నాకిది కొత్తేమీ కాదే!
ఈ ఒంటరితనం నాకు
కొత్తేమీ కాదే
ఎన్నేళ్ళుగానో
ఊరికిదూరంగా
విసిరేయబడ్డవాణ్ణి కదా
ఒంటరిగా
కుమిలిపోవడం నాకు అలవాటైపోయింది!
ఆది మానవుణ్ణి
ఆధునిక మానవుడిగా చేస్తున్నాయనుకొన్న
ఆ కత్తులు
నన్ను
ముట్టుకోనంటే
నున్నగా గెడ్డం గీసుకోవడం
నున్నగా జుత్తుని
కత్తిరించుకోవడం
నాకు కొత్తేమీ
కాదే
ఆ వంకరటింకర
జుత్తునెలా వంచాలో
నాకు
అలవాటైపోయింది !
మైల గుడ్డలూ
పిల్లల పీతి
గుడ్డలూ
సంతోషంగా
తీసుకెళ్ళి తెల్లగా ఉతికేస్తున్న ఆ రాళ్ళు
నా బట్టల్ని
మాత్రం ముట్టుకోనంటే
ఆ మురికినంతా
నాగుండెకేసి నేనేబాదుకోవడం
నా దుస్తుల్ని మల్లెపువ్వుల్లా చేసుకోవడం
నాకు కొత్తేమీ
కాదే
ఆ మురికినెలా
పోగొట్టాలో నాకు అలవాటైపోయింది!
పగలనకా, రాత్రనకా
ఎండనకా, వాననకా పనిచేసినా
నా శ్రమంతా నీకు-
నేను చేయాల్సిన నిర్భంధ
సేవయ్యింది
పట్టెడు మెతుకులు
దొరక్క
పుట్టెడు ఆకల్ని
నింపుకోవడం
నాకు కొత్తేమీ
కాదే
అవమానాల్నీ,
ఆకల్నీ రోజూ నిద్రపుచ్చడం
తరతరాలుగా నాకు
అలవాటైపోయింది!
కత్తుల్నీ, రాళ్ళనీ, నా చుట్టూ ఉన్న మనుష్యుల్నందర్నీ
భయపెట్టి నాకు దూరం చేసిన మనువా?
నువ్వు నాకిలాంటి సమయంలో ఎంతమేలుచేసిపెట్టావు
భయపెట్టి నాకు దూరం చేసిన మనువా?
నువ్వు నాకిలాంటి సమయంలో ఎంతమేలుచేసిపెట్టావు
ఎన్నాళ్ళుగానో
నన్ను హింసించిన
ఆ సామాజిక దూరం
భారాన్నిప్పుడు
కరోనా రూపంలో
నిన్ను కూడా కొన్నాళ్ళు
మొయ్యమంటుందంతే
ఎన్నాళ్ళుగానో
పడిన నామానసిక సంఘర్షణను
నిన్ను కూడా
కొన్నాళ్ళు భరించమంటుందంతే
ఎన్నాళ్ళుగానో
అనివార్యమైన నా అలవాట్లు
నిన్ను కూడా
కొన్నాళ్ళు చెయ్యమంటుందంతే!
నన్నిన్నేళ్ళు సామాజికంగా దూరం పెట్టిన
నాటి మనుధర్మశాసనానుభవంలాంటిదే
నాటి మనుధర్మశాసనానుభవంలాంటిదే
నీలో ఓ కొత్తమనిషిని చూడాలంటుందంతే!
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
సెంట్రల్
యూనివర్సిటి, హైదరాబాదు. 22.4.2020
Mobile:
9182685231
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి