"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

11 April, 2017

విస్తృతి పెరిగిన తెలుగు సాహిత్య పరిశోధనను గుర్తించాలి

ప్రపంచీకరణ ఫలితంగా తెలుగు సాహిత్య పరిశోధన విస్తృతి మరింతగా పెరిగిందని, దాన్ని గుర్తించి అనుగుణమైన పరిశోధనలు చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డా.ఆవుల మంజులత పేర్కొన్నారు. తెలుగుశాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాదు విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ఆడిటోరియంలో ‘‘తెలుగు సాహిత్య పరిశోధన-తీరుతెన్నులు ’’ అనే అంశంపై ప్రత్యేక ప్రసంగకార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రధానోపన్యాసం చేసిన డా. ఆవుల మంజులత తెలుగు భాషాసాహిత్యాల్లో హైదరాబాదు విశ్వవిద్యాలయం కొత్త కోర్సులతో, ఉపాధిని కూడా దృష్టిలో పెట్టుకొని పాఠ్యాంశాలు, సిలబస్ లను రూపొందిస్తున్నారని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మల్టీనేషనల్ కంపెనీలు తెలుగు భాష ద్వారా తమ కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి ముందుకొస్తున్నారని, దాన్ని గుర్తించి ఆ అవకాశాలను కూడా తెలుగు విద్యార్ధులు ‘జీవిక’కోసం కూడా తమ పరిశోధనలను ఉపయోగించుకోవాలని ఉద్బోధించారు. 

ద్రావిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ రాసిన ‘‘ సాహిత్యపరిశోధనాకళ: విధానం’’ అనే పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. తన కుమారుడు కీ.శే.చెన్నసాయికిశోర్ స్మృత్యర్థం సభలో పాల్గొన్న పరిశోధక విద్యార్ధులతో పాటు, ఎం.ఏ. విద్యార్ధులకూ ఉచితంగా పుస్తకాన్ని బహూకరించారు. సభకు అధ్యక్షత వహించిన తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు సాహిత్య పరిశోధకుల్లో వేటూరి ప్రభాకరశాస్త్రి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, బిరుదురాజు రామరాజు, భద్రిరాజు కృష్ణమూర్తి తదితరుల కృషిని పరిచయం చేసి, వారి మార్గాన్ని అనుసరిస్తూనే, సమకాలీన సమాజానికి కావాల్సిన పరిశోధనాంశాల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త దృష్టిని ప్రసరించే గ్రంథాన్ని రాసి, పుస్తకాలను విద్యార్ధులకు అందించిన ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణను, ఆ పుస్తకానికి సంపాదకుడు గా వ్యవహరించిన డా.దార్ల వెంకటేశ్వరరావునీ అభినందించారు.
తెలుగుశాఖలో ఎం.ఏ.స్థాయిలోనే ఈ యేడాది నుండి ప్రవేశ పెట్టిన  ‘‘టెక్నిక్స్ ఆఫ్ రైటింగ్ ఏ డిజర్టేషన్ /థీసిస్ ’’ కోర్సు కోసం సిలబస్ రూపకల్పన, పాఠాల బోధన సందర్భం నుండి ఈ పుస్తక రూపకల్పనకు అంకురార్పణ జరిగిందని చెప్తూ గ్రంథానికి సంపాదకుడుగా వ్యవహరించిన డా. దార్ల వెంకటేశ్వరరావు పెద్దమనసుతో ఒక మంచి సాహిత్య పరిశోధన విధానాన్ని తెలిపే గ్రంథాన్ని రాసిచ్చిన ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగార్కి కృతజ్ఞతలు తెల్పారు. సభలో పాల్గొన్న అతిథులను పరిచయం చేసి, అనుభవజ్ఞులైన రచయిత గంగిశెట్టి లక్ష్మీనారాయణగారనీ, ఆయన విద్యార్థుల పట్ల ప్రేమతో పుస్తకాన్ని రాసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
సుమారు రెండువందల మంది విద్యార్థినీ విద్యార్థులకు ఈ పుస్తకాన్ని ఉచితంగా బహూకరించిన ఆచార్య లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్ధులను దృష్టిలో పెట్టుకునే డా.దార్ల వెంకటేశ్వరరావు కోరిక మేరకు తన ‘‘ ఆధునికత-సమకాలీనత: కొన్నిపార్శ్వాలు’’ పుస్తకంలోని కొన్ని వ్యాసాలతో పాటు, మరికొన్ని వ్యాసాలను కలిపి పుస్తకంగా రాశానన్నారు. ఇది ఇంతకు ముందున్న పరిశోధన పుస్తకాలకంటే భిన్నంగా ఉండటమే కాకుండా, కొత్త ఆలోచనలకు ప్రేరణనిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
రిపోర్టు : డా.దార్ల వెంకటేశ్వరరావు, అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 


No comments: