తెలుగు భాషాభివృద్ధిలో డయాస్పోరా
సంస్థల కృషి
-డా.దార్ల
వెంకటేశ్వరరావు
పరిశోధన
పత్ర సంక్షిప్తి
‘డయాస్ఫోరా’ అనే పదం తొలిదశలో తమ మాతృదేశమైన
ఇజ్రాయెల్ దేశం నుండి తరిమి కొట్టబడి ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురైన యూదుల
వ్యాప్తిని తెలియజేయడానికి ఉద్దేశించింది. తర్వాత కాలంలో ఈ పద వాడుక విస్తృతి
పెరిగింది. తమ మాతృభూమి నుండి ఇతర రాష్ట్రాలు లేదా దేశాలకు చెల్లాచెదురు చేయబడిన
వాళ్ళని ‘డయాస్పోరియన్లు’ అనొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అందుకనే ‘డయాస్ఫోరా’
అనే ఆంగ్ల పదం తెలుగులో ‘ప్రవాస’ అనే వ్యవహారంలో ఉన్నప్పటికీ, ఆంగ్లంలోని NRI (A Non-Resident
Indians) లను
‘ప్రవాస భారతీయులు’ అని పిలుస్తున్నారు. ‘ప్రవాసము’ అనే పదానికి నిఘంటువులు ‘పరదేశ
వాసము’;‘పరదేశ గమనము’, ‘నిర్వాసము’; ‘వెలివేసినవారు’
మొదలైన అనేక అర్థాలిస్తున్నాయి. భారతదేశం నుండి ఇతర దేశం వెళ్ళి తాత్కాలికంగా
గానీ, శాశ్వతంగా గాని స్థిరపడిన వాళ్ళని డయాస్పోరియన్లు (ప్రవాసభారతీయులు) అనీ,
అదే భాషాపరంగా చూసినప్పుడు అటువంటి వారిని ‘ప్రవాసాంధ్రులు’ అని పిలుస్తున్నారు.
వీరినే ‘విదేశాంధ్రులు’ అని కూడా పిలవడం కనిపిస్తోంది. ‘ప్రవాసులు’ అనే పారిభాషిక
పదప్రయోగానికి సంబంధించిన సైద్ధాంతిక చర్చ ఉన్నప్పటికీ, ప్రాచుర్యంలో మాత్రం అత్యధికులు ‘ప్రవాసాంధ్రులు’గానే
వ్యవహరిస్తున్నారు.
ప్రవాసాంధ్రులు ఇతర రాష్ఱ్రాల్లో,
ఇతరదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తమ మాతృదేశ జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. దీన్నే నోస్టాల్జియా
(Nostalgia) అంటారు. సమూహంలో ఉన్నా తమ
భాషలో మాట్లాడేవాళ్ళు లేకపోవడం, భావవ్యక్తీకరణలో స్వేచ్ఛలేకపోవడం, తమ భావాల్ని
శక్తివంతంగా వ్యక్తీకరించలేకపోవడం, తమ సంస్కృతిని పాటించేవాళ్లు లేదా కనీసం
గుర్తించేవాళ్లు లేకపోవడం వంటివి సంభవించినప్పుడు ఎదురైయ్యే సంఘర్షణలకు
లోనైనప్పుడు ఈ రకమైన నోస్టాల్జియాలోకి వెళ్ళిపోతుంటారు. అటువంటప్పుడు తాము కూడా ఒక
సమూహాన్ని (Community)ని ఏర్పరుచుకోవాలనుకుంటారు.
తొలితరం డయాస్పోరియన్లకు ఈ రకమైన స్వేచ్ఛలేదు. వలసదేశాలు మనదేశాన్ని పాలిస్తున్న
సమయంలో అనేకమందిని ఆఫ్రికా, ఫిజీ, బర్మా, మలేషియా,
1824కి ముందు దిగువ బర్మాకు, 1885 లో
ఎగువ బర్మాకు తమ ఆర్థిక వనరులను పెంపొందించుకోవడానికి బలవంతంగా బ్రిటీష్ పాలకులు మన దేశం నుండి, మన తెలుగు
ప్రాంతాల నుండి కూలీలుగా మనవాళ్ళను బలవంతంగా పంపించేవారు. (
వెంకటేశ్వరరావు,1975:8). 19 వశతాబ్దంలో సుమారు 1850 ప్రాంతంలో మద్రాసు
ప్రెసిడెన్సీ నుండి మన తెలుగు వాళ్ళను మారిషస్ కి కూలీవాళ్ళుగా పంపించేవారు. ఆ
తర్వాత విశాఖపట్టణం నుండి కూడా ఆయా దేశాలకు కూలీలను పంపించేవారు. అక్కడ రబ్బరు,
ఆయిల్, కొబ్బరి తోటల్లో పనిచేయించేవారు. తర్వాత రోడ్లు నిర్మాణం, మురుగుకాల్వలు
తవ్వడం మొదలైన వాటికీ కూలీలను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకెళ్ళేవారు. (అప్పారావు,
1975:16) ఇలా ‘వలస’ వెళ్ళిన వాళ్ళకు ఆ యా దేశాల్లో కూలి పనిచేయడమే తప్ప తమ
సంస్కృతిని కాపాడుకునే హక్కులేమీ ఉండేవి కాదు. ‘కాంట్రాక్టు’లో వలసకూలీలుగా
వెళ్ళినా తర్వాత కూడా అనేక కారణాల వల్ల ఆ దేశాల్లోనే ఉండిపోయినవాళ్ళెంతోమంది
ఉన్నారని పరిశోధకులు తెలుపుతున్నారు. వీరు చెల్లా చెదురు చేయబడి కూలిపనులు చేయడం
వల్ల తమ మాతృభాషను క్రమేపీ కోల్పోవలసి వచ్చేది. అయినప్పటికీ తమ పిల్లలకు తమ
మాతృభాషను నేర్పాలనే తపన ఉండేది. వలస వచ్చిన కూలీలు సెలవు రోజుల్లో గానీ, ఖాళీ
రోజుల్లో గాని ఒక చోట సమావేశమై తమ సమస్యల్ని చర్చించుకునేవారు. అలా చర్చల్లో
వచ్చిందే తమ మాతృభాషను కాపాడుకోవాలనే ఆలోచన. అలాంటి ఆలోచనలే ప్రపంచవ్యాప్తంగా ఉన్న
‘ప్రవాసుల’ మధ్య తమ మాతృభాషను పరిరక్షించుకోవాలని దృఢసంకల్పానికి కారణమైంది. నేడు
మారిషస్ వంటి దేశాల్లో ప్రభుత్వం చేతనే కొన్ని ప్రత్యేక జి.వో.లను రూపొందించుకొని,
అక్కడ తెలుగు భాషాబోధనకు పాఠశాలలను కూడా స్థాపించుకున్నారు. అనేక సంఘాలు
ఏర్పడ్డాయి. మారిషస్ లో 8 ఆగస్టు 1947లో ‘ ఆంధ్రమహాసభ’ ను ఏర్పాటు చేసుకున్నారు.
ఫిజీలో ‘‘ దక్షిణ భారతీయ ఆంధ్ర సంఘం’’ 1941లో ఏర్పడింది. ఈ సంఘం తెలుగు
భాషాభివృద్ధి గురించి చేస్తున్న కృషిని పరిశోధకులు వివరిస్తూ ‘‘ Telugu was taught in one
of the Primary schools run by it. There were also instances of the labourers
who used to get together in the evening after the days toil to enjoy reading
from Telugu literature like Bharatam’’ (గోవింద, 1981: 183-184)
కెనడాలో కూడా తెలుగు భాషాభివృద్ధికి
ప్రవాసాంధ్ర సంస్థలు కృషి చేస్తున్నాయి. ‘ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్’ 1969లో
ఏర్పడినా, దాన్ని 1975లో రిజిస్టర్ చేశారు. ఈ సంస్థ కెనడాలో తెలుగు గ్రంథాలయాన్ని
ప్రారంభించింది. అంతే కాకుండా తెలుగు వారి నుండి తెలుగు భాషలో రచనలను
ప్రోత్సహించాలనే తపనతో ‘వాణి’ అనే వార్షి పత్రికను ప్రారంభించారు. ఈ సంస్థ తరపున
హైదరాబాదులో ప్రపంచ తెలుగు సదస్సుని 1975లో నిర్వహించింది. (మూర్తి, 1981: 175)
ప్రస్తుతం డయాస్పోరాలిటరేచర్ అనగానే
‘అమెరికాలో స్థిరపడిన ప్రవాససాహిత్యం’ అనే అంతగా వ్యాప్తిలోకి వచ్చింది. అక్కడ
తెలుగు భాషాభివృద్ధికి అటా, తానా మొదలైన అనేక సంస్థలకు కృషి చేస్తున్నాయి.
పత్రికలను ముద్రించడం, అంతర్జాల పత్రికలను నిర్వహించడం, తెలుగు రచనలను
ప్రోత్సహించడంలో భాగంగా వివిధ రకాలైన పోటీలు నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలు
చేస్తున్నాయి. ఇవన్నీ పత్రక్షంగానో, పరోక్షంగానో తెలుగు భాషాభివృద్ధికి తోడ్పాటుని
అందిస్తున్నాయనే చెప్పొచ్చు. మరికొన్ని సంస్థలైతే కేవలం తమ పిల్లలకు మాతృభాషను
విడివిడిగా చెప్పించుకోవడమే కాకుండా, ప్రత్యేక విద్యాసంస్థల్ని కూడా ఏర్పాటుచేసే
ప్రయత్నం చేస్తున్నాయి.
తొలితరంలో కూలీలుగా వెళ్ళిన ప్రవాసులకు
హక్కులు లేకపోయినా, తర్వాత దశలో నిష్ణాతులైన ఉద్యోగులు, ధనవంతులు, వ్యాపారస్తులు
ఆయా దేశాలకు వలసలు వెళ్ళారు. వారికి తమ పరిధిలో తమ సంస్కృతిని కాపాడుకోగల శక్తి
సామర్థ్యాలు ఉన్నాయని గుర్తించారు. అందువల్లనే తమ మాతృభాషాభివృద్ధికి తమవంతు కృషి
చేస్తున్నారు.
ఇటువంటి సంస్థలు తెలుగు భాషను నేర్పడం,
పత్రికలు ప్రచురించడం, సమావేశాలు, సదస్సులు నిర్వహించడం, అంతర్జాల పత్రికలు నడపడం,
తెలుగు ఫాంటులను అభివృద్ధిపరచడం, అంతర్జాలంలో తెలుగు భాషా వాడుకకు వివిధ సాఫ్ట్
వేర్స్ రూపొందించడం, ఆ యా దేశాలతో సంప్రదించి అధికారికంగా విద్యాసంస్థల్లో తెలుగు
భాషాబోధనను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించడం వంటి పద్ధతుల్లో డయాస్పోరా సంస్థలు
తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న కృషిని నా పత్రంలో వివరించాలనుకుంటున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి