గుంటూరు శేషేంద్రశర్మ బహుభాషావేత్త, కవి, విమర్శకుడు, నిరంతర సాహిత్య సేద్యం వల్ల తెలుగు సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలవైపు తీసుకెళ్ళి, తాను ప్రసిద్ధి పొందడమే కాకుండా, తెలుగువాళ్లందరూ గర్వించేలా చేశారని ‘గుంటూరు శేషేంద్రశర్మ వార్షిక స్మారకోపన్యాసం’ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చేవెళ్ల నియోజకవర్గం పార్లమెంటుసభ్యులు డా.రంజిత్ రెడ్డి అన్నారు.
వైస్ ఛాన్సలర్ ఆచార్య పొదిలి అప్పారావు అధ్యక్షతన సోమవారం సెంట్రల్ యూనివర్సిటీలో హ్యూమానిటీస్ డీన్, తెలుగు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన గుంటూరు శేషేంద్రశర్మ ధర్మనిధి వార్షిక స్మారకోపన్యాస సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
సాహిత్య మనుగడ కొనసాగాలంటే ఇలాంటి సాహిత్య సదస్సులు జరగాలని, అటువంటి వాటికి తనవంతు సహాయాన్ని అందిస్తానని ఆయన పేర్కొన్నారు. అధ్యక్షోపన్యాసం చేసిన వైస్ ఛాన్సలర్ ఆచార్య పొదిలె అప్పారావు మాట్లాడుతూ గుంటూరు శేషేంద్ర శర్మ సుమారు 30కి పైగా రచనలు చేశారని, ఆయన రచనలకు సాహిత్య అకాడమీ పురస్కారాలను అందించిందని, అటువంటి కవి సమగ్రజీవితం, సామాజిక, సాహిత్య దృక్పథాన్ని అవగాహన చేసుకోవడానికి ఇలాంటి సాహిత్య సదస్సులు ఎంతగానో తోడ్పడతాయన్నారు.
వారి శ్రీమతి ఇందిరా ధనరాజ్ గిరి సెంట్రల్ యూనివర్సిటిలో వివిధ శాఖల వారిగా ధర్మనిధి ఉపన్యాసాలను ఏర్పాటు చేయడానికి తనవంతు సహకారాన్ని అందించడమే కాకుండా, ఆయన పేరుతో సాహిత్య, సాంస్కృతిక సమావేశాలు జరుపుకునేందుకు ఒక సమావేశ భవనానికి విరాళాల్ని అందించారని, దాన్ని త్వరలోనే పూర్తి చేసి ప్రారంభిస్తామని, అందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ సాహిత్య విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ‘‘కవితా తత్త్వవేత్త గుంటూరు శేషేంద్రశర్మ’ పేరుతో ప్రధాన ప్రసంగం చేశారు.
సామాజిక చైతన్యం, సాహిత్య చైతన్యంగా మారినప్పుడే ఆ కవిత్వానికి విలువ ఉంటుందనీ, సాహిత్యానికి వస్తువుతో పాటు శిల్పం కూడా ఎంతో ప్రధానమని గుంటూరు శేషేంద్రశర్మ ప్రబోధించారని ఆయన వివరించారు. కవికి కవిత్వం ఆయుధం కావాలన్నారు.
కవిత్వం మనిషిని మార్చగలగాలని, అటువంటి కవిత్వమే నిజమైన కవిత్వమనీ, దానికి వ్యుత్పన్నత అత్యంత ముఖ్యమని శేషేంద్ర భావించారని ఆయన వ్యాఖ్యానించారు.
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డిని తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య జి.అరుణకుమారి పరిచయం చేశారు. ఈ సమావేశాన్ని నిర్వహించిన డీన్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ఆచార్య ఎస్.శరత్ జ్యోత్స్నారాణి మాట్లాడుతూ గుంటూరు శేషేంద్రశర్మజీవితాన్ని, సాహిత్యాన్ని పరిచయం చేసి, స్మారకోపన్యాసానికి సహకరించిన ఆయన శ్రీమతి ఇందిరా ధనరాజ్ గిరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ తరం విద్యార్థులకు ఆనాటి తరానికి చెందిన సాహితీవేత్తల జీవితాలు స్ఫూర్తిదాయకంగా నిలవాలంటే అటువంటి వారిపై సాహిత్య సదస్సులు, స్మారకోపన్యాసాలు జరగాల్సిన అవరాన్ని వివరించారు. సభకు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు స్వాగతం పలకగా, ఆచార్య ఎం. గోనానాయక్ వందన సమర్పణ చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి