ఒక ఒంటరి నిశ్శబ్ద ప్రస్థానం
అతనెప్పుడూ అంతే –
ఒంటరి నిశ్శబ్దంలా అనిపిస్తాడు
తీరాజూస్తే మహా సమూహమై కనిపిస్తాడు
జాలరి వల విసిరినట్టు
జనం మీదికి పాత్రల్ని విసిరి
మన గుండెల్ని రంగస్థలం చేసి రవళిస్తాడు
నాటక నిర్మాణం తెలిసినవాడు
రంగస్థల రహస్యాల్ని ఎరిగినవాడు
నిద్రలోనూ… మెలకువలోనూ…
నాటకాన్నే జీవితంగా బ్రతికినవాడు
అందరూ పొద్దున్నే లోకాన్ని పలకరిస్తే
అతను మాత్రం
నిద్రలేచి నాటకాన్నే పలకరిస్తాడు
ఆయనే- భజరప్ప గారు.
నేను విన్న వార్త అబద్దం అని ఎవరైనా చెబితే బాగుండు. ఆయన ఎవ్వరికీ చెప్పకుండా ఏమంత తొందరొచ్చిందని ఇంత హడావుడిగా వెళ్ళిపోతారు? తన శిష్య బృందాన్ని ఇంతమందిని వదిలి ఆకస్మాత్తుగా అలా ఎలా వెళ్లాలనిపించింది? చాలా బాధగా ఉంది. చాలా శూన్యంగా వుంది. ఎందుకో పాడుదుఃఖం… గుండెలు దాటి బయటకు రాకుండా ఉంది. లోపలే వుండి మెలిపెడతా ఉంది.
నా తల్లిదండ్రులు జీవాన్ని, జీవితాన్ని ఇస్తే
భజరప్పగారు ఆ జీవితానికి అర్ధం, పరమార్ధం తెలిపిన వ్యక్తి. నన్ను తెలుగు నాటకరంగంలో రచయితగా నిలబెట్టిన మహనీయులు. ఎంతోమంది చేయి తిరిగిన రచయితల సరసన కూర్చోబెట్టిన మహానుభావుడు. నటులను తయారుచేయడమే కాదు. రైటర్స్ నీ తయారుచేయగలనని నిరూపించిన సాహసి భజరప్పగారు. ఒక్క స్ర్కిప్టు ని నాచేత ఎన్నిసార్లు రీ రైట్ చేయించేవారో…నాకు, ఆయనకే తెలుసు. ఎంతమంచి డైలాగ్ అయినా రన్ కి అడ్డొస్తుందని అనిపిస్తే నిర్దాక్షిణ్యంగా కత్తెర వేసేవారు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలిసేది. ఫైనల్ గా ప్రదర్శన అద్భుతంగా వచ్చినప్పుడు ఆ బాధనంత మర్చిపోయేవాడిని. రచయిత కి డైలాగుల మీద వ్యామోహం ఉండకూడదని చెప్పేవారు. నాటకం పట్ల అంతటి నిగ్రహం, సమగ్రహం ఆయనకు వుండేవి. అందుకే అంతగొప్ప దర్శకులు కాగలిగారు.
భజరప్పగారితో పరిచయం ఇప్పటిదా…!? కనీసం 27 సంవత్సరాల అనుబంధం. భజరప్పగారు దర్శకత్వం వహించింది ఒకటా… రెండా… కనీసం 24 నాటిక, నాటకాలు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్నవి ఎన్నో నాటకాలు… నాటికలు. నా రచనల్లో ఆయన చేతుల మీదుగా ముస్తాబై ప్రేక్షకులను అలరించిన ఆణిముత్యాలు ఎన్నో. జడ్జీలను మురిపించిన మెరుపు ముక్కలు ఎన్నెన్నో…
వాటిల్లో-
1) నిశ్శబ్దగాయం
2) టామి
3) శ్రమవద్గీత
4) అజమాయి’she’…
5) నిశి
6) శైథిల్యం
7) రెక్కల పుడమి
8) ఇంకుచుక్క
9) రేలపూలు నాటకాలు…
10) నీతిగీత దాటితే…!?
11) పాదు
12) గమ్యం
13) ముసురు
14) కొత్త చిగురు
15) వలయం
16) కాడి
17) మట్టివేళ్ళు
18) ట్రోఫీ
19) హననం
20) లైఫ్ లైన్
21) కాస్త సిగ్గుపడదాం
22) నిర్మాణం
23) మాతృక
24) కల్లందిబ్బ లాంటి నాటికలు ఎన్నెన్నో
రంగస్థలం మీద రవళించాయి.
నా నాటకాలకు దాదాపు 9 నంది అవార్డులు వచ్చాయంటే అది భజరప్పగారి నిరంతర కృషే కదా. పరుచూరి రఘుబాబు నాటకోత్సవాలలో దాదాపు 30 అవార్డులు వచ్చాయంటే ఆ పుణ్యమూర్తి కఠోర నడవడికే కదా. ఏ రాజకీయాలకూ చలించకుండా దాదాపు 300 అవార్డులను నా నాటకాలు ఇతర పరిషత్తులలో కొల్లగొట్టాయంటే ఆ దయామూర్తి భిక్షే కదా.
నాటకాన్ని లాలించి ప్రేమించిన మనిషి…
నాటకాన్ని నడిపించి పరుగులు పెట్టించిన
మనిషి… శ్రీ భజరప్పగారు.
ఎంతోమంది నటులను తీర్చిదిద్దినవారు…
ఎంతోమంది నటులకు జీవితాన్ని ఇచ్చిన
వారు శ్రీ భజరప్పగారు. ఆయన ఆత్మమొత్తం నాటకమే అయినప్పుడు అవార్డులైనా… రివార్డులైనా…నాటకానికి కాక మరి దేనికొస్తాయి?
ఆయన నాటకాల్లో
జీవం ఉంటుంది… జీవితం ఉంటుంది.
కష్టం ఉంటుంది… కన్నీళ్ళు ఉంటాయి.
సమస్య ఉంటుంది.పరిష్కారం వుంటుంది.
అందుకనే ఆయన
నాటకంతో ఉద్యమించారు…
నాటకంతో పోరాడారు…
నాటకంతో యుద్ధం చేశారు… చివరకు
నాటకంతో అందరి హృదయాల్ని గెల్చుకున్నారు.
సమస్త జీవన సంవేదనల్ని తన నాటకంలో
లీనం చేసుకుంటూ అలా ముందుకు సాగి
పోయిన అద్భుత మూర్తి శ్రీ భజరప్ప గారు.
అన్ని ఋతువుల్ని చంకలో పెట్టుకుని,
ఎప్పుడూ వెలుగుతూ వుండే దివ్వెలాంటి
నాటక ప్రతిని చేతిలో పెట్టుకుని అలుపెరు
గక నిరంతరం సంచరించే వ్యక్తి ఆకస్మాత్తుగా ఇలా నిష్క్రమించడమా!?… ఎంత అన్యాయం!?
బహుశా ముందుగా వెళ్లిన తన మిత్రులందరూ ‘ఒరేయ్ బజ్జూ! తొందరగా వచ్చేయ్. ఇక్కడ బోర్ కొట్టి ఛస్తున్నాం. నువ్వొస్తే రన్ స్టార్ట్ చేద్దాం’ అని చెప్పుంటారు. అందుకనే అంత హడావుడిగా వెళ్ళుంటారు. భజరప్పసార్! మాకింత అన్యాయం చేస్తారనుకోలేదు. సారీ… మిమ్మల్ని క్షమించలేం…
(ఆకస్మాత్తుగా మనల్ని అందరినీ విడిచి వెళ్లిన శ్రీ భజరప్ప గారికి రంగస్థల నివాళులు అర్పిస్తూ రావినూతల ప్రేమకిషోర్ రాసిన వ్యాసం ‘జానుడి’ సౌజన్యంతో)…)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి