"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

10 అక్టోబర్, 2019

రావినూతల ప్రేమకిషోర్ జీవితం-పరిచయం

 రావినూతల ప్రేమకిషోర్ తల్లిదండ్రులు - విద్యాభ్యాసం: 

ప్రముఖకవి, చిత్రకారుడు, కథారచయిత, నాటక రచయిత కీ.శే. రావినూతల ప్రేమకిషోర్ ప్రకాశం జిల్లా, కొండపిలో శ్రీమతి మరియమ్మ, శ్రీ అంకయ్యలకు 1 ఆగస్టు 1965 (1.8.1965) వ తేదీన  జన్మించారు. ఏడవ తరగతివరకు  కొండపిలోను, పదవతరగతి వరకు కందుకూరులోను తన  ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఉలవపాడులో ఇంటర్మీడియెట్, ఒంగోలులో బి.ఏ. చదువు చదువుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. (చరిత్ర) పట్టాను పొందారు. ఈయన భార్య పేరు శ్రీమతి అపరంజి. ఈయనకు ఇద్దరు పిల్లలు ప్రేమ్ సాత్విక, ప్రేమ్ సదృశ్య. 

రావినూతల ప్రేమకిషోర్ ( జననం:1 ఆగస్టు 1965 , మరణం: 07 అక్టోబర్ 2019)

 

  వృత్తి-ప్రవృత్తి:

ఈయన హైదరాబాదు, విశాఖపట్టణం, నెల్లూరు ప్రాంతాలలో చిరకాలం పాటు విద్యాశాఖలో ఉన్నతాధికారిగా పనిచేశారు. ప్రవృత్తిగా కవిత్వం, నాటకాలు రాసేవారు. ఈయన రాసిన నాటకాలు సామాజిక స్పృహకలిగి, సమాజానికి గొప్ప సందేశాన్నిస్తాయి. 

నాటకాలు:

ఎయిడ్స్ బాధితుల కష్టాలను చూసి ‘నిశ్శబ్దగాయం’ సాంఘిక నాటకం రాశారు.  వీధి బాలల జీవితాలను చిత్రిస్తూ ‘టామి’ అనేనాటకాన్ని రాశారు. శ్రమైక జీవన సౌందర్యాన్ని తెలియజేస్తూ ‘శ్రమవద్గీత’ నాటకం,  రైతు సమస్యలను చిత్రిస్తూ ‘కళ్ళం దిబ్బ’, రెక్కల పుడమి నాటకాలు,  ,పోలీసులకు, నక్సలైట్లకు మధ్య నలిగిపోతున్న జనజీవన సంఘర్షణను ‘నిశి’ పేరుతోను, గమ్యలేని యువకులు తమ జీవితాల్ని ఎలా  నాశనం చేసుకుంటున్నారో ‘శైధిల్యం’ పేరుతోను, ఓటు ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ‘ఇంకుచుక్క’ అనే పేర్లతో  నాటకాలుగా రాశారు. ఈ నాటకాలన్నీ సమకాలీన సమాజ సమస్యల్ని ప్రతిఫలిస్తూ, వాటి పరిష్కారాల్ని సూచించేవే. 

నాటికలు:

వీటితో పాటు దళిత మహిళ అగ్రవర్ణ మహిళల మధ్య కొనసాగే సంబంధాలెలా ఉంటాయో ‘వర్ణచిత్రం’, సాంఘికసంక్షేమ శాఖలో జరుగుతున్న అన్యాయాల్ని ‘నీతి గీతదాటితే...’’, పాఠశాలలకు వెళ్ళకుండా జీవితాల్ని నాశనం చేసుకుంటున్న బాల్యాన్ని ‘పాడు’ , ముసురు, పేర్లతోను, యువత జీవితాల్ని చిత్రిస్తూ ‘గమ్యం’, రైతుజీవితాల్ని చిత్రిస్తూ ‘కాడి’, ప్రత్యేక ఆర్థిక మండలి పేరుతో  భూమి కొంతమందికి కట్టబెడుతున్నారంటూ ‘మట్టివేళ్ళు’, స్త్రీల పై జరుగుతున్న హింసను వివరిస్తూ ‘ట్రోఫీ’, యువతులు, స్త్రీలపై జరుగుతున్న యాసిడ్ దాడుల్ని నిరసిస్తూ ‘హననం’, ‘కాస్త సిగ్గుపడదాం’,  తెలంగాణా ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం సందర్భంగా జరిగిన ఆత్మహత్యల నేపథ్యాన్ని వివరిస్తూ ‘అనలం’, సాఫ్ట్ వేర్ జీవితాల్లో వచ్చిన మార్పువల్ల, తొలి దశలో వాళ్ళ జీవితాల్లోని వివిధ కోణాల్ని విరిస్తూ ‘లైఫ్ లైన్’ మొదలైనా నాటికలు రాశారు. వీటితో పాటు నైతిక విలువల్ని పెంపొందించడమెలాగో వివరిస్తూ ‘నిర్మాణం’ అనే పేరుతో ఒక చక్కని నాటికను ప్రదర్శించారు. 

 కవిత్వం: 

నలుగురుమవుదాం‘ పేరుతో 2011లో  ఒక వచన కవితాసంపుటినీ, ‘ప్రతీక పేరుతో మరొక కవితా సంపుటిని ప్రచురించారు. దీనికి నేను (డా.దార్ల వెంకటేశ్వరరావు) రాసిన ముందుమాట ఆయనకు ఎంతో మంచి పేరు తెచ్చిందని ఆయన పదేపదే చెప్తుండేవారు. హైకూలకు కూడా ముందుమాట రాయమని స్క్రిప్టుని పంపించారు.   ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో సామాజిక న్యాయాన్ని ఆశిస్తూ ‘ గుండెదరువు’  పేరుతో 2005లో ఒక  వచన దీర్ఘ కావ్యాన్ని ప్రచురించారు.  వీటితో పాటు హైకూలపేరుతో  మినీ కవిత్వాన్ని విస్తృతంగా రాశారు. ఈయన కవిత్వం హృదయాన్ని తాకుతుంది. మృదువుగా తాకుతూ, సంఘర్షణ రేపుతుంది. మానవత్వాన్నిమేల్కొలుపుతుంది. రచనాశైలి మృధుమధురంగా సాగుతుంది.  ఆయన రాసిన కొన్ని ‘హైకూలు’ చూద్దాం.

అమ్మ కళ్ళకేసి చూసా
బొట్ల బోట్లగా
సముద్రం

తల్లి ఒడిలో
చంద్రబింబం
పసిపాప పరిమళం

నిద్రలో
పిల్లాడి కలవరింత
నా పక్కలో వాళ్ళమ్మ లేదు

నాకు ఇష్టమైన
మా అమ్మ ఫోటో ...
మా వాడికి నచ్చలేదు

అమ్మ
కంటినీటి ప్రవాహంలో
నేనో పడవనౌతున్నా

ఆశ  గొప్పది
జీవితాన్ని
చిగురింప జేస్తుంది

నా డైరీకి ప్రే మెక్కువ
నన్ను భద్రంగా
గుండెల్ని దాచుకుంటుంది

చున్నీ కప్పాల్సింది   గుండెల్ని కదా!
ముఖానికి  చుట్టుకుని ....
ఇదేంటి వికృత పరువం !?

ఈ రోజుని
అందంగా పూయించడం
కొత్తగా చూపించడం నీ బాధ్యతే

 వర్షపు చినుకు
ఆకుని తాకింది
ముక్క పులకించింది

ఆకులు
రాత్రిని తింటున్నాయి
చెట్టు కాపలా కాస్తోంది

ముసలి చెట్టు
ఆకుల్ని రాలుస్తోంది
ఎండాకాలాన్ని తిట్టుకుంటూ

కథలు

ప్రేమకిషోర్ కవిత్వం మాత్రమే కాదు, కథలు కూడా రాశారు. ఈయన రాసిన‘వర్ణచిత్రం’ అనే దళిత కథ బహుజన కెరటాలు మాసపత్రికలో ప్రచురితమైంది. 

నవల: 

నావలోని నేను పేరుతో ఒక నవలను కూడా రాశారు. 

బహుమతులు

ఈయన రాసిన నాటకాలు అనేకం ప్రదర్శితమయ్యాయి. అనేక నాటకాలు, నాటికలకు బహుమతులు వచ్చాయి. ఆయన మంచి స్క్రిప్టు రైటర్. ఆయన నాటకాలను హైదరాబాద్ లో ప్రదర్శించినప్పుడు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించేవారు. అలా నేను ఒకటి రెండు నాటకాలను ప్రత్యక్షంగా చూశాను. ఆ నాటకాలు ఆధ్యంతం ఆసక్తిగా కొనసాగడమేకాకుండా, ఆలోచింపజేసేవి. నాటకాలు, నాటికలు ప్రదర్శించిన తర్వాత రావినూతల ప్రేమకిషోర్ చుట్టూ జనం మూగి, ఆటో గ్రాఫ్ , ఫోటోలు తీసుకోవడం, నాటకప్రదర్శన అయిన తర్వాత ప్రేక్షకులంతా ధియేటర్ లోనిలబడి గౌవరంగా తప్పట్లతో ప్రశంసించడం నేను చూశాను. కేవలం రాయడమేకాదు, అనేక పాత్రల్లో ఆయన నటించి, ఉత్తమ నటుడుగా బహుమతులు పొందారు. 

నిశ్శబ్దగాయం’ నాటకానికి నంది నాటకోత్సవాల్లో  ఉత్తమ బాల నటుడు బహుమతి (2002)లో వచ్చింది. 2003లో జరిగిన పరుచూరి రఘుబాబు సృత్యర్థం జరిగిన నాటకోత్సవాల్లో ప్రేమకిషోర్ ఈ నాటకానికే ( నిశ్శబ్దగాయం) కే అనేక బహుమతులు వచ్చాయి. ఉత్తమ నిర్మాత, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ స్క్రిప్టు రైటర్, ఉత్తమ బాల నటుడు, ఉత్తమ స్త్రీ నటన లతో పాటు జ్యూరీ ప్రత్యేక బహుమతిని కూడా అందుకున్నారు. కాకినాడలో  2003లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ నాటకంలో నటించిన వారికి ఉత్తమ ప్రతినాయకుడు పాత్రకు బహుమతి వచ్చింది. 

ఇలా సమకాలీన సమస్యల్ని తన రచనల్లో ప్రతిఫలించిన రావినూతల ప్రేమకిషోర్ ఆనారోగ్యంతో 07 అక్టోబర్ 2019 ( 7.10.2019)లో మరణించారు. 





కామెంట్‌లు లేవు: