అప్పటి కింకను గాంధీ ఇర్విన్ సంధి
జరుగలేదనే వాక్యముతో ‘ఒక ముద్దు’ కథ ప్రారంభమవుతుంది. అంటే 1930ల ముందటి సంగతి
అన్న మాట.
శాసనోల్లంఘనలో భాగంగా విదేశీ వస్తు
బహిష్కరణ కొనసాగుతుంది. ఒక పద్దెనిమిది ఏళ్ల యువతి అంకిత భావంతో ఆ ఉద్యమంలో
పాల్గొని ప్రచారం చేస్తుంటుంది. ఒక పట్టణంలో బహిష్కరణాస్తమ్రు పని చేయడం లేదని
విని ఆ యువతి అక్కడికి బయలుదేరుతుంది. అక్కడ కనిపించిన విలాస యువకుడికి విదేశీ
వస్తమ్రులు కొనవద్దని, వాటి లాన నష్టాల గురించి వివరిస్తుంది. దానికి ఆ యువకుడు
విలాసంగా, ఎగతాళిగా నీవు
ఒక ముద్దిచ్చినచో, నేను స్వదేశీ దీక్షను అవలంబించనంటాడు. దానికి ఆ యువతి ‘నా
కిద్దరు అన్నలు ఉన్నారు. అనుదినము నన్ను ముద్దిడుకుని ఆశీర్వదించి శాంతి సమరమునకు
పంపుతున్నారు. విదేశీ వస్తు వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్న సోదరుడ్ని
రక్షించాల్సిన అవసరముంది. నీవు నా మూడవ తోబుట్టువువు. అన్నా! రమ్ము. ఒకటి కాదు
వలసినన్ని గొనుము’ అనడంతో ఆ యువకుడు నిడై పోశ్చేష్టుడవుతాడు. ఉద్యమకారులకు
వుండాల్సిన సమయస్ఫూర్తిని, త్యాగనిరతిని ఈ కథ తెలియజేస్తుంది.
నేను మా పరిశోధక విద్యార్థులతో పాటు సభకు వెళ్ళాను. మస్తాన్, ఉమేశ్ నాతో పాటు సభకు వచ్చారు. అప్పటికే అక్కడ సంస్కృతం ఎం.ఏ.(సాయంకాలం కోర్సు) అదనంగా చేసి, పరీక్షలు రాస్తున్న మా పరిశోధక విద్యార్థులు చంద్రమౌళి, శ్రీధర్, సుమలత, సునీల్, రమేశ్ తదితరులు సభకోసం నిరీక్షించారు.
ఆ తర్వాత మాట్లాడిన ప్రముఖ రచయిత్రి, తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్, డా.బి.విజయభారతి పుస్తకాన్ని తెచ్చిన వాళ్ళను అభినందించారు. తన ప్రాంతాన్ని మరొకసారి గుర్తుచేసుకొని, ఆ (కోనసీమ, మామిడికుదురు, నగరం, మోరిపాలెం...) ప్రాంతాల్లో విస్తరించిన అంబేద్కర్ భావజాలం, దాని తాత్త్వికతకు ఆధారమైన బౌద్ధిజం, ఆ స్తూపాలు నేటికీ ఎలా ఉన్నాయో గుర్తుచేశారు. ఎంత లేదన్నా పితృస్వామ్యవ్యవస్థ మన నరనరాల్లోనూ జీర్ణించుకుపోయిందనీ, తండ్రీ, తల్లీ రచయితలైనా తండ్రి రచనలకు లభించినంత ఆదరణ తల్లి రచనలకివ్వడం లేదని వాపోయారు. ఇప్పటికీ ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంటే నాడే నాగమ్మగారు ఆ విధంగా రచనలు చేయడం వెనుకున్న పురుషుల ప్రోత్సాహాన్ని కూడా వివరించారు.
నిజంగా ఈ ఇద్దరి ప్రసంగారు అక్కడున్నవాళ్ళకు ప్రైమరీ సోర్స్ ని అందించనట్లనిపించింది. తర్వాత సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను మాట్లాడమన్నారు. రెండు నిమిషాల్లోనే ముగిస్తానని చెప్పాను.
తాడినాగమ్మగారు మా జిల్లావాళ్ళు కావడం, అదికూడా ఆమె పేరు మా అమ్మపేరు కూడా ఒకే పేరు ‘నాగమ్మ’ కావడం వల్ల ఈ సభలో నేను పాల్గొనడం నాకెంతో ఆనందంగా ఉందన్నాను. ఆమెకథలు, రచనలు చదువుతుంటే మా అమ్మ రచనలేవో చదువుతున్నట్లనిపించిందన్నాను. ఆమె రాసిన కథల్లో ఆధునిక కథలకు ఉండాల్సిన లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయనీ, వస్తువు, నిర్మాణం, సంఘర్షణ, పాత్రల చిత్రీకరణ, ముగింపులను రచయిత్రి ఎంతో చక్కగా నిర్వహించారని చెప్పాను. ఒకముద్దు కథలో ఉత్సుకతను వివరించాను. మిగతా కథల్లో ముఖ్యంగా ‘ప్రేమసమస్య’ కథలో గల లాజికల్ కంక్లూజన్ ఎంతో గొప్పగా ఉందన్నాను. కథను ప్రారంభించడంలోను, ముగించడంలోను పాఠకుల్ని ఆలోచింపజేసేవిధంగాను, వాస్తవికతకు దగ్గరగానూ ఉందన్నాను. పుస్తకాన్ని తీసుకొచ్చిన సంగిశెట్టి శ్రీనివాస్, వెల్డండ శ్రీధర్ లను అభినందించాను. ఈ పుస్తకానికి రాసిన సంగిశెట్టి ‘దారిదీపం’ నిజంగా భవిష్యత్తు పరిశోధనలకు దారి చూపే దీపమవుతుందన్నాను. ‘ప్రతిభారత్నం తాడిరత్నం’ అనే పేరుతో ఆచార్య బన్న అయిలయ్య గారు రాసిన ముందుమాట ఒక పరిశోధన సిద్ధాంత గ్రంథంలా ఉందనీ, ఆయన మాకు పరిశోధనలోను, అనేకాంశాల్లో మార్గదర్శకులనీ చెప్పాను. ‘తాడినాగమ్మ ఒక ఆశ్చర్యం’ పేరుతో రాసిన డా.ఎం.ఎం. వినోదిని గారి ముందుమాటలో కూడా విస్మరించిన చరిత్రను పునర్మిర్నించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించేలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నాను. తాడి నాగమ్మ గురించి ఇంతకు ముందు ప్రస్తావించిన, రాసిన వాళ్ళలో గోగుశ్యామల, శోభారాణి వంటి వారిని గుర్తుచేసిన సంపాదకులు చరిత్రకు వాస్తవికతను అద్దే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించాను. గ్రాంథిక భాష విస్తృతంగా వ్యవహారంలో ఉన్న రోజుల్లోనే సరళ గ్రాంథికాన్ని రాయడం, అదీ ఎంతో చిక్కగా రాయడం ఆమెలోని క్రమశిక్షణతో కూడిన అధ్యయనాన్ని తెలుపుతుందన్నాను.
అయితే, తాడి నాగమ్మ రచనలను చదివిన తర్వాత ఆమెను ‘తొలితెలుగుదళిత కథా రచయిత్రి’గా గుర్తించడంలోని వివిధాంశాలను లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందనీ, ఆమె ఒక దళిత కుటుంబం నుండి రావొచ్చేమో గానీ, ఆమె రాసిన కథలు ప్రధానంగా జాతీయోద్యమం, గాంధీజీ సంస్కరణోద్యమం, అంతర్జాతీయంగా జరుగుతున్న అనేక చారిత్రకాంశాలను సృజనీకరించడంలో గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించిన రచయిత్రిగా ప్రధాన జీవన స్రవంతిలో ఉన్న రచయిత్రులకు ఏమాత్రం తీసిపోరని పేర్కొన్నాను. ‘తొలిదళిత’ అనే విశేషణం బహుశా తాడినాగమ్మగారిని చరిత్ర విస్మరించిన విషయాన్ని పైకి తీసుకొస్తూ, దళితురాలైన ఆమె కథల్ని రాసినవాళ్లలో తొలిరచయిత్రిగా ప్రాచుర్యంలోకి తీసుకొని రావాలని సంపాదకులు భావిస్తున్నారేమోననీ, చరిత్ర పునర్మిర్మాణంలో ఇలాంటివన్నీ జరుగుతుంటాయని, అయినా వీటిని విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా ఉన్నవాళ్ళు, పరిశోధకులు ‘వస్తుగతంగానే’ ఆలోచించాల్సి ఉంటుందని సూచించాను.
ఆమెకు భారత, రామాయణాలు, కావ్యాలపై మాత్రమే కాకుండా, ఆంగ్ల సాహిత్యం, బైబిల్ వంటి విషయాల్లో లోతైన అవగాహన కనిపిస్తుందనీ, ముఖ్యంగా బైబిలు విషయాలు, అంతర్జాతీయ విషయాలు, ఆంగ్ల సాహిత్యం పట్ల ఆమెకున్న అవగాహనల దృష్ట్యా రచయిత్రిపై- ఆనాడు కోస్తా ప్రాంతాల్లో విజ్ఞానాన్ని దళితుల దగ్గరకు చేర్చిన క్రైస్తవప్రభావం కూడా ఉండి ఉండొచ్చనీ, దాన్ని భావిపరిశోధకులు లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నాను. నేను తాడి నాగమ్మగారి రచనల గురించి ఒక పరిశోధన పత్రాన్నే రూపొందించుకున్నాను. కానీ, సమయాన్ని బట్టి అక్కడ పూర్తిగా మాట్లాడ్డం కుదరలేదు. పూర్తి ప్రసంగాన్ని తర్వాత నా బ్లాగులో అందిస్తాను. ఆ తర్వాత ఆచార్య పిల్లలమర్రి రాములు గార్ని మాట్లాడమన్నారు. రాములన్న గారికి సమయాన్ని నిర్దేశించలేమని ఆయన ఇష్ట ప్రకారం ఎంతసేపు మాట్లాడాలో వారికే వదిలేస్తున్నామని సభాధ్యక్షుడు ప్రకటించారు. అయినప్పటికీ ఆచార్య పిల్లలమర్రి రాములు గారు ఎంతో ఔచిత్యంతో సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అభినందనలతో ముగించారు. సంగిశెట్టి శ్రీనివాస్ ఒక ప్రొఫెసర్ స్థాయిలో కంటే ఎక్కువగా పరిశోధన చేస్తున్నాడని రాములు గారు వ్యాఖ్యనించారు. తర్వాత డాక్టర్ పసునూరి రవీందర్ కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం తాడి నాగమ్మ రచనలోని వైశిష్ట్యాన్నీ వివరిస్తూనే ఆ రచనలు బయటకు తీసుకు వచ్చినందుకు సంపాదకులను అభినందించారు. ఆ తర్వాత ఆచార్య బన్న అయిలయ్య గారు మాట్లాడుతూ నేటి పరిశోధకుల తీరుతెన్నులను హాస్యస్ఫోరకంగా అందర్నీ ఆకట్టుకునేలా తన ప్రసంగాన్ని అందించారు. విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న తొలితరం దళిత ఆచార్యులకు ఇటువంటి ఇబ్బందులు తప్ఫడం లేదని ఆయనప్పటికీ, తమ కర్తవ్యాన్ని తాము నిర్వహిస్తున్నామని వివరించారు. తాము తెలంగాణ రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాల్లో ఉన్నప్పటికీ తెలుగు సాహిత్యానికి సంబంధించిన శ్రీశ్రీ , కృష్ణశాస్త్రి, జాషువా, బోయి భీమన్న మొదలైన అన్ని వర్గాల తరగతుల సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నామని అన్నారు. ఈ సభలో పాల్గొన్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు రచనలు కూడా కాకతీయ విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశంగా ఉండడమే ప్రాంతాలకతీతంగా పాఠ్యాంశాలను రూపొందిస్తున్నామనే దానికి నిదర్శనమని అన్నారు. నేడున్న అనేక పరిశోధన మార్గాలు తాడి నాగమ్మగారి కాలంలో లేకపోయినప్పటికీ అంతర్జాతీయమైన అవగాహనతో రచనలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుందని ఆయన ప్రశంసించారు. ఆమె రాసిన కథలను, వ్యాసాలను, సోదారణంగా వివరించారు. ఇంత గొప్ప కృషి చేసిన సంపాదకులను అభినందించారు.
ఆ తర్వాత తొలి ప్రతిని తాడి నాగమ్మ గారి మనవడు తాడి సురేష్ కి అందించారు. తాడి సురేష్ మాట్లాడుతూ తన చిన్నతనంలో ఆమె గొప్పతనం తాము తెలుసుకోలేక పోయామని ఒప్పుకున్నారు. నాడు హాస్టల్స్ ఎలా ఉండేవో, వాటిలో దళితులు ఎలా చదువుకున్నారో, వాటిని దళితులు ఎలా ఉపయోగించుకున్నారో అనేక ఉదాహరణలతో వివరించారు. తాము చేయలేకపోయిన పనిని సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నానని అన్నారు. తనకి ఈ రోజు జీవితంలో మరిచిపోలేని రోజుగా గుర్తుండి పోతుందని ఆయన అన్నారు. సభలో అఖిల భారత సర్వీసులో పనిచేసి పదవీవిరమణ పొందిన ఒక ఉద్యోగి మాట్లాడారు. తాను ఉద్యోగరీత్యా జర్మనీ ప్రదేశాలు పర్యటించానని అవన్నీ తనకు అనుకూలంగా తెలిసిన విషయాలు అన్నారు. నాగమ్మ గారి రచనల్లోఆ విషయాలన్నీ ఎంతో వాస్తవికంగా కనిపిస్తున్నాయని, తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. ఆచార్య ఆనందం గారు మాట్లాడుతూ తాను ఇటీవల చెన్నైలోని మద్రాసు క్రిష్టియన్ కళాశాలలో ఒక జాతీయ సదస్సులో ప్రధాన వక్తగా మాట్లాడే సందర్భంలో చరిత్ర విస్మరించిన దళిత రచయిత్రులలో తాడి నాగమ్మ గారి గురించి గారి గురించి వివరించానని ఆ విషయాలు తెలిసి అక్కడున్నవాళ్లు ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారని చెప్పారు. అధ్యక్షుడు తన అధ్యక్ష ప్రసంగంలో నాగమ్మ గారిపై క్రైస్తవ ప్రభావం కంటే బౌద్దిజం ప్రభావం ఉందని చెప్పారు. భాగ్యరెడ్డి వర్మ, గొట్టిముక్కల మంగాయమ్మ తదితరుల రచనలపై పరిశోధన చేస్తున్న క్రమంలో మరిన్ని ఆధారాలు లభిస్తున్నాయని వాటిని కూడా త్వరలోనే ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
ఈ సభను ఇంత పెద్ద ఎత్తులో నిర్వహించుకోవాలను కోలేదని, అయినప్పటికీ కొంతమంది ప్రోత్సాహంతో ఈ సభ ఇంత ఘనంగా జరగడం తనకెంతో ఆనందంగా ఉందని, తాడి నాగమ్మ గారి రచనలపై మరింత పరిశోధన చేయడానికి ఈ సభ ప్రేరణ నిస్తే తనకు మరెంతగానో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. సంగిశెట్టి శ్రీనివాస్ సభను ఎవరికి నొప్పి కలగకుండా గా చక్కగా నిర్వహించారు. ఆహ్వానపత్రంలో పేర్లు లేకపోయినా మరికొంతమందిని అనివార్యంగా మాట్లాడించాల్సి వచ్చిందేమో అనిపిస్తుంది. కొంతమంది వక్తలు సమయపాలనను పాటించకపోయినప్పుడు కొంత అసహనానికి గురైనప్పటికీ, దాన్ని కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. ప్రతి ప్రసంగం తర్వాత తన వ్యాఖ్యానాన్ని విశేషంగా జోడించకుండా సమయాన్ని ఆయన కాపాడారు. ఏశాల శ్రీనివాస్ వందన సమర్పణతో సభ ముగిసింది. సభలో ప్రముఖ కవులు స్కైబాబా, యాకూబ్, డా.పగడాల నాగేందర్, డా.రఘుశ్రీ, డాక్టర్ జి.వి.రత్నాకర్, డాక్టర్ గెడ్డం మోహన్ రావు మొదలైన రచయితలు, వివిధ విశ్వ విద్యాలయాలకు చెందిన అధ్యాపకులు విరివిగా పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి