‘రచయిత సామాజిక
స్వప్నాన్ని గుర్తించాలి’
ప్రాచీనమైనా, ఆధునికమైనా సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం
చేసుకోవడం ద్వారానే సమకాలీన సమాజానికి ఎలా పనికి వస్తుందో తెలుస్తుందని, ప్రతి
రచయితకీ ఉన్న సామాజిక స్వప్నాన్ని గుర్తించడం ద్వారా ఆ రచన సమాజానికి అవసరమో కాదో
తెలుస్తుందని కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత, ప్రముఖ సాహిత్య విమర్శకుడు
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు.హైదరాబాదు విశ్వవిద్యాలయం
తెలుగుశాఖ విద్యార్థులను ఉద్దేశించి ఆయన సోమవారం (16.11.2020) అంతర్జాలం (గూగుల్
మీట్) ద్వారా ప్రసంగించారు. కోవిద్- 19 కారణంగా అంతర్జాలం ద్వారా జరుగుతున్న
పాఠ్యాంశాల్లో భాగంగా విమర్శకుడిగా ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి సాహితీ
ప్రస్థానం- సాహిత్యకృషి’’ అనే అంశంపై ఆయన ప్రత్యేక ప్రసంగాన్నిచ్చారు. ఈ
కార్యక్రమానికి తెలుగుశాఖాధిపతి (ఇన్ చార్జి) ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
అధ్యక్షత వహించారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారి గురించి ఎం.ఏ.,స్థాయిలో
పాఠ్యాంశాలు ఉన్నాయిని, అందువల్ల ఆయనే స్వయంగా విద్యార్థులతో మాట్లాడితే
స్ఫూర్తివంతంగా ఉంటుందని భావించి, ప్రముఖ సాహితీ వేత్తల ప్రసంగ పరంపరలో భాగంగా ఈ
ప్రసంగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తెలిపారు.తొలుత
సంప్రదాయవాదిగా ఉన్నానని, అప్పుడు శిల్పం, రూపం పైనే దృష్టి పెట్టే వాడినని, కానీ,
అనంతపురం జీవితం, గురజాడ రచనలు తనను ఆధునిక మానవుడిగా, సాహితీవేత్తగా, సామాజిక
వాస్తవికతను అర్థం చేసుకొనే భౌతికవాదిగా మార్చాయని తన సాహితీప్రస్థానాన్ని
సోదాహరణంగా ఆచార్య రాచపాళెం పేర్కొన్నారు. తనపై మార్క్సిస్టు ప్రభావం ఉందనీ,
దానిపై తనకు ఇష్టం ఉందనీ, ఆ ప్రభావం తన సాహిత్యంలో కనిపిస్తుందని అన్నారు. అలాగే,
ప్రతి రచయితకు, పరిశోధకుడికీ, విమర్శకుడికీ
సమాజం పట్ల ఉండే ప్రాపంచిక దృక్పథం ఉంటుందనీ, అది భావవాదమో, భౌతికవాదమో
గుర్తించాలని అన్నారు. ప్రాచీన సాహిత్యాన్ని సమకాలీన సమాజంలో అధ్యయనం చేసేటప్పుడు
పునర్మూల్యాంకనం చేసుకొని, శాస్త్రీయ పద్ధతిలో సాహిత్యాన్ని అవగాహన
చేసుకోవాలన్నారు. సామాజిక చరిత్రలో సాహిత్య చరిత్రలెలా భాగమవుతాయో గుర్తించాలన్నారు.
అన్నమయ్య భావవాదే అయినప్పటికీ, సామాజిక సమస్యల్ని విస్మరించలేదన్నారు. ఈ
కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు ఆచార్య డి.విజయలక్ష్మి, డా.భుజంగరెడ్డి,
డా.డి.విజయకుమారి తదితరులు, విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొని, తమకున్న సాహిత్య
అభిప్రాయాలను చర్చించారు.
-
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగుశాఖ, సెంట్రల్
యూనివర్సిటి, హైదరాబాద్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి