"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

30 ఏప్రిల్, 2020

నా కుందేలు పిల్ల?


నా కుందేలు పిల్ల?
27.04.2020
మా బాబుగాడు పడుకొనే సరికి కనీసం రాత్రి పన్నెండున్నర దాటుతుంది. కొన్నిసార్లు ఒంటి గంటా రెండు కూడా అవుతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు నాదగ్గరకొస్తాడు. మొబైల్లో పాటలు పెట్టించుకుంటాడు. అవి వింటూ నామీద దొర్లుతూ, మధ్యమధ్యలో నన్ను వాడూ, వాణ్ణి నేనూ ఒకర్నొకరం కాసేపు కవ్విస్తూ, నవ్విస్తూ ఆడుకుంటాం. తర్వాత కొంతసేపటికి వాడు గానీ నేనుగాని ఎవరొకరం నిద్రపోతాం. పనులు చేసుకుంటూ వాళ్ళమ్మ మమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది. ముందు నేను నిద్రపోతే వాణ్ణి తీసుకెళ్ళి వాడ్ని నిద్రపుచ్చుతుంది. ఒకవేళ వాడే ముందు నిద్రపోతే ఇంకాసేపు పనులు చేసుకొని వచ్చి వాడ్ని తన పక్కనేసుకుంటుంది. ఇది మాకీమధ్య బాగా అలవాటైపోయింది. అలాగే రాత్రి కూడా పడుకున్నాను. వాడు పడుకున్న తర్వాత నేను లేవాలి. బాగా  పేరుకుపోతున్న పనుల్లో కొన్నింటినైనా పూర్తిచేసుకుందామనుకున్నాను. మళ్ళీ అప్పుడే అనిపించింది- ఇన్నాళ్ళూ చదివిందీ, ఇన్నాళ్లూ రాసినవీ చాల్లే అని! నన్నయ్యగారు ఊరికే అన్నారా ‘‘ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాంద్ర పరాగప్రసరంబు జందనము జంద్రజ్యోత్స్నయుం పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్‌ శీతమే’’ అని. వీడితో ఆడుకునే ఈ అద్భుతమైన రోజులు మళ్ళీ రమ్మంటే మాత్రం వస్తాయా! అనుకుంటూ వాడితో ఆడుకుంటూ, ఆడిస్తూ వాడు నిద్రపోయిన తర్వాత నేనూ నిద్రపోయాను. కానీ ఎప్పుడు నిద్ర పట్టేసిందో నాకే తెలియదు.




***
ఆకాశం నిండా వెన్నెల కాస్తుంది. నేనెక్కడికో బయలుదేరాను . దారి పొడవునా పరిమళం. నేను వస్తోంటే ఏవో పూలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయనిపిస్తుంది. నడుస్తుంటే నా దారిలో కాళ్ళకింద మెత్తగా ఏవో పరిచినట్లనిపిస్తుంది. వెళ్ళేకొద్దీ కొత్తలోకంలో ప్రవేశిస్తున్నట్లనిపిస్తుంది. ఎప్పుడూ పొందని సువాసనల అనుభూతి మనసంతా నిండిపోతుంది.
అలా నడుచుకుంటూవెళ్ళిపోతున్నాను. ఎక్కడికో నాకే తెలియడం లేదు. ఏవో తెల్లని పర్వతాలెక్కుతున్నాను. మొదట్లో చుట్టూ కనిపించిన మహావృక్షాలు మాయమైపోతున్నాయి. చెట్లకు బదులు ఏవో సన్నని తీగల్లాంటి మొక్కలు. తెల్లని పూలు. దీపావళికి అలంకరించుకునే చిన్న చిన్న ఎలక్ట్రిక్ బల్బులు వెలుగుతూ, ఆరుతూ, వెలుగుతున్నట్లనిపిస్తుంది. తెల్లని నురుగ తలమీద  తలంబ్రాల్లా కురుస్తుంది. నా కళ్లల్లో అంతకుముందెప్పుడూ లేనంత ఆనందం. నా కళ్ళల్లోని వెలుగే నా దారికి వెలుగు చూపిస్తున్నట్లనిపిస్తుంది. ఎటుచూసినా ప్రశాంతంగా ఉంది. అలాగే నడిచిపోతున్నాను. ఇంకా అలాగే నడిచిపోతున్నాను. పెద్దపెద్ద పర్వతాలు నా ప్రయాణానికి అనువుగా ఒదిగిపోతున్నట్లనిపిస్తున్నాయి.
దారిలో అమాంతంగా ఒక కుందేలు పిల్ల. ఎంత అందంగా ఉంది. నన్ను చూసి నా ఎదురుగా ఆగిపోయింది. ఒక్కక్షణం నా శిరసు కిందికి దింపి చూశాను. అప్రయత్నంగా ఆగిపోయిన నా కాళ్ళచుట్టూ ఆ కుందేలు పిల్ల గిరగిరా తిరుగుతోంది. నా  చేతులు  కింది చాచాను. తనకిష్టమైన వృక్షాన్ని గబగబా పాకి ఎక్కితున్నట్లు, నా చేతుల్లో ఆ కుందేలు పిల్ల ఒదిగిపోయింది. తీగను అల్లుకున్న పువ్వుల్లా నా చేతులు ఆ కుందేలుని చేతుల్లోకి తీసుకున్నాను. నా కుడిచేతిమీద ఒదిగిపోయిన ఆ కుందేలు పిల్ల నా యెదను హత్తుకొనేసరికి నాకేదో కొత్తరకమైన అనుభూతి. అది మాటల్లో చెప్పలేని అనుభవం. కాసేపు నా చేతులతో ఆ కుందేలు పిల్ల తలను నిమురుతుంటే, నా కళ్ళల్లో ఎక్కడనుండి ఊరిపడ్డాయో ఆ ఆనందభాష్పాలు. అక్కడే ఆ కుందేలు పిల్లను ఆడిస్తూ కూర్చుండిపోయాను. నాకొక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లనిపించింది. నాకు మళ్ళీ నా బాల్యం గుర్తుకొస్తుంది. ఆ కుందేలు పిల్ల గంతులేస్తుంటే, నా గుండెల్లో నాకేవో తీయని సంగీత స్వరాలు వినిపిస్తున్నట్లుంది. ఆ కుందేలు పిల్ల తనకేదో కావాలనో, తానేదో చెప్పాలనో తన నోటిని కదిలిస్తుంది. నా పెదవులు పలికే మౌనభాషల్ని  అర్థం చేసుకున్నట్లు దాని ముఖంలో ఎంతో ఆనందం. ఆ ఆనందంలో ఎంతసేపు అలా గడిచిపోయిందో నాకే తెలియదు.
ఆ కుందేలు పిల్లా, నేనూ దాగుడుమూతలాడుకుంటున్నాం. నాకు కనిపించకుండా ఆ కుందేలుపిల్ల దాకుంది, నేను పట్టుకున్నాను. నేను దాకున్నాను, అది పట్టుకుంది. మళ్ళీ అది ఒక పొదపక్కకి వెళ్లి దాకుంది. నేను వెతుక్కుంటూ వెళ్లాను. కానీ, ఆ కుందేలు పిల్ల కనిపించలేదు. అక్కడొక సింహం కనిపించింది. దాన్ని తప్పించుకొని నా కుందేలు పిల్లెక్కడని చూద్దామనుకున్నాను. వెంటనే ఆ సింహం నా మీదకు దుమికింది. దాని జూలు పట్టుకున్నాను. నన్ను దాని పంజాతో కొడుతూ, నోటితో కాటేయాలని చూస్తుంది. నేను దాని మెడలు పట్టుకొని, దాని మీద కెక్కాను. ఒక్కసారిగా పరుగు లంకించుకుంది. దాన్ని ఆపాలని చూస్తున్నాను. కానీ నాకు చేతకావట్లేదు. జూలుపట్టుకొని లాగుతున్నాను. చెవులు మెలేస్తున్నాను. పరుగు ఆపట్లేదు. మరింత వేగంగా వెళ్ళిపోతుంది. దారిలో చాలామంది నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎవరో ఏదో అంటున్నారు. వాళ్ళమాటలు నాకు అర్థం కావడంలేదు. ఎవరో ఏదో సైగలు చేస్తున్నారు. వాటిని సరిగ్గా చూడలేకపోతున్నాను. సింహం మరింత వేగంగా వెళుతుంది. నా తలమీద వెంట్రుకలు నా వెనక్కి ఒక కిరీటంలా అనిపిస్తుంది. దారికిరువైపులా జనం. కేరింతలు కొట్టేవాళ్ళు... తప్పట్లు కొట్టేవాళ్ళు... భయంతో చూస్తున్నవాళ్ళు దారికిరువైపులా నిలబడి దారిచ్చేస్తున్నారు. సింహం తనపరుగు ఆపట్లేదు. కొంతదూరం వెళ్ళాక ఒక గుహకనిపించింది. దానిలోకి దూరింది సింహం. దానిమీదున్న నాకు ఆ గుహ తగుల్తుందేమోనని సింహం తలమీదకి, నా తలను కొద్దిగా వంచాను. గుహలోపలికి వెళ్ళిపోయింది. గుహంతా తిరిగింది. బయటకెళ్ళడానికి దారి కనిపించట్లేదు. పరుగు తగ్గించింది. అమ్మయ్య ఇప్పుడెక్కడికి వెళ్తాదనుకుంటుండగానే , సింహం మాయమైపోయింది. నాలుగు కుక్కలు నన్ను చుట్టుముట్టాయి.
 సింహాల్లాగే ఉన్నాయా కుక్కలు. నన్ను మించిన ఎత్తులో ఉన్నాయి. నల్లగా ఉన్నాయి. ఆ కళ్ళు దగదగ మెరిసిపోతున్నాయి. అంత పెద్దకుక్కలైనా  వాటిని చూస్తుంటే భయమెయ్యడం లేదు. గుహంతా చీకటిమయంగా ఉంటుందనుకున్నాను. ఎటుచూసినా వెలుతురు. బంగారంతో పూతపోసినట్లుందా గుహ. ఎటుచూసినా వెలుతురుతో మెరిసిపోతుంది. ఎక్కడనుండీ వెలుతురొస్తుందో తెలియడం లేదు.  గుహంతా గాలి లేకుండా ఉక్కిరిబిక్కిరిగా ఉంటుందనుకున్నాను. చల్లగా ఉంది. చక్కగా గాలివేస్తుంది. ఎక్కడనుండి వస్తుందో తెలియదు.
 దగ్గరకొచ్చేస్తున్నాయా కుక్కలు. మొదట భయమనిపించకపోయినా, దగ్గరకొస్తుంటే భయం కూడా మొదలైంది. ఆ నాలుగు కుక్కల్నీ ఎలా తప్పించుకోవాలని గుహంతా ఒక్కక్షణంలో చుట్టొచ్చేశాయి నా కళ్ళు. ఆశ్చర్యంగా అక్కడంతా నాకు తెలిసిన వాళ్ళే. ఒకరు కాదు, ఇద్దరు కాదు. వందలు వేలమంది గుహనిండా ఉన్నారు. తపస్సులో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళ చుట్టూ కుందేలు పిల్లలు. స్వేచ్ఛగా తిరుగుతున్నాయి.  తమ చుట్టూ జరుగుతున్నదేమీ వాళ్ళు గమనిస్తున్నట్లనిపించడం లేదు. అందులో నా కుందేలు పిల్ల కూడా ఉందేమో అనిపించింది. అయినా అది ఎక్కడో తప్పిపోయింది. నేను సింహం మీదెక్కి వచ్చేశాను. అది ఇక్కడికెందుకొస్తుందిలే అనుకున్నాను.
 కుక్కలు నాదగ్గరకొచ్చాయి. నన్నేవే ప్రశ్నలు వేస్తున్నాయి. వాటికి నేను సమాధానాలు చెప్పలేకపోతున్నాను. నాకు తెలిసినవి కూడా చెప్పలేకపోతున్నాను. పోనీ, నువ్వేమైనా మమ్మల్ని ప్రశ్నలడుగుతావా? అన్నదో కుక్క. నా కుందేలు పిల్లెక్కడని మాత్రం అడిగాను. కుక్కలన్నీ నవ్వుకున్నాయి. ఆ గుహనిండా ఉన్నవాళ్ళంతా తపస్సులో ఉన్నారు. ‘‘వాళ్ళ చుట్టూ అనేక కుందేలు పిల్లలు తిరుగుతున్నాయి కదా. అందులో నీ కుందేలు పిల్ల కూడా ఉంది. నువ్వే గుర్తుపట్టు’’ అన్నాయి. 
వాళ్ళు ఒక్కసారిగా నవ్వినట్లనిపించింది.
కుక్కలెందుకు నవ్వాయో, వాళ్లకెందుకు నవ్వారో నాకర్థం కావట్లేదు.
అయోమయంగా పెట్టిన నా మొహాన్ని చూశాయా కుక్కలు. నేను నిస్సహాయంగా వాటిముందు మోకరిల్లాను. ‘‘దయచేసిన నా కుందేలు పిల్ల నాకు కావాలి. అదెక్కడుందో చెప్పండ’’ని బ్రతిమలాడాను.
ఈ సారి పగలబడినవ్వుతాయనుకున్నాను.
 నవ్వలేదు.
 నా దగ్గరకొచ్చాయా కుక్కలు.
 నాకు భయమేస్తుంది. ఒక కుక్క తన ముందుకాలుని నా తల మీద పెట్టి తనబిడ్డలా నిమిరింది. నాకేదో ఆత్మీయమైన స్ప్ఫర్శలా అనిపించింది.
ఇంకో కుక్క నన్ను తన ఒడిలోకి తీసుకుంది. అమ్మ ఒడిలో చిన్నపిల్లాడిలా ఒదిగిపోయినట్లనిపించింది.
 ఇంకో కుక్క నా ఎదురుగా నిలబడి ‘‘నీకు నీ కుందేలు పిల్ల కావాలంటే నేను చెప్పినట్లు చెయ్యాలి’’ ఆదేశిస్తున్నట్లుందా స్వరం.
ఏమి చెయ్యమంటారో భయం భయంగానే చెప్పమన్నాను. ‘‘ఇక్కడ తపస్సు చేస్తున్నవాళ్ళకు కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని తీర్చాలి’’ ఈ సారి వాళ్ళంతా నిజంగానే నవ్వారు.
వాళ్ళ సందేహాలేంటన్నట్టు ముఖం పెట్టాను.
కొన్ని ప్రశ్నలేవో నన్నడిగాయా కుక్కలు. నువ్వొచ్చే దారిలో నువ్వెన్ని గుహల్ని చూశావన్నాయి.
నాకసలు గుహలే కనిపించలేదన్నాను.
నువ్వొచ్చే దారిలో నువ్వెంతమందిని చూశావన్నాయి.
 లెక్కించలేదన్నాను. ఇంకా చాలా ప్రశ్నలు వేశాయి. ఒక్కదానికీ వాటికి సంతృప్తి కలిగినట్లనిపించలేదు.
అక్కడున్న ఒకర్ని పిలిచాయా కుక్కలు.
ఒక శ్లోకమేదో పలుకబోయిందా కుక్క...
దాన్ని ఆ వచ్చినతడు పూర్తి చేశాడు. అతడ్ని చూస్తే నా కంటే చిన్నవాడనిపించింది. ఆ శ్లోకం ఇంతకుముందు నాకు వచ్చిందే. నేనే అతనికి నేర్పిన గుర్తు కూడా. కానీ, నాకదిప్పుడు గుర్తురావట్లేదు. ఇంకొన్నేవో అడిగిందతడ్ని. అతడు చెప్పేస్తున్నాడు. నేను చెప్పలేకపోతున్నాను. నావైపు చూసిందా కుక్క. నాకేదో సిగ్గేసినట్లనిపించి, తలదించుకున్నాను.
‘‘పో...వాళ్ళ సందేహాలు తీర్చాలంటే నువ్వు కూడా వాళ్లలాగే మళ్ళీ కొన్నాళ్ళు తపస్సు చెయ్యాలి. వాళ్లందరి సందేహాలు తీర్చగలిగే శక్తి నీకు వచ్చినప్పుడు నీ అంతట నువ్వే తపస్సు చాలిస్తావు. ఇదిగో ఈ గుహనంతా చూడు. బయటకెళ్ళడానికిప్పుడు నీకేదారీ లేదు. నువ్వనుకున్నది సాధిస్తేనే నువ్వు గుహనుండి బయటకెళ్తావు. నీ కుందేలు పిల్లను నువ్వు గుర్తుపట్టగలుగుతావు’’ అని చెప్పి ఆ కుక్కలన్నీ మాయమైపోయాయి.
ఆ మాటనాకెందుకో కొత్త సందేహాన్ని తెచ్చిపెట్టింది.
నేనెప్పుడు తపస్సు చేశాను. నేనెప్పుడు మళ్ళీ తపస్సునాపేశాననుకుంటూ తపస్సు మొదలు పెట్టాను.

***

 ఏవఁడీ... బాబుగాడు తడిపేసుకున్నాడు. ఆ డైపర్ తీసుకురండీ. మా శ్రీమతి నన్ను లేపింది.గబగబా లేచాను.  తెల్లారిపోయింది. నా చుట్టూ నేను చూస్తున్నాను. ‘‘ఏమిటండీ... ఏదో పోగొట్టుకున్నట్లు వెతుకుతున్నారు. ఆ డైపర్ తెమ్మంటున్నానుగా’’ కొంచెం గట్టిగానే వినిపించిందా స్వరం. నా మత్తంతా విదుల్చుకుంటూ, నేను ఆ బయట గదిలో ఉన్న డైపర్ తేవడానికి బయలుదేరాను.




కామెంట్‌లు లేవు: