సూర్య దినపత్రిక ‘అక్షరం’ సాహిత్యానుబంధం, 13 ఆగస్టు 2018 సౌజన్యంతో...
నాకను రెప్పల చప్పుడు...!
నీకోసమే...
నీ శబ్దం విన్న వెంటనే రావాలని
రెండుచెవుల్నీ
ద్వార బంధాలకు తగిలించిన
అమ్మనై వంటింటిలో
నీకోసం ఎదురు చూస్తున్నాను
నీ ఎదురుగా ఎప్పుడూ
పొగలు కక్కే నాన్ననవుతూ
డైనింగ్ టేబుల్ మీద
చల్లారిపోతూ
నువ్వొచ్చాకే తిందామని
నీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటాను
సిగలో పువ్వుల వోలే
గుండెలపై పరిమళించాలని
సింగారించుకుంటూ
నలగని చీరను సర్దుకుంటూ నీభార్యనై
నీకోసం ఎదురుచూస్తాను
నీతో దాగడుమూతలాడుతూ
నిన్నేడిపిస్తూనో
నేనే ఏడుస్తూనో
నీతో ఆడుకోవాలని
చెల్లినై, తమ్ముడునై
నీ కోసమే ఎదురుచూస్తాను!
నీతో కలిసి
సంతోషంగా చీర్ కొట్టాలని
మిత్రుడినై నీజతకట్టాలని
మత్తు వాసనలతో
నీకోసం ఎదురు చూస్తున్నాను!
నువ్వు చెవిలో హియర్ ఫోన్స్
పెట్టుకున్నా
చెవులో పువ్వులు పెట్టే శబ్దాల్నీ
కాస్త విను!
పుచ్చకాయల్లా పగిలిపోతున్న
తలకాయల్ని చూసినప్పుడల్లా
హెల్మెట్ తీసి స్టైల్ గా
గాలికి వయ్యారమయ్యే
అందమైన తలనే దాచాలనిపిస్తుంది!
నన్నేదైనా దూసుకెళ్తున్నప్పుడల్లా
మనసుతోపోటీపడుతూ నడిపే వేగమే
నాగుండెల్ని గుభేలుమనిపిస్తుంది!
రోడ్డుమీదెవరైనా గుమిగూడితే
నువ్వక్కడ ఉండకూడదని
నేను మొక్కని దేవుళ్ళుండరు!
నువ్వే తుఫానుల్లోనూ
చిక్కుకోకుండా
నువ్వు మళ్ళీ నవ్వుతూ
నువ్వు నువ్వు గా ఇంటికి రావడమే
యుద్ధం జయించిన వీరునిగా
అనిపిస్తావు!
నువ్వింటి నుండి బయలుదేరి
మళ్ళీ యింటికి వచ్చేవరకూ
నీకోసమే ఎదురు చూసే
నా కనురెప్పల చప్పుడునెప్పుడూ
మర్చిపోకు !
-దార్ల వెంకటేశ్వరరావు
9182685231
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి