రాజశేఖరచరిత్రనవల-వివిధదృక్కోణాలు (విద్యార్థి సదస్సు : 2015-2016 బ్యాచ్ సంచిక) వెలువడింది. దీన్ని విద్యార్థులు, పరిశోధకులు https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook
అనే లింకు నుండి ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు.
ప్రింటెడ్ కాపీ కావాలంటే తగిన రుసుము చెల్లించి సహసంపాదకురాలుగా వ్యవహరించిన కుమారి సడ్మెక లలితనుండి పొందొచ్చు. ఈ సందర్భంగా కుమారి సడ్మెక లలిత రీసెర్చ్ స్కాలర్, తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం రాసిన ఎడిటోరియల్ ని ఇక్కడ ప్రచురిస్తున్నాను....దార్ల )
మా జాతీయ సదస్సులకు తొలి మెట్టు ఈ విద్యార్థి సదస్సు
మా హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నిరంతరం క్లాస్‌లు,
ఇంటర్నల్, ఎండ్ సెమిస్టర్ పరీక్షలు,
వీటికి తోడు నెట్, జె. ఆర్.ఎఫ్ వంటి
పోటీపరీక్షలతో బిజీ బిజీగానే ఉంటాం. ఎం.ఏ.
లో చేరిన దగ్గరనుండే మాకు రకరకాల పద్ధతుల్లో పాఠాల్ని బోధిస్తుంటారు. మా
విశ్వవిద్యాలయంలో బోధనా పద్ధతులు చాలా వైవిధ్యంగా ఉంటాయి. విద్యార్థులలో ఆలోచనా
శక్తిని, సృజనాత్మకతను రేకెత్తించేలా మా అధ్యాపకులు
పాఠ్యాంశాలను బోధిస్తుంటారు.
ఒక పుస్తకాన్ని
చదువుకుని రమ్మని దానిపై చర్చ కొనసాగించటం, లేదా ఒక అంశాన్ని
లోతుగా చర్చించటం వంటి పద్ధతుల్లో చాలా మంది అధ్యాపకులు బోధన చేస్తుంటారు.
మాకు ఎం.ఏ స్థాయిలోనే
మౌఖిక పరీక్షలు నిర్వహిస్తుంటారు.
దాని ద్వారా పై
స్థాయిలో జరిగే మౌఖిక పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి?
ఎలా వ్యవహరించాలి? ఎలా సమాధానాలు ఇవ్వాలి? అనే
అంశాలతో పాటు, మౌఖిక పరీక్షలకు సంబంధించిన మెలకువలన్నీ ఎం.ఏ స్థాయిలోనే మేము
నేర్చుకునేలా మా విశ్వవిద్యాలయం బోధనా పద్దతులు ఉంటాయి. సెమినార్స్, వర్క్ షాప్స్ నిర్వహించుకుంటాం. మేమంతా వాటిలో చాలా ఉత్సాహంగా
పాల్గొంటాం. మాకు వచ్చిన సందేహాలను చర్చా
వేదిక ద్వారా నివృత్తి చేసుకుంటాం. అప్పుడప్పుడూ బయట నుండి సాహితీవేత్తలతో
ప్రసంగాలను పెట్టిస్తుంటారు. వివిధ సదస్సులను నిర్వహిస్తుంటారు. వీటికి తోడు
విద్యార్ధులే ముందుకొచ్చి సాహిత్య చర్చా కార్యక్రమాల్ని నిర్వహించుకుంటాం. అందులో
భాగంగా రచయితలను, రచయిత్రులను ఆహ్వానిస్తాం. ఈ కార్యక్రమం
ద్వారా ప్రముఖులను గురించి తెలుసుకుంటూ, వారిచ్చే సూచనలు,
విలువైన సందేశాలను పాటిస్తాం. దీని ద్వారా ఎంతో మంది రచయితలు,
రచయిత్రులతో పరిచయాలను పెంచుకోవటం, వాళ్ల దృక్పథాన్ని
అవగాహన చేసుకోవటం జరుగుతుంది. సమకాలీన సాహిత్యాన్ని అవగాహన చేసుకోవటం జరుగుతుంది.
మా విశ్వవిద్యాలయ
ఆచార్య వర్గం ఎప్పటికప్పుడు బోధన పద్ధతుల్లో వినూత్న తను కనబరుస్తూ, విద్యార్థుల మేధోసంపత్తిని పదును పెడుతుంటారు. అందులో ముందంజ వేసేది మా
గురువు గారైనా ॥దార్ల
వెంకటేశ్వర రావు సార్ గారు. మాకు సార్ I.M.A నుండి M.A వరకు పాఠాల్ని బోధించారు. ప్రతి
పాఠ్యాంశాన్ని వినూత్నమైన పద్ధతిలో, మాకు అర్థమయ్యే పద్ధతిలో
దార్ల సార్ బోధిస్తారు. సార్ మాలో ఒకడిగా ఉంటూ మాలో నైపుణ్యాల్ని వెలికితీస్తూ,
ఎప్పుడూ మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటారు. సార్ పాఠ్యాంశాన్ని బోధిస్తుంటే మనకు ఆ అంశం పై తప్ప వేరే అంశం పై దష్టి పోదు. అంత
బాగా, అంత ఆసక్తికరంగా తమ బోధనా పద్ధతుల ద్వారా మమ్మల్ని మంత్ర
ముగ్ధుల్ని చేసేవారు. సార్ మాకు ఎం.ఏ స్థాయిలోనే ఏదైనా ఒక రచనను ఎలా విమర్శించాలి?
ఎలా సమీక్ష రాయాలో తెలియ చేసేవారు. అందువల్ల మేము చాలా
మెరుగయ్యామనుకుంటున్నాను. సాహిత్యంలో మరింత ముందుకెళ్లి పరిశోధన చేయాలనే ఆసక్తీ
పెరిగింది.
మాకు ఎం.ఏ నాల్గవ సెమిస్టర్ లో డా॥ దార్ల వెంకటేశ్వర రావు సార్ గారు తెలుగు సాహిత్య
విమర్శ, తెలుగు కల్పనా
సాహిత్యం, తెలుగు పోయిటిక్స్ మొదలైన పాఠ్యాంశాల్ని బోధించేవారు.
ఆ సమయంలోనే, ఎం.ఏ స్థాయిలోనే మాతో జాతీయ సదస్సంతటినీ గొప్ప
విద్యార్థి సదస్సుకు సార్ శ్రీకారం చుట్టారు.
25 సెప్టెంబర్ 2015,
శుక్రవారం, ఉదయం: 8.00 గంటలకు
''ఒక నవల- రాజశేఖర చరిత్రము : అరవై దృక్కోణాలు'' అనే
పేరుతో విద్యార్థి సదస్సు డా॥దార్ల
వెంకటేశ్వరరావు సార్ గారి ఆధ్వర్యంలో ప్రారంభమయింది. విద్యార్థులమంతా హడావిడిగా
చక్కగా ముస్తాబయి గ్రూపులవారీగా కూర్చున్నాం. ఒక వైపు ఆందోళన, మరో వైపు ఉత్సాహం మా అందరి ముఖాలలో
తాండవిస్తుంది. ఆ సదస్సు జరగటానికి కొద్ది రోజుల ముందునుంచే దార్ల సార్ గారు
మాకు మా పత్ర సమర్పణలకు సంబంధించిన సూచనలు,
సలహాలు ఇస్తూ, మాలో భయాన్ని పోగొడుతూ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, మమ్మల్ని ధైర్య పరుస్తూ, సదస్సుకు సిద్దం చేశారు.
అయినప్పటికీ మాలో ఆందోళన. ఎందుకంటే ఆ సదస్సు మాకు జాతీయ సదస్సులకు తొలి మెట్టు
వంటిది. అంతవరకు ఎప్పుడూ మాకు జాతీయ సదస్సుల్లో పాల్గొన్న అనుభవం లేదు. మొట్ట
మొదటిసారిగా వేదికపై మా ప్రతిభను ప్రదర్శించబోతున్నాం. అందువల్ల ఒక వైపు భయం,
మరో వైపు వేదిక పై మమ్మల్ని మేము చూసుకోవచ్చుననే ఆనందం. ఇన్ని రకాల
భావాల మధ్య మా సదస్సు ప్రారంభమయింది. ఒక్కో సెషన్‌లో ఆరుగురు సభ్యులు పాల్గొంటారు.
మాలో ఒక్కరు సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. మిగతా వాళ్ళంతా పత్ర సమర్పకులు. మా
గ్రూప్స్ కు కూడా మేమంతా రచయితలు, రచయిత్రుల పేర్లు
పెట్టుకున్నాం. కాళోజీ, జాషువ, విశ్వనాథ,
శ్రీశ్రీ, చలం మొదలైన రచయితల పేర్లు
పెట్టుకున్నాం. ఆ పద్ధతి మాకు చాలా కొత్తగా అన్పించింది. ఈ సదస్సు వల్ల మేము టీమ్
వర్క్‌తో పనిచేయడమెలాగో నేర్చుకున్నాం. మా తోటి విద్యార్థుల ద్వారా తెలియని
విషయాలను తెలుసుకుంటూ, మాలోని లోపాలను ఒకరికి ఒకరం
సరిచేసుకుంటూ, సహాయ సహకారాలు అందించుకుంటూ, ఐకమత్యంగా ఈ సదస్సుకు సిద్ధం అయ్యాం. ఈ సదస్సు ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 7.30 వరకు జరిగింది. ఈ
సదస్సులో రాజశేఖర చరిత్ర అనే నవలలో ఏదైనా ఒక అంశం పై పత్ర సమర్పణ చేస్తారు. ఆ
అంశాలు కూడా మాకు తెలుసు కానీ ఆ అంశాల్ని వినూత్నంగా ఎవరి దృక్పథంతో వారు చెప్తూ,
'అందరిని మెప్పించగలగాలి' అనే ఉత్సుకత మాత్రం
అందరిలో తొణికిసలాడుతుంది. సదస్సులో మాలోనే ఒకరు సమావేశ కర్తగా, మరొకరు అధ్యక్షత వహిస్తారు.
పత్ర సమర్పణ చేసేవారు
పోడియం దగ్గర ఎలా నిలబడాలి?ఎలా మాట్లాడాలి? ఎలా సమాధానాలు చెప్పాలి?సమాధానం తెలియకపోతే ఏం
చెయ్యాలి?మొదలైన అంశాలపై మా సార్ సూచనలిస్తుండేవారు. పోడియం
దగ్గర నిలబడితే భయంతో కాళ్లు వణికే వారు పోడియం మీద చేతులు పెట్టుకుంటే ఆ లోపం కనిపించదని మా సార్
చెప్పారు. పొట్టిగా ఉండేవారు
అందరికి కనబడాలంటే పోడియానికి ఒక పక్కగా
నిల్చోవాలని చెప్పారు. ఈ విధంగా సదస్సు జరుగుతుంటే పత్ర సమర్పకురాలికి, పత్ర సమర్పకునికి 5 నిమిషాలు మాట్లాడే అవకాశం
ఇచ్చారు. దాని వల్ల మనం ఏం చెప్పదల్చుకున్నా సమయపాలన పాటించాలి అనే విషయం మాకు
తెలిసింది. పత్రసమర్పణ తర్వాత చర్చ జరిగింది. పత్రసమర్పణ చేసిన వారిని వారి
అంశానికి సంబంధించి ఏవైనా రెండు ప్రశ్నలు అడగవచ్చని సార్ చెప్పారు. దానితో ప్రశ్నలు ఏ విధంగా అడగాలో ఏ
విధంగా సమాధానం ఇవ్వాలో చాలావరకు
తెలిసింది.
అంశానికి సంబంధంలేని ప్రశ్నలు
అడిగితే, అలాంటి
సందర్భాలు ఎదురవుతుంటాయని, వాటిని నవ్వుతూ సున్నితంగా
ఎలా పరిష్కరించుకోవాలో కూడా మా సార్ చెప్పారు. మంచి ప్రశ్నలు అడిగిన వారిని సార్
ప్రశంసించేవారు కాబట్టి ప్రశ్నలు అడగాలని ప్రశంసలు పొందాలని, మా మెదళ్లకు మరీ మేము ఆ సమయంలో పోటీపడి పదును పెట్టేవాళ్ళం. ప్రశ్నలకు
సమాధానాలు తెలియకపోతే ఎలా వ్యవహరించాలో
కూడా సార్ చెప్పారు. మాకు ఈ సదస్సు వల్ల ఎలా మాట్లాడాలి? ఏ
విధంగా మాట్లాడకూడదు?ఎలా నిలబడాలి? మన
స్వరం ఎలా ఉండాలి? ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు జాగ్రత్తగా
వింటూ, ముఖ్యాంశాల్ని ఏవిధంగా రాసుకోవాలి? మొదలైన విషయాలు తెలిశాయి. ముఖ్యంగా ప్రశ్నలు వేసిన వాళ్లని శత్రువులాగా
చూడకూడదు ఎందుకంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం ద్వారానే మన ఆలోచనా శక్తి రెట్టింపు
అవుతుంది. మనకు తట్టని ప్రశ్నలు ఎదుటి వాళ్లు వేసినప్పుడు ఆ అంశం పై ఇంకా లోతుగా
తెలుసుకోవాలనే తృష్ణ పెరిగింది.
సార్ ప్రణాళికాబద్ధంగా
ఈ సదస్సు నిర్వహించారు. ఆ రోజు సెలవు దినం అయినప్పటికీ సార్ మాతో ఉదయం 8:00 నుండి సాయంత్రం 7:30 వరకు ఎంతో ఓపికగా ఉండి ఈ
సదస్సును విజయవంతంగా నిర్వహించారు. ఈ సదస్సు వల్ల మాలో ధైర్యం వచ్చింది. ఏ
సదస్సులోనైనా పాల్గొనగలమనే ఆత్మవిశ్వాసం మాలో పెంపొందింది. ఇంతటి ధైర్యం, ఆత్మవిశ్వాసం మాలో పెంపొందించిన మా డా॥దార్ల వెంకటేశ్వర రావు సార్ గారికి మా ప్రత్యేక
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అంతేకాదు
ఎం.ఏ. పూర్తయిన వెంటనే నాకు పిహెచ్.డి సీటు రావడం, అది డా॥ దార్ల వెంకటేశ్వర రావు సార్
గారి దగ్గరే పరిశోధన చేసే దగ్గరే పరిశోధన చేసే అవకాశం లభించటం నా అదృష్టంగా
భావిస్తున్నాను. అందుకు నాకెంతో సంతోషంగా కూడా ఉంది. ఈ సదస్సులోని వ్యాసాలన్నీ
సార్ ఒక సంచికగా చేసి e-book గా ప్రచురిద్దామని చెప్పటంతో మేమంతా టైప్ చేసి
ఇచ్చాం. ఆ పుస్తకం కోసం నేను మా తరగతిలో
వాళ్లమంతా ఎదురు చూస్తున్నామని మాటల సందర్భంలో సార్ తో ఈ విషయాన్ని
ప్రస్తావించాను. కొన్ని వ్యాసాల్ని ఎడిట్ చేశారనీ, ఇంకా
ఎడిట్ చేయాల్సిన అవసరం ఉందనీ, టైపోగ్రాఫికల్ మిస్టేక్స్
కూడా చాలా ఉన్నాయనీ చెప్పారు.
‘‘లాగూ పరిశోధనలో చేరావు కదా...
నువ్వే ఆ వ్యాసాల్ని ఒకసారి ఒక పరిశోధకురాలిగా చదవ”మన్నారు. ఎం.ఏ.
లో సమర్పించిన ఆ వ్యాసాలు ఇప్పుడు చదువుతుంటే చాలా లోపాలు కనిపిస్తున్నాయి. వాటిని సరిచేయడం కష్టం. కానీ అక్షర
దోషాలు లేకుండా వాటన్నింటినీ ఒక చోట పెట్టివ్వడానికి ప్రయత్నిస్తానని అన్నాను.
కొన్ని వ్యాసాల్ని చదివిన తర్వాత చాలా మంది గ్రాంథికంలోనే రాశారు. కొంత మంది
పేరాల్ని పేరాల్ని రాసేశారు. వాటన్నింటినీ ఎడిట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. 'నువ్వు కూడా నేర్చుకున్నట్లవుతుంది. ప్రయత్నించు. నువ్వే 'సహసంపాదకురాలు'గా ఉందువు గాని' అన్నారు. దానితో నాకెంతో ఉత్సాహం కలిగింది. ఈ సదస్సు సంచికను త్వరగా
తీసుకురావాలనిపించింది. సంచిక పేరుని 'రాజశేఖర చరిత్ర నవల
-వివిధ దృక్కోణాలు'గా ప్రచురిస్తున్నారు. అరవై పత్రాలు
లేకపోవడం, మరికొన్ని పత్రాలు లభించకపోవడం వల్ల శీర్షికను
మార్చారు.
ఈ పుస్తకం 'సహసంపాదకురాలు'గా
బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు నేను చాలా వరకు సాంకేతిక నైపుణ్యాన్ని
అలవర్చుకున్నానుకుంటున్నాను. పుస్తకాన్ని ప్రచురించడానికి కావల్సిన ప్రతి
టెక్నాలజీని సార్ నాకు ఎంతో వివరంగా నేర్పించేవారు. దీని ద్వారా ఒక పుస్తకం ప్రచురణ
కావాలంటే, అది పాఠకుల ఆదరణ పొందాలంటే, ఎంత
టెక్నాలజీ తెలియాలి?ఎంత ప్రణాళికాబద్ధంగా దానికోసం పనిచేయాలి?
పుస్తకం ప్రచురణలో సహ సంపాదకురాలిగా ఇంత మంచి అవకాశం కల్పించిన డా॥దార్ల
వెంకటేశ్వర రావు సార్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
- సడ్మెక లలిత
రీసెర్చ్‌స్కాలర్, తెలుగుశాఖ, హైదరాబాదు
విశ్వవిద్యాలయం.
సహసంపాదకురాలు, రాజశేఖరచరిత్రనవల-వివిధదృక్కోణాలు (విద్యార్థి సదస్సు : 2015-2016 బ్యాచ్ సంచిక)
11-5-2017
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి