26 మార్చి 2020,
హైదరాబాదు.
ప్రియమైన శత్రువు కరోనాకి ఎంతో ద్వేషంతో రాయునది.
గత కొన్ని నెలలుగా నువ్వు క్షేమంగా, స్వేచ్ఛగా, భయంకరంగా
ప్రపంచమంతా విహరిస్తున్నావు.
నువ్వు చైనాలోని వూహాన్ (Wuhan) ప్రాంతంలో బయలుదేరి ప్రపంచమంతా చుట్టేస్తున్నావు.
నేనిక్కడ భయంతో వణికిపోతున్నాను.
నేనే కాదు, మా
ఇంట్లో వాళ్ళు, మా ప్రక్కింటిలో వాళ్లు, మా వీధిలోవాళ్ళు, మా ఊళ్ళో వాళ్లు, మా
జిల్లా, మా రాష్ట్రం, మా దేశం... ఇన్ని మాటలెందుకు మా మానవ ప్రపంచమంతా నీ పేరు
చెప్తే వణికిపోతున్నారు.
అయినా నిన్ను ఓడించాలని మా వైద్యులు నిరంతరం నీతో
పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళకి మా ప్రభుత్వాలు ఎంతో సహకరిస్తున్నాయి.
మా భారతదేశంలోని ప్రజలంతా మొన్నే అంటే మార్చి 22 వతేదీన ఒక్క రోజంతా బయటకు రాకుండా
‘జనతా కర్ప్యూ’ పాటించాం. సాయంత్రం మా
వైద్యులందరి సేవల్నీ గౌరవంగా చప్పట్లు కొట్టి అభినందించాం. మా ప్రధానమంత్రి శ్రీ
నరేంద్రమోడీ, మా ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గార్లు ఈ జనతా కర్ఫ్యూ పట్ల అంకితభావంతో
పాటించాలని పిలుపునిచ్చారు. మేము అక్షరాలా వారి మాటల్ని నిలబెట్టుకున్నాం.
అయితే ఆ రోజు సాయంత్రం ముంబాయి, మరికొన్ని ప్రాంతాల్లో
గుంపులు, గుంపులుగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నీపై విజయం సాధించినంతగా సంబరాలు
చేసుకున్నారు. కానీ, నువ్వు అదను చూసి మాపై విజృంభిస్తున్నావని తెలిసి మరలా మా
ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి.
22 మార్చి ఆదివారం అంతా ఇంట్లో ఉండి విజయోత్సవంతో సాయంత్రం
బయటకొచ్చేశాం.
ఈ లోగా ప్రపంచవ్యాప్తంగా మళ్లీ నీ విజృంభణ మొదలైంది.
నిన్ను అంతం చేయాలంటే లాక్ డౌన్ అనే ఒక అస్త్రాన్ని కనుగొన్నారు.
24 మంగళవారం నుండి 21 రోజుల పాటు లాక్ డౌన్ అస్త్రం మా
భారతదేశమంతా కాపలా కాస్తుంది.
మేము ఇంట్లో ఉండడం మొదలు పెట్టాం.
ఏమీ తోచడం లేదు. తిరిగి కాళ్ళు ఊరికే ఉంటాయా? ఈ గది నుండి ఆ
గదికీ, ఆ గది నుండి ఈ గదికీ తిరిగి తరిగి విసుగొస్తుంది.
బయటకొస్తే, లాక్ డౌన్ అస్త్రం పోలీసోళ్ళ రూపంలో
తరుముకొస్తుంది. వాళ్ళెవరు తరుముకొచ్చినా, రాకపోయినా నువ్వు మాత్రం కనిపెట్టుకునే
ఉంటావు కదా...
ఇంట్లో మేమేమి చేస్తున్నావని, దాన్ని తెలుసుకోవాలనీ తెగ
ఉబలాటం పడుతున్నావనుకుంటాను.
అవన్నీ వివరిస్తాను.
అవన్నీ వివరించాలంటే మాకు ఇంట్లో కరెంటు ఉండాలి.
నీళ్ళుండాలి. ఇంటర్నెట్ ఉండాలి. తినడానికి కనీసం ఏవొకటి ఉండాలి. వాటిని మాకు
అందిస్తున్న మా సిబ్బంది ధైర్యసాహసాల్ని ఏమని పొగడను. వాళ్ళకి నమస్కరిస్తున్నాను.
మేమింట్లో ఎలా గడుపుతున్నామో, తర్వాత చెప్తాను.
ఇట్లు
కరోనాపై లాక్ డౌన్ అస్త్రంతో యుద్ధం చేస్తున్న ఒక సైనికుడు
26.03.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి