(నమస్తేతెలంగాణ, చెలిమి, సాహిత్యానుబంధం (MON,DECEMBER 19, 2016) లో ప్రచురితమైన నావ్యాసాన్ని ఆ పత్రిక సౌజన్యంతో ఇక్కడ పునర్ముద్రిస్తున్నాను....దార్ల)
తెలుగు కాల్పనిక సాహిత్యంలో చలం తర్వాత మళ్ళీ అంతటి సంచలనాన్ని తీసుకొచ్చిన రచయిత కేశవరెడ్డి. స్త్రీ కేంద్రంగా చలం తన సాహిత్యాన్ని సృజనీకరిస్తే, కేశవరెడ్డి సామాజికంగా పీడితులైన వారెందరినో కేంద్రంగా చేసుకున్నాడు. ఈ పీడితుల్లో స్త్రీలు కూడా ఉన్నారు. ఆ విధంగా చలం కంటే ఎక్కువ మంది పాఠకులు కేశవరెడ్డికున్నారు. చలం తెలుగు వచన సాహిత్యశైలికి సొగసులద్దితే, కేశవరెడ్డి
పీడిత కుల దైన్యాన్ని తాత్త్వికశైలిలో మనకళ్ళముందుంచాడు. అటువంటి కేశవరెడ్డి రచనలపై బహుజన విద్యార్థి సమాఖ్య వారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో అనేక మంది మేధావులు తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. సూర్యప్రకాశ్‌గారు తన వ్యాసంలో కేశవరెడ్డిగారి వ్యక్తిత్వాన్నీ, సాహిత్యాన్ని పరిచయం చేశారు.
చివరిలో పతంజలి, రాజేందర్ గార్లు కేశవరెడ్డితో జరిపిన ముఖాముఖి విశేషాలు న్నాయి. నరేశ్ కుమార్‌గారు కేశవరెడ్డిగారిలోని సాహిత్య, మానవ సంబంధాల్ని చెప్తూ వారి హాస్పిటల్‌లో పేషెంట్స్‌కంటే సాహిత్యంతో సంబంధం ఉన్నవాళ్ళే ఎక్కువ ఉండేవారన్నారు. జతిన్‌కుమార్ అభిప్రాయంలో కేశవరెడ్డి రాసిన సాహిత్యం రెండు వేల పేజీలకు మించకపోయినా, సాహిత్యంలోఅంతకంటే గాఢమైన ప్రభావాన్నే చూపించిందన్నారు. సాధారణంగా రచయితల్లో భిన్న భావజాలాలున్నప్పటికీ ఆయన ప్రాపంచిక దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి విమర్శకులు కొన్ని విశ్లేషణలు చేస్తుంటారు. ఈ విషయంలో జతిన్‌కుమార్, నందిని సిధారెడ్డి మొదలైనవాళ్ళు కేశవరెడ్డి భావజాలం గురించి చర్చించారు.
దళిత సమస్యను దళితేతరులు రాయడంపై భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, చేతులున్నవాళ్ళంతా రాయలేనట్లే, సమస్యలు న్న వాళ్ళంతా తమ సమస్యల్ని సాహిత్యీకరించలేకపోవచ్చు. అందువల్ల రచయితలు ఎవరి గురించైనా రాయవచ్చు. కాకపో తే, ఆచరణాత్మకం కాని రాతలవల్ల ఒనగూరే ప్రయోజనం ముఖ్యం. అలా లేకపోతే ఆ వర్గాలు, ఆ వర్ణాలవారికేమీ ఒరగదు. వాళ్ల గురించి ఆలోచించడం, రాయాలనుకోవడమే ఒక బాధ్యత అనుకుంటే చర్చ మరోలా ఉంటుంది. అలా కాకుండా మారుతున్న భావజాలాలకు అనుగుణంగా తమ వైయక్తిక గుర్తింపుల కోసం రాసేవారి పట్లనే కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. అంతవరకు మాట్లాడలేని, రాయలేని వాళ్ళు మాట్లాడగలిగే, రాయగలిగే స్థాయికొచ్చినప్పుడు కూడా తామే మాట్లాడాలనో, తాము రాసిందే కళాత్మకంగా ఉంటుందనో తమ ఆధిక్యాన్ని ప్రదర్శించుకొనేవాళ్ళ పట్ల కూడా ఇలాంటి వ్యతిరేకత ఎదురవుతుంది. కేశవరెడ్డిగారు తాను రాసిన దానికి కట్టుబడి జీవించారు. ఇటువంటి వాళ్ళను అస్తిత్వవాదులంతా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూనే ఉన్నారు.
కేశవరెడ్డిగారి సాహిత్యంలోని మరో ముఖ్యాంశాన్ని కూడా సదస్సులో చర్చించారు. మార్క్సిస్టులు దళిత ఉపకులాల వారి గురించి మాట్లాడటం దళిత సమైక్యతను నాశనం చేసే భావాలకు బీజాలు నాటినట్లవుతుందేమోనని స్మశానందున్నేరు వంటి నవల రాసేనాటికి ఎదురైంది. అలాంటి వాటి విషయం లో వచ్చే భావజాల సంఘర్షణలను సిధారెడ్డిగారు తన ప్రసంగంలో స్పష్టంగా వివరించారు. అంతర్గత వర్గాధిపత్యాన్ని కూడా మార్క్సిజం సహించదు కదా! అలాంటప్పుడు ఈ సమస్యను ఈ కోణం నుంచి కేశవరెడ్డి ఆలోచించారేమో. మాదిగ, మాలల్లో ఉన్న సమస్యను తీసుకునే స్మశానందున్నేరు నవల ను రాసినప్పటికీ, దాన్ని ఒకే కులంలో జరిగినట్లు మార్పుచేసినట్లు కేశవరెడ్డిగారు
ఒక సందర్భంలో చెప్పారు. రచయిత మానవజీవితాల్లోని చిన్న చిన్న సంఘర్షణలుగా కనిపించే వాటి తీవ్రతను కూడా చిత్రించగలగాలి. అలాంటప్పుడు ఆ రచయి త చర్చోపచర్చలకు గురైనప్పటికీ, సాహిత్యాభిమానులందరికీ తర్వాత ఆ రచయిత ప్రేమపాత్రుడు కాగలుగుతాడు. కేశవరెడ్డి రచనల్లో ఈ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే తనది కాని జీవితాల్ని తన రచనలకు కేంద్రం చేసుకున్నాడు. లేకపోతే ఒక ఔట్ సైడర్ గానే ఆలోచిస్తే ఎరుకలు, యానాదులు, దళితులు, స్త్రీలు తనకు వస్తువులు కాకుండాపోయేవి.
కేశవరెడ్డి సాహిత్యం పీడితపక్షానికి చెందిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్న సమయంలోనే వాడ్రేవు వీరభద్రుడు దాన్ని భారతీయ పౌరాణేతిహాసాల దృక్కోణం నుంచి వీక్షించారు. ఆయన నవలలన్నింటిలోను అనుస్యూతంగా కొనసాగుతూ వస్తున్న ఒక ప్రధానపాత్ర భగవద్గీతఅనడమే కాకుం డా, సోదాహరణంగా మునెమ్మను కూడా ఈ కోణంలోనే సమన్వయించారు. సాహిత్యంలో రచయిత అలిగారిక్‌గా చెప్పే తాత్త్విక సత్యాల్ని పాఠకుడు అందుకోవడానికి ప్రయత్నించా లి. దీనిద్వారా సాహిత్య పునర్మూల్యాంకన సూత్రాన్ని బలంగా ముందుకు తీసుకొచ్చినట్లయ్యింది. అతడు అడవిని జయించాడు నవలిక కు నేడున్న పీఠికల కంటే ముందు, తొలి ప్రచురణల్లో వచ్చిన పీఠికలు కూడా ఈ విషయాలను సూచించినా, రచయిత అన్ని రచనల్లోనూ ఈ లక్షణాన్ని సమన్వయించడం ఈ కీలకోపన్యాసంలో కనిపించే ఒక ప్రత్యేకత.పాఠకుల్లో ఎక్కువమంది నమ్మిన మునెమ్మలో ఉన్నది మాంత్రికవాస్తవికతగా చెప్పే మ్యాజిక్ రియలిజవ్‌ు కాదనీ, దేశీయ సాహిత్య ప్రభావమేననడం కూడా కొత్త సమన్వయం. రచయిత ఎవరి పక్షం వైపు ఉండాలి? అలా ఉండకపోతే రాయకూడదా? మొదలైన ప్రశ్నల ద్వారా ఒక సాహిత్యతాత్త్విక చర్చను మరోసారి తెరతీశారు.దీన్ని కళ కళకోసమా? కళ ప్రజలకోసమా? అనే వాదాల్తో చూస్తే సరిపోతుందో లేదో ఆలోచించాలి.
అరుణకుమారిగారు కూడా కేశవరెడ్డి రచనలను దేశీయ తాత్త్విక భూమికతోనే పరిశీలించారు. తులనాత్మకపద్ధతిలో విశ్లేషిస్తూనే, ఆయన రచనలన్నింటినీ ముఖ్య మైన అంశాలను 14 విభాగాలుగా వింగడించి, ప్రాగ్రూపాలుగా చూడాల్సిన అంశా ల్ని కూడా మనముందుంచారు. ప్రపంచసాహిత్యంలో కేశవరెడ్డి సాహిత్య విశిష్టతను గ్రీకు సాహిత్యం నుంచి పరిశీలిస్తూనే ఆంగ్ల సాహిత్యంలో ప్రఖ్యాతిగాంచిన హెమింగ్వే ఓల్డ్ మాన్ అండ్ ది సీ వరకు వివిధ రచనలతోను, కేశవరెడ్డి రచనల్లో అంతఃసూత్రంగా ఉన్న అంశాల్ని లోతైన విశ్లేషణను అందించారు. ఇప్పటికే కేశవరెడ్డి రచనలను తులనాత్మకంగా అధ్యయ నం చేసే పని జరుగుతున్నా, పాశ్చాత్య ప్రభావాన్ని స్థిరీకరించే దిశగా చాలా పరిశోధనలు జరిగాయి. వాడ్రేవు వీరభద్రుడు, అరుణకుమారిగార్ల దృష్టితో కేశవరెడ్డి రచనలను అధ్యయనం చేయడం వల్ల తెలుగు సాహిత్య విశిష్టత, దేశీయ దృక్పథం ప్రపంచానికి తెలుస్తుంది.
తుమ్మల రామకృష్ణగారు సృజనకారుని సంఘర్షణను, కేశవరెడ్డి గారి సాహిత్య వైశిష్ట్యాన్ని వివరించారు. రచయిత అనుకున్నదే తడవుగా రచన రాదు. ఒకవేళ వచ్చినా ఒక్కోసారి దాని లో సాంద్రత ప్రశ్నార్థకమే అవ్వొచ్చు కూడా! రచయిత తాను చెప్పాలనుకున్నదాన్ని రచనగా వెంటనే వెలువరించాలనుకోవడం మంచిదే. కానీ, భారతీయ లాక్షణికుల్లో రాజశేఖరుడు అన్నట్లు ఒకవస్తువు.. కళగా మారే క్రమంలో అది రచయిత సమాధి స్థితిలోకి వెళ్ళగలిగితేనే సాధ్యం. ఆ భౌతిక సత్యం కళా సౌందర్యమై పాఠకునికి శాశ్వతానుభూతినిస్తూ సత్యం గోచరించేలా చేస్తుంది. కేశవరెడ్డి రచనలు అలా రూపుదిద్దుకున్న మానవీయ పతాకలుగా రెపరెపలాడగలుగుతున్నాయన్నారు. నేలవిడిచి సాము చేయని వాస్తవికవాదిగా చెప్తూనే, వందలాది సంవత్సరాలుగా సాహిత్యవస్తువుగా మారలేనివాళ్ళను సాహిత్యీకరించి, ఉదాత్త వస్తు రమణీయకత్వాన్ని తీసుకొచ్చిన రచయితగా అంచనా వేశారు. ఒక మానవతావాదిగా కేశవరెడ్డిని గుర్తించారు.
కేశవరెడ్డి రచనల్లోని రూప పరమైన చర్చను కూడా ప్రస్తావిస్తూ తుమ్మల రామ కృష్ణ గారు నవల, నవలిక, కథ, కథాని క వంటి ప్రక్రియాపరమైన లక్షణాలను సమన్వయించేటప్పు డు పరిశోధకులు, విమర్శకులు పాటించే ప్రమాణాల గురించి ఆలోచించాల్సిన అంశాలున్నాయన్నారు. తెలుగు కాల్పనిక సాహిత్యంలో ఆత్మ కథ, ఆత్మకథాత్మక నవల వంటి వాటి విషయంలో కూడా మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉం ది. హిందీ, మరాఠీ, తమిళ భాషల్లో ఆత్మకథాత్మక నవలలుగా చెప్పుకున్న రచనలు తెలుగులోకి వస్తున్నాయి. అలా వచ్చినదే భగవాన్ దాస్ హిందీలో రాసిన మై బంగీహూ నవల. అది నేను అంటరాని వాణ్ణి పేరుతో తెలుగులో వచ్చింది. ఓం ప్రకాశ్ వాల్మీకి మరాఠీలోరాసిన జూఠన్ తెలుగులోకి వచ్చిం ది. తమిళ రచయిత్రి బామ ఆత్మకథాత్మక నవలలుగా రాసిన కరక్కు, సంగతి కూడా తెలుగులో అనువాదమైయ్యాయి.
పి.వి.నరసింహారావు గారి ది ఇన్ సైడర్, దేవులపల్లి కృష్ణమూర్తి గారి లైఫ్ ఇన్ అనంతరామ తెలుగులో ఊరు వాడ బతుకు పేరుతో వచ్చింది. ఇవన్నీ ఆత్మకథాత్మక నవలలుగా చెప్తున్నారు. ఆళ్వారుస్వామి ప్రజలమనిషిని కూడా ఆత్మకథాత్మక నవలగా భావిస్తున్నారు. నవలకు, ఆత్మకథాత్మక నవలకు మధ్య గల లక్షణాలను సాధ్యమైనంత స్పష్టంగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. కేశవరెడ్డిగారి కుమార్తె మునెమ్మ గురించి సదస్సులో చెప్తూ తమ కుటుంబానికి చెందిన పాత్రలందులో ఉన్నాయన్నారు. కవిత్వం, కథ, నవల వంటి సృజనాత్మక సాహిత్య ప్రక్రియల్లో రచయిత జీవితంతో పాటు, తన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు కూడా పాత్రలుగా, సంభాషణలుగా మారుతుంటాయి. అయినా అవి వారిలో ఏ ఒక్కరి కి మాత్రమే చెందినవిగా చెప్పలేం. అలా తీర్చిదిద్దగలగడమే సాహిత్యాన్ని కళాత్మకం చేయడమవుతుంది. అలాంటప్పుడు ఆత్మకథాత్మక విషయాలుగా నిర్ధారించేటప్పుడు విమర్శకులు చాలా సంఘర్షణలకు గురవుతుంటారు. వీటిని తెలుగు సాహిత్యంలో లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది.
తెలుగులో కథ, కథానిక విషయంలో కూడా ఇలాంటి గందరగోళ నిర్ణయాలు కనిపిస్తున్నాయి.గురజాడ రెండుమూడు పుటల్లో రాసిన దిద్దుబాటునీ, కొలకలూరి ఇనాక్ నూరు పుటలకు మించి వర్ణించిన ఊరబావి రచనను కూడా కథానికలే అంటున్నారు. అలాగే నూరు పుటలకు మించకుం డా రాసిన కేశవరెడ్డి రచనలనూ నవలలనీ, వెయ్యిపుటలకు మించి రాసిన విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలు రచననూ నవలే అనడంలో విమర్శకులు భేదాల్ని పాటించడం లేదు. ఆంగ్ల సాహిత్యంలో నావెల్, నావలెట్ వంటి పారిభాషిక పదాలతో ఈ ప్రక్రియాపరమైన భేదాలను రచనల్లోని పదాలను బట్టి లక్షణాలను ఏర్పరిచే ప్రయత్నం కనిపిస్తుంది. తెలుగులో వల్లంపాటి వెంకటసుబ్బయ్య ఈ రకమైన కొన్ని ఆలోచనలను చర్చించే ప్రయత్నం చేశారు. కానీ, ఈ దిశగా లోతుగా పరిశోధనలు జరుగాల్సి ఉంది.
తీసుకున్న వస్తువు, దాన్ని పాఠకునికి అందించే నైపుణ్యం, ఈ రెండింటి ద్వారా మొదట వ్యక్తమైయ్యేది రచయిత వ్యక్తిత్వ మే. పరిశోధకుడు తనకు ముందున్న వారి అభిప్రాయాలను స్వీకరించి, వాటిని తన వాదన లేదా సిద్ధాంత సమర్థతకు ఉపయోగించుకున్నా, ఆ విషయాన్ని చెప్పాలి. అలా చెప్పకపోతే అది భావచౌర్యం కిందికే వస్తుంది. విమర్శ, పరిశోధకుల అభిప్రాయాలను తమ సిద్ధాంత గ్రంథాల విషయంలో చాలామం ది ఈ నియమాన్ని పాటించడంలేదు. ఒకరి అభిప్రాయాన్ని లేదా వారి సిద్ధాంతాన్ని తమ పరిశోధనల్లో వాడుకున్నప్పటికీ ఆ విషయాలు చెప్పడం మేధోహక్కులను గౌరవించడమవుతుంది.సమ్మెట నాగమల్లేశ్వరరావు క్లిష్టమైన విషయాల్ని కూడా చిన్న చిన్న వాక్యాలతో సరళంగా వివరించాడు. తన పత్రంలో కేశవరెడ్డినీ, సాహిత్యాన్నీ చాలా జాగ్రత్తగా అంచనా వేయడం, అభిప్రాయ ప్రకటనల్లో అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా సం యమనాన్ని ప్రదర్శించడం విద్యార్థులు గుర్తించాల్సిన అంశాలు.
కేశవరెడ్డి సాహిత్యం గురించి మాట్లాడే పేటెంటు హక్కుల్ని పొందినంత సాధికారికంగా మాట్లాడే వాళ్ళలో ఒకరైన అంబ టి సురేందర్ రాజు, ఇంచుమించు ఆ వయసులోని వాడ్రేవు వీరభద్రుడు, సందిని సిధారెడ్డి, తుమ్మలరామకృష్ణ, అరుణ కుమారి, జతిన్‌కుమార్ తదితరులు మొదటి తరానికి చెందినవాళ్ళు. కేశవరెడ్డి సాహిత్యాన్ని శాస్త్రీయంగా ముందుకు తీసుకెళ్ళాలనుకునే మల్లెగోడ గంగాప్రసాద్ లాంటివాళ్ళు రెండవతరానికి ప్రాతినిథ్యం వహిస్తుంటే, ఇప్పుడిప్పుడే సాహిత్యాన్ని చదువుతూ, పరిశోధన చేస్తూ, పత్రసమర్పణలకు ఆసక్తి చూపుతున్న సుమలత వంటి విద్యార్థులు మూడవ తరానికి ప్రాతినిథ్యం వహిస్తున్నట్లనిపిస్తుంది. అలా మూడు తరాలకు చెంది న వాళ్ళు ఈ సదస్సులో కేశవరెడ్డి సాహిత్యాన్ని చర్చించారు. ఆ స్థాయిలోని భావ పరిణతి కూడా ఆయా పత్రాల్లో కనిపిస్తుంది. ఈ సంచికలోని వ్యాసాలను చదివేటప్పుడు, ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు సదస్సులో సమర్పించిన మూడుతరాల వారి స్థాయిల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.అప్పుడే కేశవరెడ్డి సాహిత్య దర్శనంపై సమగ్రత సాధ్యమవుతుంది.
- డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి