నీకోసం ఒత్తులువేసుకొని వెలిగించుకున్న
ఆ కళ్ళముందలా తిరుగుతూనే
ఎందుకలా నీచుట్టూ
సన్నని తెరల్నేవో చుట్టుకుంటున్నావు
నీకోసం వాకిట్లో పరిచిన ఆ చూపుల్నలా
తాకుతూనే
ఎందుకలా ముందడుగు వేయలేకపోతున్నావు
నీ కోసం తల్లడిల్లుతున్న ఆ హృదయాన్ని సమీపించీ హత్తుకోలేక
ఎందుకలా తత్తరపాటుకి గురౌతున్నావు నీకోసం ముందుకు చాచి పిలుస్తున్న
ఆ రెండుచేతుల్నీ పరుగునవచ్చి
నీ నడుముకు చుట్టుకున్న తీపి జ్ఞాపకాలేవో తరుముతున్నా
ఎందుకలా నీలోకి నువ్వే ముడిచికిపోతున్నావు
ఎందుకలామనసునంతాపర్వతాలతో
కప్పుకుంటావు
ఎందుకలా యమునా ప్రవాహాన్నాపుకుంటావు
నీకు మాత్రమే కనిపించే మబ్బుల కళంకమేదో
నన్ను చేరుకోనివ్వడంలేదని నీకు తెలుసు
కళంకాన్ని కూడా నిష్కళంకంగా
ముద్దాడే నిలువెత్తు నిర్వ్యాజ అనురాగ క్షేత్రం పిలుస్తోంది రా!
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ 14.5.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి