"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

28 మే, 2020

యూనివర్సిటీ లో నా మిత్రులు 2

Part 2
రెగ్యులర్ గా క్లాసులు మొదలైన తర్వాత ఇతరుల రూమ్ లో గడపటం తగ్గించేశాడు ఉమా. ఎప్పుడన్నా వస్తే
మా రూముకే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేవారు.
మరో అందగాడు మోహన్ అని పిలుచుకునే దారపునేని మోహన్. అప్పుడే సినిమాల్లో డ్రీమ్ బోయ్ హీరోగా పిలుచుకొనే అరవిందస్వామి అని మా వాళ్ళు చాలామంది పిలిచేవారు. మా క్యాంపస్ లో నెమళ్ళు కూడా మోహన్ జుట్టుని ఎగరేసే స్టైల్ చూసి కుళ్ళు కునేంత వెరైటీగా తలని ఎగరేసే వాడు . ఆ సిల్కీ హెయిర్ గాలికి ఎగురుతుంటే, దానికి తగ్గట్టే చిరుదరహాసాన్ని విసురుతుండేవాడు. నేనూ, ఉమా, ఈశ్వర్ మరి కొంతమంది ముందు వరుసల్లో కూర్చునే వాళ్ళం. అది ఒకందుకు మంచిదనిపించేది. దృష్టంతా పాఠం చెప్పేవాళ్ళు మీదే పెట్టాలి. వాళ్ళు చెప్పేది స్పష్టంగా వినిపించడం  వరకూ మంచిదే. కానీ, ఒక్కోసారి కొంతమంది పాఠం వినేటప్పుడు మా మొహాల గురించి వెనుక వరుసల్లో కూర్చొనేవాళ్ళు కామెంట్స్ చేస్తుండేవారు. అలా వెనుకవైపు వరుసల్లో కూర్చొని తాను బాగా ఎంజాయ్ చేస్తున్నానని మిమ్మల్ని అప్పుడప్పుడూ సరదాగా ఏడిపించే వాడు!
ఆలిండియా రేడియో, హైదరాబాద్ స్టేషన్ కు నాకు పరిచయం చేసింది మోహనే. అక్కడ సుమనస్పతి రెడ్డిగారు, మంచి సాహితీవేత్త ఆయన్ని పరిచయం చేసింది కూడా మోహనే. ఆ తర్వాత ఆకాశవాణిలో పుస్తకపరిచయాలతో మొదలై  నాకు గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్, ఎయిడెడ్ డిగ్రీ లెక్చరర్ గా ఉద్యోగం వచ్చేవరకూ అక్కడే క్యాజువల్ క్యాంపియర్ ( మామూలు మాటల్లో చెప్పాలంటే ఎనౌన్స్)గా పని చేస్తూనే ఉన్నాను.  ఒక రోజు తేడాతో ఆ రెండు ఉద్యోగాలు వచ్చాయి. ఆకాశవాణికి నన్ను, ఉమా, ఈశ్వర్, అంజనీబాల, నారాయణం సురేశ్ బాబు (నాసు) మొదలైన వాళ్ళనెంతో మందిని మా మోహనే పరిచయం చేశాడని గుర్తు. తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చినా, నేనైతే అక్కడ చేరాను. కానీ, మోహన్ దాన్ని సీరియస్ గా పట్టించు కోలేదు.
నిజానికి మోహన్ జీవితాన్ని సీరియస్ గా తీసుకొనే వాడు కాదనిపించేది నాకు. అప్పటికే వాళ్ళ అన్నయ్య లెక్చరర్ గా ఉండటం, జీవితం హాయిగానే  సాగిపోవడమో, ఎందుకో తెలియదు గానీ, దేన్నీ అంత సీరియస్ గా తీసుకొనే వాడు కాదనిపించేది. మరలా అందర్నీ నవ్వించే వాడు. మోహన్ తో క్లాసు లో అందరూ బాగా కలిసి ఉండేవారు. అయినా, మోహన్ ని మేమే హైజాక్ చేశామనిపిస్తుంటుంది. మనవాడి మాటల్లో ప్రగతిశీల భావాలు గమనించే వాణ్ణి. వర్గనిర్మూలన గురించి మాట్లాడేవాడు. ఖమ్మం ప్రభావం కదా అనుకునేవాణ్ణి. ఫిరదౌసి కావ్యాన్ని రాస్తూ మంచిమంచి పదాలను కూర్చి పద్యాలను రాసిన జాషువా లా నిఘంటువు చూసి మరీ కవిత్వంలో పదాల్ని పెట్టేవాడు మోహన్. రాసేవాడు. నాకులాగా పత్రికలకు పంపేవాడు కాదు. మాకు చదివి వినిపించే వాడు. అమ్మాయిలు, అబ్బాయిలనే తేడాలేకుండా అందరితో సరదాగా ఉండేవాడు.. తామరాకు మీద నీటి బొట్టులా! నిజానికి అందర్నీ ఏకంచేయగలిగి, వాళ్ళను నడిపించగలిగే నాయకత్వ లక్షణాలు  మోహన్ లో ఉన్నాయనిపించేది. కానీ, ఏ ఉద్యమానికీ, నాకు తెలిసి నాయకత్వం వహించే వాడు కాదు. యూనివర్సిటీలో 'జర్మన్ మీట్'- అంటే తూర్పు గోదావరి (తూ.గో), పశ్చిమ గోదావరి ( ప.గో)ల నుండి వచ్చిన వాళ్ళు ఏడాదికోసారి ఏర్పాటు చేసుకొనే సమావేశం... భవిష్యత్తులో ప్రాంతీయ ద్వేషాలకు ఆజ్యం పోసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదనే మోహన్ మాటలు నాకు స్ఫూర్తినిచ్చేవి. మేము అటువంటి వాటికి దూరంగా ఉండటానికీ, అటువంటి వాటిని ప్రోత్సహించకపోవడానికీ, మా తెలుగు క్లాసులో అన్ని ప్రాంతాల వాళ్ళూ ఉండటం, ఏదైనా పరస్పరం చర్చించుకోవడం మాకెంతగానో ఉపయోగపడేది. అందుకే ఏమి జరుగుతున్నా పసిపాపలా నవ్వేసి ఊరుకునే తాత్త్వికుడిలా అనిపించేవాడు మోహన్.  నిష్కల్మషంగా కలిసిపోయే వాడు. చిన్నపిల్లాడిలా హోలీని ఎంజాయ్ చేసేవాడు. నాకు మోహన్ అంటే ఒకపసిపాప నవ్వుతూ కనిపించే నిష్కల్మషంగా పరిమళించే ఆ  ముఖమే నాముందు కనిపిస్తుంది.
(సశేషం)



కామెంట్‌లు లేవు: