సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పునఃసమీక్షకు అవకాశం కెల్పించిన నేపథ్యంలో ఇప్పుడు అందరూ సంయమనం పాటించాలి. ఈ సమయంలో ఉద్రేకపూరితమైన కవిత్వం, కథలు రాయడం మంచిదికాదు. అలాగే ఉద్రేకపూరితమైన ప్రసంగాలు చేయడం కూడా మంచిది కాదు. అది దళితుల మధ్య మరింత విద్వేషాలకు కారణమవుతుంది.అంతేకాకుండా రిజర్వేషన్ల మొదటికే మోసం వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఉభయ వర్గాలు కూడా సంయమనం పాటించడం ఎంతో అవసరం. దేశంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దళితులు, బహుజనులు, అందరూ కలిసిమెలిసి ఉండవలసిన అవసరం ఎంతగానో ఉంది.
సామాజిక ఉద్యమాల్లో సాహిత్యం ఒక శక్తివంతమైనటువంటి పాత్ర నిర్వహిస్తుంది. అది డప్పోల్ల రమేశ్ తెచ్చిన కవితా సంకలనం 'కువ్వ' ప్రత్యక్షంగా నిరూపించింది. అతడు కవిత్వం రాశాడు, పాటలు రాశాడు వాటిని బాగా పాడతాడు. ఒక కవిగా ఒక ఉద్యమకారుడిగా సామాజిక న్యాయం కోసం తనదైన పాత్ర నిర్వహించడంలో అంకితభావం కలిగిన వ్యక్తి. దళిత చైతన్యానికి మాదిగ చైతన్యానికి రమేశ్ చేసిన కృషి విశేషమైంది. దాన్ని సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అతడు కువ్వ పుస్తకాన్ని ప్రచురించడానికి ఆర్థికపరమైనటువంటి అనేక కష్టనష్టాలకు గురయ్యాడు. అయినప్పటికీ కూడా దాన్ని రెండవ ముద్రణ కూడా వేసి సామాజిక న్యాయం కోసం సాహిత్యం ద్వారా అన్ని వర్గాలను ఒకచోట తీసుకురావడంలో ఒక చైతన్యవంతమైన ఇటువంటి పాత్రను నిర్వహించాడు. అలాగే మన కవులు ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ , డాక్టర్ కాకాని సుధాకర్, డాక్టర్ గుండె డప్పు కనకయ్య, డాక్టర్ గుండిమెడ సాంబయ్య, సిద్దెంకి యాదగిరి, నిరంజన్, చిరంజీవి, బాలయ్య బాలరాజు, అబ్జ్్రహాం, మల్లలయ్య జుజ తదితరులంతా కూడా అంకితభావంతో సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నారు.
ప్రొఫెసర్ ముత్తయ్య గారు ఒక సైద్ధాంతిక నేపథ్యంతో ముందుకు వెళ్లాలని చెప్పడమే కాకుండా దాన్ని ఆచరణలో చూపిస్తున్నారు. అందువల్ల ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అందరూ కూడా సంయమనం పాటిస్తూ మాదిగలు, ఉప కులాల వారు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం న్యాయబద్ధమైందని అందరికీ అనిపించేట్టుగా వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని అందరూ గుర్తించాలని మీ అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.... ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
(అక్షర దండోరా-ఆన్లైన్ కవి సమ్మేళనం12.9.2020 లో అతిథిగా పాల్గొని చేసిన ప్రసంగ సారాంశం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి