నిజం చెప్పొద్దూ
ఇదేదో సుఖదుఃఖాల
సమ్మేళనంలా ఉంది
చీకటి వెలుగుల
దోబూచిలా ఉంది
దొడ్డి దారిలో దొంగలా
పారిపోకుండా
నా కొడుకునిలా
ఎత్తుకుని తిప్పుతుంటే
వాడికళ్ళల్లో
కురుస్తున్న నవ్వుల జల్లుల్ని
ఎన్ని కోల్పోయానో తెలుస్తోంది!
వండినంత
ప్రేమగానే వడ్డిస్తున్నా
ఆమె కళ్ళల్లో
ముద్దముద్దకీ మెరిసిన
కాంతినెంత
కోల్పోయానో తెలుస్తోంది
అందనంత ఎత్తు
ఎదిగినందుకు
సంతోషించేవారో,
సర్థుకుపోయేవారే
అమ్మానాన్నల ఆ
చల్లని చేతులు తాకగానే
అనురాగాన్నెంతకోల్పోయానో తెలుస్తోంది
దిద్దట్లేదని మూతిబిగుంచుకుని
మూలనకూర్చున్న
పేపర్లన్నీ
కలం ముగ్గులతో
కళకళ్ళాడుతున్నాయని తెలుస్తోంది
తరగతి గదిలో భయం
చెరవీడని విద్యార్థులు
చరవాణుల్లో
పాఠాలకోసం స్వచ్ఛమైన శ్రోతలై
ప్రశ్నల
బాణాలైయ్యారని తెలుస్తోంది
ఇంటిలోనే ఉన్నా
ఒంటరికావద్దొంటూ
ఇంటర్నెట్
విశ్వాన్నే నా ముంగిట నిలిపి
ఇంటిబయటకొస్తే
కరోనా కాటేస్తుందని తెలుస్తోంది
సోషల్ మీడియాలో
నిజానిజాల్ని
తెలుసుకోవడానికి
నాకళ్ళకు
హంసముక్కునతికించుకోవాలని తెలుస్తోంది
ఓ కరోనా
నువ్వు మమ్మల్నిలా
రెక్కల్ని విరుచాననుకుంటున్నావు
నువ్వు నేను
కోల్పోయిన
చిన్నిచిన్ని
ఆనందాల్ని మళ్ళీ స్ఫర్శించావనిపిస్తోంది
ఓ కరోనా
నన్ను నేను స్వీయ
నిర్బంధాన్ని విధించుకొనేలా చేసి
నువ్వేమే
విచ్చలవిడిగా వీధులన్నీ
తిరుగుదామనుకుంటున్నావేమో
దేన్ని చూసుకొనే
నీకా ఘరానా?
నిన్ను జుట్టు
పట్టి ఊడ్చేయాలని మునిసిపాలిటీ
నిన్ను యావజ్జీవ
కారాగారంలో వేసేయ్యాలని పోలీసు
నిన్ను శస్త్రచికిత్స
చేసి తొలగించాలని ఆసుపత్రి
నీకు కనిపించని
నాలుగో సింహమై వేటాడుతున్నారు
ఏరోజుకారోజు
పనిచేస్తేనే గాని గడవని కూలన్నకు
స్వచ్చందసంస్థలు
స్వచ్ఛంగా
ఆత్మీయ ఆలింగనాలు
చేసుకుంటున్నాయి
ఓ కరోనా !ఇక దేన్ని చూసుకొనే నీకా ఘరానా?
ఓ కరోనా ! ఇక నీ కలుగులోకి నువ్వు జారుకోవే బిరాన!
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు
5.4.2020
Mobile:
9182685231
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి