వాళ్ళని
కాసేపు విందాం!
ఎక్కడనుండీ
తడి ?
తడితడిగా
కవిత్వం
గుండెతడిగా
కవిత్వం
గొంతుపెగలనియ్యని
తడి!
కాసేపు
రీసెర్చ్ పక్కనపెట్టాలనిపించింది.
వాళ్ళు
మనింట్లోవాళ్లు కావచ్చు.
మన
పాఠశాల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో,
బయట
ఎక్కడైనా కనిపించవచ్చు.
పురుషుడికున్నంత స్వేచ్ఛ
వాళ్ళకి
ఈ విషయంలో ఎందుకోలేదో!
వాళ్ళు
ప్రవహించే మౌనాలు.
వాళ్ళు
బాధల్ని తమలో తామే
ఉండగట్లుకునే
బలవంతపుపర్వతాలు.
వాళ్ళు
కళ్ళు వర్షించాలనుకున్నా
చాటున్న
నేలదొరకని మబ్బులు.
వాళ్ళు
కదులుతున్న మంచుకొండలు
వాళ్ళు
సిగ్గుముడేసుకున్న అసహాయ సౌందర్యదేవతలు
వాళ్ళు
మగాళ్ళలా బరితెగించి
రోడ్డుమీదే
నిలబడి ఓ వికృతచిత్రం గియ్యలేరు
వాళ్ళు
స్పందిస్తే ఎలా ఉంటుంది?
వాళ్ళు
అక్షరమైతే ఎలా పలుకుంతుంది?
అనేక
సమూహాలు ఒక్కసారిగా మనమీదపడినట్లుంది
చీకటి
సూదుల్లేవో కళ్ళలో బాణాలుగా విసిరినట్లుంటుంది
వాళ్ళింతకాలం
మనకి నిలబడే నేలయ్యారు
వాళ్ళింతకాలం
మనకి సుఖశయ్యలయ్యారు
వాళ్ళింతకాలం
కన్నీళ్ళల్లో దహించుకుపోయారు
వాళ్ళు
చీకటి గుహల్నుండి బయటకొస్తున్నారు
వాళ్ళింతకాలం
నటించిన మూగతనాన్ని విదుల్చుకుంటున్నారు
వాళ్ళు
గొంతుల్లో జీరగా బాధ కురుస్తున్న వాన
వాళ్ళు
గొంతుల్లో పిడికళ్ళవ్వాలనే పిలుపు
వాళ్ళు
గొంతుల్లో మనువుగాడి గొంతుపిసికాలనే కసి...
వాళ్ళు
మాట్లాడాలి.
వాళ్ళు
మాట్లాడుతున్నారు
వాళ్ళు
గొంతుల్లో ధ్వనులు అక్షరాలవుతున్నాయి
వాళ్ళు
గొంతుల్లో అక్షరాలు ఆవేదనల్ని వినిపిస్తున్నాయి
వాళ్ళే
మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడుతున్నారు.
వాళ్ళు
మాట్లాడుతున్నారు.
వాళ్ళని
కాసేపు విందాం!
-దార్ల వెంకటేశ్వరరావు
హైదరాబాదు
(2-3-2018 గణేశ్ దినపత్రికలో ప్రచురితం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి