"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

08 నవంబర్, 2020

‘‘నేను’’ యౌగిక కావ్యం : సామాజిక జీవన చిత్రణ

 

-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

తెలుగుశాఖ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి,

గచ్చిబౌలి, హైదరాబాద్, 

 

సాహిత్యం సమాజానికి ప్రతిబింబం అంటారు. అయితే తాను జీవించే సమాజ చిత్రణ తన రచనల్లో ప్రతిఫలిస్తూ ఉంటుంది. తాను పుట్టి పెరిగిన వాతావరణం , తనకు  ఉన్నటువంటి పరిచయాలు, తాను చదివిన నా రచనలు, తాను విన్న ప్రసంగాలు మొదలైనవన్నీ కూడా తన రచనలో ప్రతిబింబిస్తుంటాయి. వాటిని బట్టే ఆ రచయిత దృక్పథం,  అతని సామాజిక జీవన విధానాన్ని తెలుసుకోగలుగుతాం.ఈ నేపథ్యం నుండే డాక్టర్ వాసిలి వసంత కుమార్ 'విశ్వర్షి వాసిలి' కలం పేరుతో 'నేను' యౌగిక కావ్యంలో గల సామాజిక జీవనచిత్రణ గురించి ఈ పత్రంలో పరిశీలించాలనుకుంటున్నాను. సాధారణంగా సాహిత్యంలో సమాజజీవన చిత్రణ అనేది వివిధ పాత్రలు, సన్నివేశకల్పనలు, వర్ణనల ద్వారా జరుగుతుంది. కానీ, వచన దీర్ఘకావ్యంలో ఒక బలమైన వస్తువుని లేదా ఒక అంత: సూత్రాన్ని లేదా ఒక సిద్ధాంతాన్ని వర్ణిస్తుంటారు. ‘‘నేను’’ యౌగిక కావ్యం ఆధునిక సమాజంలో కొంతమంది ఆలోచనాదృక్పథంగా అభివర్ణించవచ్చు. కొంతమంది ఆలోచనాదృక్పథం అంటే కొంతమంది సమాజంలో భాగమే కదా. కాబట్టి, ఆ సమాజిక జీవన చిత్రణ ఎలా ఉందనేది ఈ కావ్యాన్ని అనుసరించి గుర్తించే అవకాశం ఉందనుకుంటున్నాను.  

ఆధునిక తెలుగు సాహిత్యంలో 1977-85 సంవత్సరాల మధ్య కాలంలో దీర్ఘకావ్యాలు వచ్చాయి. నగ్నముని ‘‘కొయ్యగుర్రం’’ (1977) ని ఇంచుమించు దీర్ఘకావ్యానికి ఉండవలసిన అనేక లక్షణాలున్న రచనగా విమర్శకులు భావిస్తున్నారు. ప్రముఖ విమర్శకుడు చేకూరి రామారావుగారు కొయ్యగుర్రం గురించి వ్యాఖ్యానిస్తూ దీర్ఘకావ్యం గురించి ఇలా అన్నారు. ‘‘కావ్య ఖండికల్లో ఒకే వస్తువు (అంటే కథకాదు), ఒకే భావం ఉంటాయి. ఒక ఖండికలో భిన్నభావాల్ని పలికించడం కష్టం.దానికి కొంత విస్తీర్ణత కావాలి.మనం రోజూ చేసే ఖండికలకన్నా పెద్దవిగా ఉంటే తప్ప భిన్న భావాల్ని చెప్పడం కుదరదు. అంటే మహాకావ్యం కావాలి. మహాకావ్యానికి విస్తీర్ణతే ప్రధానం కాదు గానీ, అవసరమైన ఒకలక్షణం. పెద్ద ఫాంటులో అచ్చేయడం వల్లనో, పాదాలు విరవడం వల్లనో కవిత్వం కానట్టే, విస్తీర్ణత వల్ల ఏదీ మహాకావ్యం కాదు.కాలేదు. ఒక ప్రధాన వస్తువుతో , ఒక తాత్త్విక చింతనతో, సందేశంతో అనేక భావాలతో, మూడ్స్ తో  కథలేకుండా ‘అర్బేనిటి’ అనే లక్షణం కలిగి ఉండి తగినంత విస్తారంగా  ఉన్న దీర్ఘకవితను  ఆధునిక మహాకావ్యం అంటున్నాను’’ (నగ్నముని కొయ్యగుర్రం- అవలోకనం, 2001: 10). చేరా గారు మహాకావ్యం అన్నా, దీర్ఘకావ్యం అనే ఆలోచనతోనే చెప్పారు. ఇలాంటి దీర్ఘ  కావ్యాల్లో డా.సి.నారాయణరెడ్డి గారి ‘విశ్వంభర’, మట్టీమనిషీ ఆకాశం; వరవరరావు గారి ‘సముద్రం’, ఆరుద్రగారి ‘త్వమేవాహం’, ఖాదర్ మొయుద్దీన్ ‘పుట్టుమచ్చ’ మొదలైన వరుసలోనే  విశ్వర్షి వాసిలి’గా పేరొందిన డాక్టర్ వాసిలి వసంతకుమార్ గారి ‘‘నేను’’యౌగిక కావ్యం కూడా చెప్పుకోవచ్చు. దీన్ని మార్చి, 2020లో ప్రచురించారు. అంతకుముందే ఒక ఏడాదిగా కొన్ని పత్రికల్లోను, వాట్సప్ గ్రూపుల్లోను దీనిలోని కొన్ని భాగాల్ని ప్రచురించారు. డాక్టర్ వాసిలి వసంతకుమార్ గారు యోగాశిక్షణనిస్తుంటారు. యోగదర్శనానికి సంబంధించిన అనేక కావ్యాల్ని కూడా రాశారు. మనకే తెలియని మన రహస్యాలు, ఆధ్యాత్మిక జీవనతత్త్వం: అస్తిత్వ దృక్పథం, అస్తిత్వతాత్త్వికత, యోగ దర్శని మొదలైన గ్రంథాలు రాశారు.  కనుక, యోగ వల్ల తనకు కలిగిన అనుభవాన్ని విశ్వానుభవంగా వర్ణించడం ఈ కావ్యవిశిష్టత. ఈ కావ్యంలోని ‘‘నేను’’ వైయక్తికం కాదు; మానవునికి ప్రతీక. మానవ అన్వేషణకు ప్రతీక. మానవ పరిణామానికి ప్రతీక. మానవుడికీ, విశ్వానికీ జరిగే ఆలోచనల సంఘర్షణకు ప్రతీక. ఇలాంటి అభిప్రాయమే ఈ కావ్యానికి ‘ఇదో యౌగిక అనుభావ్యం’ పేరుతో ముందుమాట రాస్తూ ప్రసిద్ధ సాహిత్య విమర్శకులు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ ‘‘తాను అన్నది దీన్ని అభివ్యక్తీకరించిన కవికాదు... ‘నేను’ అనే ఒక సాకృత వ్యక్తిని నడిపించే చైతన్య శక్తి’’ (పుట:9) అన్నారు.

మనం సాహిత్యంలో ఆధునికతను కాలానుగుణంగాను, ఒక తత్త్వంగాను అర్థం చేసుకుంటున్నాం.  ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కొన్ని పరిణామాలు ‘ఆధునికత’ను నిర్వచించుకునేలా చేశాయి. సాధారణంగా ఏ భాషలోనైనా, ప్రపంచంలో ఎక్కడనుండి వచ్చిన సాహిత్యమైనా ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. దీన్ని సాహితీవేత్తలు భావవాద సాహిత్యం, భౌతికవాద సాహిత్యంగా పిలుస్తున్నారు.  భావవాద దృక్పథంతో సాహిత్యాన్ని రాసేవారు సాహిత్యం భగవంతుని ప్రేరణవల్ల కలుగుతుందని భావిస్తారు. పూర్వజన్మసంస్కారాలు గురించి మాట్లాడతారు. పాలించేవాళ్లు దైవాంశసంభూతులుగా భావిస్తూ, వాళ్ళకు అనుగుణంగా సాహిత్య సృజన చేస్తుంటారు. మన కష్టసుఖాలకు మన కర్మమే కారణమని వాదిస్తుంటారు. మానవుని చేతిలో ఏమీ లేదనీ, అంతా క్రమానుసారంగానే జరుగుతుందని భావిస్తుంటారు. సాధారణంగా ఇటువంటి భావాలతో కొన్నాళ్ళు మన తెలుగు సాహిత్యం కూడా కొనసాగింది. దీన్ని సంప్రదాయ సాహిత్యం, ప్రాచీన సాహిత్యం మొదలైన పేర్లతో పిలుస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కొన్ని మౌలికమైన మార్పులు మానవుల ఆలోచనావిధానాన్ని మార్చేశాయి. మూఢవిశ్వాసాలను,  రాచరికాన్ని, నియంతృత్వాన్ని ధ్వంసం చేసి,  ప్రత్నామ్నాయ  ప్రజాప్రభుత్వాల్ని కొనసాగించవచ్చని రష్యావిప్లవం (1917), ఫ్రెంచి విప్లవం (1789-1799) ప్రపంచానికి కొత్త ఆలోచనల్ని కలిగించాయి. ఫ్రెంచి విప్లవం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలను ప్రపంచానికి అందించింది. రష్యా విప్లవం మానవ ఆలోచనా విధానాన్ని కొత్తమలుపుకి తిప్పాయి. దైవాంశసంభూతులు, వంశపారంపర్యపాలన, పాపపుణ్యాలు మొదలైనవన్నీ ప్రశ్నింపబడ్డాయి. ఈ హేతువాద దృష్టి మనిషిని దేవుడు-సైన్స్ అనే రెండు మార్గాల్లో ఆలోచించేలా చేసింది. దేవుడి సృష్టి – ఆ ఆలోచనలన్నీ మతంగా మారి, కొంతమందికి మాత్రమే సంతోషంగా జీవించే అవకాశం ఉందని బోధిస్తూ ఆ ఆలోచనలన్నీ ‘‘దైవం’’ చుట్టూ తిరిగేలా చేశాయి.

సైన్స్ – అంటే భౌతిక వాస్తవికత గురించి ఆలోచించే వాళ్ళు చారిత్రక వాస్తవాలను, సామాజిక పరిణామ గతుల్నీ హేతుబద్ధంగా విశ్లేషించడం మొదలుపెట్టారు. సమాజ ప్రగతి అంతా మానవ సృష్టి అన్నారు. ఈ ఆలోచనా దృక్పథంతో రచనలు చేసేవాళ్ళంతా మానవుణ్ణి కేంద్రంగా చేసుకొని తమ రచనల్ని కొనసాగించారు.

ఈ మానవుడి కేంద్రంగా జరిగే చర్చలో పాల్గొన్న వారు  ‘మానవకేంద్రితం’ గురించి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు ‘‘ మానవుడంటే ఎవరు? ఈ ప్రాణికోటిలో మనం భావించే అత్యున్నత ప్రతిభాసంపదలు ప్రదర్శించే నరుడేనా? ఈ ప్రతిభా సంపదులకు మూల విధానమేమిటి? మానవుణ్ణి ఇంత ఉన్నతంగా తీర్చి దిద్దుతున్న ఆ చైతన్య స్రోతస్విని స్వరూపం ఏమిటి? ‘పరస్పర సంబంధం లేనట్లుగా అగుపించే రెండు సమాంతరాల సమన్వయమే సత్యం’ అనే మాట పూర్వులనేక విధాలుగా చెప్పారు. ‘పూర్ణమదం పూర్ణమిదం’ అన్న ఉపనిషదోక్తి నుంచి మొదలుపెట్టి, ‘ది సమ్మింగ్ అప్’ (The Summing Up) నవలా రచయిత సోమర్సెట్ మామ్ వరకు ప్రాక్పశ్చిమ దార్శనికులు, రచయితలు పలువిధాలుగా అభివర్ణించారు. ఎంత అభివర్ణించినా ప్రాథమిక అంశాలు రెండే. ఒకటి పదార్థమూ, రెండు చైతన్యమూ. ...రెండూ కలిస్తే ప్రాణి. ప్రాణికి రూపం ఇచ్చేది పదార్థం. అర్థం చెప్పేది చైతన్యం. దాని మహార్థాన్ని జీవన సార్థక్యం కోసం వినియోగించుకోవటమే కాకుండా ప్రకృతిని తన అధీనంలోకి తెచ్చుకొని, దానికి పూరణగా సంస్కృతిని నిర్మించుకున్న జీవి మానవుడు’’ అని వివరించారు. (పుట: 10)  ఈ అభిప్రాయాన్ని గమనిస్తే, పదార్థం-చైతన్యం గురించి వాటి అవినాభావ సంబంధాన్ని, దాని ముందువెనుకల గురించీ చర్చలు మొదలవుతాయి. ఇవన్నీ తాత్త్వికాంశాలు. కళ్ళకు కనిపించే సత్యాలుగా కొన్నింటినైనా నిరూపించే భౌతిక శాస్త్రజ్ఞులు, ఆ ఆలోచనలున్న షడ్దర్శనాలు, ఉపనిషత్తుల వంటి వాటిలో నిష్ణాతులు రచనలు చేయడం, వాటిని వ్యాఖ్యానించడం వంటివి చేయగలిగినప్పుడే నిజమైన ‘సత్యం’ స్ఫష్టమయ్యే అవకాశం ఉంది. సత్యాన్ని అన్వేషించే క్రమం నరంతరం కొనసాగాల్సిందే. దీనిలో భాగమే ‘‘నేను’’ యౌగిక కావ్యం కూడా! అందుకనే ఆ రకమైన ఆలోచనల జీవన విధానాన్ని ఈ కావ్యం ప్రతిఫలిస్తుందని అనగలుగుతున్నాను.

నేను యౌగిక కావ్యం – సంప్రదాయ-ఆధునిక భావనల సమన్వయ దృష్టితో వచ్చిన కావ్యమని ప్రతిపాదిస్తున్నాను. ప్రపంచ సృష్టి, దానిలో మానవుడు, మానవుని అస్తిత్వం, మానవుని జీవన గమ్యం మొదలైనవన్నీ తాత్త్వికదృక్పథంతో వర్ణించారు.  కొన్ని విషయాల్లో భౌతికాంశాలకు ప్రాధాన్యం ఉంటే, మరికొన్ని అంశాలకు కేవల భౌతిక సత్యాలతోనే నిరూపితం కాదనే కోణంలో ఈ కావ్యవర్ణన సాగింది. సైన్స్ కూడా చెప్పలేని అనేకాంశాలు మనముందుకొస్తున్న ‘సమకాలీన మానవ జీవనం’ ఈ కావ్యంలో ప్రతిఫలిస్తుంది. వీటిలో కొన్ని అంశాల్ని వివరించే ప్రయత్నం చేస్తాను.

నేను యౌగిక కావ్యం (2020) ఏడు విభాగాలుగా ఉంది. పరిణామ, ప్రమోద, ప్రమాణ, ప్రస్థాన, ప్రయోగ, ప్రవిమల, పరమపథాలు అనేవి ఆ విభాగాలు.

‘‘శూన్యం కాని స్థితీ కాని

గగనం లేని గాలీ లేని

వెలుతురు చేరని చీకటి చేరని

వాయులీన ఖగోళత

అణువుకు అనంతానికి అభేదకత’’ (నేను యౌగిక కావ్యం, పుట: 48)  అని కావ్యాన్ని ప్రారంభించారు.

సృష్టి ఎలా ప్రారంభమైందనే ఆలోచన ఇక్కడ కవిత్వంగా మారింది. విశ్వావిర్భావినికి రకరకాల సిద్ధాంతాలున్నాయి. దేవుడే సృష్టికారకుడని ఒక సిద్దాంతం. బిగ్ బ్యాంగ్ థియరీ మరొకటి. ఒక పెద్ద విస్ఫోటన ఫలితంగా విశ్వం ఏర్పడ్డదని చెప్పేదే బిగ్ బ్యాంగ్ థియరీ.  మహా విస్ఫోటన సమయంలో హీలియం సింథసైజేషన్ జరిగి ఉంటుందని పరిశోధకుల అభిప్రాయం. హీలియం (Helium) అనేదొక రసాయన మూలకం. రంగు, రుచి, వాసన లేని, విషపూరితం కాని (non-toxic), తటస్థమైన  ఒకే అణువు కలిగిన రసాయన మూలకంగా చెప్తారు. Hydrogen (ఉదజని) ఒక రసాయన మూలకం. దీన్ని "H" అనే సంకేతముతో సూచిస్తారు. ఉదజని యొక్క అణు సంఖ్య 1. మూలకాల పట్టికలో ఇది మొదటి మూలకం. హైడ్రోజెన్ ని ఆంగ్లంలోని H  అనే అక్షరంతో మూలకాల పట్టికలో మొదటిగా సూచిస్తారు. తర్వాత  2 వదిగా సూచించేది హీలియం (He ). సాధారణోష్ణము, పీడనముల వద్ద ఇది రంగు, వాసన, రుచి లేని, అలోహిత బణు (H2) వాయువు. ఇవన్నీ పై కవితాత్మక పంక్తుల్లో సులభంగా వివరించాడు కవి.ఇలా శాస్త్రీయంగా వివరించాల్సిన అంశాలెన్నో ఈ కవిత్వంలో ఉన్నాయి.  అలాంటి సృష్టి ఆవిర్భావంలో మానవుని ఆవిర్భావం జరిగిన పరిణామాన్ని ఇలా కవిత్వీకరిస్తారు కవి.

‘‘కాలం స్థితీ విడివడని ఏకత

ఆ ఏకత్వంతో ఖగోళ జవజలం

జలధిన ఈదులాడుతూ ఒక జీవం

జీవనానికై కలయ తిరుగుతున్న ప్రాణం

జల జీవనానికి ప్రాణభూతంలా భూగోళం

భూగ్రహానికి శ్రీకరంగా నేను ( పుట: 49)   

            ఇక్కడ మత గ్రంథాల్లో సృష్టి ఆవిర్భావం గురించి కనిపించే వర్ణనల్లా అనిపిస్తాయి. కానీ, తర్వాత ‘‘ జలతత్వంతో ముడిపడ్డ మానవతత్త్వం/మత్స్యావతారంగా తొలి ఆవిష్కరణ’’ అని ప్రతిపాదిస్తారు కవి. ఇక్కడే కవి భారతీయ దార్శనిక ఆలోచనాదృక్పథంతో శాస్త్రీయంగా వివరించే ప్రయత్నం కనిపిస్తుంది. కేవలం దశావతారాల్ని ఉన్నతీకరిస్తూనో, దాన్నే విశదీకరిస్తే ఒక వర్గానికి వెనుకేసుకొచ్చిన వాదనతో నిండిన కావ్యమయ్యేది. అలా కాంకుండా –

‘‘చిరుజీవం పెరుగుతూ పెనుజీవం కావటం

పెరిగిన కణం మూల కణంగా వెనుతిరగడం

రేపటి కోసం ఒకరిని ఒకరు ఆశ్రయించడం

చివరికి నిష్ర్కమించడం సృష్టి పరిణామం

తిరోగమనం మృతతత్వానికి తొలిపరిణామం

ఇదే నా జనన మరణ ఆవిష్కృత రహస్యం’’ (పుట: 51) ఇక్కడున్నారు కవిగా, దార్శనికుడిగా ‘విశ్వర్షి వాసిలి’. మన కళ్ళముందు కనిపించే వాస్తవాన్ని భ్రమలుగా చెప్పట్లేదు. జనన-మరణాలు మనకి కనిపించే వాస్తవం. కానీ, మనిషి పుట్టింది అందుకేనా? ‘‘తిరోగమనం మృతత్త్వానికి తొలిపరిణామం’’ అనే ప్రతిపాదనతో కావ్యాన్ని పురోగమనం దిశగా పయనించడం ఎలాగో వివరిస్తూ పరిపూర్ణం చేయడం కావ్యపరమార్థం. దీనికి శాస్త్రాన్ని,  ఆధ్యాత్మిక రహస్యాలతో సమన్వయీకరిస్తూ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని హిందూ పురాణాల్లో దశావతారాలుగా చెప్పేవాటిలో గల అంతరార్థవ్యక్తీకరణగా జీవపరిణామాన్ని కవిత్వీకరిస్తారు కవి. ‘‘నేను కార్య జాతం కాదు.../ కర్మజాతం కానే కాదు...’’(పుట: 52) అని తన శాస్త్రీయమైన అనుభవాన్ని, విశ్వరహస్యశోధన సత్యాన్ని నిజాయితీగా వెల్లడిస్తారు కవి. మొదటి భాగం ‘పరిణామ పథం’ సృష్టినీ, మానవ జీవ పరిణామాన్నీ శాస్త్రీయంగా కవిత్వీకరించడం వల్ల వేదాలు, పురాణాలు, కావ్యాలు మొదలైన వాటిలో గల తాత్త్విక సత్యాల్ని మహానుభావులు  ప్రతీకలుగా అందించారని విశదీకరిస్తున్నట్లు తెలుస్తుంది. అందువల్ల మరలా హిందూ పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాల్ని ఈ దృష్టితో అధ్యయనం చేయాలనే ప్రేరణ కలుగుతుంది. బుద్ధుడు, కృష్ణుడు, పాండవులు, జీసస్, మహర్షుల జన్మకొక ఒక పరమార్థం ఉందంటారు. మానవ పురోగమనానికి ఆ పరమార్థాన్ని అవగాహన చేసుకోవడం అవసరంమంటారు.

            ‘‘నేను రాగాన్ని మోసుకుంటూ

 చరణారవిందమవుతుంటాను

                వైరాగ్యాన్ని సృజిస్తూ

ముకుళిత హస్తమవుతుంటాను

                 జీవితంలో పాడుకుంటూ పాదుకుంటూ

                 మృత్యువును చేదుకుంటూ చేరుకుంటూ

                నా నరాలు నయగారాలు పోతున్నాయి

                నా నేత్రాలు అరమోడ్పులతున్నాయి’’ (పుట: 58) అని మానవ జీవితానుభవంలో గల సుఖదు:ఖ దశల్ని వర్ణిస్తూనే చివరికి ఏమవుతామో చదివేసరికి  కళ్ళు చెమరుస్తాయి. ఆకులో ఆకునైపోతానన్న కవి దేవులపల్లి కృష్ణశాస్త్రిని గుర్తుకు తెస్తున్నట్లనిపిస్తుంది. కానీ, ఒక భౌతిక వాస్తవం మనిషి మరణించడం. నిజంగా అది మరణమేనా? దీన్ని ‘‘ నేను వాస్తవ నిశ్శబ్ద గమనాన్ని ... స్వప్న శబ్ద గమకాన్ని/ ఇంద్రియ సంచారిని... పరమ పథ విహారిని/ ఇద్ధరిన ద్వైతాన్ని... అద్ధరిన అద్వైతాన్ని’’ అని  చెప్పడంలోనే విశ్వర్షి వాసిలి గారి ఔచిత్యం, ఉదాత్తమైన భావన కనిపిస్తుంది. ఇక్కడ పరమ పథం అంటే ఏమిటో కూడా ఆయనే వర్ణిస్తూ ‘‘ విశ్వమే నేను’’ (పుట: 58) అని స్పష్టంగా చెప్తారు.

            ‘‘నా అక్షరం /  ఆత్మదర్శనాల నిఘంటువు/   సాధనా రహస్యాల సర్వస్వం’’ (పుట: 76) ‘‘నేను అష్టాంగ దర్శనను/నవనాడుల చరిత్రను’’ (పుట: 93) ,   ‘‘నేను గర్భస్థ మంత్రాన్ని/విశ్వకుండలిని తంత్రాన్ని/   సహస్ర మండల పారవశ్యాన్ని’’  (103) మొదలైన భావాలన్నీ యోగ దర్శనానికి సంబంధించినవి. యోగా చేస్తే మానవుడు పొందే నిజమైన ఆనందం తెలుస్తుంది. దేహధర్మం తెలుస్తుంది. దేహధర్మం తెలిస్తే మరణిస్తామనే దు:ఖం నుండి విముక్తులవుతాం. ఈ కావ్యంలో అనేకచోట్ల  బుద్ధుని ప్రస్తావన కనిపిస్తుంది. బౌద్ధంలో గల శాంతికి మూలం ధ్యానం. ధ్యానం యోగా మౌలిక ధర్మం. అలా  విశ్వం తెలియాలన్నా, విశ్వరహస్యాల్లో అంతర్భావమైన మానవ దేహతత్త్వం తెలియాలన్నా యోగరహస్యాలు తెలియాలనే భావనలు గల కవితాత్మక వాక్యాలు కావ్యం నిండా మనల్ని యోగావైపు మళ్లిస్తాయి. కావ్యాన్ని చదువుతున్నంత సేపూ ఆ సత్యాలు అనుభవంలో కొచ్చే కొద్దీ మనసంతా ఆనందతాండవం చేస్తుంది. ‘‘నేను మూడుకోట్లను దాటాలి/మూఢమతులను కాదనగలగాలి’’ అని జ్ఞానంగా ప్రాచుర్యంలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలనీ, విశాలమైన భావాల్ని అలర్చుకోగలిగినప్పుడే నిజమైన మనమేమిటో మనకి అర్థం అవుతుందని, వీటిని ప్రతిమనిషి ప్రాథమికంగా తెలుసుకోవాలంటారు కవి. ‘‘నేను భాషను దాటాలి/ భావవలయ భాషాభేదాలను దాటిపోగలగాలి’’ (పుట: 124) అనే మహోదాత్తభావనలు ఉన్న ఈ కావ్యం పాఠకుడికి  విశ్వమానవుణ్ణి తయారు చేసే పోజివివ్ ఎనర్జీనిస్తుంది. ప్రకృతితో మానవుడు ఉంటున్న తీరు, ఉండాల్సిన తీరుని తాత్త్వికంగా  తెలుసుకోవడానికి ఈ దీర్ఘకావ్యం ఎంతగానో తోడ్పడుతుంది. ఇది తెలుగు భాషలో వెలువడొచ్చు. కానీ, దీనిలోని భావాలు అన్ని భాషలవాళ్ళు చెందినవి. ఇది ఈ దేశంలో వెలువడొచ్చు. కానీ, ఈ కావ్యంలోని భావాలు ప్రపంచంలోని అందరి అనుభవాలు. ఈ కావ్యంలోని భావాల్ని అవగాహన చేసుకోగలిగితే ఈ విశ్వాన్ని అర్థం చేసుకోగలిగినట్లే. అందుకే విశ్వమే తానై, తానై విశ్వమై యోగదార్శనిక సత్యాన్ని ప్రవచించారు ‘విశ్వర్షి వాసిలి’

            కవి ఈ కావ్య నేపథ్యాన్ని వివరిస్తూ ‘‘ఆధ్యాత్మిక దృష్టి కోణానికి ఆధునికతను మేళవించి పలుకుతున్న’’ కావ్యమని ఒక పాఠకులెవరో అన్నారని, ఆ అభిప్రాయాన్ని అంగీకరిస్తున్నట్లుగానే వాటిని ఉదహరించుకున్నారు. మొత్తం మీద ఈ ‘‘నేను యౌగిక కావ్యం’’ సమకాలీన వైజ్ఞానిక మానవుని అంత: సంఘర్షణ, పరిణామాల్ని మనకళ్ళముందుంచుతుంది. ‘‘మనవుకు ఆది రూపమైన మత్స్యం నుండి, నేటి మానవ సంఘ మనుగడ వరకూ మనో యోగ పర్యటనను కావించే’’ (పుట:32)  రచనగా ప్రముఖ విమర్శకురాలు డాక్టర్  రాజేశ్వరి దివాకర్ల గారు పేర్కొన్నారు.  పంచభూతాలు, పంచకోశాలు, చతుర్విధ పురుషార్థాలు ఇంద్రియాలు, ఆత్మ, ధ్యానం, మొదలైన వాటిని మాత్రమే కాకుండా, భూలోక ఆవరణకు అతీతమైన ఈ ప్రాకృతిక ప్రపంచంలో మనిషి స్థానాన్ని యోగికంగా శోధించిన మహోన్నత కావ్యంగా డాక్టర్ రాయదుర్గం విజయలక్ష్మి అభిప్రాయపడ్డారు.(పుట:34) డాక్టర్ ఏల్చూరి మురళీధరరావుగారు ఈ కావ్యాన్ని ప్రతీకాత్మకంగా భావిస్తూ, వైదిక విషయాలు, ఐతిహాసికాలు, పౌరాణికాలు, వైజ్ఞానికాలు, కాల్పనికాలు మొదలైన అనేకాంశాల సంగమంగా వ్యాఖ్యానించారు. (పుట: 20) ఈ అభిప్రాయం ప్రకారం కూడా ‘‘నేను’’ యౌగిక కావ్యం  కాలానుగుణంగా ఆధునిక కావ్యంగా నిలుస్తూనే, తాత్త్వికంగా కొన్ని సంప్రదాయాల్ని చర్చకుపెడుతున్న కొంతమంది ఆలోచనలకు ప్రతిఫలనంగా ఈ కావ్యాన్ని గుర్తించవచ్చు.  

             (పెదనందిపాటు ఆర్ట్స్ & సైన్స్ కళాశాల, పెదనందిపాడు, గుంటూరు జిల్లా వారు ‘‘ ఆధునిక తెలుగు సాహిత్యం- సామాజిక జీవన చిత్రణ’’ అనే అంశంపై 3, 4 జూలై 2020 తేదీల్లో నిర్వహించిన అంతర్జాల జాతీయ సదస్సులో సమర్పించిన పత్రం)

 

 

కామెంట్‌లు లేవు: