్టాలు సమాజం ఎన్ని ఉన్నా లేకపోయినా భర్తకు భార్య; భార్య భర్త మాత్రమే నిజమైనటువంటి తోడని నిరూపిస్తుందీ కథ. తన భార్య ఉన్నంతవరకు సమయానికి మంచి భోజనం చేసినటువంటి వేణుగోపాల్, ఆమె రైలు ప్రమాదంలో చనిపోవడంతో, ‘‘ఆకలి విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పట్టా పొందిన అనుభవశాలి అయ్యాడం’’టారు రచయిత. '' స్వర్గం నరకం అంటే ఎక్కడో లేదు. ఈ భూమి మీదే ఉన్నాయి. స్వర్గం అంటే తను పుట్టిన దగ్గరి నుంచి బిడ్డలు పుట్టేవరకూ వున్న కాలం. నరకం అంటే బిడ్డలు పెద్ద వాళ్లయిన దగ్గర నుండి వృద్ధాప్యం వచ్చి చనిపోయేవరకు ఉన్నకాలం’ అనే మాట ఒక జీవితసత్యంగా, ఒక వాస్తవిక దృశ్యంగా, ఒక ప్రవచనంలా మిగిలిపోతుందనిపిస్తుంది. పిల్లలు తమ తల్లిదండ్రులకు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో పరోక్షంగా ప్రేరణనిస్తుందీ కథ.
ఇద్దరు స్నేహితుల్లో ఒకడు పరిస్థితులు బాగున్నా, బాగాలేకపోయినా, తాను సహజంగా పెద్ద తెలివితేటలున్నవాడు కాకపోయినా అనేక కష్టనష్టాలకు గురై బాగా చదువుకొని ఉద్యోగిగా స్థిరపడి, సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని పొందుతాడు. మరొకడు ఎంతో తెలివైనవాడు, కానీ పేదరికం, కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడంతో మధ్యలోనే చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి, పెళ్ళిచేసుకొని, బతుకుబండిని ఈడ్చుకోలేక సతమతవుతుంటాడు. వీళ్ళిద్దరూ దూర ప్రాంతాల్లో స్థిరపడినా, మళ్ళీ ఒకరునొకరు కలుసుకోవాలని ప్రయత్నం చేయగా, చేయగా ఫోను నెంబరు దొరుకుతుంది. కానీ, దాని ద్వారా మాట్లాడుకోవాలనుకునేటప్పుడు బాగా స్థిరపడిన స్నేహితుడు, జీవితంలో బాగా స్థిరపడలేకపోయిన స్నేహితుడితో మాట్లాడాలని ఉంటుంది. వాళ్ళిద్దరిమధ్యా అనివార్యమైన ఆర్థిక, సామాజిక సంబంధాలు కలిగించిన మానసిక సంఘర్షణను ఎలాంటిదో ఈకథలో వాస్తవికంగా చిత్రించారు కథారచయిత. పేదవాడు ఫోను చేస్తే తీస్తాడో లేదో, సరిగ్గా మాట్లాడతాడో లేదో అనుకొని ఆ గతకాలపు జ్ఞాపకాలు అలాగే ఉంటే మంచిది కదా' అనుకుని తన స్నేహితుల మధ్య ఉన్న స్నేహ వాత్సల్యం తెలుసుకోవాలంటే 'నామరొకదేహం' కథ చదవి తీరాల్సిందే. చదువు విలువతో పాటు, పరిస్థితులు అనుకూలించక పోతే ఆ చదువు చదువుకోలేక తమకున్న తెలివితేటలు కూడా ఎలా నాశనం అయిపోతాయో ఈ కథలో చదివితే తెలుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో నిజమైన స్నేహితుడు ఎలా ఆదుకుంటాడో, ఆదుకోవాలో చెప్పే కథ ఇది.
కొన్ని వృత్తుల్లో తలమునకలైనప్పుడు పండగ సమయాల్లోనైనా కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా గడపలేనటువంటి కొన్ని వృత్తులు ఉంటాయి. అటువంటి వృత్తుల్లో టైలర్ పని ఒకటి. అంటే దర్జీ పని. అజీమ్ టైలర్ (లేడీస్ స్పెషలిస్ట్) అనే క్యాప్షన్తో రాసినటువంటి కథ కూడా చదువు ప్రాధాన్యాన్ని చెప్తూ తాను ఉన్నత చదువులు చదువుకోకపోయినా, తన కూతుర్ని జాయింట్ కలెక్టర్ ఉద్యోగం పొందే వరకు చేసినటువంటి ఒక తండ్రి జీవన ప్రస్థానం ఈ కథ. కథలో ట్విస్ట్ ఏంటంటే తన కూతురు కలెక్టర్ అయినప్పటికీ తన వృత్తి మీద ఉన్న ప్రేమతో ఆ వృత్తిని మానకుండా దాన్ని కొనసాగించడం, ఆ వృత్తి వల్లనే తన పిల్లల్ని చదివించుకున్నాననే తృప్తిని వ్యక్తం చేస్తుంది. తన మిత్రులు, తన నైపుణ్యమేదో తన వృత్తితో ముడిపడి ఉంటుందనే సత్యాన్ని ఈ కథ ద్వారా ఆవిష్కరించాడు రచయిత. ఇల్లు మూడు చర్చనీయాంశాలు ఉన్నాయి. ఒకటి: చదువు ప్రాధాన్యత. రెండు: కొన్ని వృత్తులు ఆర్థికంగా ఎదగకుండా చేస్తూ కుటుంబ సభ్యులతో గడప లేనటువంటి నిరంతర శ్రమ చేస్తున్నా, తగిన ఆర్థిక శక్తినివ్వనటువంటి స్థితిని చూపించడం. మూడవది: తాను ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా సామాజిక సంబంధాలు పటిష్టంగా ఉంటే, తాను అనారోగ్యానికి గురైనప్పటికీ, వాటన్నింటిని విజయవంతంగా అధిగమించి, తృప్తిగా జీవించడమెలాగో నేర్పే ఒక సందేశం ఈ కథలో ఉంది. దీనితో పాటు తమ వృత్తులు తమ సామాజిక సంబంధాల వంతెనగా కూడా మారతాయి. కనుక, వాటిని వదల్లేని ఒక ఆత్మీయబంధం కూడా ఉంటుంది.
దివ్యాంగుల్లో ఉండవలసిన ఆత్మాభిమానాన్ని, దాన్ని ఆసరాగా చేసుకుని మాతృత్వంలో ఉన్నటువంటి మమకారాన్ని కరుణరస భరితంగా, సందేశాత్మకంగా రాసిన కథ 'ఆత్మాభిమానం'. ఈ కథ ఒక దివ్యాంగుడైన జిల్లా కలెక్టర్ తన మాతృమూర్తి ఫోటోని తన ఆఫీసులో పెట్టుకోవడంతో ప్లాష్ బ్యాక్ పద్ధతిలో నడిచింది. ఈ కథ చదువుతున్న పాఠకుడికి కన్నీళ్లు రాకుండా నిలుపుకోవడం కష్టం. ఆత్మాభిమానం అని ఒక పాత్రకు పేరుపెట్టడమే ఒక కొత్త ఆలోచన. ఆత్మాభిమానాన్ని పెంచి పెద్దచేసి, తన తల్లి ఆశయాల్ని నెరవేర్చడంతో పాటు, అదే ఆత్మాభిమానాన్ని తన ఆఫీసు సిబ్బందితో ప్రవర్తించడం. ఆత్మాభిమానంతో బ్రతకాలనుకున్న మరొక దివ్యాంగురాల్ని ప్రోత్సహించడం వంటివన్నీ ఆత్మాభిమానంలో కనిపించే భిన్న కోణాల్ని చూపిస్తుందీ కథ.
దేశభక్తి నేపథ్యంలో 'కడతేరని కష్టాలు- కడివెడు కన్నీళ్లు' కథ కొత్త కోణంలో ఆవిష్కృతమైంది. లేక లేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు దేశం మీద ప్రేమతో మిలటరీ లోకి వెళ్లి ప్రాణాలర్పిస్తాడు. రాజకీయ నాయకుల పరామర్శలు ప్రభుత్వ హడావిడి ఆర్భాటంగా జరుగుతోంది. చేసిన వాగ్దానాలు పత్రికల్లో ప్రముఖంగా రాస్తాయి. కానీ కొంతమందికి అవి అమలులో మాత్రం శూన్యం గా మారిపోతాయి. మరికొంతమందికి ఏవీ అడక్కపోయినీ, అన్నీ అమలై పోతూ ఉంటాయి. దేశం కోసం ప్రాణాలర్పించిన వారి ప్రాణాలు అన్నింటికీ ఒకే రకమైన విలువ ఉంటుందా? అనే చర్చను పెడుతుందీ కథ.
'గయ్యాళి నాగమ్మ' కదా ఒక విచిత్రమైన కథ రచయిత. రచయిత కథా కథనంలో ఎంతో ప్రతిభ కనిపిస్తుంది. కొంతమంది మనస్తత్వాలు సులభంగా అర్థం కావు. కొంతమంది చాలా నెమ్మదిగా ఉంటారు, మరి కొంతమంది కఠినంగా ఉంటారు. ఇంకొంతమంది గయ్యాళిగా కూడా ఉంటారు. ఈ కథ ద్వారా నాగమ్మ అనే పాత్ర కథాసాహిత్యంలో ఒక రేర్ క్యారెక్టర్ గా మిగిలిపోతుందనుకుంటున్నాను. కులమతాలకు అతీతంగా, నిష్కళంకమైనటువంటి జీవితాన్ని జీవించిన వారి జీవితాలకు నిలువెత్తు నిదర్శనంగా ఒక మనిషి సమాజంలో శాశ్వతంగా ఎలా నిలిచిపోతుందో నాగమ్మ పాత్ర ద్వారా తెలుస్తుంది. కథా సాహిత్యంలో ఇదొక ప్రయోగాత్మకమైన కథాకథనమనుకుంటున్నాను.
రైతుల దీనస్థితిని తెలియజేసే కథ 'మేత తాడు- ఉరితాడు' ఒకవేపు క్రికెట్ పిచ్చి, మరొకవైపు రైతుల దీనస్థితి... రెండింటినీ ఒకేసారి చెప్పే కథాకథనం రచయిత ప్రతిభకు నిదర్శనం. గాట్ ఒప్పందాల ఫలితంగా రైతుల పై పడిన ప్రభావాలు, ప్రపంచీకరణ పరిస్థితుల వలన వచ్చిన మీడియా ప్రభావం వల్ల మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాల విచ్ఛిన్నాన్ని ఈ కథ మన కళ్ళముందు ఉంచుతుంది. క్రికెట్ ను ఒక ఆట కాకుండా దేశాల మధ్య వైరుధ్యాలుగా, దేశభక్తి పేరుతో జరుగుతున్న విద్వేషాలుగా మారుతున్న విధానాన్ని ఆలోచింపజేస్తుంది.
సమాజంలో ఒకప్పుడు నాటకరంగానికి నాటక కళాకారుల కి ఎంతో ఆదరణ ఉండేది. ప్రపంచీకరణ ప్రభావంతో కళాకారులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఎంతోమంది కళాకారులు భిక్షాటన చేసుకొంటూ పొట్టపోషించుకుంటున్నారు. నటన ఉన్నా లేకపోయినా మరికొంతమంది మాత్రం వెండితెర, బుల్లితెరలపై గొప్ప కళాకారులుగా చలామణీ అయిపోతున్నారు. కానీ, నిజమైన కళాకారులకు గానీ, నాటక రంగానికి గానీ తగినంత ఆదరణ లభించడంలేదని మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్న. కళాకారులుగా గుర్తింపు పొందాలన్నా రకరకాల మేనేజ్మెంట్ టెక్నిక్స్ నేర్చుకోవాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో కళాకారుల కుటుంబం నుండి వచ్చిన రాజారాం ఒక భిక్షగానిలో తన వంశాన్ని, తమ కళల్ని, తన తండ్రినీ చూసుకొని రంగులు వెలసిన నాటకరంగం తన కళ్ళల్లో ఎలా కరుణరసంగా ప్రవహించిందదో ఎంతో ఆత్మీయంగా చెప్పిన కథ' కరుణ రసం' కళాకారులు వీధి నాటకాలు ప్రదర్శించేటప్పుడు ఆయా పాత్రల్లో ఎలా లీనమైపోతారో ఆ సందర్భంగా ప్రేక్షకులు ఎలా ప్రతి స్పందించే వారో వర్ణించిన తీరు ఎంతో అనుభవంతో చెప్పిన కథలా అనిపిస్తుంది.
'' పూర్వం 90 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళు కూడా సమాజంలో కానీ ఇంట్లో గాని ఎంతో గౌరవం పొందేవారు. కానీ ఈనాటి పరిస్థితి వేరు. 50 సంవత్సరాలు దాటుతున్నాయంటేనే వారిలో ఏదో తెలియని నిరాశ ...జీవితం ఇక చాలు అనే మాటలు... వినాల్సి వస్తుంది ఎంత విచిత్రం...'' ఇది 'మనిషి మనిషిగా అనే కథలో రచయిత మనకు ఇచ్చిన ఒక జీవిత సత్యం. ఒక్క ప్రవచనం లాంటి మాట. దీనికి కారణం ఏమిటి అని మనలో మనం ప్రశ్నించుకుంటే మన విద్యా విధానం, మన అభివృద్ధి వంటి మానవీయ విలువలన్నీ ఆముడిపడ్డాయా? అనే ఆలోచనలు కలిగిస్తాయి. మన విద్యా విధానం నేడు సమష్టి కుటుంబాల నుండి వ్యష్టి కుటుంలగా మారిపోయిన తర్వాత కనిపించే ఒక కోణాన్నీ కథ చర్చిస్తుంది.
'' సాయంత్రం 6 గంటలకు కామరాజ్ నగర్ లో తండ్రి అంతిమ యాత్ర. లండన్ విశ్వవిద్యాలయం ఆడిటోరియం వేదికపై మనిషి- డబ్బు అనే అంశంపై కొడుకు ప్రసంగం ఒకేసారి మొదలయ్యాయి.'' ఇవి తడియారని బతుకులు కథ లోని వాక్యాలు. ఇక ఈ ఒక్క వాక్యం చదివితే పూర్తి కథను కూడా చెప్పనవసరం లేదు. సమకాలీన సమాజంలో వలసలు. అలా వలసలు వెళ్ళవలసినటువంటి దుర్భిక్ష పరిస్థితులు...ఆ వలస వెళ్లినటువంటి ప్రాంతాల్లో కూడా ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ తమ పిల్లల్ని చదివించుకోవాలని తపన చెందుతున్నారో మన కళ్ల ముందు హృదయవిదారకంగా చూపిస్తుందీకథ. ఒక కదులుతున్న దృశ్యమాలిక మన కళ్లెదుటే తెరమీద చూపిస్తున్నట్లనిపిస్తుంది. తెలుగు వాళ్లు ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుండి బ్రతుకు తెరువు కోసం మద్రాసు వెళ్లిన వారి జీవితంలోని అనేక కోణాలను డయాస్పోరిక్ షార్ట్ స్టోరీ గా మన కళ్ల ముందు ఉంచారు. తెలుగు సాహిత్యంలో ఈ మధ్య వస్తున్నుటువంటి ధోరణుల్లో డయాస్పోరా సాహిత్యం ఒకటి. పారిశుద్ధ్య కార్మికులుగా ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాలలో బతుకు తెరువు కోసం పడుతున్నవారి కష్టాలు మన కళ్ల ముందు కనిపించాలంటే ఈ కథ చదవాలి.
ఇలా ఈ కథలన్నీ చదువుతుంటే, విస్తాలి శంకర్ రావు గారి లో ఒక విమర్శకుడు ఒక సీరియస్ పరిశోధకుడు మాత్రమే కాదు, ఒక సున్నితమైన మనస్తత్వం కలిగిన సృజనాత్మక కథారచయిత గమనించడానికి ఈ కథలు ఎంతగానో తోడ్పడతాయనిపిస్తుంది. ఈయన హృదయం ఇంత సున్నితమైందా? మానవ సంబంధాల కోసం ఇంతగా తపిస్తున్నాడా అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న మనుషుల్ని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం విస్మరిస్తున్నామని మనం గుర్తించలేకపోయామా అనిపిస్తుంది. అలా మనల్ని మనం విస్మరించుకుంటున్న వాస్తవ జీవిత దృశ్యాల్ని మన ముందు కదిలేలా చేశారనిపిస్తుంది. ఈ కథల్లో మన గ్రామాలలోని మూలాలు, ఆ గ్రామాల్లోని మానవ సంబంధాలు, ఆ మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులు ఎలా జరుగుతున్నాయో ఒక శతాబ్ది సామాజిక వాస్తవిక చరిత్ర మనకి అవగాహన అవుతుంది. మాతృభాషగా తెలుగు కావాలని కొంతమంది ఉద్యమాలు చేస్తారు. కానీ వాళ్ల పిల్లలు మాతృభాషగా తెలుగు చదవరు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని పెడుతూ ఉంటే వ్యతిరేకతను ప్రదర్శిస్తుంటారు. ప్రైవేటు పాఠశాలల్లో అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న ఆంగ్ల మాధ్యమం గురించి వాళ్లు మాట్లాడరు. ఈ అంశాల పట్ల సమాజంలో సంఘర్షణ కొనసాగుతోంది. ఆ సంఘర్షణ కూడా ఈ కథల్లో వస్తువయ్యింది.
ఒక్కమాటలో చెప్పాలంటే ఆచార్య విస్తాలి శంకరరావు ఒక సృజనాత్మక రచయితగా, అందులోనూ ఒక ఉత్తమ కథారచయితగా తెలుగు సాహిత్యానికి పరిచయమవుతున్న సందర్భంగా నా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, ఈ కథల్ని చదివి, మన చుట్టూ ఉన్న మానవసంబంధాల్ని పరిమళభరితం చేసుకోవాలని కోరుతున్నాను.
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
18.3.2021
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి