"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

24 April, 2021

మణిపూసల రామాయణం

సాహిత్యం నిత్యనూతనంగా కొనసాగడానికి సమాజంలో ఉన్న మనుషులు కూడా నిత్యనూతనంగా ఆలోచిస్తుండడమే ప్రధాన కారణం. ఆ నిత్యనూతనత్వం వల్ల తెలుగు సాహిత్యంలో ప్రక్రియా వైవిధ్యంతో పాటు, కవిత్వంలో రూప వైవిధ్యం కూడా కనిపిస్తుంది.కొన్ని క్రొత్త ప్రయోగాలు చేస్తూ ఛందోబద్ధమైన పద్యాన్ని వదలకుండా నేటికీ పద్యకవిత్వాన్ని రాస్తున్న వాళ్ళూ ఉన్నారు. పద్యాన్ని కొంత సంస్కరణ చేసి మాత్రా ఛందస్సులో కవిత్వం రాస్తున్న వాళ్ళూ ఉన్నారు. మినీ కవిత్వానికి దీనికీ కొంత భేదం ఉందనీ, దీన్ని మినీ కవిత్వంగా భావించకూడదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మినీ కవిత్వానికి వచన కవిత్వమే ప్రేరణగా‌ కనిపిస్తుంది. వచన, మినీ కవిత్వంలో సంప్రదాయ ఛందస్సు, మాత్రాబద్దతకు బదులు లయ ప్రధానంగా కనిపిస్తుంది. శ్రీశ్రీ లాంటి ఒకరిద్దరు కవులు మాత్రం దీనికి మినహాయింపుగా కనిపిస్తారు. తెలుగు కవిత్వ పరిణామాల్లో సంప్రదాయ సాహిత్య వారసత్వాన్ని ఆధునికతను మేళవించి రూప వైవిధ్యభరితమైన కవిత్వంగా రమేశ్ గోస్కుల సృష్టించిన కైతికాలు, వడిచర్ల సత్యం సృష్టించిన మణిపూసలు కవిత్వరూపాల్ని చెప్పుకోవచ్చు.

 ఒక సాంస్కృతిక చైతన్య వారధి  మణిపూసల రామాయణం

ఒక నూతన కవిత్వరూపాన్ని సృష్టించడం ఒక కష్టమైతే అది నిలబడాలంటే ఆ ప్రక్రియలు లేదా ఆ రూప వైవిధ్యంలో మంచి రచనలు రావడం ఎంతో అవసరం. సుగమ్ బాబుగారు సృష్టించిన రెక్కలు కవిత్వరూప ప్రక్రియలో ఇప్పటికే భగవద్గీత కూడా వెలువడింది.
ఇప్పుడు మణిపూసలు అనే కవిత్వ రూప ప్రక్రియలో రామాయణం వెలువడుతుంది. ప్రపంచ సాహిత్యంలో రామాయణానికి ఎంతో విశిష్టత ఉంది. రామ నామాన్ని పలకడమే పుణ్యం గా భావించే వాళ్ళూ ఎంతోమంది ఉన్నారు. ‘మరల నిదేల రామాయణం బన్నచో…’ అని విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణం రాయడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఎంతో హేతుబద్దంగా చెప్పారు. ఇప్పుడు ప్రముఖ కవి, వాగ్గేయకారుడు, తెలుగు పండితుడు టి.ఆశీర్వాదం గారు “మణిపూసల రామాయణా”న్ని రాశారు. రంగనాథ రామాయణం వంటివాటిని మినహాహిస్తే సాధారణంగా రామాయణాన్ని రాసిన వారిపేరుతోనే ఆ రామాయణాన్ని పిలవడం సంప్రదాయంగా వస్తుంది. కానీ, ఆశీర్వాదం గారు ఒక కవిత్వ ప్రక్రియతో రామాయణాన్ని పేరుపెట్టారు. అదొక విశేషం.
ఈ రామాయణం తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానాన్ని పొందుతుందని దాన్ని చదివిన తర్వాత నాకు అనిపించింది. మూడు రకాలుగా ఈ విశిష్టత కనిపిస్తుంది.

ఒకటి: మణిపూసలు నూతన కవిత్వ రూపంలో రాయడం వల్ల ఆ మణిపూసలు కవితా రూపం తెలుగు చిరస్థాయిగా నిలుస్తుంది.

రెండవది: రామాయణానికి ఉన్న విశిష్టత వల్ల దాన్ని ఎవరు ఏ ప్రక్రియలో రామాయణాన్ని రాసినా, దానికి సాహిత్యంలో సుస్థిర స్థానమే దక్కుతుంది. అలా దీనికి కూడా విశిష్టమైన స్థానమే దొరుకుతుందని నమ్ముతున్నాను.

మూడవది: ఆశీర్వాదం గారు రాసినటువంటి రామాయణంలో కనిపించే విశేషాల వల్ల తెలుగు సాహిత్యంలో ఈ రామాయణాకి విశిష్ట స్థానం లభిస్తుంది.అందులో పై రెండింటి గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు. మూడవది- ఆశీర్వాదం గారు రాసిన మణిపూసల రామాయణ విశేషాలు కొన్నింటినైనా ప్రస్తావించుకోవాలి.రామాయణాన్ని మణిపూసలు రూపంలో రాయడం వల్ల చదువుకోవడానికి అవకాశం ఉంటుంది.ఈ రామాయణాన్ని గానం యోగ్యంగా ఆలపించడానికీ అనుకూలంగా ఉంది. స్వయంగా ఆశీర్వాదం గారు పాడినపుడు నేను విన్నాను. ఆయన గొంతు నాకెంతో శ్రావ్యంగా అనిపించింది. ఆయన వర్ణించిన మణిపూసలు అందమైన కందపద్యాల్లా సాగిపోతున్నాయి. కావ్య సంప్రదాయంలో అవతారికు ఎంతో ప్రాముఖ్యాన్నిస్తారు. ఈ కావ్యంలో కవి ఆశీర్వాదం గారు విఘ్నేశ్వర స్తుతి చేస్తూ ఆ సంప్రదాయాన్నే పాటించారు. శ్రీరామ అనే పదాన్ని పలికితేనే పుణ్యమని భావించినట్లే, తనకి వచ్చిన కవిత్వంలో రామాయణాన్ని వర్ఱిస్తున్నానంటూ…
‘‘నీదు పుణ్యచరితము
ఎపుడు విన్న నవకము
మరల నేను చెప్పుటకు
చేయుచుంటి ధైర్యము’’ అని అన్నారు. దీనిలో ‘నవకము’ అనడం ద్వారా ఆ చరిత్ర ఎప్పటికీ క్రొత్తగానే ఉంటుందనీ అంటే Fresh గాను, మృదుమధురంగానూ ఉంటుందనే భావాన్ని చెప్పి, రామాయణంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. దీన్ని ‘మణిపూసలు’ అనే కవిత్వ రూపంలో చెప్తున్నానంటూ, దైవాన్ని సహకరించమని ఇలా ప్రార్థిస్తున్నాడు కవి.
‘‘మణిపూసలు గూర్చెదా
రాముని గళమేసెదా
పూర్వకవుల వోలెనేను
చరితార్థుడనయ్యెదా

చక్కని పదసంపదిచ్చి
చిక్కని భావంబునిచ్చి
కావ్యంబును గూర్చ నన్ను
కనికరించు కరుణనిచ్చి’’.…దీనిలో తన కావ్య లక్ష్యాన్ని కూడా తెలిపారు. పూవుకి దారం ఉంటే దానికి కూడా విలువ కలుగుతున్నట్లు, రాముని కథ చెప్పడం వల్ల తనకు కూడా చరిత్ర వస్తుందని ఎంతో వినయంగా చెప్పుకోవడాన్ని గమనించాలి. ఇది ఆత్మస్తుతిలా కనిపించే వినయం. కవి … గళమేసెదా, పదసంపదిచ్చి వంటి ప్రయోగాల్లో ద్రుతాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని మణిపూసల్లో పాటించే మాత్రలకు భంగం కలగకుండా జాగ్రత్త పడ్డారు. ఇలాంటి ప్రయోగాలు భాషను సామాన్య జనానికి దగ్గరగా తీసుకెళ్ళడానికి దోహదపడతాయి. కవి వ్యాకరణాన్ని, మాత్రా ఛందస్సుని పాటిస్తూనే కావ్యాన్ని రసభరితం చేస్తూ మృదుమధుర మైన భాషను ఉపయోగించి, తెలుగు భాష ఉన్నతిని మరింత పెంచేలా చేశారు.సాహితీవేత్తలు రామాయణం నేటికీ ఆదరణీయం కావడానికి సమాజంలో ఒక ఆదర్శ పురుషుడు ఎలా ఉండాలో సూచిస్తూ చెప్పడం ఒక కారణంగా భావిస్తుంటారు. ఆ ఆదర్శనీయమైన వాటిలో కొన్ని లక్షణాలు ఆనాటి రాజ్యానికీ, సమాజానికీ మాత్రమే కాకుండా నేటి ఆధునిక కాలంలో కూడా ఎంతో మంది పాటిస్తున్నారు. కాబట్టే రామాయణం నేటికీ నిలుస్తుంది. అందుకని రామాయణంలో రాముని పాత్ర తీర్చిదిద్దేటప్పుడు కవి ఎంతో జాగ్రత్తలు తీసుకున్నాడు. కవి ఆశీర్వాదం గారు సందర్భం వచ్చినప్పుడల్లా శ్రీరాముని ఎంతో ఔచిత్యంతో వర్ణించారు.

మణిపూసల రామాయణం పుస్తక రచయిత ఆశీర్వాదం

‘‘సద్గుణాల ధాముడు
సకల కళా నిపుణుడు
లోకమందు ఒక ఒకడు
అతడే శ్రీరాముడు ’’ (బాలకాండ: 9)
కొన్ని పద్యాలు కేవలం శ్రీరాముడి మాత్రమే కాకుండా ఆ సర్వనామాలు లేదా నామాలు తీసేసి చూస్తే కనుక విడి విడిగా కూడా అవి ఒక నీతి పద్యాలు నిలిచిపోతాయన్నట్లున్నాయి. అది ఆశీర్వాదం గారి రచనా విశేషాల్లో మరొక అంశం.

‘‘ అతడు ఎక్కడున్నను
మంచి యచట జరుగును
అతడు కాలుమోపిన
వాన బాగ కురియును’’ (బాలకాండ: 45)
‘‘ దు:ఖాలకు క్రుంగిపోడు
సుఖంబులకు పొంగిపోడు
రెండింటిని సమముగా
భావించెడి స్థితప్రజ్ఞుడు’’ (అయోధ్యకాండ: 77)
ఇలాంటి పద్యాలు కొంతమంది మంచి వాళ్ళకు కూడా అనువర్తితమవుతుంది.
గోదావరి తీరప్రాంతాన్ని వర్ణిస్తూ…
‘‘ఫలములకు కొదువలేదు
జలములకు లోటులేదు
చూడచక్కప్రాంతమది
దానికేది సాటిరాదు’’ (అరణ్యకాండ: 52) అన్నారు. ఈ విషయాలు కొన్ని ప్రాంతాలను చూసినప్పుడు వాటికీ సరిపోతాయనిపిస్తాయి. ఇలాంటి వర్ణనలు సాహిత్యాన్ని శాశ్వతం చేస్తుంటాయి.
శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగే తరుణంలో మంథర మాటలు విన్న కైక దశరథుడిని తన వరాలు గురించి ప్రస్తావిస్తుంది. ఆ సందర్భంలో తల్లితో జరిపే సంభాషణలో శ్రీరాముడు…
‘‘ విషమునైన తాగుతాను
జలధినైన దూకుతాను
అతడాదేశించినా
ప్రాణాలనె వదులుతాను ’’ (అయోధ్యకాండ: 74) అని తన తండ్రి మాటను పాటించితీరుతాననే మాటలు పాఠకుల హృదయాల్ని ద్రవింపజేసేలా వర్ణించారు కవి. అల్లారు ముద్దుగా పెరిగే సమయంలో విశ్వామిత్రుడు తీసుకెళ్లినప్పుడు , పట్టాభిషేకం జరిగే సమయంలో కైక అడ్డుకున్నప్పుడు దశరథుని మన: స్థితినీ, శ్రీరాముని వినయ విధేయతలను వర్ణించిన తీరు అద్భుతం.
ఆరుకాండలలో రాసిన ఈ మణిపూసల రామాయణాన్ని చదివితే రామాయణాన్ని ఇంత సులభంగా కూడా చెప్పవచ్చా? అనుకుంటాం. పెద్దపెద్ద రామాయణాల్ని చదివి అర్థం చేసుకోలేనివారు, కవిత్వంలో ఉంటూనే సులభంగా అర్థమయ్యేటట్లు ఉండే బాగుండుననుకునేవారికి మణిపూసల రామాయణం బాగా నచ్చుతుంది. కట్టెకొట్టితెచ్చె అన్నట్లుగా విషయాన్ని సూటిగా, స్ఫష్టంగా చెప్పడంలో కవి ప్రతిభ వ్యక్తమవుతుంది. ఈరామాయణాన్ని పండిత పామరులంతా చదువుకొని ఆనందించగలుగుతారు. అంతేకాదు, వాల్మీకి రామాయణాన్ని మరలా చదవాలనిపిస్తుంది కూడా! అంతటి ప్రేరణను కల్గించేశక్తి ఈ రామాయణానికి ఉంది. అక్కడక్కడా సంస్కృత శ్లోకాల్ని కూడా పెట్టి మూల గ్రంథంపై కవికున్న గౌరవాన్ని ప్రకటించుకున్నారు. ఈ రామాయణాన్ని పూర్తిగా గాని, దీనిలో కొన్ని భాగాల్ని గానీ, పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులకు పాఠ్యాంశంగా పెడితే సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఆధునిక కవిత్వ రూపాల్ని పరిచయం చేస్తూనే, సంప్రదాయ మూలాల్ని కూడా చెప్పుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ మణిపూసల రామాయణాన్ని సగం వరకూ చదువుకునే పాఠకుడు తాను కూడా మణిపూసల్లో కవిత్వాన్ని చెప్పడానికి సిద్దమౌతాడేమోనన్నట్లుంది. రచనా శైలి అంత సరళంగా కొనసాగింది. మణిపూసల సృష్టికర్త వడిచర్ల సత్యం గారు వందలాది మంది చేత ఈ కవిత్వాన్ని రాయిస్తున్నారు. కానీ, ఆశీర్వాదంగారు రాసిన ఈ మణిపూసల రామాయణం ద్వారా సాహిత్యంలో మణిపూసల కవిత్వ రూపానికి ఒక విశిష్టస్థానం లభిస్తుందని విశ్వసిస్తున్నాను.
కవి ఆశీర్వాదం గారు గతంలో ఆటవెలది ఛందస్సులో ‘‘ అక్నాపుర ప్రశస్తి శతకం’’ (2018) రాశారు. దీనికి ముందుమాట రాస్తూ ప్రసిద్ధ సాహితీవేత్త నందిని సిధారెడ్డి ‘‘ అక్నాపురం అదృష్టానికి నోచుకున్నది. కవిపుడితే తప్ప ఊరి వైభవం వెలుగులోకి రాదు. అక్నాపురం ప్రశస్తిని వివరిస్తున్నాడు ఆశీర్వాదం. అక్షరమాలలో మొదటి ‘అ’ అక్నాపురం అయితే, రెండో ‘ఆ’ ఆశీర్వాదం. ‘అ’‘ఆ’లకు మేళవింపు ఈశతకం’’ అని చమత్కారంగా ఆయన్ని ప్రశంసించారు. మరొక ముందుమాట రాసిన ప్రసిద్ధ పద్యకవి ఆశీర్వాదంగార్ని మనముందు నిలిపేలా అంచెనా వేస్తూ ‘‘ఆశీర్వాదం కుటుంబం సంగీత సాహిత్యాల సమారాధనల కలబోత. ఆశీర్వాదం సోదరులిద్దరూ స్వతహాగా గాయకులు. మంచి సాహిత్యపరిమళమున్న పాటలనెన్నుకొని కమ్మగా పాడటం వీళ్ళకు అలవాటు. వీధి భాగోతాలు, చిరుతల రామాయణాలు, భజనలూ వీళ్ళ ఇంట్లో, ఒంట్లో నిరంతరం ప్రవహించే సంయుక్త విద్యుత్తు’’ అని చెప్పారు. నేను ఆశీర్వాదం గారి గొంతులో ఈ రామాయణాన్ని విన్నప్పుడు ఈ కుటుంబనేపథ్యం నాకు తెలియదు. కానీ, దోరవేటి గారి మాటలు చదివిన తర్వాత వీళ్ళకు వంశపారంపర్యంగా వచ్చిన వరం పాడటం అని, దాన్నిలా అందరికీ పంచే పనిచేయడాన్ని మనం అభినందించకుండా ఉండలేమనిపించింది.
ఆశీర్వాదం గారు ఆశీర్వచనాలు (2019) పేరుతో వివిధ ఖండికలుగా మణిపూసలు కవిత్వాన్ని రాశారు. దీనికి ప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డిగారు ముందుమాట రాస్తూ రుబాయిల ప్రతిరూపమే మణిపూసలు’ అని ఆ రూపపరిణామాల్ని శాస్త్రీయంగా వివరించారు. పద్యం ముత్యాల సరాలుగా, ముత్యాల సరాలు రుబాయిగా, రుబాయి మణిపూసలుగా రూపాంతరం చెందుతూనే తనదైన ప్రత్యేకతల్ని నిలుపుకుంటూ ముందుకొస్తున్న తీరుని చక్కగా వివరించారు. కవి టి.ఆశీర్వాదం గారి మణిపూసల్లో జాతీయత, మానవీయతా, సాంస్కృతిక చైతన్యం ముప్పేటలా కనిపిస్తుందని ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డిగారు ఆశీర్వదించారు. ఆయన అన్నట్లే మణిపూసల రామాయణం రచనకూడా ఒక సాంస్కృతిక చైతన్యం. ఒక మానవీయకోణాన్ని మరోసారి గుర్తుచేసుకోవడమే అని అనుకుంటున్నాను. రామాయణంలో వివాదాస్పద అంశాల జోలికి పోకుండా, సమకాలీన సమాజానికి కావలసిన అంశాలేమిటో గుర్తిస్తూ, కేవలం కథను చెప్తున్నట్లే చెప్తూనే, రాముని ఆదర్శంలో కనిపించే కుటుంబ విలువల్నీ, సంఘర్షణల్నీ, వాటి నుండి బయటపడ్డానికి గుర్తించాల్సిన మార్గాల్ని, రాజనీతి విషయాల్ని చక్కగా వర్ణించారు. దీన్ని చదువుతుంటే రామాయణాన్ని అంతా చదువుతున్న అనుభూతిని కలిగిస్తూనే, మూలాన్ని చదివించే గుణమున్న రచనా విధానం పాఠకుల్ని, సాహితీవేత్తల్ని ఆలోచింపజేస్తుంది. కవి భావించినట్లే తెలుగు సాహిత్యంలో ఈ రామాయణానికి తగిన గుర్తింపు లభిస్తుందని నమ్ముతున్నాను. ఆశీర్వాదం గారు భవిష్యత్తులో మహాభారతాన్ని కూడా రాయాలని ఆకాంక్షిస్తూ, ఈ పుస్తకానికి నాలుగు మాటలు రాసే అవకాశాన్ని కలిగించినందుకు సంతోషాన్ని వ్యక్తంచేస్తూ, ఆయన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

తెలుగుశాఖ, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్,

( సెంట్రల్ యూనివర్సిటి)హైదరాబాద్.


No comments: