"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

12 అక్టోబర్, 2019

శ్రీ అనంత పద్మనాభ కళాశాలతో నా అనుబంధం


శ్రీ అనంత పద్మనాభ కళాశాలతో నా అనుబంధం 
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
 ప్రొఫెసర్ తెలుగుశాఖ & డిప్యూటి డీన్,
 స్టూడెంట్స్ వెల్ఫేర్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్,
 హైదరాబాద్. ఫోను: 9182685231

శ్రీ అనంతపద్మనాభ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కళాశాల (ఎస్.ఏ.పి) పేరు చెప్పగానే అనంతమైన అనుభవాలు, ఆనందాలు, అనుభూతులు వెల్లువలా గుర్తుకొస్తాయి. అక్కడే నా తొలి పర్మినెంటు ఉద్యోగం. అక్కడే నా డాక్టరేట్ పూర్తిచేయ గలగటం. అక్కడుండగానే నా వివాహం జరగటం. అదీ ఆ కాలేజీలో ఉద్యోగం చేస్తున్న లెక్చరర్ నే! అన్నింటికీ మించి ఆ ఉద్యోగానికి ఎంపిక చేయడంలో యాజమాన్యం ప్రదర్శించిన నిజాయితీ! అక్కడ నేను మూడు సంవత్సరాలు తెలుగు లెక్చరర్ గా పనిచేశాను. కానీ, వికారాబాదుతో ఎన్నో సంవత్సారాల అనుభవాన్ని పెనవేసుకొన్నాను.  ఆ వాతావరణం అంతబాగుంటుంది. ఆ కాలేజీ ప్రక్కనే అనంతగిరి. ఆ అరణ్యంలోనే శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం, ఆ ప్రక్కనే మూసీనది పుట్టిన స్థలం, లేళ్ళు, నెమళ్ళు, రకరకాల పక్షుల కిలకిలారావాలు... ఆ ప్రక్కనే బండబాయి ఆంజనేయస్వామి దేవాలయం... అలా ఎటుచూసినా పరవళ్ళు త్రొక్కే పచ్చని ప్రకృతి, ఆ ప్రకృతిలోనే ప్రతిరోజూ ఉదయమే వ్యాయామం....ఇవన్నీ నాకెప్పటికీ మరిచిపోలేని ఆనందానుభూతులు.
అంతచక్కని వాతావరణాన్ని నాకు పరిచయం చేసింది – శ్రీ అనంతపద్మనాభ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కళాశాల. ఆ కళాశాల గురించి నాకు పత్రికలో ఉద్యోగ ప్రకటన ద్వారా తెలిసింది. నాకు చిన్నప్పటి నుండీ పత్రికలు చదవడం అలవాటు. అందులో లేఖలు,  ఉద్యోగ ప్రకటనలు చదవడం మరీ అలవాటు. అలా ఒక రోజు  శ్రీ అనంతపద్మనాభ కళాశాల, వికారాబాదులో ఒక తెలుగు లెక్చరర్ పోస్టు ఉన్నట్టు కనపడిందొక ప్రకటన. అది పర్మినెంటా? టెంపరరీయా? ఇవేమీ ఆలోచించలేదు. దానికి వెంటనే దరఖాస్తు చేశాను. ఇంటర్వ్యూ వచ్చింది. అప్పటికే నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఫిల్.. పూర్తి చేసి, జె.ఆర్.ఎఫ్., నెట్, స్లెట్ వంటివన్నీ సాధించి ఉన్నాను. డాక్టరేట్ చేస్తున్నాను. ఇంటర్వ్యూ సికిందరాబాద్, తార్నాకాలో గల ఒక ఇంటి ఆవరణలో జరిగింది. అది కళాశాల కరస్పాడెంట్ శ్రీ మర్రి రవీంద్రరెడ్డిగారి గృహసముదాయం. ఆరోజు జరిగిన ఇంటర్వ్యూలో విషయ నిపుణుడిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగుశాఖలో పనిచేస్తున్న ఆచార్య రుక్నుద్దీన్ గారు వచ్చారు. ఆయనతో పాటు ఎస్.ఏ.పి.కళాశాల కరస్పాండెంట్ శ్రీ మర్రి రవీంద్రరెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీ యాదగిరిరెడ్డిలతో పాటు ఆర్. జె.డి వరంగల్లు మొదలైనవాళ్ళు కమిటీలో ఉన్నట్లు గుర్తు. నా ఇంటర్వ్యూ బాగా జరిగింది. ఇంచుమించు ఆ ఇంటర్య్యూలో గల సభ్యులంతా  మెచ్చుకున్నట్లనిపించింది. సంతోషంగా బయటకొచ్చాను. ఒక నెల తర్వాత నన్ను ఎంపిక చేస్తున్నట్లు అపాయింట్ మెంటు లెటర్ పంపారు.
 అది ఎయిడెడ్ కళాశాల అనీ, అది పర్మినెంటు పోస్టు అనీ నాకు అప్పుడే తెలిసింది. ఆ ఉద్యోగానికి చాలామంది ప్రయత్నించారనీ, పలుకుబడిగల రాజకీయవేత్తలతో చెప్పించే ప్రయత్నం చేశారనీ, డబ్బు కూడా ఇవ్వడానికి ప్రయత్నించారనీ, వాళ్ళకంటే తానెక్కువగా ప్రయత్నించడం వల్ల, వాళ్ళకంటే ఎక్కువ లంచమిచ్చానని కొంతమంది ప్రచారం చేశారట. అది తెలిసి నేనాశ్చర్యపోయాను. కనీసం ఆ కాలేజీ గురించి గానీ, ఆ యాజమాన్యం గురించి గానీ, నిజానికి ఆ ఉద్యోగం పర్మినెంటని గానీ నాకు తెలియదు. నిజాయితీగా  నాకా ఉద్యోగం వచ్చిందనాలో, నిజాయితీగా ఆ ఉద్యోగాన్ని నాకిచ్చారనాలో నాకు మాత్రమే తెలుసు.  నా ఆత్మ సాక్షికి మాత్రమే తెలుసు. అందుకే ఆ కాలేజీ అన్నా, ఆ యాజమాన్యమన్నా నాకిప్పటికీ ఎంతో గౌరవం. 
అపాయింట్ మెంట్ ఆర్డర్ తో పాటు   స్వీటు ప్యాకెట్ పట్టుకొని కళాశాలకు వెళ్ళాను. అక్కడ తెలుగు శాఖలో ఒకామె కూర్చొని ఉన్నారు. ఆమె ఎవరో నాకు తెలియదు. ‘‘నాకు ఈ కాలేజ్ లో ఉద్యోగం వచ్చిందండీ. చేరడానికి వచ్చాను. స్వీటు తీసుకోండి’’ అని స్వీటు ఇచ్చి, ఆఫీసు ఎక్కడో ఆమెనడిగి తెలుసుకొని వెళ్ళి, ఉద్యోగంలో చేరాను. ఆ రోజు నా తొలి స్వీటు తీసుకున్నదెవరో కాదు-మంజుశ్రీ!  అప్పటికే ఆమె ఆ కాలేజీలో పార్ట్ టైమ్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. గవర్నమెంటు జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా ఎంపికై, అపాయింట్ మెంటుకోసం ఎదురు చూస్తున్నారు. నేను కూడా శ్రీ అనంతపద్మనాభ కళాశాలకు వచ్చేటప్పటికే, ఆమె లాగే గవర్నమెంటు జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా ఆంధ్రప్రదేశ్ కాలేజీ సర్వీస్ కమీషన్ వారి పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికై, అపాయింట్ మెంటుకోసం ఎదురుచూస్తున్నాను. ఆ అపాయింట్ మెంటు ఆర్డర్ వచ్చిన తర్వాత ఆమె గవర్నమెంటు కళాశాలకు వెళ్ళిపోయినా, నేను అక్కడే ఉండిపోయాను. నాకు మా జిల్లా – తూర్పుగోదావరిలో జె.ఎల్.గా పోస్టింగ్ వచ్చినా, నేను వెళ్ళలేదు.
 ఆ తర్వాత కాలంలో - డా.డి.నారాయణరావు, డా.కనకరత్నం, శ్రీ. ప్రభాకర్, శ్రీ. చెన్నయ్య తదితరుల ప్రోత్సాహంతో మంజుశ్రీతో నాకు వివాహమైంది. ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి. కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామి వారు అప్పు చేసి తన వివాహం చేసుకున్నారని చెప్తుంటారు. అది నిజమో కాదో గానీ, నా పెళ్ళి మాత్రం అప్పు చేసి చేసుకున్నాను.  ఉద్యోగంలో చేరిన వెంటనే పెళ్ళి చేసుకోవాలనుకున్నాను. అప్పటికి నాకు వచ్చే రీసెర్చ్ ఫెలోషిప్  ప్రతి పైసా జాగ్రత్త గా పొదుపు చేసి మా చెల్లికి కట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేశాను.  అటు మా ఊరిలోనూ, ఇటు వికారాబాదులోనూ రెండుచోట్లా భోజనాలు పెట్టాలి. వెళ్ళడానికి, రావడానికి, పెళ్ళికి చాలా ఖర్చు అవుతుంది. మాకు మేముగా చేసుకోవాలనుకున్న పెళ్ళికావడంతో రెండు వైపుల నుండీ ఒక్కపైసా మాకు అందేపరిస్థితి లేదు.  ఆ పరిస్థితుల్లో ఆ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ విద్యార్థులు, అధ్యాపకులు ఎంతగానో ఇష్టపడే డా.వీరయ్యగారు ఉండేవారు. మంజుశ్రీ ఆయనకు స్టూడెంటుగా, పార్ట్ టైమ్ లెక్చరర్ గా ముందే తెలుసు. మేమిద్దరం పెండ్లి చేసుకుంటున్నామని తెలిసి, ఆయన  తన పేరుతో బ్యాంకులో లోను పెట్టి మరీ అప్పు ఇప్పించారు. నెల నెలా మేము వాయిదా సొమ్ము కట్టి, రశీదు ఇచ్చేవాళ్ళం. అప్పుతీరిపోయింది. తర్వాత వికారాబాదులో స్థలం కూడా కొనుక్కున్నాం. శ్రీవేంకటేశ్వరుడు తన అప్పు తీర్చడానికి నేటికీ వడ్డీ చెల్లిస్తూ ‘వడ్డికాసులవాడు’ అయ్యాడేమో గానీ, డా.వీరయ్యగారి దయవల్ల మేము త్వరగానే ఆ అప్పుతీర్చుకున్నాం. ఆయన సహాయాన్నిమేమెప్పటికీ మర్చిపోలేం. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు చెప్పుకోవడం కనీస ధర్మమనుకుంటున్నాను.
ఆ కాలేజీలో చేరిన తర్వాత ఒకవైపు క్లాసులకు ప్రిపేర్ అయి చెప్పాలి. మరొక వైపు నా డాక్టరేట్ పూర్తి చేసుకోవాలి. ఆ కాలేజీలో మంచి గ్రంథాలయం ఉంది. లైబ్రేరియన్ శ్రీ సత్తిరెడ్డిగారు నా ఆసక్తిని గమనించి లైబ్రరీని వాడుకోవడానికి ఎంతో స్వేచ్ఛనిచ్చేవారు. అప్పటికే మా యూనివర్సిటీలో మా సీనియర్ గా ఉన్న డి.నారాయణరావు ఆ కాలేజీలో అప్పటికే తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నారు. తనని ‘అన్నా’ అనిపిలిచేవాణ్ణి. తను నన్ను ఎంతగానో ప్రోత్సహించేవాడు. నాకేవైనా పరిశోధనకు సంబంధించిగానీ, పాఠాలకు సంబంధించి గానీ అర్థం కానివాటిని నాకు చెప్పేవాడు. నన్ను ఆ కాలేజీలో లెక్చరర్ గా విద్యార్థులకు పరిచయం చేసింది కూడా ఆయనే.  నేను చేరినప్పుడే  తన డాక్టరేట్ ని కూడా పూర్తి చేశాడు. ఆ ఊపులోనే నన్ను కూడా త్వరగా పూర్తి చేయమని, నా థీసిస్ ప్రూఫ్ రీడింగ్ లో కూడా ఎంతగానో సహకరించాడు. అప్పుడు కంప్యూటర్ లో తెలుగు చాలా కష్టంగా ఉండేది. ఆ కాలేజీలోనే పనిచేస్తున్న కుమార్ గారి సతీమణి నాకు డిటిపి చేసిపెట్టారు. ఆ విధంగా నా డాక్టరేట్ ని ఆ కళాశాలలోనే పూర్తిచేసి, యూనివర్సిటీకీ సబ్‌మిట్ చేయడానికి వెళ్తుంటే, యాక్సిడెంట్ అయ్యింది కూడా మర్చిపోలేను. కానీ, ఆ సంఘటన నా జీవితానికి క్రొత్త పాఠాన్ని నేర్పింది. ఒక ఉద్యోగి నాతో పాటు వస్తానని నా బైక్ పై కూర్చొని, అతను చేసిన పొరపాటు వల్ల నాకు యాక్సిడెంట్ అయ్యింది. నేను స్పృహ తప్పి పడిపోతే, నా బైక్ పై వచ్చిన ఆ ఉద్యోగి నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. నాకు తెలియని ఎవరో నన్ను ఆటోలో తీసుకెళ్ళి, శంకరపల్లిలో డా.రామచంద్రగారి ఆసుపత్రిలో చేర్చారు. నన్ను ఆసుపత్రిలో చూసిన మా యూనివర్సిటి లైబ్రరీ ఉద్యోగి సత్యనారాయణగారు ఒక్క పైసా కూడా నా నుండి తీసుకోనివ్వకుండా నా కవిత్వం, రచనలు గురించి ఆ డాక్టర్ కి చెప్పి వైద్యం చేయించి, వికారాబాదు మా ఇంటికి జాగ్రత్తగా చేర్చాడు. నన్ను ఆటోలో తీసుకెళ్ళిందెవరో నాకిప్పటికీ తెలియదు. కానీ, ఎస్.ఏ.పి.కాలేజీ లెక్చరర్ అని తెలిసి నన్ను అక్కడ చేర్చారని మాత్రం ఆసుపత్రిలో ఎవరో నాకు చెప్పారు. అలా, ఆ కాలేజీకున్న పేరు ప్రఖ్యాతులే నన్ను కాపాడాయి. ఎవరెప్పుడు సహాయం చేస్తారో, ఎలా ప్రవర్తిస్తారో తెలియదని, అయినా మనం చేసిన మంచి పనులే మనల్ని కాపాడుతుంటాయన్నట్లుగా ఆ సంఘటన నా జీవితానికో పాఠాన్ని నేర్పింది.

ఆ కాలేజీలో నేను పనిచేసిన ప్రతి సంవత్సరం మ్యాగజైన్ ‘అనంతజ్యోతి’ పేరుతో ప్రచురించేవారు. అప్పటికే నాకంటే ఆ శాఖలో సీనియర్స్ డా.పగడాల లక్ష్మీనారాయణగారు, డా. ఎం. దేవకీదేవిగారు, డా.డి.నారాయణరావుగారు ఉన్నా, వాళ్ళంతా నేను చేరిన తర్వాత నన్ను తెలుగు రచనలను చూడమని ప్రోత్సహించేవారు. అలా నేనున్న మూడేళ్ళూ కళాశాల విద్యార్థినీ, విద్యార్థుల రచనలను ఎంపికచేసి ప్రచురించడం కూడా మరిచిపోలేని ఒక అనుభూతి. ఆ సంచికల్లో రచనలు ప్రచురించిన వాళ్ళు నేడు మంచి కవులుగా గుర్తింపు పొందడం నాకెంతగానో ఆనందమనిపిస్తుంది.  ఆ కళాశాలలో ప్రతి యేడాదీ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలో తెలుగు శాఖ అధ్యాపకులు ఎంతో అంకితభావంతో పనిచేసేవారు. ఆ రోజుల్లోనే మా బృందమంతా ( డా.డి.నారాయణరావు అధ్యక్షులుగా, మంజుశ్రీ ఉపాధ్యక్షులుగా, ప్రభాకరరావు సంయుక్తకార్యదర్శిగా, చెన్నయ్య కోశాధికారిగా, నేను ప్రధాన కార్యదర్శిగా) తెలుగు సాహిత్య వేదికను ఏర్పాటు చేసి, కొన్ని సాహిత్య కార్యక్రమాల్ని కూడా నిర్వహించేవాళ్ళం.
ఆ కాలేజీ తరపున వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన సాహితీ వేత్తల్ని పిలిచి ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించడం ఆ కాలేజీ యాజమాన్యం చేసే ఒక మంచి పని. నేనున్న ఒక యేడాది ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య సుమతీ నరేంద్రగార్ని పిలిచి ఉపన్యాసం పెట్టించాం. నేను వారిని ఆహ్వానించి, పరిచయం చేశాను. నా గొంతు విని, ప్రిన్సిపాల్ యాదగిరి రెడ్డి గారు ‘‘ఎందుకయ్యా అంతగొంతు...కాస్త నెమ్మదిగా చెప్పొచ్చుగా’’ అన్న మాటలు నేటికీ నాకు గుర్తే. అక్కడ సుమారు క్లాసులో నూట ఇరవై మంది వరకూ విద్యార్థులుండేవారు. వాళ్లందరికీ వినపడాలంటే గట్టిగా చెప్పాల్సి వచ్చేది. అందువల్ల అలా పెద్దగొంతుతో చెప్పడమే నేటికీ అలవాటైపోయింది.
ఆకాలేజీలో విద్యార్థినీ విద్యార్థులకు అధ్యాపకులు పాఠం చెప్తుంటే ప్రిన్సిపాల్ యాదగిరి రెడ్డి గారు గోడపక్కనుండి వినేవారు. క్లాసుల సమయంలో విద్యార్థులుగానీ, అధ్యాపకులు గానీ ఎవరూ బయట కనపడకుండా ఆయన క్యాంపస్ లో తిరుగుతుండేవారు. ఒక ప్రిన్సిపాల్ ఎలా ఉండాలో యాదగిరిరెడ్డిగారిని చూస్తే తెలుస్తుందనిపించేది. స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే, కళాశాల వార్షికోత్సవం మొదలైన అనేక కార్యక్రమాల్లో నన్ను ఆయన భాగస్వామ్యం చేసేవారు. అప్పుడప్పుడూ పాఠం చెప్పేటప్పుడు క్రమశిక్షణ గురించి పాఠంలో భాగంగా చెప్పమనేవారు.  అన్ని జాగ్రత్తలు తీసుకునే కళాశాలలో పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉంది. ఒక క్రమశిక్షణను అలవర్చుకోవడానికి కూడాఆ కళాశాల నాకెంతగానో సహకరించింది. తెలుగు క్లాసులు చివరి పిరియడ్ లో ఉన్నా, వాళ్ళు క్లాసులో ఉండడానికి మేమెంతగానో తపనపడేవాళ్ళం. రోజురోజుకీ కొత్తగా పాఠం చెప్పి వాళ్ళని ఆకట్టుకోవాల్సి వచ్చేది. చివరి అవర్ లో, తెలుగు క్లాసులో కూడా స్టూడెంట్స్ ఉంటున్నారా? అని కొంతమంది ఆశ్చర్యంగా అడగడం నాకు కొత్తలో మరింత ఆశ్చర్యమనిపించేది.
ప్రతిరోజు సాయంత్రం ట్రైన్ టైమ్ వరకూ కొంతమంది మాతో కలిసి కేరమ్స్, క్రికెట్ వంటివి ఆడేవారు. ఆ కాలేజీకి విశాలమైన ఆటస్థలం ఉండేది. వార్షిక సంవత్సర వేడుకల్లో భాగంగా విద్యార్థులకే కాకుండా అధ్యాపకులకు కూడా క్రీడల్లో కూడా పోటీలు పెట్టేవారు. ఒక సంవత్సరం అధ్యాపకులు ఒక జట్టుగా క్రికెట్టు ఆడాం. ఆ యేడాది నేను కూడా టీమ్ లో ఉన్నాను. ఆ టీమ్ లో ఆడిన తర్వాత నేను వారంరోజులు ఒళ్ళునొప్పులతో బాధపడ్డాను. అలవాటులేని ఆటల్లోని మజాను ఆ విధంగా రుచిచూసిన కమ్మదనం నేడు గుర్తు చేసుకుంటే ఎంత బాగుందనిపిస్తుంది. ఆ టీములోనే ఒక విచిత్రం జరిగింది. ఒక సీనియర్ అధ్యాపకుడు కూడా ఆ క్రికెట్ టీమ్ లో పాల్గొన్నారు. ఆరోజు  క్రికెట్ ఆడాలని తెలిసి పాత ఫ్యాంటు వేసుకొచ్చారు. అది బాగా చివికిపోయింది.  బాల్ తేవడానికి ఆయన పరుగుపెడుతుంటే ఆ ఫ్యాంటు నిలువునా చిరిగిపోయింది. నిర్ఘాంతపోయారాయన. (అదృష్టమేమిటంటే, ఆయన లోతొడుగువేసుకున్నారు!) కానీ, ఒక్కసారిగా అధ్యాపకులు, స్టూడెంట్స్ ఆయన్ని చుట్టుముట్టారు.  ఆయన అవమానపడకుండా ఆయన్ని కాపాడిన దృశ్యం నేటికీ నా కళ్ళముందు మెదులుతుంది. ఎక్కడైనా పెద్దవాళ్ల జట్టుగా కూడి క్రికెట్ ఆడుతున్నా, నాకు మాత్రం ఆ దృశ్యమే కనపడి నాలో నేను నేటికీ నవ్వుకుంటుంటాను.
 కాలేజీలో చేరిన తొలిరోజుల్లో నేను, ప్రభాకర్, చెన్నయ్య, కనకరత్నం  మేమంతా కలిసి కళాశాల ప్రక్కనే ఉండే రామయ్యగూడలో అద్దెకుండే వాళ్ళం. అప్పటికే పెళ్ళైన వాళ్ళు, పెళ్ళికాని వాళ్ళు – అంతా ‘బ్యాచిలర్స్’ గానే నచ్చిన వంటల్ని పచ్చిపచ్చిగాను, కమ్మగాను వండుకుతిన్న రుచులు నేటికీ నోరూరిస్తుంటాయి. ప్రతిరోజూ విందుగానే కొనసాగేది. నా పైళ్ళైన తర్వాత శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం దగ్గర్లో అంటే ఎం.ఐ.జిలో నాగేందర్ గౌడ్ ఇంట్లోకి అద్దెకొచ్చేశాం. మమ్మల్ని వాళ్ళు కుటుంబసభ్యుల్లా చూసేవారు. డా.నారాయణరావు బి.టి.యస్ కాలనీలో ఉంటే,  ప్రభాకర్ తన కుటుంబంతో గంగారంలో కాపురం పెట్టాడు. చెన్నయ్య ఎన్ .టి.ఆర్ స్టాట్యూ దగ్గర్లో ఇల్లు తీసుకున్నాడు. డా.కనకరత్నం రామయ్యగూడలో ఉండగానే ద్రావిడ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా వెళ్ళిపోయాడు. ఎక్కడున్నా గాని మేమంతా కలిసే ఉన్నట్లుండేవాళ్ళం. డా.నారాయణరావుగారింట్లో వండిన రొయ్యలు, మంచి చేపల రుచులు నేటికీ మర్చిపోలేను. ఇక,  తాజా కాయకూరలంటే మాత్రం- నేటికీ నాకు వికారాబాదే గుర్తొస్తుంది. ఆ పరిసరాల్లో అడవులు విరివిగా ఉండడం వల్ల శీతాఫలాలు చాలా తక్కువరేటుకి, పెద్దపెద్ద పండ్లు దొరికేవి. అన్ని బాగున్నా, ఆ రోడ్లు మాత్రం మేము వేసుకున్న బట్టల్ని ఎఱ్ఱరంగుగా మార్చడంలో మాతో పోటీపడి, ఎప్పుడూ అవే విజయం సాధించేవి. శివసాగర్ చెఱువులో నీళ్ళు అయిపోకుండా డా.నరసింగరావు, మహేశ్వర్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులతో పాటు మా అధ్యాపకులు కూడా స్వచ్ఛందంగా పాల్గొని, ఆ చెఱువు మట్టిని తవ్వడం, చెఱువులోని గుఱ్ఱపుడెక్కను తొలగించడం నాకు ఆ చెఱువుని చూసినప్పుడల్లా గుర్తొచ్చే సామాజిక కార్యక్రమం.
ఆ కాలేజీలో మూడేళ్లు పనిచేశాను.  చేసినన్ని రోజులూ నిజాయితీగా, అంకితభావంతో పనిచేశాను. అక్కడ డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి అధ్యయన కేంద్రంలో ఆదివారం బి.ఏ., ఎం.ఏ., విద్యార్థులకు పాఠాలు చెప్పేవాణ్ణి. ఇన్విజిలేషన్ చేసేటప్పుడు సీరియస్ గా ఉండేవాణ్ణి.స్లిప్పులు రాయనిచ్చేవాణ్ణి కాదు. రెండు రోజుల తర్వాత నన్ను ఇన్విజిలేషన్ కి పిలవలేదు! తర్వాత తెలిసింది...స్లిప్పులు రాయనివ్వడం లేదనీ, తలతిప్పనివ్వడం లేదనీ కోర్డి నేటర్ కి ఫిర్యాదులు వెళ్ళాయని తర్వాత తెలిసింది. ఆ కాలేజీలో పి.జి. కోర్సులు కూడా ఉండేవి. అవి పేమెంట్ సీట్స్. పి.జి. మేనేజిమెంటు కోర్సుకి సంబంధించి పరీక్ష జరుగుతుంది. ఒకామె పరీక్షరాస్తూ, చాలా హడావిడి చేస్తుంది. మిగతావాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉందా ప్రవర్తన. నేను చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాను. ‘‘నేనెవరో తెలుసా... నేను ప్రసిద్ధ యాక్టర్ ని’’ అంది. ‘‘ అయితే ఏంటి, మీరిక్కడ ఒక స్టూడెంట్ మాత్రమే. మిగతావాళ్లలాగే మీరూను. మీ యాక్షన్ అంతా బయట చూసుకోండి. ఇక్కడ ఇతరులకు ఇబ్బంది కలిగించొద్ద’’ని హెచ్చరించాను. ఆమె ఇప్పుడు ఎన్నో తెలుగు  సీరియల్స్ లో ప్రతినాయిక పాత్రలో నటిస్తున్నారు. ఇలాంటివాళ్ళెంతో మంది ఆ కాలేజీలో చదివేవారు.  
ఆ కాలేజీలో వేదం సూర్యప్రకాశరావుగారని ఒక ఇంగ్లీషు లెక్చరర్ ఉండేవారు. ఆయన ప్రతి వారం బండబాయి దగ్గర ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళేవారు. ఆయనతో పాటు నన్నుకూడా తీసుకెళ్ళేవారు. మంచి కవిత్వం రాసేవారు. నేటికీ ఆయన కవితలు పత్రికల్లో, ముఖ్యంగా ఆంధ్రభూమిలో ప్రచురితమవుతుంటాయి. నేను కవిత్వం రాస్తానని తెలిసినన్ను బాగా ఇష్టపడేవాడాయన.
డా.నరసింగరావు, సత్తిరెడ్డి, సోమన్న, దత్తాత్రేయరెడ్డి, విజయకుమార్ జాదవ్ తదితరులంతా కలిసి ట్రెయిన్ లో వచ్చేవారు. నేను కూడా కొన్నాళ్ళు సెంట్రల్ వర్సిటి క్యాంపస్ నుండి వచ్చేవాణ్ణి. అప్పుడు ఆ రైల్లో అనేక పుస్తకాలు చదువుకోవడానికి నాకెంతో సమయం ఉండేది. ఇక్కడున్న లింగంపల్లి స్టేషను గానీ, అక్కడున్న వికారాబాదు స్టేషను గానీ పెద్దగా అభివృద్ధి చెందలేదప్పుడు. కొన్ని ట్రైన్స్ మాత్రమే ఆపేవారు. అందువల్ల రైల్వే అధికారులకు కొన్ని ట్రైన్స్ రెండు చోట్లా ఆపమని అనేక విజ్ఞాపన పత్రాలను పంపేవాళ్లం. రెండు స్టేషన్స్ లోను రిజర్వేషన్ కౌంటర్స్ పెట్టమిని కూడా అభ్యర్థించేవాళ్ళం. అవిప్పుడు ఎంతగానో అభివృద్ధి చెందాయి. అప్పుడప్పుడు వికారాబాదు, లింగంపల్లి స్టేషన్స్ లో సినిమా షూటింగ్స్ కూడా జరిగేవి. అప్పుడు ఆ నటుల పాట్లు చూసేవాళ్ళం. సినిమా చూసి విమర్శించినంత సులువుకాదు,  ఆ సినిమాలు తీయడం అనిపించేది. ఆ కాలేజీ చుట్టు ప్రక్కల జరిగే వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా గుర్తొస్తుంది. కొత్తగా సర్పంచులుగా ఎన్నికైన దళిత సర్పంచుల శిక్షణాసమావేశాన్ని ధారూర్ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దానికి వెళ్తూ డా. ముత్తారెడ్డి గారు, నన్ను కూడా తీసుకెళ్ళారు.   

శ్రీ అనంతపద్మనాభ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కళాశాలకు నాల్గువైపులా రెండు అంతస్థుల పటిష్టమైన నిర్మాణం ఉంది. కళాశాల ఆవరణలో మాజీ గవర్నర్, ముఖ్యమంత్రి గౌరవనీయులు కీ.శే.మఱ్ఱి చెన్నారెడ్డి గారి విగ్రహం ఉంది. ఆ విగ్రహం దగ్గరున్న చక్కని వేదికపై కూర్చున్న విద్యార్థులను ఆయన దీవిస్తున్నట్లుండేది. మొత్తం మీద ఆ కాలేజీ నాకు పాఠం చెప్పడమెలాగో నేర్పింది. ఆ కాలేజీ నాకు విద్యార్థినీ విద్యార్థులతో ఎలా ఉండాలో నేర్పింది. ఆ కాలేజీ సహ అధ్యాపకులతో ఎలా కలిసిమెలిసి ఉండాలో అర్థమయ్యేలే చేసింది. ఆ కాలేజీ నాన్- టీచింగ్ తో ఎలా సహృదయ సంబంధాల్ని కలిగి ఉండాలో నేర్పింది. ఆ కాలేజీ నాకు యాజమాన్యంతో ఎలాంటి సత్సంబంధాల్ని కలిగిఉండాలో నేర్పింది. ఆ కాలేజీ మొత్తానికి నాకో వ్యక్తిత్వాన్నిచ్చింది. ఆకాలేజీ నాకో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టు పడితే, దానికి దరఖాస్తు చేసుకుంటానని యాజమాన్యాన్ని అడిగాను. వారు అడ్డు చెప్పకుండా అనుమతిచ్చారు. యూనివర్సిటీలో నాకు పోస్టు వచ్చింది. నాకు కావలసిన రోజున రిలీవ్ చేస్తానని నాకెంతగానో సహకరించారు. ఆ కాలేజీలో పనిచేసిన మూడేళ్ల కాలమూ, తర్వాత నేను సెంట్రల్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా చేరిన తర్వాత నా ప్రమోషన్ కి ఆ కాలేజీ అనుభవం ఎంతగానో సహకరించింది. నా జీవితంలో ఒక అందమైన అధ్యాయాన్ని రూపొందించుకోవడానికి ఆ కాలేజీ నాకెంతగానో తోడ్పాటునందించింది.





pages from 92 to  95




1 కామెంట్‌:

Venkatesh చెప్పారు...

Chala hrudyanga,tajaga vunnayi mee college anubhavalu guruvu garu.