"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

08 జూన్, 2020

యూనివర్సిటీ లో నా మిత్రులు 3

''తుజే డేఖా తో  యే జానా సనమ్
ప్యార్ హోతా హై దివానా సనమ్ ..'' పాట వింటున్నప్పుడల్లా నాకు కుమార్ సాను గొంతు
వినిపించదు! నాకు ఆ పాట చూస్తున్నప్పుడు షారూఖ్ ఖాన్ కూడా కనిపించడు...మా నారాయణం సురేశ్ బాబు గాడి గొంతే వినిపిస్తున్నట్లు ఉంటుంది.
మా నారాయణం సురేశ్ బాబుగాడే కళ్ళెదుట మెదులుతున్నట్లనిపిస్తుంది. అందుకే ఆపాట చూడ్డం కంటే, వినడమే నాకిష్టం. ఎం.ఏ.లో చేరిన కొత్తలోనే ఆ సినిమా వచ్చిందనుకుంటాను. ఆ పాటే ఎప్పుడూ పాడుకొంటూ గంతులేస్తూ కనిపించే వాడు..మా నాసుబాబు. నిజానికి మా నాసుబాదుది వెన్నలాంటి మనసు. కానీ బయటకు కొండలా కనిపించేవాడు. మంచి సాహిత్యాన్ని ఆస్వాదించడమే కాదు, మంచి కవిత్వాన్ని కూడా రాస్తాడని వాళ్ళమ్మ గారి పేరుతో వేసిన పుస్తకాన్ని చూస్తే గాని తెలియలేదు.   మా బ్యాచ్ లో మా అందరికంటే వయసులో చిన్నవాడులా ఉండేవాడు.
ఆ వయసులో ఉండాల్సిన హుషారంతా వాడిలో కనిపించేది.
ఏమాత్రం ఖాళీ ఉన్నా, వెంటనే లైబ్రరీకి వెళ్ళిపోయేవాడు. తెలుగు పుస్తకాలు మాత్రమే కాకుండా  ఇంగ్లీష్ పుస్తకాలు కూడా చదివేవాడు. మాట్లాడేటప్పుడు కూడా ఇంగ్లీష్, హిందీ పదాల్ని ఎక్కువగా ప్రయోగించేవాడు. మా అందరికంటే సన్నగా ఉండేవాడు. ఎప్పుడూ ఇన్సర్ట్ చేసుకుని, ఒక్కవెంట్రుక కూడా చెరిగిపోకుండా నున్నగా దువ్వుకొనేవాడు. మేమేన్నా సరదాగా అన్నా నవ్వేసి ఊరుకొనేవాడు. వాడి నోటి నుండి పరుషంగా వచ్చిన ఒక్కమాట కూడా నేనింత వరకు విన్లేదు. బాధను తనలోనే దాచుకొని సంతో‌షాన్ని మాత్రమే మాతో పంచుకొనే మా ఈశ్వర్  గాడిలాంటివాడే వీడూ ! ఎం.ఏలో చేరిన కొత్తలో మేమంతా కలిసి అంటే
నేనూ, ఉమా, ఈశ్వర్, నాసుబాబు కలిసి ఒకసారి గోల్కొండ చూడ్డానికి వెళ్ళాం. నాకేదో బాగా రూటు తెలిసినట్టు 'ఫలానా నెంబరు' బస్సెక్కాలని చెప్పేవాణ్ణి. ఆ రోజు మెహిదీపట్నం వరకు వెళ్ళి, అక్కడనుండి గోల్కొండ వెళ్ళే బస్సు కోసం చూస్తున్నాం. వెంటనే నేను '' అఫ్జల్ గంజ్ వెళ్ళే బస్సెక్కితే, అక్కడ నుండి గోల్కొండ వెళ్ళే బస్సులొస్తాయ'న్నాను. అలాగే చేశామనుకుంటున్నాను. ఆ తర్వాత నాబస్సురూట్ జ్ఞానాన్ని మా మిత్రులకు చెప్తే, ఒకటే నవ్వు!. ఇక, అప్పటి నుండీ నేనేదైనా బస్సు పేరు చెప్తుంటే చాలు... ''అఫ్జల్ గంజ్ వెళ్ళిపోదామంటాడ్రోయ్ దార్ల'' అనేవాడు మా నాసుబాబు. అలా ఏడిపించడంలో చాలా ముందుండే వాడు. ఒకసారి స్నానం చేస్తుంటే ఫోటో తీశానని ఏడ్పించేటంతటి అల్లరి చేసే ముదురు కృష్ణుడు వాడు! చాలా రోజుల తర్వాత ఒకసారి మళ్ళీ నాసుబాబు, మోహన్, ఈశ్వర్, ఉమా, నేనూ మళ్ళీ యూనివర్సిటీలో కలిశాం. ఒకరోజంతా క్యాంపస్ లో నే తిరిగాం.  అప్పుడు తీసిన ఫోటోల్లో ఇదొక ఫోటో... మళ్ళీ మనముందుంచాడు మానాసుబాబు.
నాసుబాబు  ఎం.ఏ.పూర్తి చేసిన తర్వాత కూడా ఆ పరిచయాన్ని అలాగే పరిమళింప జేస్తున్నాడు. హైదరాబాద్ నుండి మా ఊరెళ్తుంటే వాళ్ళింటికి వెళ్ళకుండా మా ఊరుకునేవాడుకాదు. అలా అనేక సార్లు విజయవాడ- వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ళ కుటుంబంతో కూడా  అనుబంధాన్ని పెనవేసుకొనేలా చేసిన రాగబంధం మాది.
(సశేషం)


కామెంట్‌లు లేవు: