"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

15 మార్చి, 2019

డా. పుట్ల హేమలతగారి పరిశోధన స్మృతిలో… (మార్చి, 2019)




డా.పుట్ల హేమలత గారు మరణించారనే సమాచారాన్ని అప్రయత్నంగా వాట్సప్‌లో చదివాను. నాకు పెద్ద షాక్‌ తగిలినట్లయింది. ఈ సమాచారం తప్పనుకున్నాను. కానీ, అది పెట్టింది డా.నవీన్‌. అతడు ఆమెకు అల్లుడవుతారు. నాకు యూనివర్శిటీ కొలీగ్‌. అయినా షాక్‌ నుండి కాసేపు తేరుకోలేకపోయాను. వెంటనే వారి కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండే ప్రొఫెసర్‌ రాజశేఖర్‌గారికి ఫోన్‌ చేశాను. ఆయన దాన్ని ధృవీకరించారు. ఆమె పార్ధివ దేహాన్ని రాజమండ్రిలోని ఒక ఆసుపత్రిలో ఉంచారనీ, తానూ అక్కడే ఉన్నాననీ చెప్పారు. ఈ సమయంలో ఫోన్‌ చేయొచ్చో, లేదో అనిపిస్తున్నా, నా మనసు కుదుటపడలేదు. డా.నవీన్‌కు ఫోన్‌ చేశాను. ఆయన కూడా దాన్ని ధృవీకరించేసరికి నాకు అత్యంత దగ్గర వ్యక్తి, నా రక్తసంబంధమేదో నాకు దూరమైపోయినట్లనిపించింది. డా.హేమలత గార్ని నేనెప్పుడూ ”అక్కా” అని పిలిచేవాణ్ణి. ఆమె నాతో అంత ఆత్మీయంగా ఉంటారు. ఆమెతో నాకున్న అనుబంధమంతా ఒక్కసారిగా గుర్తుకొచ్చేసరికి ఒక్కసారి కళ్ళు బైర్లు కమ్మాయి. కన్నీళ్ళాపుకోలేకపోయాను. రాజమండ్రిలోనే ఉండే మా తమ్ముడు డా.రవికుమార్‌కి ఫోన్‌ చేసి, వెంటనే ఆసుపత్రికి వెళ్ళి చూసి రమ్మన్నాను. ఆ వార్త నిజం కాకూడదనుకున్నాను.
ఆమెతో నాకు, నా కుటుంబానికి ఉన్న అనుబంధమంతా కళ్ళముందు కదలాడింది. కళ్ళు మసకమసకగా ఉన్నా, ఆమె నా కళ్ళముందే కదులుతున్నట్లే అనిపించింది. ”అక్కా… ఈ వార్త నిజం కాకుంటే ఎంత బావుణ్ణు” అంటూనే విషయాన్ని నా వాట్సాప్‌ స్టేటస్‌లో చూసి చాలామంది ఫోన్లు చేస్తుంటే వాళ్ళతో మాట్లాడలేకపోయాను. గొంతు బొంగురుపోయేది. నా జ్ఞాపకాలు వరదల్లా కళ్ళలో పొంగిపొర్లేవి. ఈ మధ్యకాలంలో ఇంత తక్కువ సమయంలో అంత గాఢమైన అనుబంధాన్ని కలిగించిన వ్యక్తి నాకెవరూ తారసపడలేదేమోననిపిస్తుంది. ఆమెలోని పట్టుదల, పాండిత్యం, స్వచ్ఛమైన మనస్సు… అన్నింటికీ మించిన ఆత్మీయతానురాగాలు నన్నెంతగానో ఆలోచింపజేసేవి. ఆమెతో మాట్లాడుతుంటే నా కుటుంబ సభ్యురాలితో మాట్లాడుతున్నట్లుండేది. ఆమెతో మాట్లాడుతుంటే ఒక పరిశోధకురాలితో చర్చిస్తున్నట్లుండేది. ఆమెతో మాట్లాడుతుంటే దళిత, మైనారిటీ వర్గాల ప్రతినిధితో మాట్లాడుతున్నట్లుండేది. ఆమె నన్నెంతో గౌరవించేవారు. ఆమె నిర్వహించే సదస్సులు, సమావేశాలకు నన్నెంతో గౌరవంగా ఆహ్వానించేవారు.
రాజమండ్రిలో కేంద్ర సాహిత్య అకాడమీ, మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడమీ, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలలయం సంయుక్తంగా 2008 డిసెంబరు 8, 9, 10 తేదీలలో సాహిత్య సభలు నిర్వహించారు. మూడవరోజు అంటే డిసెంబరు 10వ తేదీన ‘మైనారిటీ సాహిత్యం’పై జరిగిన ఒక సమావేశానికి నన్ను అధ్యక్షత వహించమన్నారు. ఆ సమావేశానికి ముఖ్య అతిధిగా ప్రొఫెసర్‌ ఎస్‌.వి.సత్యనారాయణ పాల్గొనగా, డా.సీతారాం, డా.వినోదిని తదితరులు పత్రాలను సమర్పించారు. ఆ సదస్సులో మైనారిటీ సాహిత్యంపై నేను సమర్పించిన పత్రం తర్వాత కాలంలో సాహితీవేత్తల దృష్టిని ఆకర్షించింది. నిజానికి అప్పటినుండే సాహితీవేత్త హేమలత గారితో నా పరిచయం మొదలై, ఆమె ‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’ గురించి పరిశోధన చేస్తున్న క్రమంలో ఒక పరిశోధకురాలిగా ఆ పరిచయం మరింత బలపడింది. ఆ నిబద్ధత వల్ల, ఆ పరిచయంతోనూ నేను కూడా ఆమె నిర్వహించిన మరికొన్ని జాతీయ సదస్సుల్లో, సాహితీ కార్యక్రమాల్లో పాల్గొన్నాను.
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక మూడవ మహాసభల సందర్భంగా 2016 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ రీసెర్చ్‌ (ICSSR)సంస్థ సహకారంతో ”సహన, అసహన భావనలు – చారిత్రక, సామాజిక, సాంస్కృతిక పరిణామాలు – ప్రభావాలు” అన్న అంశంపై ఒక జాతీయ సదస్సు, ఆంధ్ర మహిళా సభ క్యాంపస్‌, హైదరాబాద్‌లో జరిగింది. దానిలో నన్ను ”కులమత సమాజం – సహన సంస్కృతి” అనే పత్రాన్ని సమర్పించమని డా.మల్లీశ్వరి గారి ద్వారా ఆహ్వానించారు. ఆ సదస్సులో డా.హేమలత గారితో పాటు ఆచార్య కాత్యాయనీ విద్మహే, రుక్మిణి తదితర ప్రముఖ మహిళా రచయిత్రులతో పాటు వకుళాభరణం రామకృష్ణ, విక్టర్‌ తదితర రచయితలు పాల్గొన్నారు.
అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’ అనే అంశంపై రాజమహేంద్రవరంలో 2017 జనవరి 11వ తేదీన ఒకరోజు జాతీయ సదస్సు జరిగింది. ఆ సదస్సుని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, మనోజ్ఞ సాహిత్య అకాడమీ (విహంగ డాట్‌ కామ్‌) వారు సంయుక్తంగా నిర్వహించారు. సాహిత్యపీఠం డీన్‌ ఆచార్య ఎండ్లూరి సుధాకరరావు అధ్యక్షత వహించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ఎస్వీ సత్యనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన… ఆధునిక శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పుల్ని గమనిస్తూ వాటిని అందుకోవడంలోనే పరిశోధన విజయవంతమవుతుందనీ, ఆ విధంగా ఈ సదస్సు ఒక మంచి ప్రయత్నమన్నారు. సదస్సు అవగాహనా పత్రాన్ని సదస్సు కన్వీనర్‌గా వ్యవహరించిన డా.పుట్ల హేమలత వివరించారు. నేటికీ చాలామందికి అంతర్జాలం పట్ల అవగాహన ఉండడం లేదనీ, దీన్ని కనీసం పరిశోధకులు, రచయితలు అయినా ముందుగా అందుకోగలిగితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఈ సదస్సుని నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ సదస్సులో నన్ను ”తెలుగు భాష-సాంకేతిక పరిజ్ఞానం-ఆవశ్యకత” అనే అంశంపై జరిగిన సమావేశానిక అధ్యక్షత వహించమన్నారు. ఆ సమావేశంలో వివిధ విశ్వవిద్యాలయాల పరిశోధకులు అధిక సంఖ్యలో పత్రాలు సమర్పించారు. ఈ సమావేశానికి మధ్యలో భోజనానంతరం ‘విహంగ సాహిత్య పత్రిక వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమం’ జరిగింది. ఈ కార్యక్రమానికి ‘విహంగ’ సంపాదకురాలు డా.పుట్ల హేమలత అధ్యక్షత వహించారు. విహంగ అంతర్జాల పత్రిక నిర్వహణలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహాయ సహకారాలందిస్తున్న రచయిత్రులు, రచయితలకు ”విహంగ పురస్కారాల”ను ప్రకటించారు. వీటిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య ఎస్‌.వి.సత్యనారాయణ, సాహిత్య పీఠం, బొమ్మారు పీఠాధిపతి ఆచార్య ఎండ్లూరి సుధాకరరావు, ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణం, విజయనగరం శాఖ ప్రత్యేక అధికారి ఆచార్య జి.యోహాన్‌బాబు, విహంగ సంపాదకురాలు డా.పుట్ల హేమలత గార్ల చేతుల మీదుగా పురస్కార గ్రహీతలను సత్కరించారు. ఆ పురస్కార గ్రహీతల్లో నేను కూడా ఉన్నానని తెలిసి ఎంతో ఆనందించాను. నన్నీ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఆనాటి సదస్సు, సభలను నేనెప్పటికీ మర్చిపోలేను. తర్వాత ఆ సదస్సు పత్రాలను పుస్తకంగా ప్రచురించారు. నేను పాల్గొన్న అనేక ఛాయా చిత్రాలను, నా అధ్యక్షోపన్యాసాన్నీ అందులో ప్రచురించారు. ఆ సదస్సులో పాల్గొని పత్ర సమర్పణ చేసిన పరిశోధకులు, సాహితీ వేత్తలు ఎంతోమందికి నా చేత ధృవీకరణ పత్రాలను ఇప్పించి నన్నెంతగానో గౌరవించారు. అవన్నీ ఆ పుస్తకంలో నేడు కనిపిస్తుంటే, వాటిని చూసినప్పుడల్లా అక్క డా.పుట్ల హేమలతగారు నా కళ్ళను తడి చేయకుండా ఎలా ఉంటారు?
నిజానికి నాకు ఆమెతో మాట్లాడినప్పుడల్లా ఆమె ఇంటర్నెట్‌లో తెలుగు సాహిత్యం గురించీ, మహిళా సమస్యల్ని చిత్రించిన రచనల గురించీ, వాటిని ప్రజలకు చేర్చాల్సిన మార్గాల గురించీ, ప్రరవే గురించీ ఆమె ఎంతో తపిస్తున్నారనిపించేది. తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవట్లేదనిపించేది.
డా.పుట్ల హేమలత గారు ”వెబ్‌లో తెలుగు సాహిత్యం తీరు-తెన్నులు” అనే అంశంపై పరిశోధన చేసి ఆ గ్రంథానికి డాక్టరేట్‌ వచ్చిన తర్వాత దాన్ని అలాగే ఉంచేయలేదు. దాన్ని ‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’ పేరుతో ముద్రించి లోకానికి అందించారు. ఆ పుస్తకాన్ని ప్రచురించేవరకూ నిత్యం అంతర్జాలం, తెలుగు వినియోగం, సాంకేతిక పరిజ్ఞానం మొదలైన అంశాల్ని తనకు అందుబాటులోఉన్నంతవరకూ మార్పులు, చేర్పులు చేస్తూనే ఉన్నారు. ప్రింటింగ్‌కి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక కొత్త విషయం దొరికినప్పుడు – అది తొలిసారి కంప్యూటర్‌పై తెలుగుని వాడిన వారి గురించి ప్రచురించడం కోసం మరలా ఆర్ధికంగా మరింత భారమైనా వెనుకాడలేదు. ఇవన్నీ నాతో చెప్పేవారు. ఆ పుస్తకానికి వేసిన ముఖచిత్రం కూడా మేడమ్‌గారి ఆలోచనల్లోనుండే రూపొందింది. డిజైనర్‌ దగ్గర కూర్చొని ఏ ఏ అంశాలుండాలో వివరించి ముఖచిత్రాన్ని అర్థవంతంగా వచ్చేలా రూపొందించారు. దాని గురించి పరిశోధన చేస్తున్నప్పటినుండీ నాకు బాగా పరిచయమవడం వల్ల సమాచార సేకరణ నుండి డాక్టరేట్‌ పూర్తవడం, దాన్ని మరలా గ్రంథ రూపంలోకి తీసుకురావడం, దాని ఆవిష్కరణ వరకూ అనేక సూచనలు, సలహాలను అడిగేవారు. తనకు తెలిసినా తెలియనట్లుండే నిగర్వి ఆమె. తన పరిశోధన గ్రంథానికి ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, ప్రముఖ రచయిత్రి ఆచార్య కాత్యాయనీ విద్మహేలతో పాటు నన్ను కూడా ముందుమాట రాయమని, దాన్ని ఒక్క అక్షరం కూడా మార్చకుండా తన పుస్తకంలో ప్రచురించుకున్నారు. ఆ గ్రంథం ఆవిష్కరణ సభకు నన్నొక వక్తగా పిలిచి మాట్లాడించారు. డా.పుట్ల హేమలతగారి పరిశోధన గ్రంథం ”అంతర్జాలంలో తెలుగు సాహిత్యం” ఆవిష్కరణ సభ 2016 అక్టోబరు 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు తెలంగాణ సారస్వత పరిషత్‌, బొగ్గులకుంట, తిలక్‌నగర్‌, హైదరాబాద్‌లో జరిగింది. సభకు ముఖ్య అతిధిగా జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి గారు విచ్చేసిన ఈ సభకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, పరిశోధకుడు ఆచార్య ఎన్‌.గోపి గారు అధ్యక్షత వహించారు. సభను ప్రముఖ కవి, హేమలతగారి సహచరుడు ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ గారు స్వాగతం పలికారు. వక్తలుగా హైదరాబాదు విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, నేను (ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు) కంప్యూటర్‌ ఎరా మాసపత్రిక సంపాదకుడు నల్లమోతు శ్రీధర్‌ గార్లతో పాటు గ్రంథ రచయిత్రి డా.పుట్ల హేమలత గారు పాల్గొన్నాం. సభలో ఆచార్య బన్న ఐలయ్య, డా.రఘు, రచయిత్రులు, భూమిక సంపాదకురాలు సత్యవతి తదితరులెంతో మంది ప్రేక్షకులుగా కూర్చున్నారు.
ఆమెకు పరిశోధనలో నూతన సమన్వయాల్ని గాని, కొత్త అంశాల్ని గాని అన్వేషించాలనే తపన కూడా అధికంగా కనబడేది. తొలిదశలో తన పరిశోధనలో చేయాల్సిన అంశాలు, చేర్చాల్సిన అంశాలు, అధ్యాయాల విభజన వంటి వాటిని నాతో చర్చించేవారు. అదంతా ఇంచుమించు తొలిరోజుల్లో అత్యధిక శాతం ”చాటింగ్‌”లోనే కొనసాగించేవారు. అలాగైతే వాటిని తాను భద్రపరచుకొని, కావలసినప్పుడల్లా మరలా చూసుకునే వీలుంటుందనేవారు. ఆ చాటింగ్‌, ఈ-మెయిల్‌ ఉత్తర ప్రత్యుత్తరాలను ఇప్పుడు చూస్తుంటే, మరలా ఆ అక్షరాలు కళ్ళకు కనిపించకుండా కన్నీళ్ళడ్డుకుంటున్నాయి.
అక్కా!
నువ్వు అర్ధంతరంగా నీ పయనాన్ని ఆపేసినా, దాన్ని అందుకోవడానికి వందలాది ప్రరవే రచయిత్రులు నేడు సిద్ధమయ్యారు. అన్నింటికీ మించి నీ భావజాలాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న ఆణిముత్యం లాంటి కూతురు, అక్షరానికి పదునెలా పెట్టాలో తెలిసిన వర్తమాన యువ కథా రచయిత్రి మానస వంటివాళ్ళు నీ పయనాన్ని మరింత ముందుకు తీసుకెళతారనే నమ్మకం కలుగుతోంది. నీతోఉన్న అనుబంధాన్ని, నీ పరిశోధన కృషిని, నీ ఆత్మీయానురాగాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. దాన్నెక్కడ ప్రస్తావించవలసి వచ్చినా నా వంతు పాత్రను నేనూ నిర్వహిస్తానని మాటిస్తున్నాను.
 మీ తమ్ముడు లాంటి వాడైన…
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
ప్రొఫెసర్, తెలుగుశాఖ, &
డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్, సెంట్రల్ యూనవర్సిటి, హైదరాబాద్.
19 ఫిబ్రవరి 2019
(డా.పుట్ల హేమలత గారు ది:  09.02.2019 న రాజమహేంద్రవరంలో మరణించారు, ఆమె స్మృతిలో...)


కామెంట్‌లు లేవు: