నిన్న రాత్రి (13.9.2020)బాబు గాడు (దార్ల శ్రీనివాసరావు) చేసిన ఒకపనికి నేను ఆశ్చర్యపోయాను. భయపడ్డాను కూడా. నేను నా కంప్యూటర్ దగ్గర కూర్చుని నా పని నేను చేసుకుంటున్నాను. బాబు గాడు మెల్లగా నేనున్న రూమ్ దగ్గరికి బీన్ బ్యాగ్ తెచ్చుకున్నాడు. దాని మీద కూర్చున్నాడు తనలో తాను ఏడవడం మొదలు పెట్టాడు. కుమిలి కుమిలి ఏడవడం మొదలుపెట్టాడు. నేను వాడిని చూసి నా గుండె తరుక్కుపోయింది. బయటకు శబ్దం రాకుండా తనలో తానే కుమిలిపోతూ ఏడ్వడం నాకు ఆశ్చర్యమనిపించింది. బాబు గాడి కళ్ళల్లో నీళ్లు చూసేసరికి నా మనసు మనసులో లేదు. గబగబా వెళ్లి దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకున్నాను. ఏడుస్తున్న ఆ దృశ్యం చూసి నాకు గుండెకోత కోసినట్లు అనిపించింది. ఈ ప్రపంచమంతా ఒక్కసారిగా స్తంభించిపోయినట్టనిపించింది. ఒక్కోసారి గా నిశ్చేష్టుడనయ్యాను. ''మంజూ! ఒకసారి ఇటు వచ్చి చూడు' అనే మాటలు అప్రయత్నంగా వచ్చే
శాయి నా నోటి నుండి. అంతే వెంటనే వాడ్ని దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకొని ముద్దుపెట్టుకున్నాను.
అసలు ఏం జరిగింది ?
వాడికి అన్నం తినిపిస్తూ మొబైల్లో పాటలు పెడుతూ ఉంటుంది వాళమ్మ. ఆ పాటల్ని ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ సంతోషంలో అటు ఇటు ఊగిపోతూ సంతోషంతో ముఖం మీద తలతోనో, చేతులతోనో కొడుతూ ఉంటాడు. అలా నన్ను కూడా చాలాసార్లు కొట్టాడు. అది చాలా గట్టిగా తగులుతుంది. పైగా అది ముక్కు మీదా, దవడ మీదా, ముఖం మీదా...ఇలా తగిలేసరికి ఆ బాధ చెప్పనలవి కాదు . కొన్నిసార్లు సంతోషం పట్టలేక మరికొన్ని సార్లు చిరాకు వచ్చో తెలియదు మొహాన్ని పట్టుకుని రక్కేస్తాడు. వాడికి ఇంకా రెండేళ్లు పూర్తి కాలేదు. మాటలు రావు. కానీ, మనం ఏదైనా చెప్తే వాడికి అర్థం అయిపోతుంది. వాడ్ని పొగిడితే సంతోష పడతాడు. వాడ్ని తిడితే బాధ పడి పోతాడు. వాడి ముఖకవళికల్లో ఆ భావన స్పష్టంగా తెలుస్తుంది.
ఇలాంటి సంఘటనే నిన్న కూడా జరిగింది. వాళ్ళమ్మ సరదాగా 'నాదగ్ఖరకు రాకు..పో' అంది.' నేను కంప్యూటర్ దగ్గర కూర్చుని పనిచేసుకుంటున్నా, ఆ మాటలు నాకు వినపడుతూనే ఉన్నాయి. ఆ మాటలు వాడి మనసుని బాధపెట్టేశాయి. మౌనంగా వచ్చేసి, కూర్చొని ఏడ్చేస్తున్నాడు. రెండేళ్లు నిండకపోయినా, మనం మాట్లాడే మాటలకు సమాధానం చెప్పగలిగే మాటలు రాకపోయినా, దాని ప్రతిస్పందన కనిపిస్తుంది. దీనికి ఈ సంఘటనే నిదర్శనం. వాళ్ళమ్మ వచ్చి, సరదాగా అన్నాను నాన్నా...నిన్నెకతకడికి వెళ్ళమంటానంటూ కాసేపు లాలిస్తే మళ్ళీ నవ్వుతూ ఒళ్ళోకి వెళ్ళిపోయాడు...
"ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 14.5.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి