Sunday, June 11, 2017

డా.సినారె మృతికి నా ప్రగాఢ సంతాపం

ప్రముఖకవి, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత డా.సి.నారాయణరెడ్డిగారు ది: 12 జూన్ 2017 న మరణించినట్లు తెలిసింది. ఆయన మరణం తెలుగు సాహిత్యానికి ఒక తీరనిలోటు. ఆయన  ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నాను.
-డా.దార్ల వెంకటేశ్వరరావు

డా//దార్ల ను సన్మానిస్తున్న డా//సినారె, ఫోటోలో డా//పోతుకూచి సాంబశివరావు, డా//డి.రంగారావు లు ఉన్నారు
డా//దార్ల ను సన్మానిస్తున్న డా//సినారె, ఫోటోలో డా//పోతుకూచి సాంబశివరావు కూడా ఉన్నారు

సభలో మాట్లాడుతున్న డా//ద్వానాశాస్త్రి గారు
డా// జి.అరుణ కుమారి గారిని సన్మానిస్తున్నా డా//సినారె

సభకు ముందు ప్రముఖ విమర్శకులు, కవి డా// అద్దేపల్లి రామమోహన రావు గారితో సంభాషిస్తున్న డా//దార్ల
ఫోటోకి ఫోజిస్తూ డా//సినారె, డా//డి రంగారావు , డా//దార్ల
సభలో డా//సినారె తో మాట్లాడుతున్న డా//దార్ల
సభలో డా//సినారె తో మాట్లాడుతున్న డా//దార్ల


సినారె అనగానే సాహిత్యం తో ఏ మాత్రం పరిచయం లేకపోయినా, పత్రికలు చూస్తున్న సామాన్యులకు కూడా ఆయన ఒక కవి అని తెలిసిపోతుంది. తెలుగులో ఙ్ఞానపీఠ్ అవార్డు సాధించిన వారిలో ఆయన ద్వితీయుడు. అలనాడు కవి శ్రీనాథుడు అంత వైభవాన్ని పొందాడో లేదో గానీ, నేడు సాహిత్య ప్రపంచంలో సినారె కి దక్కినంత గౌరవ మర్యాదలు మరోకవికి దక్కలేదంటే అతిశయోక్తి కాదేమో! అసలు పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి అయినా సినారె గానే బాగా ప్రసిద్ది.
అలాంటి మహాకవిని చూడాలని ప్రతి తెలుగు కవీ ఉబలాట పడటం సహజం! అలాగే ఆయన్ని కలవాలని నాకూ ఉబలాటం ఉండేది.
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ నుండి పెట్టీ బేడా సర్దుకొని సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకోవడానికి 1995 లో హైదరాబాదు వచ్చాను. ఆ సంవత్సరమే హైదరాబాదులోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్బులో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సినారె ని కలుసుకున్నాను. ఆయన, డా//శరత్ జ్యోత్స్నారాణి గారు రాసిన కొత్తపాట కవితా సంపుటిని ఆవిష్కరించడానికి వచ్చారు. ఆయన వేదిక పైకి వచ్చినప్పుడు ఆరోజు నేను పూల గుత్తిని ఇచ్చాను.
ఆ తర్వాత చాలా సభల్లో ఆయన ప్రసంగాల్ని విన్నాను. ఆయన ప్రతి ప్రసంగం ఒక రసగుళికలా సాగిపోతుంది. ఎప్పుడూ ఏదో కొత్త దనం ఉన్నట్లనిపిస్తుంది.
ఆయన సభలో మాట్లాడుతుంటే ఎవరైనా సరే కదిలితే ఊరుకోరు. ప్రసంగం వినకుండా మాట్లాడుకుంటున్నా వెంటనే వాళ్ళకో చురక వేస్తారు. ప్రతిరోజూ ఇంచుమించు ఆయన లేకుండా హైదరాబాదులో సాహిత్య కార్యక్రమాలు జరగవంటే బాగుంటుందేమో. రోజూ ఏదో కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన కొన్నాళ్ళు హైదరాబాదు లో లేనప్పుడు వార్తాపత్రికలు చాలా వెలితిగా ఉన్నాయని కొన్ని పత్రికలు వార్తలు రాశాయి.
అప్పుడే ఔత్సాహిక రచయిత ఎవరైనా ఓ కవితా సంపుటినో, ఏదైనా ఒక పుస్తకాన్నో ప్రచురించుకొని, దాన్ని ఆవిష్కరించమని కోరితే ఆయన తప్పకుండా వస్తారు. ఆ పుస్తకంలోని రెండు మూడు మంచి విషయాల్ని ప్రస్తావించి వెళతారు. అలా నా ఎం.ఫిల్., గ్రంథం " ఙ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన " ఆవిష్కరణ సభకు వచ్చి నన్ను ఆశీర్వదించారు. నా పుస్కకావిష్కరణ సభ చిక్కడపల్లి లోని నగర కేంద్ర గ్రంథాలయం లో 1999 జూలై 16 వతేదీన జరిగింది. నాటి సభకు చాలా మంది విచ్చేశారు. నా గ్రంధావిష్కరణ సభకు డా// సి.నారాయణ రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి, సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెస్ర్ సి. ఆనందారామం, డా//ఎస్.శరత్ జ్యోత్స్నారాణి, ప్రముఖ సాహితీ వేత్త డా//జె. బాపురెడ్డి, కృష్ణా పత్రిక సంపాదకులు పిరాట్ల వెంకటేశ్వర్లు , విశ్వసాహితి అధ్యక్షులు డా//పోతుకూచి సాంబశివరావు, ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, రత్నామహీధర్, శ్రీమతి రాణీ సంయుక్త తదితరులు పాల్గొన్నారు.

నా పుస్తకావిష్కరణ సభ నాటి కొన్ని పత్రికల వార్తలు

ఆ తర్వాత డా//సి.నారాయణ రెడ్డి గారిని సభావేదికపైకి పిలిచే అవకాశం అనేక సభల్లోకలిగింది. ఆయనతో వక్తగా పాల్గొన్న సభ మాత్రం 20 డిసెంబరు 2008 న త్యాగరాయ గాన సభలో జరిగిన సాహిత్య సభే కావడం విశేషం. ఈ సభలో పాల్గొన్న నాతో ఆయన ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. మాట్లాడిన వారందరినీ సత్కరించారు. అందులో నేనూ ఒకడిని కావడం నాకు ఎంతో ఆనందం కలిగించింది. ఈ సభలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి హైమావతీ భీమన్న గారు కలవడం ఒక మరిచి పోలేని మరో సన్నివేశం. ఆమె ఆత్మీయతను ఆసభలో చూడగలిగాను.
శ్రీమతి హైమవతీ భీమన్న గారిని సన్మానిస్తున్నా డా//సినారె , ఫోటోలో ఎడమ వైపునుండి డా//శరత్ జ్యోత్స్నారాణి, డా//జి.అరుణ కుమారి,డా// పోతుకూచి సాంబశివరావు, హైమవతీ భీమన్న, డా//దార్ల
డా//మెడతో్టి సంగీతరావు రచించిన పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న సినారె, ఆ వరుసలో డా//మెడతో్టి సంగీతరావు, డా//దార్ల వెంకటేశ్వరరావు, పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారలు చిత్రంలో ఉన్నారు.
ఈ సభకు మరో ప్రత్యేకత కూడా ఉంది. సభావేదిక పై మాగురువులు ఇద్దరు ఉన్నారు. ఒకరు డా//ద్వా.నా.శాస్త్రి , మరొకరు డా//ఎస్.శరత్ జ్యోత్స్నారాణి .ఈ సభ వారితో పాటుగా నేనూ ఒక వక్తగా పాల్గొన్న సభ. కనుక సహజంగానే ఈ సభ పట్ల నాకు ఒక ప్రత్యేకత ఉంటుందనిపించింది.


1998 లో జరిగిన ఒక కార్యక్రమంలో డా//సినారె, అప్పటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సుజీ ఫుడ్స్ అధినేత....., శ్రీనివాసాచార్య, డా//యస్.టి. ఙ్ఞానానంద కవి, డా// శరత్ జ్యోత్స్నారాణి గార్లు పాల్గొన్న సభలో మాట్లాడుతున్న డా//దార్ల

No comments: