"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

01 జనవరి, 2020

నాలుగు మనసుల వెచ్చదనం

 నాలుగు మనసుల వెచ్చదనం




వాళ్లు నవ్వితే

ఇల్లంతా

వసంతం పూసిన తోట!


చిన్న చేతులతో

మన వేళ్లను పట్టుకునే ఆ స్పర్శ

మనిషి జీవితానికి

దేవుడు పెట్టిన విరామచిహ్నం

ఇంకా బతకాలనే గుర్తు చేసే ఆశ!


రాత్రి

పిల్లలు అలొ నిద్రపోతుంటే

వాళ్ల ముఖాలు చూస్తే

చంద్రుడు

తన కాంతిని దగ్గరగా మడిచిపెట్టి 

తనను తాను చూసుకున్నట్టే!


అమ్మ గుర్తొచ్చేది

అనారోగ్య సమయంలో

నాన్న గుర్తొచ్చేది

బాధ్యతల బరువులో

భార్యా పిల్లలు గుర్తొచ్చేది మాత్రం

ప్రతి శ్వాసలో!


కుటుంబం 

దేవుడిచ్చిన 

అత్యంత విలువైన ఆశీర్వాదం!


మనిషి బయట ఎంత గొప్పవాడైనా

ఇంటికి వచ్చాక

పిల్లల ముందు 

ఓ గుర్రమైపోతాడు,

భార్య ముందు

అలసిపోయిన 

ఓ చిన్న పిల్లవాడైపోతాడు.


కుటుంబం అంటే

కేవలం రక్త సంబంధాలేనా

రోజూ విరిగిపోతున్న మనిషిని

మళ్లీ అతికించే చేతులు.

అమ్మ జ్ఞాపకం 

దీపంలా వెలుగుతూ ఉంటుంది,

నాన్న మౌనం 

గోడలా ధైర్యంగా నిలబెడుతుంది 

భార్య ప్రేమ 

వానలా గిలిగింతలతో కురుస్తుంది

పిల్లల నవ్వులు

ఆ ఇంటి పైకప్పుపై ఎగిరే పావురాల్లా

మనసంతా నింపేస్తుంటాయి.


అమ్మా నాన్నలు

మన దగ్గర లేకపోయినా

మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు.

కొన్ని జ్ఞాపకాలు

పాత అల్మారాలో పెట్టిన బట్టల్లా ఉంటాయి.

ఎన్నాళ్ల తర్వాత తీసినా

అందులో

అమ్మ పంచిన కమ్మని వాసన,

నాన్న చిందించిన చెమట,

మన బాల్యంతో ముడిపడి

ఇంకా అలాగే ఎప్పటికీ మిగిలే ఉంటాయి


పండుగరోజు

కొత్త బట్టలు వేసుకున్నా

అమ్మ చేతి తలంటు లేకపోతే

అద్దంలో కనిపించే మన ముఖం కూడా

పూర్తికాని చిత్రంలా ఉంటుంది


ఎక్కడో దూరప్రాంతంలో

ఒంటరిగా టీ తాగుతున్నప్పుడు

నాన్నే గుర్తొస్తాడు.

తన చేతిలోని కప్పు నుంచి ఎగిసే ఆవిరిలా

ఆయన మౌనం కూడా

మన మీద ప్రేమగా అలముకుంటుంది!


చివరికి

మనిషి జీవితమంతా వెతికేది

డబ్బు కాదు, పేరు కాదు

ఇలా తన అలసటను ఒడిలో పెట్టుకునే

నాలుగు మనసుల వెచ్చదనమే!

డా.దార్ల వెంకటేశ్వరరావు 1.1.2020

కామెంట్‌లు లేవు: