ఔను ఈమె
అసూర్యంపశ్య కాదు
పుట్టిన మర్నాటి నుండే
ప్రకృతి ఉయ్యాల్లో పక్షు కిలకిలరావాల్లో
లేగదూడ గంతులతో
ఆంబోతుల అత్యాచారాలతో
బతుకు పాఠాల్ని నేర్చుకుంటుంది !
కదిలే నదితో పోటీ, యెదలో సొదతో పోటీ
రంగుల రంగుల పొంగులతో పోటీ
జీవితాన్ని మలుపుతిప్పే
తెలుపు నలుపులతో నిత్యం పోటీ పోటీ!
ఈమె అసూర్యంపశ్య కాదు!
భర్త లేకుంటే బతుకేలేదనో
బతకనివ్వరనో
నిస్సహాయ స్థితిలో
సతీసహగమనమంటూ
అశక్తిని శక్తిగా నిరూపించుకునే
యుక్తి పరురాలో ముక్తి పరురాలో,
భక్తి పరురాలో కానే కాదు!
ఒక ఎ్లమ్మలా, ఒక మల్లమ్మలా,
ఒక రేణుకమ్మలా, ఒక గ్రామదేవతలా
ఒంటరిగానైనా నిలిచే శక్తి! నిలబెట్టే శక్తి!
ఈమె అసూర్యంపశ్య కాదు!
పీలికలు పీలికలుగా చేసిన జీవితాన్ని
తలచుకొని తలచుకొని
తలదించుకుని
కుమిలిపోయే అబల కాదు
పాడుబడినా , బీడుపడినా
జీవితాన్ని
పండించుకోవడం తెలిసిన సబల!
ఈమె అసూర్యంపశ్య కాదు!
ఈమె అమాయక సీతకు వారసురాలేమీ కాదు
శిష్టుడనుకునే వశిష్ఠ మహర్షినే
తన కోసం తపస్సు చేసేలా చేసుకుని
ఆకాశంలో నక్షత్రమై మెరిసే అరుంధతి
ఈమె అసూర్యంపశ్య కాదు!
కారంచేడు, చుండూరుల్లో
పోరాటయోధుల్ని
పుష్పించిన
నీ వెంటరాని
నా అంటరాని వసంతం!
నా బతుకులో వాడిపోని
ఓడిపోని, ఓటమెరుగని
నిత్యవసంతం!
ఈమె అసూర్యంపశ్య కాదు!
-దార్ల వెంకటేశ్వరరావు
9182685231
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి