ఈరోజు (21.9.2020) సాయంత్రం ఒంగోలు శారద సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాల కవి సమ్మేళనం జరిగింది.ఈ కవి సమ్మేళనం ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారు శ్రీ హనుమంతరావు గారి పర్యవేక్షణలో నిర్వహించారు. దీనికి నన్ను అతిధిగా పిలిచారు.ఈ వారం చదువు- సంస్కారం అనే అంశంపై కవితలను ఆహ్వానించారు. చాలా మంది మంచి కవితలు చదివారు. కొంతమంది పాటల రూపంలో, మరికొంతమంది పద్యాల రూపంలో, ఇంకొంతమంది వచన కవిత్వాన్ని చదివారు. కవులంతా చదువు- సంస్కారం గురించి మంచి కవిత్వాన్ని చదివి వినిపించారు. ముఖ్యంగా అప్పుడే రచనా ప్రపంచం లోకి అడుగుపెడుతున్న వారు ఈ సాహితీ సాంస్కృతిక సంస్థ ద్వారా ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు. వారిని ఈ సంస్థ బాగా ప్రోత్సహిస్తుంది.ఈ కరోనా లాక్డౌన్ సమయంలో కూడా ఉభయ రాష్ట్రాలలోని కవులు అంతర్జాల కవి సమ్మేళనం లో పాల్గొంటున్నారు. ఆ విధంగా ఇంటిదగ్గర అందరితో కలిసిమెలిసి ఉన్నామనే భావన కలిగేటట్లు
అంతర్జాల కవిసమ్మేళనాలు ఉపయోగపడతాయి. ఒక అంశం మీద కవిత్వం రాయడం వల్ల వాళ్ల ఆలోచన మంచి ఆలోచనలు రూపొందడానికి ఉపయోగపడుతుంది.అందుకని ఇటువంటి కవి సమ్మేళనంలో పాల్గొనమని ఆహ్వానించినప్పుడు నేనుకూడా పాల్గొంటున్నాను. ఈ సందర్భంగా ఆంధ్ర మహా భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పిన 'చదివించిరి నను గురువులు' అనే పద్యం తర్వాత విద్య ప్రాధాన్యాన్ని తెలిపే ఏనుగు లక్ష్మణ కవి విద్య నిగూఢగుప్తమగు విత్తము... అనే పద్యం చెప్పాను. అలాగే , విశ్వనాథ సత్యనారాయణ గారి ' మర,నిదేల...అనే పద్యం చెప్పి, ఎవరి అనుభవం వాళ్లకి కొత్తగా ఉంటుందని అందుకని ప్రతి పదంలోనూ కొత్తగా కవిత్వం రాస్తున్నవాళ్ళు ఒక కొత్త అనుభూతిని పొందుతారని వ్యాఖ్యానించాను. అటువంటి కొత్త తరానికి స్వాగతం చెప్తున్న నిర్వాహకులను అభినందించాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి