విశ్వర్షి వాసిలి గారి ‘నేను’ దీర్ఘకావ్యం-సౌందర్య దృక్పథం
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
తెలుగుశాఖ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,
యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్-500 019,
• ‘సౌందర్యం’ అనే పదానికి నిఘంటువుల్లో ‘చక్కదనం, అందం, అలంకారం అనే అర్థాలు ఉన్నాయి. దీన్ని మనం ఇంగ్లీషులో Beauty అనీ, Aesthetic అనీ అంటుంటాం. విద్యాత్మక అధ్యయనాల్లో ఈస్తటిక్స్ అనేది సాధారణంగా కావ్యం లేదా రచనలోని వస్తువు, దాన్ని అభివ్యక్తీకరించిన విధానాల్ని చర్చించే సౌందర్య చర్చగా కొనసాగుతోంది. కానీ, నిజంగా మనిషి ఆలోచించాల్సిన సౌందర్యం భౌతికమైంది మాత్రమేకాదని ‘నేను’ దీర్ఘకావ్యం చదివిన వారికి అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపించింది. అందుకే దీన్ని విశ్వర్షి వాసిలిగారు ‘‘నేను’’ దీర్ఘ కావ్యంలో ఎలా అభివ్యక్తీకరించారో నాకున్న పరిమిత జ్ఞానంతో ఈ పత్రంలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను.
• సౌందర్యాన్ని నిర్వచించడంలో అనేక సమస్యలు ఉన్నాయి. అందుకని సౌందర్యాన్ని నిర్వచించడం కంటే దాని అనుభవించడమే సులభంగా చేయగలుగుతాం అని చాలామంది కళాతాత్వికులు అన్నారు. తెలుగులో సౌందర్యం గురించి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి వారిలో సంజీవ్ దేవ్ ఒకరు. ఒకచోట వ్యక్తిలోని ఆనందం తన బయటి అస్తిత్వంలో గోచరించడమే సౌందర్యం అని సమాధానమిచ్చారు. ఇది మాఘమహాకవి ‘శిశుపాలవధ’ కావ్యంలో…
‘‘శనై: శనై: యన్నవతా ముపైతి
తదేవ రూపం రమణీయతాం’’ అనే శ్లోకంలోని భావమే. మొదట రూపంగా కనిపించినా లేదా రూపాన్ని ఆధారం చేసుకున్నా, తర్వాత ఆ రూపం కంటే మానవుని మనసు నుండి ఏదైతే మెలమెల్లగా ఆనందంగా బహర్గతమౌతుందో అదే సౌందర్యం.
• పదార్థాన్నిలేదా రూపాన్ని ఆశ్రయించి ఉన్నప్పటికీ అదే సౌందర్యం కాదు, దాన్ని ఆశ్రయించుకొని ఉన్న ఒక ఆనందంగా చెప్తారు. అలాగే మానవుడిగా కనిపించే ఈ పదార్థానికి కలిగే అనుభూతులు, ఆ అనుభూతుల్లోని ఆనందం, ఆ ఆనందం సత్యంగా, శివంగా, సుందరం. దీన్ని వివరించడంలో వ్యాఖ్యాతలు సౌందర్య తత్త్వాన్ని ఒక మతానికి అంటే గట్టే ప్రయత్నం చేశారనిపిస్తుంది.
• మనిషి తాను జీవించడానికి కావలసిన ప్రాథమిక అవసరాల గురించి నిరంతరం తపిస్తూ ఉంటాడు. ఆహారం దుస్తులు నివాసయోగ్యమైనటువంటి ప్రాంతం కోసం ముందుగా ప్రయత్నిస్తాడు. దీని కోసం తన చుట్టూ ఉన్న పరిసరాలు ని ముందుగా తనకనుకూలంగా మార్చుకున్నాడు. తాను ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. ఈ ఆనందం భౌతికమైన ఆనందం గా కనిపిస్తుంది. భౌతికమైన ఆనందం మనసు కూడా హాయినిస్తుంది. అంటే ఆనందం శరీరానికి మాత్రమే సంబంధించింది కాదు. ఆనందం మనసుకు సంబంధించింది కూడా.
• మనిషి తాను హాయిగా జీవిస్తున్నానని సంతోషపడుతూనే దానితోనే సంతృప్తి పడడు. తన జీవితానికి గల పరమార్థం ఏమిటి? అని కూడా ఆలోచిస్తాడు. ఇలా ఆలోచిస్తూ, జీవితాన్ని ఒక్కో మెట్టుగా ఎక్కుతూ నిజమైన సౌందర్యపుటంచులు చూడాలనుకుంటాడు.
• కొంతమంది భౌతిక అవసరాలతోనే జీవితానందాన్ని అనుభవిస్తూ జీవిత లక్ష్యాన్ని చేరుకుంటారు. మరికొంతమంది భౌతికమైన ఆనందంతో పాటు దీనికి మించింది ఇంకా ఏదో ఉందని ఆలోచిస్తూ, దాన్ని చేరుకోవడానికి తపిస్తుంటారు. దీన్నే మనం ఆధ్యాత్మిక సౌందర్యం అనొచ్చు. దీన్ని వివరించేదే సౌందర్య తాత్వికత.
• ఇక్కడే మనిషి తనును తాను తెలుసుకుంటాడు. నేను, మనం అనే భావనల నుండి విడివడతాడు. ఈ విశ్వంతో మమేకం అవుతాడు. తన భవ బంధాలనుండి విముక్తి అవుతాడు. అందరిలో తననీ, తనలో అందరినీ చూసుకోవడం మొదలుపెడతాడు. ఈ ఆనందం వ్యక్తిగతం కాదు, వ్యక్తిగతంలా కనిపించే ఒక నిజమైన సౌందర్యం...నిరపేక్షమైన సౌందర్యం. అలాంటి సౌందర్య దృక్పథమే 'విశ్వర్షి' వాసిలి వసంతకుమార్ గారి 'నేను' దీర్ఘకావ్యంలో నాకు కనిపించింది. దాన్ని నేను తాత్త్విక సౌందర్యం అంటున్నాను.
• మానవుడు అలాంటి సౌందర్యానునుభూతికి రావడానికి ఎంతో పరిణతి పొందాలి. అందుకని సౌందర్యం అంటే అర్థం ఏమిటి? అనుకుంటే అందంగా జీవించడంగా చెప్పుకుంటాం. మరి- అందం అంటే ఏమిటి? అందమంటే సత్యం. మరి - సత్యం అంటే ఏమిటి? కేవలం భౌతికంగా కనిపించేది మాత్రమేనా సత్యం? సత్యం అంతా మన కళ్ళకు గోచరిస్తుందా? సత్యమంతా మనకు అవగతమై పోతుందా? అందుకని సత్యం ఒక అన్వేషణ. సత్యం ఒక నిరంతర అన్వేషణ. ఆ అన్వేషణను మనకు అందిస్తుందనుకుంటున్నాను- ఈ 'నేను' దీర్ఘ కావ్యం. ఈ కావ్యానికి రెండవపుట అట్టమీద ఈ లక్ష్యం స్ఫష్టంగా కనిపిస్తుందన్నట్లుంది.
‘‘ప్రపంచంలో మనం ప్రతిబింబాలం
జీవితంలో నీడలా వెంటాడే ప్రత్యక్షసాక్షులం
బింబంలో స్ఫష్టంగా అగుపిస్తాం
కానీ హృదయం కనిపించదు
నీడలో రేఖామాత్రంగా ప్రతిఫలిస్తుంది
కానీ మనసు వినిపించదు
ఇలా మనకు మనమే
స్ఫష్టంగా రూపాలం... అస్పష్టంగా నీడలం
అయినా క్రాంతి ప్రసారణతోనే
రూపం అయినా...నీడ అయినా...
అగుపించే వ్యక్తిత్వంలో కనిపించని కోణాలు ఎన్నెన్నో!
వినిపించే జీవితంలో వెలికిరాని రహస్యాలు ఇంకెన్నో! ’’
• కొంతమంది సౌందర్యం గురించి చెప్తూ, వ్యక్తి అంతర్గతంగా ఉన్నదే బహిర్గత ప్రపంచంలో అక్షరాల రూపంలో గానీ, మాటల రూపంలో గానీ, చేతల రూపంలో గాని వ్యక్తమవుతుందంటారు.
• ఈ దీర్ఘకావ్యంలో సౌందర్య దృక్పథాన్ని అవగాహన చేసుకోవడమంటే సాహిత్యంలో మనం సర్వసాధారణంగా చర్చించుకునే కళ- ప్రయోజనం గురించి చర్చించుకోవడం వంటిది కాదనుకుంటున్నాను. ఇందులో ఉన్న సౌందర్యం నిరపేక్ష మైన సౌందర్యం గురించి చర్చించుకోవడం వంటిది. విశ్వ చైతన్యాన్ని తెలుసుకోవాలనుకునే చైతన్యం గురించి చర్చించుకోవడం వంటిది.
• సాహిత్యంలో సాధారణంగా చర్చించుకొనే కళ కళ కోసమా? కళ ప్రజలకోసమా ? అనే ఒక చర్చ ఉంది. నిజానికి దీన్ని కూడా మనం స్వాగతించాల్సిందే. కనీస అవసరాలు తీరని వారికి ఆధ్యాత్మిక సౌందర్యం గురించి చెప్తే వాళ్ళకు అర్థం కాదు. అక్షర జ్ఞానం కూడా లేనటువంటి వాళ్లకి సాహిత్యంలో అభివ్యక్తి నవ్యతల గురించి చెప్తే వాళ్లకు అర్థం కాదు. కాబట్టి అది కూడా అవసరమే . కానీ నేను దీర్ఘ కావ్యం ఆ స్థాయిని దాటిపోయింది. ఒక మేధోగత పాఠకుణ్ణి ఆలోచించేలా చేస్తుంది. ఆ మేథోగతపాఠకుడు దీన్ని అవగాహన చేసుకుంటే, దీని సారాంశాన్ని మళ్లీ సామాన్యులకు అందించగలుగుతాడు. శాస్త్రం చేసే పనికూడా ఇదే. సాంకేతికత సామాన్యులందరికీ అర్థం కాదు, కానీ, ఆ సాంకేతికతను ఉపయోగించి, రకరకాలుగా సామాన్యుడు ఉపయోగించుకునేలా శాస్త్రవేత్త ప్రయత్నిస్తాడు.
నా అక్షరం
ఆత్మ దర్శనాల నిఘంటువు
సాధనారహస్యాల సర్వస్వం
అన్నట్టు
నీ ఆత్మ తలుపులు తెరిస్తేనే కదా
నా అక్షరం నీకు ఉపదేశామృతమయ్యేది (పుట: 76)
• ఈ వాక్యాలే చెప్తున్నాయి... పాఠకుడికి అర్థం కావాలంటే 'నేను' అనే వైయక్తిక స్థితి నుండి 'నేను లోనే నువ్వూ ఉన్నావు' అనే స్థితికి ఎదిగినప్పుడు మాత్రమే ఈ కావ్యం అర్థమవుతుంది. అందుకే దీన్ని మేథోగతపాఠకుడు కావాలన్నాను.
'' నేను
కోరికను
ఏకోరికా
నాదికానివాడను'' (పుట:80) అనడంలో తన అభిప్రాయాన్ని తానే ఖండించున్నట్లుండే వైరుధ్యంలా అనిపిస్తుంది.
• రససిద్ధాంతంలో శాంతరసం...దాని స్థాయీ భావం 'శమం' గురించి ఇక్కడోసారి ఆలోచించాలి.నిర్వికార చిత్తవృత్తి విశేషాన్ని కదా శమం అంటారు. ఆ స్థితిలో ఏ కోరికలపట్లా ఆసక్తి లేనట్లనిపిస్తుంది. కానీ తాను అనుభవించిన జీవితంలోని సుఖం దుఃఖాలు ఇతరులు అనుభ వించడంలో తనకు నిర్వికారత ఉండదు. అది పరిణత స్థితి. ఆ స్థితిలో కోరికలు తీర్చుకోవాలని ప్రయత్నించే వారిని చూసి సంతోషిస్తాడు. మానవజీవితంలోని ఆధ్యంతాల పరిణామాన్ని గుర్తిస్తేనే ఇక్కడ కవి కోరికలోని వైరుధ్యం అర్థమవుతుంది.
• ‘‘నేను
మనిషిని
వందేళ్లు జీవించాల్సిన వాడిని
నువ్వు వృక్షానివి
వందేళ్లు విస్తరించాల్సిన దానివి.
అయినా ఇద్దరమూ
వర్తమానంలో కరుగుతున్నవాళ్ళమే!
అని చెప్పి ఈ చరాచర జగత్తులో మనిషీ, ప్రకృతీ.. అంతా కూడా నశించి పోవాల్సిందేననే సత్యాన్ని విశదీకరిస్తూ
.....
మిత్రమా
కడచూపుకు
నేనూ కట్టినే నువ్వూ కట్టెవే
కట్టకడపటికి
మనది విభూతి యోగమే' అంటారు. ఇది సత్యం. భౌతిక సత్యం. కానీ విభూతి అయినతరువాత దానితో ఉన్నటువంటి జీవశక్తి ఏమవుతుంది? అది జీవిత సత్యాన్వేషణ.
(పుట: 94, 95)
ఇది అనుభూతుల సంగమం
ఇందులో నేను ద్వైతాద్వైతంరూపంగా కనిపిస్తాడు
ఒకమాతృమూర్తిలా కనిపిస్తాడు
ఇందులో నేను ఒక పసి పిల్లాడిలా కనిపిస్తాడు
ఇందులో నేను ఆవేశం ఉరకలెత్తే ఉడుకు రక్తం గల యువకుడిలా కనిపిస్తాడు
ఇందులో నేను ఒక శ్రామికుడులా కనిపిస్తాడు
ఇందులో నేను దేనికోసం వెతుకుతున్నాడో
దేనికోసం బ్రతుకుతున్నా డో తెలియని వాడిలా కనిపిస్తాడు. తెలిసి సమాజాన్ని తనకనుకూలంగా మార్చుకునే తెలివైనవాడిగా మార్చుకునే మనిషిలా కనిపిస్తాడు
''నేను అమ్మతనాన్ని ఆరగించిన పనితనాన్ని
నాన్న తనాన్ని పోషించిన పాఠ్యాంశాన్ని
పాఠశాలన వికసించిన జ్ఞానప్రసూనాన్ని
కళాశాలన ప్రభవించిన విజ్ఞాన వలయాన్ని
విశ్వవిద్యాలయాన శోధించిన అక్షరతత్వాన్ని'' (పుట.105) అని కవిత్వంలో ఈ భావాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయనిపిస్తుంది.
• నిజానికి ఈ దీర్ఘ కవితా సౌందర్యం మనకు తెలియాలంటే దీనిలో అనేక సందర్భాలలో ఉపయోగించిన ఆ పారిభాషిక పదాలు, ఆ పదాలలోని మార్మికత మనకి తెలిసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఇది కేవలం సాహిత్య గ్రంథం మాత్రమే కాదు. ఇది ఒక తత్వ శాస్త్రానికి సంబంధించిన సాహిత్య దర్శనం.
ఇది ఇది మానవుడు నిరంతరం చేస్తున్న అన్వేషణకు ఒక మేధో గత వైజ్ఞానిక రచనా రూపం.
ఇది ఇది విశ్వాన్ని అక్షరరూపంలో వర్ణించే ఒక మహోన్నత ప్రయత్నం.
అందుకే ఒక చోట ఇలా అంటారు.
''నేను
ఆత్మను అక్షరం లోకి దింపుతానంటే
ఆత్మ అక్షయంగా కదలాడతానంది
అక్షర అక్షరాన్ని దున్నుకుంటూ పొమ్మంది
మట్టిపెళ్లలు దాగిన మనిషి కథను చూడమంది
కథను చరిత్రగా మలిచిన తీరు కనమంది
చరిత్రకెక్కని శేషభాగాన్ని చేయమంది.(పుట.133)
• నేను దీర్ఘ కావ్యం ఒక క్రైస్తవుడు చదువుకుంటే అది క్రైస్తవ దార్శనికతను వివరించే గ్రంథం గా కనిపిస్తుంది
• నేను దీర్ఘ కావ్యం ఒక హిందువు చదువుకుంటే అది ఒక హిందూ జీవన దార్శనికతను చూపిస్తుంది.
• నేను దీర్ఘ కావ్యాన్ని ఒక బౌద్ధ సన్యాసి చదువుకుంటే ఒక బౌద్ధ దార్శనికత కనిపిస్తుంది
• ఒకవేళ మనిషిగా మాట్లాడలేని ఈ ప్రకృతి కనుక నేను దీర్ఘ కావ్యాన్ని చదువుకుంటే అది తన అస్తిత్వం గురించి చెప్తున్నదని సంతోషిస్తుంది.
• ఒక్క మాటలో నేను దీర్ఘకావ్యం ఒక ప్రాంత, కాల, కుల, మత,జాతి భేదాలు లేకుండా మనిషికీ ఈ విశ్వానికీ మధ్య గల అవినాభావ సంబంధాన్ని అన్వేషించే గొప్ప కావ్య సౌందర్యం అనుభూతిలోకి వస్తుంది.
• ముగింపు
ఈ ‘నేను’ దీర్ఘ కావ్యం గురించి మాట్లాడ్డమంటే, మళ్ళీ కవిత్వమై మాట్లాడ్డమేనేమో అనిపిస్తుంది. విమర్శ రచనలోని గుణ గణాలను విశ్లేషిస్తుంది. పరిశోధన రచనలోని తత్వాన్ని అన్వేషిస్తుంది. కళాతాత్త్వికుడు సౌందర్యాన్ని ఆస్వాదిస్తాడు. ప్రతిదానిలోనూ సౌందర్యాన్ని చూస్తాడు. ప్రతిదానిలోనూ మమేకమై ఒక మహా అనుభూతికి గురవుతాడు. ఈ కావ్యం చదివిన తర్వాత నాలో విమర్శకుడు, నాలో పరిశోధకుడు కంటే, నా కళా తాత్త్వికుడే నన్ను జయించాడు. మనకు తెలియనిదేదో విశ్వంలో ఉన్నట్లే, పాఠకునికే తెలియనిదేదో ఈ నేను దీర్ఘకావ్యంలో కూడా ఉందనడమే నిజమైన సౌందర్య దృక్పథంగా భావిస్తున్నాను.
( యోగాలయ, సికిందరాబాద్ వారు 19 .09.2020 నుండి 25.09.2020 వరకు అంతర్జాలం ద్వారా జరుగుతున్న తెలుగు సాహిత్యంలో నేను యౌగిక కావ్య సప్తపథ సమాలోచన సదస్సు’లో సమర్పించిన పత్రం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి