డాక్టర్ దానక్క ఉదయభాను...హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశాడు. అతను డిగ్రీ చదివేటప్పడే ఒకసారి నన్ను కలిశాడు. అప్పటికే నేను సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు అధ్యాపకుడిగా పని చేస్తున్నాను. కాశీమ్ సార్ పంపించారని, ఒక కళాశాల మ్యాగజైన్ తీసుకొస్తున్నామని, దానికి సంబంధించిన సలహాల కోసం వచ్చానని చెప్పాడు. ఆ రోజు అతని మాటలు, అతని ఉత్సాహం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. అతడు మార్క్సిస్టు భావజాలం ఉన్న వ్యక్తిగా కూడా అనిపించాడు. కొంచెం వేగంగా నిర్ణయాలను తీసుకుంటాడనీ అనిపించింది. ఈ సమాజాన్ని సమూలంగా మార్చాలని ఓ పెద్ద ఆశయాన్ని కలిగి ఉన్నానిపించింది. అతను అడిగిన మ్యాగజైన్ కు సంబంధించిన సూచనలను.. నాకు తెలిసినంతవరకు చెప్పి పంపించేశాను. తర్వాత ఉదయభాను ఏం.ఏ తెలుగు కోసం ఒక ఎంట్రెన్స్ రాయడం, సెంట్రల్ యూనివర్సిటీలో సీటు రావడం చకచకా జరిగిపోయాయి. ఎమ్మే లో నేను సాహిత్య విమర్శ తో పాటు దళిత సాహిత్యాన్ని కూడా బోధించాను. దళిత సాహిత్య విమర్శ కోర్స్ ఆప్షనల్. అయినా కానీ దాన్ని ఉదయభాను కూడా ఎంపిక చేసుకున్నాడు. దళిత సాహిత్యం పాఠం అంతా తీవ్రమైన చర్చోపచర్చలతో జరిగేది. నేను కూడా విద్యార్థులకు ఆ అవకాశాన్ని ఇచ్చేవాడిని. చిలుకూరి దేవపుత్ర గారి పంచమం నవల మా దళిత సాహిత్యం పాఠ్యాంశంలో ఒక భాగం.దళిత సాహిత్యాన్ని మార్స్క్ నుండి అంబేద్కర్ నుండి ఎలా అవగాహన చేసుకోవాలో , ఆ నవలలో చాలా చక్కగా ప్రతిపాదించారు రచయిత. మన ఉదయభాను మార్క్సిజమే ఈ సమాజానికి అవసరమనీ, అంబేద్కరిజం సమస్యని పరిష్కరించడానికి తాత్సారం చేస్తుందనీ, మార్క్సిజం పద్ధతిలోనే సమాజం బాగుపడుతుందని వాదించేవాడు. ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే అతడు ఒక ఆలోచించే విద్యార్థి. ఈ సమాజం పట్ల తపన కలిగిన విద్యార్థి. విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్ధి సంఘం అనుబంధంగా అతడు చేసిన పనులు చిరస్మరణీయం. కారంచేడు సంఘటన 25 సంవత్సరాల నేపధ్యంలో అతని ఆధ్వర్యంలో జరిగిన సభ, నభూతో న భవిష్యతీ అన్నట్లు నిర్వహించాడు. ఆ సభ జరిగే అప్పుడు దళిత విద్యార్ధి సంఘానికి అధ్యక్షుడిగా మా విద్యార్థి డాక్టర్ ఆదినారాయణ ఉండేవాడు. నేను కూడా ఆసభలో పాల్గొన్నాను. అయినా గానీ, అతడికి మార్క్సిజం పట్ల అభిమానమే కనిపించేది. అతడు నాతో చాలా అంశాల పట్ల విభేదించే వాడు. అలా విభేదించినా అతని మాటలలో నాకెందుకో ఒక శాస్త్రీయత ఉందనిపించేది. తర్వాత అనేక ఒడిదుడుకుల మధ్య అతను డాక్టరేట్ పూర్తిచేశాడు. ఈమధ్య కరోనా సమయంలో నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. దాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను.
కాలిబాటల రహస్యాలు
పేరు దక్కని జాడల్లో
నీడల చిరునామాలు
వెతుకుతూ నేను బయలుదేరాను
దారి తెలిసినా తీరం తెలియదు
దీపం చేతిలో ఉన్నా
చమురు కులం చేతిలో బంధీ
ప్రాపంచిక దృక్పథం జ్ఞానంలో మిళితమైనా
లందలో పొడవని పొద్దులా గుండె
అంటరాని మునివేళ్లతో
పలకను పలగజీరివచ్చిన తెగువ
పండవుతానో, కాయవుతానో
పువ్వుగానే పరిమళించకుండానే అస్తమిస్తానో తెలియని
తోలుబతుకుల తెగింపుతో నేను
సమస్తాన్ని పరాస్తం చేయగలననే ప్రవాహ ధీమా నాది
కళ్లకు నాచుతీగల్లా అల్లుకునే
జంధ్యాల వధ్యశిలలను
గుర్తించలేని కాలంలో
నిస్వార్థంతో, చనుబాల తీపితో
నన్ను
"సమురాయ్" అని కీర్తించి
రెండేళ్లు లాలించి..
ఆ తరువాత..
"ఎహే ఆయన ఆంధ్ర మాదిగోడు, బాపనోళ్లకంటె ఎక్కువ" అని అన్నా, "డిపార్ట్మెంట్ లో మన మాదిగోడు ఉన్నా లేనట్టే లెక్క" అని అన్నా, ఆఖరికి "ఆయనేందిలే" అనేదాకా వెళ్లినా..
నా అహంకారాన్ని ఓపికగా సహించి, చిరునవ్వుతో భరించి.. ఆఖరికి..
పదకొండేళ్ల తరువాత..
అక్షరాలా పదకొండేళ్ల తరువాత..
నేను "సార్ నేను మీకు విద్యార్థిని కాను, తమ్ముడిలా భావించండి" అని కౌగిలిని ఎక్స్పెక్ట్ చేసి మీ దగ్గరికి వస్తే..
పదకొండేళ్ల నా తప్పటడుగుల్ని తల్లిలా లెక్కించి,
చిరునవ్వుతో నా అహంకారాన్ని ఓడించారు చూడండి సార్.. బరాబర్ చెప్తున్నా.. మాదిగోడంటే మీలాగే ఉండాలె. తొడగొట్టే కాలం కాదిది.. కుట్రలకాలంలో అదును చూసి అగ్రవర్ణ పెత్తనపు కాలుపట్టి గుంజాలె. నాలాగ మీసం మెలేసి బతికే కాలం కాదిది. పైపెదవిమీద వాడికివాడే రక్తం చిట్లేలా వేలేసుకునే నేర్పు మన వ్యూహంలో ఉండాలె. దార్ల సార్ ఐ లవ్యూ. నేను మీ నుండి నేర్చుకున్న గుణపాఠాలు కాశీం సార్ అరెస్టయ్యినప్పుడు, లాక్డౌన్లో, ప్రస్తుతం నేను చేస్తున్న వ్యవసాయ సంక్షోభంలో మరీమరీ గుర్తొస్తున్నాయి. మీరు బరాబర్ వందేండ్లు బతకాలె. మీ వ్యూహ చాతుర్యాన్ని, శబలతను వేలాదిమందికి పంచాలె. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్️️️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి