మనదేశంలో పౌరసేవలతో సంబంధం ఉన్న అన్నిశాఖల్లోనూ అవినీతి ప్రబలడానికి అనేక కారణాలున్నాయి. ప్రభుత్వం ఏర్పరిచే నియమనిబంధనల ప్రకారమే ప్రజలు వివిధ సేవల్ని అందుకోవాలనే చైతన్యం పెరగాలి. దీనికి ప్రభుత్వం సరళీకృత విధానాలను రూపొందించాలి. విచారణలో పేరుతో కాలయాపన చేయకూడదు. ఏ పనికి ఏమేమి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలో, దేనికెంత రుసుము చెల్లించాలో స్పష్టంగా ప్రజలకు తెలిసేలా ప్రచారం చెయ్యాలి. నిబంధనలు పాటించినా ఏదొక నెపంతో పని చెయ్యకుండా ఇబ్బందులకు గురిచేసే సిబ్బందిని ఆయా శాఖల్లో నియమించకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో నియమించాల్సి వచ్చినప్పుడు, వాళ్ళేదైనా ఇబ్బందులకు గురి చేస్తే తగిన సాక్ష్యాధారాలతో చర్యలు తీసుకోవడానికి సి.సి.కెమేరాలు వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. అధికారులు, ఉద్యోగులపై ప్రజాప్రతినిథుల మితిమీరిన జోక్యం తగ్గాలి. అవినీతికి పాల్పడేవారిని కుల, మత, లింగ, ప్రాంత వివక్షతలు లేకుండా కఠినంగా శిక్షించాలి. అవినీతిని ప్రోత్సహించేవార్నీ, అవినీతికి పాల్పడేవారిని శిక్షించాలనే చట్టాలున్నాయి. వాటిని నిర్భయంగా అమలు చెయ్యాలి. ప్రతి పనికీ పర్యవేక్షణాధికారం పేరుతో అధికారాన్ని కొన్ని చోట్ల లోనే కేంద్రీకరించడం కూడా సరైంది కాదు. ప్రభుత్వం తీసుకొచ్చే అవినీతిని నిర్మూలించే సంస్కరణలు ఒక పాతవ్యవస్థను తీసేసి ఒక కొత్త వ్యవస్థను నామమాత్రంగా పెట్టడం కాదు. మౌలికమైన మార్పులు తీసుకొచ్చి, సత్ఫలితాల్నిచ్చే నిర్మాణాత్మకమైన వ్యవస్థను
తీసుకొస్తే ప్రజాభిమానాన్ని పొందుతారు.
... ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డిప్యూటీ డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి