"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

16 మార్చి, 2019

‘‘లోతైన పరిశోధనలకు వేదిక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి’’


ఆచార్య వేదప్రకాశ్, (చైర్మన్ (పూర్వ) యూనివర్సిటి గ్రాంట్స్ కమీషన్, న్యూఢిల్లీ) నుండి సర్టిఫికెట్ ను స్వీకరిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 


‘‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేక అంశాల్లో లోతైన పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించడానికీ, అనేక విషయాల్లో నూతనావిష్కరణలను చేయడానికీ వీలైన వాతావరణంతో కూడిన స్వయంప్రతిపత్తి ఉంది. నిష్ణాతులైన అధ్యాపకులు ఉండటం వల్ల కూడా ఆ విశ్వవిద్యాలయంలో  నిజమైన జ్ఞానాన్వేషణ కొనసాగుతోంద’’ని ఉన్నత విద్యారంగంలో విశేషానుభవం గల కొంతమంది విద్యావేత్తలు వ్యాఖ్యానించారని సెంట్రల్ యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వెల్లడించారు. 
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు న్యూఢిల్లీలో  ఫిబ్రవరి 28 నుండి మార్చి 2, 2019 వరకు‘‘జాతీయ విద్యాత్మక ప్రణాళికలు మరియు పరిపాలనా సంస్థ’’, నిర్వహించిన ‘‘ఉన్నత విద్యావిధానంలో వ్యవస్థీకృత నూతన ఆవిష్కరణలు మరియు ఉత్తమ అభ్యసనాలు’’ అనే అంశంపై మూడురోజుల కార్యశాలలో  హైదరాబాదు విశ్వవిద్యాలయం ప్రతినిథిగా పాల్గొని వచ్చారు. 
ఈ కార్యశాల ప్రధానంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రాల్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ప్రొ.వి.సిలు, రెక్టార్లు, సంచాలకులు, డీన్స్, శాఖాధ్యక్షులు, రిజిస్ట్రార్లు, విద్యా సంబంధ పరిపాలనాధికారులు, కళాశాలల్లో పనిచేసే ప్రిన్సిపాల్స్ మొదలైన పరిపాలనా సంబంధ అధికారులు మొత్తం 46 మంది పాల్గొన్నారు. హైదరాబాదు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య అప్పారావు పొదిలె సిఫారసు మేరకు డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ హోదాలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఈ కార్యశాలకు హాజరయ్యారు.

మాట్లాడుతున్న యూ నివర్సిటి గ్రాంట్స్ కమీషన్ ఉపాధ్యక్షుడు ఆచార్య భూషణ్ పట్వర్ధన్ 

యూనివర్సిటి గ్రాంట్స్ కమీషన్ ఉపాధ్యక్షుడు ఆచార్య భూషణ్ పట్వర్ధన్ తన ప్రసంగంలో విధాననిర్ణయాలకు సంబంధించినవీ, డిజిటల్ హ్యుమానిటీస్ కి సంబంధించిన ప్రాజెక్టులకు యూజిసి అధిక ప్రాధాన్యాన్నిస్తుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ రకమైన పరిశోధనలను ప్రోత్సహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చెప్పారు.  నిజానికి విజ్ఞానశాస్త్రాల కంటే నేడు మానవీయశాస్త్రాలల్లో పరిశోధనలు చేసేవారికి అధికమొత్తంలో గ్రాంటులు మంజూరు చేయడానికి యూజిసి సిద్ధంగా ఉందని, అయితే అవి గ్లోబల్ డిజిటల్ హ్యుమానిటీస్ కు సంబంధించిన అంశాలైతే వాటికి ప్రాధాన్యం ఉంటుందని ఆయన అన్నారని వెంకటేశ్వరరావు వివరించారు.  సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పరిశోధనలను, కొన్ని ఉత్తమ అభ్యాసాలను కొనియాడిన వారిలో యూనివర్సిటి గ్రాంట్స్ కమీషన్ పూర్వ చైర్మన్ ఆచార్య వేద ప్రకాశ్, అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటి పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య రాజన్ జి.హర్సే తదితరులు ఉన్నారని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. 
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో అమలు చేస్తున్న వివిధ ఉత్తమ విధానాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తున్న  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఈ వర్క్ షాప్ కి హాజరై యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో అమలు చేస్తున్న వివిధ ఉత్తమ విధానాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆయన తన ప్రెజెంటేషన్ లోపాఠ్య ప్రణాళికల రూపకల్పన,  ఈ- గవర్నెన్స్, పరిశోధనలకు ఇచ్చే ప్రోత్సాహం, పరిశోధనలు చేసే విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే విధంగా రూపొందించిన స్వర్గ్ పథకం, స్వయంప్రతిపత్తిలో సమతుల్యతను పాటించడం, అంగవైకల్యం గల విద్యార్థులకు అందించే అవకాశాలు, విద్యార్థులకు ఉపయోగపడే మానసిక దృఢత్వం కోసం సైకలాజికల్ కౌన్సిలింగ్ వ్యవస్థ, సోలార్ ఎనర్జీని ఉపయోగించుకోవడం, ఇతర పరిశోధన సంస్థలతో ఒప్పందాలు, ఉపాధి అవకాశాలపై దృష్టి కేంద్రీకరించడం, స్వచ్ఛభారత్ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనడం,  క్రీడా సౌకర్యాలతో పాటు, యోగా, ధ్యానం మొదలైన అంశాలను వివరించారు.  
వీటిని విన్న తర్వాత వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన వారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్  అనుసరిస్తున్న వాటిలో కొన్నింటిని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆన్ లైన్ ఫీడ్ బ్యాక్ గురించి వివరించమన్నారు. వాటిని ఇంటర్నెట్ ద్వారా ఉంచుతున్న విధానాన్ని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వివరించారు. ఫీడ్ బ్యాక్ ఇచ్చే విద్యార్థుల వివరాలు గుప్తంగానే ఉంచుతారని, వాటిని విశ్వవిద్యాలయంలో సంబంధిత అధ్యాపకులకు గానీ, అధికారులకు గాని తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటారని వివరించారు.  వాటిని తమ విశ్వవిద్యాలయంలో అనుసరించాలనుకుంటున్నామని, తర్వాత తనతో సంప్రదిస్తామని కొంతమంది అన్నారని వెంకటేశ్వరరావు వివరించారు. 
కార్యశాలలో పాల్గొన్న వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు 

వివిధ సంస్థలలో పనిచేసిన, పనిచేస్తున్న ఉన్నత విద్యలో నిష్ణాతులైన వారు తమ అనుభవాలను ఈ కార్యశాలలో వివరించారు. మరికొంతమంది ఉన్నత విద్యాసంస్థల్లో రావాల్సిన మార్పులు, కొత్త ఆవిష్కరణలు, చేపట్టాల్సిన విధానాలను తమ ప్రసంగాల్లో విశ్లేషించారు. వారిలో ఆచార్యులు అఖిలభారత విశ్వవిద్యాలయముల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆచార్య ఫర్ఖాన్ ఖమర్, వివిధ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల అధిపతులైన ఆచార్య ఎన్.వి.వర్గీస్, ఆచార్య కుమార్ సురేశ్, ఆచార్య రాజన్ జి.హర్షే, డా. ఆర్.కె.చౌహాన్, ఆచార్య మాథ్యూ, ఆచార్య కె.శ్రీనివాస్, ఆచార్య భూషణ్ పట్వర్థన్, ఆచార్య వేద ప్రకాశ్, ఆచార్య జి.డి.శర్మ తదితరులెంతోమంది ఈ కార్యశాలలో పాల్గొని వివిధ ఉన్నత విద్యాసంస్థల్లో రావలసిన మౌలికమార్పుల గురించి వివరించారు.  
ఈ కార్యశాలలో ప్రధానంగా  స్వయంప్రతిపత్తితో పాటు వివిధ అధికారాలను నిర్వహించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థలతో సమన్వయం, పరస్పరసహకారాల గురించి చర్చించారు. దీనితో పాటు నిధుల సేకరణ, వివిధ సంస్థలతో ఒప్పందాలు, నూతన పాఠ్య ప్రణాళికల రూపకల్పన,  ఉపాధి అవకాశాలపై దృష్టికేంద్రీకరించడం, వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, సామాజిక ప్రయోజనాలు, భవిష్యత్ అవసరాలపై దీర్ఘకాలిక ప్రాజెక్టులు మొదలైన అంశాలగురించి చర్చించారు. పాఠ్య ప్రణాళిల రూపకల్పన, వివిధ విధాన నిర్ణయాల్లో పూర్వవిద్యార్థుల్ని భాగస్వాములుగా చేసుకోవడం, ఉన్న వనరుల్ని సక్రమంగా వినియోగించుకోవడం, పాలనలోను, బోధనలోను పారదర్శకతను పాటించడం, బోధనలో వినూత్నవద్ధతుల్ని అనుసరించడం వంటి విషయాల్లో వినూత్నావిష్కరణలు అవసరమన్నారు. కంప్యూటర్, ఇంటర్నెట్ లను ఉపయోగించుకున్నా మూసధోరణిలో పాఠ్యాంశాల రూపకల్పన, బోధన యాంత్రికంగా మారకుండా జాగ్రత్తపడాల్సన అవసరాన్ని గుర్తించాలన్నారు. సమస్యల పరిష్కారానికి విశ్లేషణాత్మకంగా ఆలోచించే విద్యావిధానంపై దృష్టికేంద్రీకరించాలన్నారు. 
భూమిపుత్ర దినపత్రిక, 16 మార్చి 2019, అనంతపురం

ఈ కార్యశాలలో ఉన్నత విద్యాలోను, పరిపాలనారంగంలోను నిష్ణాతులైన వారు చెప్పిన అంశాలు ఇప్పటికే చాలా వరకూ యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ అనుసరిస్తూ, అనేకాంశాల్లో సమకాలీన ఉన్నత విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగానే కొనసాగుతుందని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.

 University of Hyderabad, News Heralad Report



కామెంట్‌లు లేవు: