విద్యార్థులకు ఓ అధ్యాపకుని లేఖ
ప్రియమైన మా
విద్యార్థినీ, విద్యార్థులారా!
ఎలా ఉన్నారు?
అంతాబాగున్నారా? మీరంతా
బాగుండాలని కోరుకుంటున్నాను.
నేనిక్కడ
మీరు లేని లోటుతో మీ కోసమే ఆలోచిస్తున్నాను.
మనం క్లాసులో కలిసి చాలా రోజులైంది కదా...
కరోనా భూతం మనల్ని ఇలా ఒక్కొక్కర్నీ ఒక్కోచోటుకి విసిరేసింది!
మీరు
ఇళ్ళకు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిసింది.
ఇంటికి
వెళ్ళారు. కానీ, ఇంతకు ముందులా సంతోషంగా తిరగడానికి లేదనుకుంటాను.
మనమంతా లాక్ డౌన్ లో ఉన్నాం. తప్పదు. ఇంటికే పరిమితం కాక తప్పదు.
కొన్ని
ప్రాంతాలైతే మరీ డేంజర్ జోన్స్ గా ప్రకటించారు.
ఇతర
దేశాల నుండి ఎక్కువ మంది ఆ ప్రాంతానికి వస్తే, ఆ ప్రాంతాన్ని డేంజర్ జోన్ గా
ప్రకటిస్తున్నారని తెలిసింది.
అది
నిజమో కాదో,
నాకూ తెలియదు.
ఆ
ప్రాంతంలో కరోనా వైరస్ అనుమానితులు అధికంగా ఉన్నారని తెలిసినా దాన్ని డేంజర్ జోన్
గా ప్రకటిస్తారేమో.
ఏది
ఏమైనా మనం కొన్నాళ్ళు ఇలా గడపాల్సిందే. తప్పదు.
మీలో కొంతమంది ఇళ్ళకే పరిమితమై ఉండవచ్చు.
ఏమి చెయ్యాలో తోచని వాళ్ళుంటారు.
చాలామంది చూడాలనిపించకపోయినా, టీ.వీ.తో కాలం
గడిపేస్తుంటారు.
ఇంకొంతమంది-పుస్తకాలు చదువుతూనో, ఏదొకటి
రాస్తూనో కూడా కాలం గడుపుతుండొచ్చు.
పుస్తకం తీసేలోగా, మీ చేతిలో
ఉన్న మొబైల్ ఏదో సమాచారం తెచ్చినట్లు పిచ్చుకలా కిచకిచమంటుందా?
బహుశా మనమంతా మొబైల్ని ముట్టుకున్నంతగా, మొబైల్ తో గడిపినంతగా మిగతా దేనితోనూ గడపలేకపోతున్నామేమో...
ఏవేవో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
వాట్సాప్ తెరిస్తే ఏదేదో వస్తుంది.
రెడ్ జోన్ అంటున్నారు
మన చుట్టూనే కరోనా పోజిటివ్ వచ్చినవాళ్ళున్నారంటున్నారు.
ఈ లాక్ డౌన్ మరి కొ న్ని నెలలు పట్టొచ్చంటున్నారు.
ప్రపంచమంతా నాశనమైపోయే రోజులొచ్చాయంటున్నారు.
దేవుడే మనుష్యుల్ని శిక్షిస్తున్నారంటున్నారు.
దేవుడే ఉంటే దేవాలయాలెందుకు మూసేయాలంటున్నారు
దేవుడే ఉంటే మసీదులెందుకు మూసేయాలంటున్నారు
దేవుడే ఉంటే చర్చిలెందుకు మాసేయాలంటున్నారు
ఇప్పుడు దేవుడంటే డాక్టర్లేనంటున్నారు
ఇప్పుడు దేవుడంటే పోలీసేనంటున్నారు
ఇప్పుడు దేవుడంటే పారిశుధ్యకార్మికుడేనంటున్నారు
దేవుడే లేడనేవాళ్ళు
దేవుడే ఇదంతా చేస్తుందనేవాళ్ళు.... రకరకాల వాదనలు
ఆ దేశం తిన్నతిండివల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఒకరు
ఆ దేశం కావాలనే ఒక వైరస్ ని సృష్టించిందని మరొకరు
ఏ దేశం ఏమి చేసినా మాదేశం సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని ఇంకొకరు
అదిగో వాక్సిన్,, ఇదిగో
వాక్సిన్... కనిపెట్టారంటూ వార్తలు
ఇప్పుడు ప్రపంచం ఇరుకు ఇరుకుగా మారిపోయింది
ఇప్పుడు ప్రపంచం తనను తాను కొత్తగా నిర్వచించుకొంటుంది
మీరివ్వన్నీ పట్టించుకోకండి.
మీరు మీ జాగ్రత్తలు పాటిస్తూ, ప్రభుత్వం
ప్రకటించే ప్రకటనల్నే నమ్మండి.
మీరు మీ సమయాన్ని ఇలాంటి పుకార్లను చర్చించుకోవడానికీ, మరింత వ్యాప్తి చేయడానికి వెచ్చించకండి.
నిజానికి మన కుటుంబ సభ్యుల సుఖదు:ఖాలలో మమేకమవ్వండి
నిజానికి ..మన విద్యార్థుల్లో చాలామంది ఆరోజు గడిస్తే చాలనుకునే
వాళ్ళున్నారు.
మర్నాడు ఎలా గడుస్తుందో తెలియని వాళ్ళున్నారు.
చాలామందికి తెల్లవారితే పొయ్యి వెలిగించలేని పరిస్థితుల్లోనూ
ఉంటారని తెలుసు.
ఇంట్లో ఉండమన్నంత సులువు కాదు...
మామూలు రోజుల్లోనే పనుల్లేక పస్తులుంటున్నవాళ్ళెంతోమంది.
ఇప్పుడు పనీలేదు
పనిలేనప్పుడే ఆకలీ ఎక్కువేస్తుందన్నట్టనిపిస్తుందా...
ఆకలికున్న లక్షణమే అది..
డబ్బులున్నా...కొనుక్కొనే వీల్లేని వాళ్ళు కొంతమంది.
కొనుక్కుందామన్నా డబ్బుల్లేనివాళ్ళింకొంతమంది.
ఆకలితో గడిపేస్తున్నాళ్ళు ఇంకొంతమంది.
ఇది నేడు లోకం పరిస్థితి.
మీరెలా ఉన్నారోనని నాకు చాలా దిగులుగా ఉంది.
హాస్టలుంటే నాలుగు మెతుకులు దొరికేవనుకుంటున్నవాళ్ళున్నారనీ
తెలుసు
హాస్టల్లో తినలేకపోతున్నామనుకున్నవాళ్ళున్నారు
ఇంట్లో తిందామనుకున్నా అన్నీ నిండుకున్నవాళ్ళూ ఉండొచ్చు.
రోజులు మారతాయి.
మనకన్నీ మళ్ళీమంచిరోజులొస్తాయి.
మంచి రోజులు రావాలని కోరుకుందాం
మనకీ దుస్థికి కారణం - కరోనా వైరస్
దానికి వ్యాపించే లక్షణముంది.
ప్రపంచాన్ని వణికిస్తుంది.
ప్రపంచం దాన్నుండి కొన్ని పాఠాల్ని నేర్పుకుంది.
ప్రపంచం దాన్నుండే మనకి కొన్ని పాఠాల్ని నేర్పుతుంది
అందుకే ప్రభుత్వం దీన్ని కట్టడి చేయాలనుకుంది.
దీన్ని
మనం అర్థం చేసుకోవాలి.
ప్రభుత్వానికి
మనం
మనకి
ప్రభుత్వం అన్నట్లుగా
పరస్పరం
సహకరించుకోవాలి.
మనకెన్ని
సమస్యలున్నా వాటిని అధిగమించాలి.
మన
విషయానికొస్తాను.
ఈ
యేడాది విద్యాసంవత్సరం పోయినట్లేనా?
మాకు
పరీక్షలుంటాయా?
దీన్నెలా
భర్తీ చేస్తారు?
ఎన్నో
ప్రశ్నలు..
కొంతమంది
ఫోను చేసి మరలా మనం క్లాసుల్లో ఎప్పుడు కలుసుకుంటామని అడుగుతున్నారు.
నిజమే, నాకూ
మిమ్మల్నందర్నీ క్లాసులో
కలుసుకోవాలనుంది.
మరలా
మనం పాఠాలు చెప్పుకుంటూ గడిపేయాలనుంది.
అంతవరకూ
మనం ఒకపనిచేద్దాం.
చాలామంది
విడివిడిగా తమ పాఠాలకు సంబంధించి సందేహాలడుగుతున్నారు.
అక్కడున్నా, ఎక్కడున్నా
మీరు
మీ పాఠాల గురించి ఆలోచిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది.
మీరు
మీ విద్యాభ్యాసం గురించే ఆలోచిస్తున్నందుకు ఆనందంగా ఉంది.
మనం
స్వీయనిర్భంధంలో ఉండొచ్చు.
కానీ, మనం
ఎంతో అభివృద్ధిచెందిన శాస్త్ర, సాంకేతికయుగంలో ఉన్నాం.
మనం
మన ఇంటివాళ్లతో ఒక్కొక్కరితోనే కాదు,
కుటుంబమంతా అవసరమైతే కాన్ఫరెన్సులో కూడా కలిసి మాట్లాడుకుంటున్నాం.
మనమంతా
మన భావాల్ని ప్రత్యక్షంగా వీడియోల ద్వారా ప్రకటించుకుంటున్నాం.
దీన్ని
మనమెందుకు ఉపయోగించుకోకూడదు.
మనం
ఒక పనిచేద్దాం.
మన
తరగతి వాళ్ళమంతా ఒక వాట్సాప్ గ్రూపుగా ఏర్పడదాం.
మీకొచ్చే
సందేహాల్ని దానిలో పోస్టు చేయండి. నేనెప్పటికప్పుడు నా పాఠ్యాంశం వరకూ మీ సందేహాల్ని తీరుస్తుంటాను.
ఒక
సమయం పెట్టుకుందాం.
ఆ
సమయంలో మనమంతా వీడియో కాన్పరెన్సు ద్వారా పాఠాల్నీ విందాం.
ఎన్నాళ్ళీ
స్వీయనిర్భంధం ఉంటుందో తెలియదు.
అంతవరకూ
మనం నిర్వీర్యమైపోతూ, నిరాశపడొద్దు.
మీ
కోసం నేనున్నాను.
ఇలాంటప్పుడే మనం మనధైర్యాన్ని ప్రదర్శించాలి.
ఇలాంటప్పుడే మనం మన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించాలి.
ఇలాంటప్పుడే మనం మనమంతా కలిసే ఉన్నామని ప్రకటించాలి
ఇలాంటప్పుడే మనం మనకున్న అవకాశాల్నీ వినియోగించకోవాలి.
ఈ సమయాన్ని వృధాచేయొద్దు.
కాలాన్ని మనం మనకనుకూలంగా మార్చుకుందాం.
మనల్ని మనం రీచార్జ్ చేసుకుందాం.
నిరంతరం మీకోసమే ఆలోచించే
మీ
తరగతి అధ్యాపకుడు
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాద్,
9182685231 (వాట్సాప్ నెం.)
29 .03.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి