ఈ రోజు (10 ఏప్రిల్ 2017) సాయంత్రం 4 గంటలకు హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి పుస్తకం ‘‘సాహిత్యపరిశోధనా కళ: విధానం’’ ఆవిష్కరణ సభ జరుగుతుంది.
ఈ కార్యక్రమం స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ ఆడిటోరియానికి మార్చారు. పత్రికకు ప్రకటన పంపేనాటికి దీన్ని డా.బి.ఆర్.అంబేద్కర్ ఆడియంలో నిర్వహించుకోవచ్చనుకున్నాం. కానీ, విద్యార్థినీ విద్యార్ధుల సౌకర్యార్ధం స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ ఆడిటోరియంలో నిర్వహిస్తే బాగుంటుందని సభాస్థలాన్ని మార్చాల్సి వచ్చింది.
ఈ కార్యక్రమం స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ ఆడిటోరియానికి మార్చారు. పత్రికకు ప్రకటన పంపేనాటికి దీన్ని డా.బి.ఆర్.అంబేద్కర్ ఆడియంలో నిర్వహించుకోవచ్చనుకున్నాం. కానీ, విద్యార్థినీ విద్యార్ధుల సౌకర్యార్ధం స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ ఆడిటోరియంలో నిర్వహిస్తే బాగుంటుందని సభాస్థలాన్ని మార్చాల్సి వచ్చింది.
ఈ ప్రకటనను పంపించిన అన్ని పత్రికలు ప్రచురించినందుకు ఆ పత్రికా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే, ఈ రోజే ఈ పుస్తకానికి సంబందించిన నా సమీక్షను కూడా ప్రచురించినందుకు నమస్తేతెలంగాణ దినపత్రికకు ప్రత్యేక ధన్యవాదాలు.
పత్రికల్లో ప్రచురించిన ఆ వార్తలను మా విద్యార్ధుల సౌకర్యార్ధం ఆ యా పత్రికల సౌజన్యంతో ఇక్కడ పునర్ముద్రిస్తున్నాను. వీటిని ప్రత్యేకించి మరింత స్ఫష్టంగా చూడాలనుకునేవారు మీకు కావలసిన వార్తాంశం పై కర్సర్ ని పెట్టి, మౌస్ కుడివైపున క్లిక్ చేసి, open link in new tab నొక్కండి.
నమస్తేతెలంగాణ ‘చెలిమి’ సాహిత్యానుబంధం, 10 ఏప్రిల్ 2017
సాహిత్య పరిశోధనకు ఓ వెలుగు పేరుతో నమస్తే తెలంగాణ దినపత్రిక, చెలిమె సాహిత్యానుబంధంలో నా సంపాదకీయాన్ని కొంతభాగాన్ని ప్రచురించాను. పూర్తి పాఠాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను.
సాహిత్య పరిశోధకులకు ఓ కొత్త మార్గదర్శిక
సాహిత్య పరిశోధన చేస్తున్న వాళ్ళని మీరు పాటించిన పరిశోధన
పద్ధతి ఏమిటి? మీ పరిశోధనలో ‘సమస్య’ (Problem of the Research) ఏమిటి? మీ పరిశోధనలో గల ఊహాపరికల్పన (Hypothesis), సిద్ధాంతం (Thesis), ఫలితాంశాలు
(Results)
ల మధ్య భేదాల్ని వివరిస్తారా? పరిశోధన, విమర్శ, సృజనాత్మక సాహిత్యాలకు, వాటి
శైలికీ మధ్య భేదాలేమైనా ఉంటాయా? చూశారా? రిఫరెన్సులు, ఉపయుక్త గ్రంథ సూచికలు
రాయడానికి మీరే పద్ధతిని అనుసరించారు? MLA, Harvard, Chicago, APA...ఇలా అనేకంగా ఉన్న శైలీపత్రాల్లో మీరు దేన్ని
అనుసరించారు? Viva-voce (మౌఖిక పరీక్ష)లో మొదలైన ప్రాథమికాంశాలను అడిగితే
చెప్పలేని వాళ్ళెంతోమంది ఉన్నారు.
ఇది పరిశోధక విద్యార్ధులకే కాదు,
పరిశోధన పూర్తిచేయించిన పర్యవేక్షకులకు కూడా చాలా మందికి తెలియదు. ఈ విషయాన్ని ఆ
పరిశోధన గ్రంథాన్ని చూస్తేనే తెలుస్తుంది. ఇది Adjudication కి వస్తున్న పరిశోధన గ్రంథాలను చూసిన స్వీయానుభవంతో చెప్తున్నమాట. ఉపయుక్తగ్రంథాల
జాబితాను, రిఫరెన్సులను చూస్తుండగానే ఆ పరిశోధన గ్రంథం ఎంత ‘శాస్త్రీయం’గా
రూపొందిందో అర్థమవుతుంది. అయితే, కొన్ని విశ్వవిద్యాలయాల నుండి కొంతమంది శాస్త్రీయంగా
రాస్తున్నవారూ, పరిశోధన చేయిస్తున్నవారూ ఉన్నారు.
తెలుగులో పరిశోధనలు ‘ఇలా’
మారడానికి లేదా రావడానికి గల కారణాలేంటి? రీసెర్చ్ మెథడాలజీ అనేదొక క్రమపద్ధతిలో
బోధించాల్సిందని గుర్తించకపోవడం ఒక ముఖ్యకారణం.
అలా బోధించాలంటే తగిన పుస్తకాలుండాలి. తెలుగులో అలాంటి పుస్తకాలున్నాయా?
కొన్ని ఉన్నాయి!
పరిశోధన పద్ధతులు (అప్పారావు గంధం & కాళిదాసు సూర్యనారాయణ ), పరిశోధన విధానం (ఎస్. జయప్రకాష్), జీవియస్ వ్యాసాలు
(జి.వి. సుబ్రహ్మణ్యం), పరిశోధన పద్ధతులు (ఆర్వీయస్. సుందరం), పరిశోధన సూత్రాలు ( కుసుమాబాయి & కులశేఖరరావు), సాహిత్య పరిశోధన సూత్రాలు, ( రాచపాళెం
చంద్రశేఖరరెడ్డి & హెచ్.ఎస్. బ్రహ్మానంద),
పరిశోధన విధానం:
సిద్ధాంత గ్రంథ రచన (పులికొండ
సుబ్బాచారి) మొదలైన పుస్తకాలు తెలుగు
భాషాసాహిత్యాలపై పరిశోధన చేస్తున్నవాళ్ళకు పరిశోధన స్వరూప, స్వభావాలు, పద్ధతులను ప్రాథమికంగా
అవగాహన చేసుకోవడానికి చాలావరకు సహకరిస్తున్నాయి.
ఇంకేమున్నాయి?
కొన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగుశాఖలు ఉన్న పరిశోధన
తీరుతెన్నుల గురించి కొన్ని ప్రత్యేక సంచికలు ప్రచురించాయి. తెలుగు అకాడమి వారు
పరిశోధనలకు సంబంధించిన ఒక ప్రత్యేకసంచికను ప్రచురింది.
అభ్యుదయ విశేష సంచికలో కూడా పరిశోధనకు సంబంధించి ఒక ప్రత్యేకసంచికను ప్రచురించారు.
వీటితో పాటు కొన్ని మాస, త్రైమాసిక పత్రికలు ఈ అంశాన్ని చర్చించే
వ్యాసాలను ప్రచురించాయి.
ఆచార్య వెలుదండ నిత్యానందరావుగారు విశ్వవిద్యాలయాల్లో
తెలుగు పరిశోధన గ్రంథాన్ని సాధ్యమైనంతవరకు తాజా సమాచారంతో అందిస్తున్నారు. ఈ పుస్తకంతో
పాటు వివిధ విశ్వవిద్యాలయాల తెలుగు శాఖల వారు ఆ శాఖల్లో జరుగుతున్న పరిశోధనల
వివరాలను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ పూర్వ పరిశోధనల సమాచారాన్ని
సేకరించుకొని, తమ పరిశోధనల్లో పూర్వ
పరిశోధనల సమీక్ష (Review of literature) కి సహకరిస్తాయి.
వీటన్నింటిలోను ‘పరిశోధన పద్ధతులు’ ఉంటున్నప్పటికీ, ఆ పద్ధతులు తెలుగు భాషాసాహిత్య
పరిశోధనలకు పూర్తిగా సమన్వయించుకోవడానికి అవకాశం ఉందా? లేదా? అనే సందేహాలు నేటికీ
పరిశోధకుల్లో కలుగుతున్నాయి.
ఆంగ్ల సాహిత్యంలో వస్తున్న Research
Methodology పుస్తకాల్లోను కొంత గందరగోళం ఉన్నా, ఆ
గందరగోళాల్లోని సమస్యలకు పరిష్కారాలను వివరణాత్మకంగా వివరించే గ్రంథాలు కూడా చాలా
ఉన్నాయి. ఇలా పరిశీలిస్తే- సృజన, పరిశోధన, విమర్శ రచనలను చేయడానికి, వాటిని
అధ్యయనం చేయడానికి ఆంగ్లంలో చాలా రచనలున్నాయి. ముఖ్యంగా
ఫిక్షన్ ని శాస్త్రీయంగా వివరించే ప్రయత్నం చేసిన గ్రంథాలు పరిశోధకులకు చాలా
ఉపయోగపడతాయి. వీటిలో The Art of the
Novel (Milan Kundera), The Art of the Novel (Henry James), Aspects of
the Novel ( E.M.Forster), The Art
of Fiction (David Lodge) మొదలైనవి ముఖ్యమైనవి.
తెలుగులో ఇలాంటి రచనల్ని వెతికితే
చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఈ ఆలోచనలతో రాసిన రచనలు కొన్ని వ్యాసాలు
రూపంలోను, కొన్ని అనువాదాల ప్రభావంతోను వచ్చాయి. The Novel and the People (Ralph Fox) పుస్తకాన్ని తెలుగులో వల్లంపాటి ‘నవల-ప్రజలు’ పేరుతో అనువదించారు.
తెలుగులో ఈ దిశగా ఆలోచిస్తే,
సంస్కృతంలో కొన్ని లక్షణ గ్రంథాలు, వాటి ప్రభావంతో వచ్చిన రచనలే మనదృష్టికొస్తాయి.
సాహిత్య (కావ్య) శాస్త్రం లేదా అలంకార శాస్త్రాలుగా వీటిని పిలుచుకుంటున్నాం.
వీటిలోని కొన్ని సిద్ధాంతాలు, లక్షణాలు సాహిత్య విమర్శకు స్వీకరించక తప్పదు. అయినప్పటికీ, సాహిత్య
విమర్శకీ, భారతీయ సాహిత్య (కావ్య) శాస్త్రానికీ మధ్య భేదం ఉంది. వీటిని విశ్వవిద్యాలయాల స్థాయిల్లో అధ్యయనం
చేసేటప్పుడు నేటికీ కొన్ని విశ్వవిద్యాలయాల్లో
‘తెలుగు సాహిత్య విమర్శ’ గా కలిపేసి బోధిస్తున్నారు. మరి కొన్ని
విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖలో కావ్య శాస్త్రం, సాహిత్య విమర్శ,
కళాతత్త్వశాస్త్రం మొదలైన కోర్సులను ప్రత్యేకంగా బోధిస్తున్నారు. వీటితో పాటు
తెలుగు భాషాసాహిత్య పరిశోధనను ప్రత్యేకంగా ఒక పాఠ్యాంశంగా అధ్యయనం చేస్తున్నారు.
ఇదే పద్ధతిలో మరికొన్ని విశ్వవిద్యాలయాలు కూడా కొన్ని ప్రత్యేక కోర్సులను
రూపొందించి అధ్యయనం చేయడం హర్షణీయం. ఈ అవగాహన తెలుగు భాషాసాహిత్యాలను అధ్యయనం
చేస్తున్న విశ్వవిద్యాలయాలు అన్నింటిలోను రావలసిన అవసరమెంతో ఉంది.
ప్రపంచీకరణ ఫలితంగా ‘జ్ఞానం’
ప్రజాస్వామీకరణకు గురవుతున్నట్లు కనిపిస్తూనే, కొన్ని ‘వర్గాల’ గుత్తాధిపత్యం వైపు
పయనిస్తోందేమోననిపిస్తుంది. ఇది కేవలం కొన్ని శాస్త్రాలకే పరిమితం కాదు; అన్ని
శాస్త్రాలకూ వర్తిస్తుంది. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంలో కొనసాగుతున్న విద్య
కొన్ని వర్గాలకు అందుకోలేని పరిస్థితి రాబోతుందనిపిస్తోంది. నైపుణ్యం,
శాస్త్రీయతలు ఉన్నతవిద్యను శాసించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్నతవిద్య
అనేది ప్రభుత్వ సంస్థల్లో కంటే ప్రయివేటు సంస్థల్లోకి చేరుపోతున్న సూచనలు
కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావం అన్ని శాస్త్రాల్నీ శాసించినట్లే, భాషాసాహిత్యాల్నీ
ప్రభావితం చేస్తాయనుకుంటున్నాను. అలాంటప్పుడు శాస్త్రీయత, నైపుణ్యాలే అవి
నిలబడ్డానికి ప్రధాన కొలమానాలవుతాయి. ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయ విరాళాల సంఘం (University
Grants Commission), National Assessment and Accreditation Council (NAAC) వారు తీసుకుంటున్న
విధానపరమైన నిర్ణయాల్ని పరిశీలిస్తే ఈ విషయం మరింత స్ఫష్టంగా బోధపడుతుంది. ఈ
సంస్థల పర్యవేక్షణలో మన సీనియర్ ప్రొఫెసర్స్ మారుతున్న సామాజిక పరిస్థితులకు
అనుగుణంగా ఉన్నత విద్యాభివృద్ధికి కొత్తకొత్త నియమావళిని ప్రకటిస్తున్నారు. స్వయంప్రతిపత్తి
కళాశాలలకు అనుమతులిస్తున్నారు. వీటన్నింటికీ పరిశోధనల్లోని నాణ్యతలను అనుసరించి
‘గ్రేడ్స్’ ప్రకటిస్తున్నారు. ఇవన్నీ ఉన్నతవిద్యలో నైపుణ్యాభివృద్ధికి,
శాస్త్రీయావగాహనకు తోడ్పడే అంశాలు. ‘శాస్త్రీయత’ అనగానే కేవలం విజ్ఞానశాస్త్రాలు (Pure Sciences) లోనే ఉంటుందనుకోవడానికి వీల్లేదు. అవి Sciences, Social Science,
Humanities లలో ఏ శాఖల్లోనైనా ‘శాస్త్రీయమైన’ బోధన అవసరం. Sciences లో ఉన్నంత ఖచ్చితత్వ నిరూపణ మిగతాశాస్త్రాల్లో అసాధ్యమనే మాట అతార్కికం!
Pure Sciences లో కొన్ని
ప్రయోగశాలలు (Labs) ఉంటాయి. వాటిలో కొన్ని పద్ధతుల ప్రకారం కొన్ని
ప్రయోగాలు చేసి ఫలితాంశాలను నిరూపిస్తుంటారు. సామాజికశాస్త్రాలు,
మానవీయశాస్త్రాలకు సమాజం, మానవ అనుభవాలే ప్రయోగశాలలు. వీటిని నిరూపించడానికి కూడా
కొన్ని పద్ధతులున్నాయి. అవి విజ్ఞానశాస్త్ర పరిశోధకులు ఉపయోగించే పరికరాలు, పద్ధతుల
వంటివి కాకపోవచ్చు. కానీ, సామాజికశాస్త్రాలు, మానవీయ శాస్త్రాలకు కొన్ని పద్ధతులు
ఉంటాయి. వీటన్నింటినీ సర్వసాధారణంగా పరిశోధన పద్ధతులనో, కౌశలాలు (Techniques) అనో పిలుస్తున్నారు. జాగ్రత్తగా పరిశీలిస్తే,
ఒక్కొక్క శాస్త్రానికీ ఒక్కొక్క ‘పద్ధతి’ని రూపొందించుకోవలసిన అవసరం ఉంటుంది.
నిజానికి భాషా సాహిత్య పరిశోధన, ఇతర శాస్త్ర పరిశోధనల కంటే భిన్నమైందేనని . ఈ
దిశగా ఆంగ్ల భాషలో వచ్చిన కొన్ని గ్రంథాలను చూస్తే తెలుస్తుంది. An Introduction to Research in English Literary
History (Chauncey Sanders), Theory of Literature (Wellek and
Warren), The Handbook to Literary Research (Delia
da Sousa Correa and W.R.Owens), The Craft of Language and Literary Research
(Syed Mohammad Haseebuddin Quadri), Research
Methods in English (M.P.Sinha) మొదలైన పుస్తకాల్లో Literary Researchలో కొన్ని ప్రత్యేక పద్ధతుల్ని పాటించాలనే స్పృహ కలుగుతుంది. ఆంగ్ల భాషలో ఉన్న
పుస్తకాలు, ప్రధానంగా ఆంగ్ల, యూరోపియన్ సాహిత్యాల్ని ఉదాహరిస్తూ వచ్చిన రచనలు.
వీటిలో కొన్నింటిని పరిశీలించిన తర్వాత Science Research, Social Sciences / Humanities
Research, Literary Researchలకూ మధ్య కొన్నింటిలో
సారూప్యాలున్నా, ప్రత్యేక పద్ధతుల్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందనిపించింది.
తెలుగులో కూడా ఈ దిశగా పుస్తకాలు
అందుబాటులో ఉంటే బాగుండునని అనుకుంటున్న సమయంలో నాకు ‘ఆధునికత-సమకాలికత :
కొన్ని పార్శ్వాలు’ (2016) అనే పుస్తకం కనిపించింది. దీన్ని బోధన, పరిశోధన,
పాలనా రంగాల్లో విశేషమైన అనుభవం ఉన్న ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు రాశారు.
దీనిలో తెలుగు భాషాసాహిత్యాలకు సంబంధించిన ప్రత్యేక పరిశోధన పద్ధతుల గురించి
కొన్ని వ్యాసాలు ఉన్నాయి.
భాషాసాహిత్యాల్లో ‘దర్శనం’ ప్రధానమవుతుందని
భారతీయాలంకారికుల్లో అభినవగుప్తుని సిద్ధాంతాలతో పాశ్చాత్య సిద్ధాంతాల్ని సమన్వయిస్తూ
విభిన్న అంశాలపై రాసిన వ్యాసాలు సాహిత్య పరిశోధనలు చేసేవారికి మోడల్ గా
నిలుస్తాయనిపించింది. సాహిత్యపరిశోధనలో తార్కికత, నిరూపణలు సాధనాలుగా
ఉపయోగించుకుంటూ ఆ కవి లేదా ఆ రచనను ‘దర్శింప’ చేయగలగాలి. వీటిని లక్ష్మీనారాయణ
గారు వివరించిన విధానం నాకు బాగా నచ్చింది.
‘ఆలోచనలోని క్రమబద్ధతలకు,
వ్యక్తిలోని హేతుశీలకు రూపం తార్కికత. చక్కటి ఆలోచనావిధానమే తార్కికత’ (ఆధునికత-సమకాలికత: కొన్ని పార్శ్వాలు, పుట:116)
‘‘పరిశోధనకు జీవధాతువు కొత్త
సమాచార సేకరణ, లేదా, కనీస కొత్త విశ్లేషణ/ఆవిష్కరణ. దానికి ప్రాణం పోసేది
విమర్శనాశక్తి. విమర్శనాశక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రతివిషయంలోనూ
కొత్తఖాళీ-స్పేస్-కనబడుతూనే ఉంటుంది. కొత్త దర్శనం స్ఫురిస్తూనే ఉంటుంది. ఆ
దర్శనమే పరిశోధనకు ఫలం. పరిశోధన చేత ఒక సాహిత్య అధ్యేత సమకూర్చుకొనేది ‘దర్శన’బలం.’’
(పుట: 369)
‘‘ కంటితో భౌతికంగా చూసేది
వీక్షణం. మనసుతో లోన-అంతస్తులను-చూడగలిగేది దర్శనం...వ్యక్తిని చూడ్డం
వీక్షణం-‘వ్యక్తిత్వా’న్ని గ్రహించడం దర్శనం...ఆ వ్యక్తిత్వ నిర్మాణానికి కారణమైన
భూమికలను, వాటి తాత్త్వికతలను సవిమర్శకంగా చూడగలిగితే అది నిజమైన దర్శనం.’’
(పుట: అదే)
‘‘ఎందులో పరిశోధన చేసినా,
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టా ఇస్తాం. ఆ మాటకు న్యాయం చేకూరేది ఆ పరిశోధనలో దర్శనం
సిద్ధించినప్పుడే. పరిశోధనకు అంతిమ ఫలం దర్శనం’’ (పుట: అదే)
ఇలా ‘దర్శనం’ చేసి,
నిరూపించినవాటినే పరిశోధనలుగా పిలుస్తున్నామా? విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలుగా
సమర్పిస్తున్న గ్రంథాల పుటలను బట్టి డిగ్రీలను నిర్ణయించాలా? డిగ్రీలను బట్టి
పుటలను నిర్ణయించాలా? పరిశోధన గ్రంథంలో ప్రధానమైనవి పుటలా ? ప్రతిపాదనా? సమన్వయమా?
సిద్ధాంతమా? – ఇలాంటి ప్రశ్నలు అప్పుడే పరిశోధనలో ప్రవేశించిన వాళ్ళకు ఎదురవ్వడం
సహజం. దీన్ని తమ గ్రంథంలో ఇలా ప్రస్తావించారు. ‘‘ఎం.ఫిల్., కు 120 పుటలు,
పిహెచ్.డి. కి 250 పుటలని కొందరో సూత్రాన్ని ఏర్పరిచారు. చివరికవి పుటలకోసం
పరిశోధనలుగా మారాయి. ఎం.ఫిల్.కు విస్తృత పరిశోధన చేయకూడదని కాదు. ఎం.ఫిల్.కు
పిహెచ్.డి. కి మధ్య అంతరాన్ని గుర్తించడంలో ఒక ప్రణాళిక బద్ధమైన విధానం ఏర్పడాలి’’
(పుట: 171)
1. దీనితో పాటు మరో విషయాన్ని కూడా చర్చకు పెట్టారు. ఎం.ఏ. పూర్తయిన వెంటనే
ప్రతిభ లేదా అదృష్టం వల్లనో బోధనలోకి వెళ్తున్నారు. వారికెలాంటి భాషాసాహిత్యాల
బోధన, పరిశోధనల్లో శిక్షణా ఉండటంలేదు. దాని వల్ల బోధనా ప్రమాణాలు
సన్నగిల్లుతున్నాయనేది వీరి అభిప్రాయం. (పుట: 172)
2. తెలుగు పరిశోధన కేవలం సాహిత్య భాషాశాఖలకే పరిమితం కానక్కరలేదు.
చరిత్రశాఖల్లోనూ సాహిత్యాంశాల ఆధారంగా పరిశోధనలు చేయవచ్చు. చరిత్రలో లిఖిత, అలిఖిత
ఆధారాలకు శాసనాల వంటివి ఆకరాలుగా పనిచేస్తాయి. వీటిలో భాషాసాహిత్యాంశాలు ఉంటాయి.
వీటిపై కేవలం భాషాసాహిత్య శాఖలే కాకుండా ఇతర శాఖలు కూడా పరిశోధనలు చేస్తున్నాయి.
(పుట: 180) అందువల్ల వీటికి కేవలం సాహిత్య
పరిశోధన పద్ధతులే సరిపోవు. సామాజికశాస్త్రాల పద్ధతులను మిళితం చేసుకొని
సమన్వయించుకోవాల్సిన అవసరం ఉంది.
3. ‘‘తెలుగులో పరిశోధన ‘మెథడాలజీ’ని పటిష్టంగా పాటిస్తున్నారా?... అసలు
మెథడాలజీకి సరైన పుస్తకాలున్నాయా? అన్న ప్రశ్నలు తరచూ వినబడుతూనే ఉన్నాయి. ఇందుకు
స్పందనగా పరిశోధనలపై వచ్చిన పుస్తకాలలో సాహిత్యశాస్త్రాన్ని అన్వయించి చూడవలసి
ఉంటుందన్న భావనే మొలకెత్తకపోవడం అన్యాయం. ’’ (పుట: 183)
4. ‘‘మనం సరిగ్గా ‘సాహిత్య పరిశోధనా సంవిధానాన్ని’ గుర్తించగలిగామా? సాహిత్య
పరిశోధనలో ముఖ్యాంగాలైన ‘సిద్ధాంతం’; ‘విమర్శ’; ‘చరిత్ర’ అనే మూడింటి మధ్య
శాస్త్రీయమైన అన్వయం కోసం ఆలోచించామా? కళగా సాహిత్య ప్రతిపత్తిని దృష్టిలో
ఉంచుకొని దాని పరిశోధనా సంవిధానానికి సరైన పాఠ్య క్రమాన్ని నిర్ణయించగలిగామా?’’
(పుట: 183)
ఈ ప్రశ్నలకు వివరణల్ని మళ్ళీ ఈ
పుస్తకాన్ని రాసిన ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగారితోనే చర్చించాను. ఈ
సందర్భంలోనే, హైదరాబాదు విశ్వవిద్యాలయం
తెలుగుశాఖలో ఎం.ఏ., స్థాయి నుండే పరిశోధన పద్ధతులను అవగాహన కలిగించే ఒక కోర్సు (Techniques of
Writing a Dissertation/Thesis)ని బోధిస్తున్న సంగతినీ
ప్రస్తావించాను. పరిశోధన చేసేటప్పటికంటే, బోధించేటప్పుడు ఆ మౌలికమైన పుస్తకాల్ని
చదువుతూ, పాఠం చెప్తుంటే నాకు చాలా సందేహాలు వస్తున్నాయని చెప్పాను. ఆ సందేహాల్ని
తీరుస్తున్నట్లుగా ఈ పుస్తకంలో తెలుగు భాషా సాహిత్య చరిత్ర, సాహిత్య విమర్శ,
భాషాసాహిత్య పరిశోధనలకు సంబంధించిన కొన్ని సైద్ధాంతిక భావనలు విద్యార్ధులకు,
పరిశోధకులకు, అధ్యాపకులకు మార్గదర్శనం చేసేలా ఉన్నాయన్నాను. దాన్ని నా కోర్సులో
రిఫరెన్సు పుస్తకంగా పెట్టాలనుకుంటున్నానని, అనుమతిని కోరుతున్నానని అన్నాను. తన
లక్ష్యం నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందంటూనే, అంతపెద్ద పుస్తకం ఎం.ఏ. స్థాయి
విద్యార్థులకు ‘బరువు’ అవుతుందేమో, వాళ్ళకు కావలసిన అంశాలు ఒక అరవై, డెబ్బై పుటల్లో
ఎడిట్ చేస్తే బాగుంటుందన్నారు. ఈ
పుస్తకంలో సూచనామాత్రంగా చెప్పిన కొన్ని అంశాలను, పరిశోధకులకు తక్షణం ఉపయోగపడే
మరికొన్ని అంశాలను ఓ ‘చిన్నిపుస్తకం’ గా తెస్తే బాగుంటుందన్నాను.
‘‘ఈయనేంటిప్పుడు పరిశోధన విధానాల్ని
తెలిపే పుస్తకాలు రాస్తున్నారనుకోరా’’ అంటూ, ‘‘ఒక పనిచెయ్... పరిశోధన పద్ధతులకు కావలసిన
అంశాలు నా పుస్తకంలో ఉన్నాయన్నావు కదా. వాటిని ఒక చోట పెడితే, వాటికి మరికొన్ని
అంశాల్ని రాసిస్తాను. అయితే దానికి నువ్వే ఎడిటర్ గా ఉండాలి’’ అన్నారు.
మా తొలి బ్యాచ్ (ఎం.ఏ., స్థాయిలో ఈ
యేడాది నుండే ప్రారంభమైన Techniques of
writing a Dissertation / Thesis కోర్సు ) వాళ్ళకి కూడా ఉపయోగపడాలనుకున్నాను. ‘ఎడిటర్’ గా నాకో గొప్ప
అవకాశాన్ని కల్పించారు. పుస్తకంలో ఉండాల్సినవేమిటో ఆయన చెప్పారు. నేను కూడా ఒక
పరిశోధక విద్యార్ధిలా, ఒక పరిశోధనాంశాన్ని బోధిస్తున్న అధ్యాపకుడిలా మా అవసరాల్నీ
నా చర్చల్లో చేర్చాను. చాలా వాటిని ఈ పుస్తకంలో చేర్చారు. ఈ పుస్తకం సాహిత్య
పరిశోధనలో ఒక మైలురాయి కాగలదనుకుంటున్నాను. దీనిలో పరిశోధనకు సంబంధించిన Dissertation,
Thesis లకు సంబంధించిన వివరణలున్నాయి. అలాగే, భారతీయ
సాహిత్య సిద్ధాంతాలనుండి తీసుకోవాల్సిన మౌలికాంశాలైన ప్రతిభ, వ్యుత్పత్తి,
అభ్యాసాలను సాహిత్య పరిశోధనలో అన్వయించుకోవాల్సిన విధానాన్ని సూచించారు. కావ్యాత్మ
సిద్ధాంతాలుగా ప్రాచుర్యంలో ఉన్న రస, ఆలంకారిక, వక్రోక్తి, రీతి, ధ్వని, ఔచిత్య
సిద్ధాంతాల్ని సాహిత్యంలో దర్శించి, వివరించే విధానాల్ని తెలిపారు. భారతీయ సాహిత్య
సిద్ధాంతాలు పాశ్చాత్య సిద్ధాంతాలైన రీడర్ రెస్పాన్స్ థియరీ, మ్యాజిక్ రియలిజమ్
వంటి వాటిగా పరిణమించిన తీరు భావి పరిశోధకులకు కొత్త చూపునిస్తుందని అనుకుంటున్నాను.
సాహిత్య విమర్శ, సిద్ధాంతం, కావ్యమీమాంస (కావ్య శాస్త్రం) వంటివాటిని
పర్యాయపదాలుగా వాడేస్తున్నా, వాటి ప్రత్యేక అర్ధాలను పరిశోధకులు అవగాహన
చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది.
సాహిత్య పరిశోధనలో 1. పాఠ్య
పరిశోధన విధానం, 2. జీవన చారిత్రక పరిశోధన, 3. కవి/కృతి కాల పరిశోధన, 4. కృతి
వ్యాఖ్యానాత్మక పరిశోధన, 5. ప్రక్రియా వికాస పరిశోధన, 6. భావతత్త్వవికాస పరిశోధన
అని ఆరు పద్ధతుల్ని వివరించారు. వీటితో పాటు సిద్ధాంతం, చరిత్ర, విమర్శల మధ్య భేద
సాదృశ్యాల్ని ఎలా విశ్లేషించాలో స్పష్టంగా చెప్పారు. మూడో అధ్యాయంలో పరిశోధన
క్రమాన్ని సమాచార సేకరణ, విశ్లేషణ, వాదస్ధాపన/నిరూపణ, సిద్ధాంతీకరణ,
సిద్ధాంత రూపకల్పన, సమర్పణలను అరటిపండు ఒలిచిపెట్టినట్లు వివరించారు. సాహిత్యంలో
కవిత్వాన్ని, కథల తత్త్వాన్ని పరిశోధించి నిరూపించే పద్ధతులు పరిశోధకులకు కొత్త
ఆలోచనలనిస్తాయి. పరిశోధనలో విమర్శ, సిద్ధాంతాల బలం నూతన సిద్ధాంతాల స్థాపన లేదా
సమన్వయానికి ఎంతగా దోహదపడుతుందో ఈ విభాగం వల్ల తెలుస్తుంది. సమీక్ష, విమర్శ,
పరిశోధనలకు సంబంధించిన వ్యాసాన్ని, మరికొన్ని వ్యాసాల్లోని అంశాలు దీనిలో
అనుబంధంగా చేర్చగలుగుతున్నాను.
* *
*
నా పాఠంలో భాగంగా సృజనాత్మక రచన-పరిశోధనాత్మక రచనలకు మధ్య గల వ్యత్యాసాల్ని
చెప్పే కొన్ని ముఖ్యాంశాల్ని ఇక్కడ అందిస్తున్నాను.
కేవల సృజనాత్మక రచన శైలిలోను, వస్తు-రూప
స్వీకరణలోను పరిశోధన రచనకంటే భిన్నంగా ఉండాలి.
1.రచనను ఆసక్తి రేకెత్తించేలా ప్రారంభించాలి. ఇది పరిశోధనకు కూడా వర్తించవచ్చు. 2.సాధారణంగా ఒక సంఘటన, దాన్ని అనుసరించిన అనుబంధ సంఘటనలు మాత్రమే ఇతివృత్తంలో భాగం అవుతుంటాయి. కవిత్వమైతే ఒక సంవేదన ప్రధానమవ్వాలి. 3.
స్థల, కాలాలు, పాత్రల పేర్లు
పట్ల జాగ్రత్తను వహించాలి. రచన ప్రారంభం నుండి చివరి వరకు వీటిని పేర్కొనేటప్పుడు
పేర్లు మార్చేయడం, ఆ భౌతిక పరిస్థితులకు తగినట్లుగా వర్ణించకపోవడం వంటివన్నీ
సృజనకారుని ప్రతిభను దీప్తిమంతం చేస్తుంటాయి. పరిశోధన పారిభాషిక పదాలు ఒకే అర్ధంలో
సమన్వయించాలి. 4. వస్తువు సొంతంగా కల్పించుకున్నదా? అనువాదమా? అనుకరణా? అనుసృజనా? అనేది ముందుగానే చెప్పుకోవడం మంచిది. 5.వస్తువు
నిత్యనూతనంగా, అందరికంటే భిన్నంగా సమకాలిక సమాజానికి ప్రతిబింబంగా ఉంటే బాగుంటుంది. 6.పాఠకుల
నిర్ణయానికి సృజనకారునికి స్వేచ్ఛ
ఉంటుంది. 7. భాషను మన పాఠకులను బట్టి నిర్ణయించుకోవాలి. సహజత్వం ఉట్టిపడేలా ఉండాలి. 7.
సందేశాన్ని ఇవ్వడం
కోసం రాస్తున్నా, దాన్ని పాత్ర గతంగా గానీ, రచన ఆస్వాదనానంతరం కల్గించే అనుభూతి ద్వారా వ్యక్తం కావాలి.
కేవలం ఆనందం కోసమే అయినా కళాత్మకత ముఖ్యం.8. వర్ణనలు, సన్నివేశ కల్పనలు సందర్భోచితంగా
గుర్తుండిపోయేలా ఉండాలి. ప్రారంభం, ముగింపు, నిర్ణయాలనేవి సృజనకారుని ఆలోచనా
సరళిని బట్టి ఉండొచ్చు.
సృజనాత్మక రచనకు, పరిశోధన రచనలో
పాటించాల్సిన కొన్ని అంశాలను గమనించాలి. 1. అన్వేషణ, అనుమానం, ప్రతిపాదన, సిద్ధాంత ఖండనలలో ఏదో ఒక దానితో
ప్రారంభించాలి. 2. ఒకే అంశంపైనే పరిశోధన దృష్టిని కేంద్రీకరించాలి. 3. చివరి వరకు పారిభాషిక పదాలను ఒకే అవగాహనతో ప్రయోగించాలి. 4.
Review of literature వల్ల ‘పూర్వ పరిశోధనలను పరిశీలించాను’ అనే స్పృహ కలిగించాలి. పూర్వ పరిశోధకులు అభిప్రాయాల్ని
తీసుకుంటూనే అవి సమర్థిస్తున్నా, ఖండిస్తున్నా, ఆ అంశాలు స్పష్టంగా తెలపాలి. భావచౌర్యానికి
ప్రయత్నించకూడదు. 5. కొత్త సమన్వయం లేదా కొత్త ప్రతిపాదన ఉండాలి. 5. పాఠకులు పండితులు అనేది మర్చిపోకూడదు. 6.
ప్రయోగించే భాష,
పారిభాషిక పదజాలం
పండితుల ప్రశంసలను అందుకునేలా ఉండాలి. 7. ప్రకటనలు (Statements), వివాదాస్పద వ్యాఖ్యల పట్ల సంయమనంతో
వ్యవహరించాలి. నిరూపణాత్మకమైన ఖండన మంచిదే. కానీ, ప్రమాణాలతో, హేతుబద్ధంగా నిరూపించాలి. 8. తాను
ప్రతిపాదించిన అంశాన్ని పరిశోధకులు ఆలోచించేలా చేయగలగాలి. ప్రతిపాదిత లేదా
సమన్వయాంశం శాశ్వత ముద్రను వేయగలగాలి. 9. Hypothesis కీ, సిద్ధాంతానికీ, ఫలితాంశాలకీ మధ్య స్పష్టమైన విభజన రేఖలు కనిపించాలి.
ఇటువంటివన్నీ పరిశోధన రచనలో ముఖ్యంగా గమనించగలిగే అంశాలు. అందుకనే నిఘంటువుల్లో Research అంటే “The systematic
investigation into and study of materials and sources in order to establish
facts and reach new conclusions.” అని వివరిస్తున్నారు.
లక్ష్మీనారాయణగారు ‘కథన మీమాంస’
కు సంబంధించిన కొత్త అంశాలను వివరిస్తూ కవిత్వాన్ని, జానపదవిజ్ఞానాన్ని కూడా
పరిశోధించే సాంకేతిక మార్గాల్ని ఈ గ్రంథంలో పరిచయం చేశారు. వస్తువు, రూపం,
ప్రక్రియ, పరిశోధన పద్ధతి మొదలైన పారిభాషిక పదాలను ఎలా అవగాహన చేసుకోవాలో ఈ
పుస్తకంలో వివరించారు. ‘ఆధునికత-సమకాలికత: కొన్ని
పార్శ్వాలు’ గ్రంథం లో ‘కథన మీమాంస’ పై వ్యాసాన్ని కూడా పరిశోధకులు చూస్తే
ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో Socio-cultural approach తో పరిశోధనలు
విస్తృతంగా వస్తున్నాయి. ఈ పరిశోధకులు సాహిత్య వాస్తవాలు, సామాజిక-సాంస్కృతిక
వాస్తవాల పట్ల స్పష్టతను ఏర్పరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశాల్ని ఈ పుస్తకం
చర్చించింది.
పరిశోధనలో సమాచార సేకరణ చాలా ముఖ్యమైన మెట్టు. వీటి
స్వభావాన్ని బట్టి Primary, Secondary, Tertiary Sources గా వర్గీకరిస్తుంటారు. అలాగే, పరిశోధనలో Review of literature పై బాగా దృష్టి కేంద్రీకరిస్తే పరిశోధన సమస్య పట్ల మరింత స్పష్టత వస్తుంది.
ఒకవేళ పరిశోధనలో కొన్ని పూడ్చాల్సిన గ్యాప్స్ కనిపించినప్పుడు, పరిశోధన చేసేటప్పుడు
మన పూర్వీకులు చెప్పిన ఆగమ, నిగమన
పద్ధతులు (Inductive, Deductive Methods) ఎంతగానో ఉపకరిస్తాయి. ఆ రంగంలో
పరిశోధన అయిపోయిందనేవాళ్ళు వీటిని అవగాహన చేసుకుంటే పరిశోధన ఒక నిరంతరాన్వేషణ
అనేది బోధపడుతుంది. ‘సామాన్య సూత్రాల నుండి, ఒక విశిష్ట సూత్రాన్ని
నిష్పన్నం చేసేది, సూత్రీకరించేది, లేదా ప్రమాణీకరించేది’ సూత్రీకరణ విధానం (Deductive
Method)గాను, ‘ప్రమాణీకరింపబడిన సూత్రాన్ని ఒక సందర్భానికి
అన్వయించి, ఆరోపించి, ఆ ప్రమేయంతో దాని గుణ స్వభావాన్ని పరిశీలించి నిర్ధారించేది
లేదా విపులీకరించేది’ సూత్రాన్వయ విధానం (Inductive Method) గాను ఆచార్య గంగిశెట్టిగారు నిర్వచించి, పరిశోధనలో
వీటి ప్రాధాన్యాన్ని వివరించారు.
శైలి విషయానికి వస్తే, మన తెలుగు
భాషలో సంస్కృత, ఆంగ్ల భాషల ప్రభావం వల్ల ప్రవేశించిన ‘బడు’, ‘జరుగుతుంది’ వంటి
ప్రయోగాల్ని పరిశోధనల్లో ఎంతవరకూ స్వీకరించవచ్చో కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు.
పరిశోధనలో ‘ఆత్మాశ్రయ’ శైలి నుండి తప్పించుకోవడానికి వీటిని అవసరమైనంత మేరకు
ఉపయోగించుకోవడంలో ప్రమాదం లేదన్నారు. వీటిని మరింత విస్తరించుకోవాల్సిన
అవసరం ఉంది.
పరిశోధనలో తన ప్రాజెక్టు లేదా
ఎం.ఫిల్., పిహెచ్.డి. గ్రంథాలను సమర్పించేందుకు సిద్ధంచేసేటప్పుడు ప్రూఫ్ రీడింగ్
చూసుకోవాల్సి ఉంటుంది. Chicago Manual of Style ఇంగ్లీషులో
ప్రూఫ్ రీడింగ్ చేసే పద్ధతిని కూడా అందించింది. తెలుగులో ఈ దిశగా జర్నలిజమ్ లో
కృషిచేస్తున్నా, పరిశోధక విద్యార్ధులకు అందుబాటులో ఉండేలా ప్రూఫ్ రీడింగ్ తో కూడిన
శైలీపత్రం (Style Sheet) రావాల్సిన అవసరం ఉంది. తెలుగు పరిశోధన, విమర్శ
రచనల్లో ఉండాల్సిన భాష గురించి కూడా సోదాహరణంగా రాయాల్సిన అవసరం ఉంది.
పరిశోధన పద్ధతుల్ని వివరించే చాలా
పుస్తకాల్లో రిఫరెన్సులు, ఉపయుక్త గ్రంథ సూచికలను సోదాహరణంగా వివరించే గ్రంథాలు
చాలా వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానవీయ శాస్త్రాల్లో ముఖ్యంగా భాష,
సాహిత్యం, జానపద విజ్ఞానం, ఫిలాసఫీ మొదలైన పరిశోధనలకు MLA Handbook for Writers
of Research Papers అనే పుస్తకాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం 8th ఎడిషన్ అందుబాటులోకి వచ్చింది. ఆధునిక శాస్త్ర, సాంకేతిక సమాచార రంగాల్లో
వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా రిఫరెన్సు, ఉపయుక్త గ్రంథాలను పేర్కొనే
పద్ధతుల్ని ఆ హేండ్ బుక్ లో సోదాహరణంగా వివరించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సాంప్రదాయిక పరిశోధన
విధానాలతో పాటు, ప్రతి శాస్త్రంలోనూ ఆధునిక, సమకాలీన సమాజానికి అనుగుణంగా కొత్త
కొత్త పరిశోధన పద్ధతులను రూపొందించుకుంటున్నారు. సాహిత్య పరిశోధన కూడా దీనికి
అతీతమైనదేమీకాదనీ గుర్తిస్తున్నారు. ఈ గుణాత్మకమైన మార్పుల్ని ఆచార్య గంగిశెట్టి
లక్ష్మీనారాయణగారు గుర్తించి తన పుస్తకంలో వివరించారు. అందు వల్ల మా తరం
పరిశోధకులకు ఈ పుస్తకం చక్కని మార్గదర్శనం చేస్తుందనుకుంటున్నాను.
ఆంగ్లభాషతో ఎక్కువగా పరిచయం లేని తెలుగు పరిశోధక
విద్యార్థులు కూడా అంతర్జాతీయమైన అవగాహన పెంచుకోవడానికి, వాటిని తమ పరిశోధనల్లో
అన్వయించి సత్ఫలితాలను సాధించడానికి కనీసం ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది.
కనుక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పుల్ని తెలుగు సాహిత్య పరిశోధకులు
కూడా అర్ధం చేసుకుంటూ వాటిని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది.
రిఫరెన్సులు, ఉపయుక్త గ్రంథ
సూచికలు ఏ పద్ధతిలో (MLA
/Chicago/APA etc.) ఎలా ఇవ్వాలో అలా అందించడానికి అంతర్జాలంలో కొన్ని Citation Generators అందుబాటులో ఉన్నాయి. ఉదా: http://www.easybib.com దీనిలో మనకి కావలసిన ఫార్మేట్ ని
బట్టి మన వివరాలు నిర్దేశించిన బాక్స్ లో పూర్తి చేస్తే దాన్ని ఆ జెనరేటర్ ఒక
వరుసలో పెట్టిస్తుంది. వీటితో పాటు అంతర్జాలంలో https://owl.english.purdue.edu/,
http://www.aresearchguide.com/12biblio.html
వంటి వెబ్ సైట్స్ ఉపయుక్త గ్రంథసూచిని ఎలా రాయాలో
సులభంగా వివరిస్తున్నాయి. అలాగే, వీడియో, సినిమా, చిత్రం, డిజిటల్ ఆకరాలను, వెబ్
సైటు, బ్లాగు, ఈమెయిల్, వాట్స్ అప్, ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, మొబైల్
మెసేజ్ వంటి వాటిని రిఫరెన్సులు, ఉపయుక్త గ్రంథసూచికలు ఎలా రాయాలో తెలిపే కొన్ని Citation Generators అంతర్జాలం (Internet)లో ఉన్నాయి. ఈ టెక్నికల్
వివరాలవైపు వెళ్ళకుండా ఈ ‘సాహిత్య పరిశోధనాకళ: విధానం’ అనే పుస్తకంలో
సాహిత్య అంశాలపైనే దృష్టిని కేంద్రీకరించటం గమనించాలి.
ఈ పుస్తకం ప్రధానంగా
సాహిత్యరంగాల్లో అనుసరించాల్సిన పద్ధతుల్నీ, వాటిని సైద్ధాంతీకరించే క్రమాన్ని, వాటికి సంబంధించిన పారిభాషిక పదాలు, సిద్ధాంత వివరణలు
అందిస్తున్నది. అందువల్ల ఇంతకు ముందువచ్చిన తెలుగు పరిశోధన విధానాన్ని తెలిపే
గ్రంథాలకంటే ఇది ప్రత్యేకంగా నిలుస్తున్నది. ఈ పుస్తకం
చదివిన తర్వాత కచ్చితంగా సాహిత్య పరిశోధనలోను, పరిశోధకుల్లోను మార్పులు వస్తాయని
విశ్వసించవచ్చు. ఇది పరిశోధన బాగుపడాలనుకొనేవాళ్ళంతా చదవాల్సిన గ్రంథంగా
భావిస్తున్నాను. ఈ పుస్తకానికి ‘‘సాహిత్య పరిశోధనాకళ: విధానం’’ అని పేరు పెట్టడం
వెనుక సాహిత్యంలోని కళాత్మకతకు రచయిత ప్రాధాన్యం ఇవ్వడాన్ని స్పష్టంగా
గుర్తించవచ్చు. పరిశోధకులు సృజనాత్మకంగా కొత్తపద్ధతుల్ని ఆలోచించే మార్గాల్ని
ఆహ్వానించే వ్యూహం కూడా ఇందులో ఉందనుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదివిన వివిధ
విశ్వవిద్యాలయ ఆచార్యులు తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించిన సాధ్యమైన అన్ని
అంశాల్నీ ఒకే బృహత్ గ్రంథంగా రాసుకోవాల్సిన అవసరాన్నీ సూచిస్తూ, దానికిది
ప్రేరణనిస్తుందనుకుంటున్నాను.
పరిశోధన బాగుపడాలని తపించేవాళ్ళ
కోసం మరలా కొన్ని అంశాల్ని రాసివ్వడమే కాకుండా, మూల గ్రంథం నుండి తీసి ఈ పుస్తకంగా
ప్రచురించినందుకు, పెద్దమనసుతో దీనికి నన్ను ఎడిటర్ గా ఉండమని నా గౌరవాన్నీ,
బాధ్యతనూ పెంచిన వాత్సల్యశీలి, సహృదయులు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగార్కి,
నన్ను వీరికి పరిచయం చేసిన నా శ్రేయోభిలాషి మా తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య తుమ్మల
రామకృష్ణగార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
- డా॥దార్ల వెంకటేశ్వరరావు
ప్రముఖ పరిశోధకుడు, విమర్శకుడు, ద్రావిడ
విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు రాసిన ‘‘సాహిత్య పరిశోధనా
కళ: విధానం’’ పుస్తకావిష్కరణ సభ 10 ఏప్రిల్ 2017, సాయంత్రం : 4-00 గంటలకు హైదరాబాదు
విశ్వవిద్యాలయం (సెంట్రల్ యూనివర్సిటి) హైదరాబాదులో జరుగుతుంది. పొట్టిశ్రీరాములు
తెలుగు విశ్వవిద్యాలయం, మాజీ వైస్ ఛాన్సలర్ డా.ఆవుల మంజులతగారు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ
సందర్భంగా ‘‘తెలుగు సాహిత్య
పరిశోధన-తీరుతెన్నులు’’ గురించి ఆచార్య మంజులత ప్రత్యేకప్రసంగాన్ని చేస్తారు. సభకు
తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణగారు అధ్యక్షత వహిస్తారు.
పుస్తకావిష్కరణానంతరం ‘‘సాహిత్య పరిశోధనా కళ: విధానం’’ గ్రంథాన్ని సెంట్రల్ యూనివర్సిటి పరిశోధక విద్యార్ధులకు ఆచార్య గంగిశెట్టి
లక్ష్మీనారాయణగారు తన కుమారుడు కీ.శే.చెన్నసాయికిశోర్ స్మృత్యర్థం ఉచితంగా
బహూకరిస్తారు. సభలో డా.పిల్లలమర్రి రాములు, డా.దార్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొంటారు.
దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని పరిశీలించగలరు. తెలుగుశాఖ, హైదరాబాదు
విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్ధులు, ఎం.ఏ. చదువుతున్నవిద్యార్థినీ విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా
విజ్ఞప్తి చేస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి