'' ఇంకా కులవివక్షా!... ఎక్కడ?''
నీక్కనపడని కులవివక్ష
నాకెందుకు కనపడుతుందో తెలుసుకోలేకపోతున్నందుకు
నీ ముందు నేనింకా పసివాణ్ణే!
నూలుపోగులేకుండా నిర్లజ్జగా ఊరేగుతున్న నిన్నంతా నిండువస్త్రాల్లో మెరిసిపోతున్నారంటున్నా
నగ్నంగా కనపడుతున్నావన్నందుకు
నేనింకా పసివాణ్ణే!
పరి'పూర్ణ'ఆత్మవిశ్వాసంతో
దేశ కీర్తిప్రతిష్టల్ని హిమాలయాలపై ఎగరేసినా
కనపడని నీ కళ్ళు
నీవాళ్ళగల్లీ ఆటలకు ఢిల్లీదాకా విప్పారి వర్షించడంలో నీకే కులవివక్షా లేదని చెప్పే ఒక్క మీడియానైనా కాలేని
నేనింకా పసివాణ్ణే!
నువ్వేమో
కోట్లకు కోట్లు మనీలాండరింగ్ చేస్తున్నా
కోట్లకు కోట్లు బ్యాంకు లోన్లు ఎగేస్తున్నా
పావలావడ్డీ ఋణం కోసం
పాదాలరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి నీకవసరంలేని నాకవసరమయ్యే
ఆ హామీలతో
ఒక్క రూపాయి ఋణం పొందలేని
నేనింకా పసివాణ్ణే!
దేశం కోసం నా ప్రాణాన్ని తృణప్రాయంగా
త్యజించినా
నాకుటుంబ పరామర్శకైనా
చలించని నీ హృదయస్పందనను గుర్తించలేకపోతున్న
నేనింకా పసివాణ్ణే!
పార్లమెంటు పెద్దకుర్చీలో కూర్చున్నా
నా పార్థివ దేహాన్ని
నీ కాళ్ళముందుకొస్తేగాని
సంతాపాన్ని అందుకోలేక
మళ్ళీ చంపేసే చులకన భావానికి
నిలువెత్తు అవమానంతో
మళ్ళీ ఢిల్లీ నుండి నా గ్రామానికే విసిరివేయబడ్డ
నేనింకా పసివాణ్ణే!
అంబేద్కర్ పెట్టిన రొట్టెను పంచుకోలేక
అంబేద్కర్ వేసిన నిచ్చెనా ఎక్కలేక
నన్ను నేను చీల్చుకుంటున్న
నేనింకా పసివాణ్ణే!
నా చీలికల్ని కుట్టుకుంటూ
నీ ఏలికల్ని పసిగడుతూ
నా జెండా నేను మోసుకుంటూ
నీ గుండెల్లో డప్పుల చప్పుడు చేసుకుంటూ
నేను బయలుదేరకపోతే
నేనింకా పసివాణ్ణే!
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సెంట్రల్ యూనివర్సిటీ, 9182695231
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి