(ప్రముఖ కథకుడు, విమర్శకుడు అంపశయ్య నవీన్ గారు నా పుస్తకం ‘దళితసాహిత్యం-మాదిగ దృక్పథం’ అనే పుస్తకాన్ని ఇండియాటుడే, 30 మార్చి 2010,తెలుగు , పుట: 51 లో సమీక్షించారు. ఆ వ్యాసాన్ని పాఠకుల సౌకర్యార్థం ఇండియా టుడే సౌజన్యంతో ఇక్కడ పునర్ముద్రిస్తున్నాను...దార్ల )
వర్గీకరణ అవసరాన్ని చాటిన వ్యాసాలు.
రిజర్వేషన్ లలో న్యాయం కోసం గళమెత్తిన కలాలు.
-అంపశయ్య నవీన్
దళితుల్లో ఎన్నో ఉపకులాలున్నప్పటికీ, ప్రధానమైనవి మాల, మాదిగ. మాలలు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారని మాదిగలు భావించారు. కాబట్టి వెనుకబడిన కులాల్లో ఏ, బి, సి, డి, ఈ అని వర్గాలు వారీగా రిజర్వేషన్లను ఎలా నిర్ణయించారో,
దళితుల విషయంలో అలాంటి వర్గీకరణ జరిగి మాలలకుఇంత శాతం, మాదిగలకు ఇంత శాతం, ఇతర ఉపకులాలకు ఇంత శాతం అని నిర్ణయించి,
ఆ ప్రకారం రిజర్వేషన్లను అమలు పరచాలని మాదిగ పోరాట సమితి పదిహేనేళ్ళుగా పోరాటం చేస్తోంది. ఐతే, ఇది దళిత వర్గాలను చీల్చడం కోసమే ఏర్పడిన కుట్ర అనీ, వర్గీకరించాడానికి వీల్లేదఇ మాల మహానాడు అంతే ఉద్ధృతంగా పోరాటం చేస్తోంది. ఇలా మాలలు, మాదిగలు విడిపోయి పోట్లాడుకోవడమనేది దళిత వర్గాల పట్ల సానుభూతి ఉన్న మేధావులందరినీ కలవరపరిచింది. వర్గీకరణే లక్ష్యంగా అనేక మంది మాదిగ వర్గం కవులు, రచయితలు కవితలు, కథలు రాస్తూ చాలా సాహిత్యాన్ని సృష్టించారు. ఈ సాహిత్యాన్ని విశ్లేషించే ప్రయత్నం దార్ల వెంకటేశ్వరరావు రాసిన “దళిత సాహిత్యం - మాదిగ దృక్పథం’’ అన్న ఈ పుస్తకంలో జరిగింది. మాదిగ వర్గానికే చెందిన దార్ల వెంకటేశ్వరరావు హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో లెక్చరర్. పుస్తకంలోని ఆరు వ్యాసాల్లోనూ వెంకటేశ్వరరావు లోతైన విశ్లేషణ, సమగ్ర పరిశీలన కనిపిస్తాయి. పుస్తకంలోని మొదటి వ్యాసం : రాగవాసిష్టం - నాటక వైశిష్ట్యం. ఆర్యులు బయటి నుంచి ఈ దేశంలోకి వచ్చారన్న వాదనను డాక్టర్ అంబేద్కర్ అంగీకరించలేదు. అంబేద్కర్ భావజాలంతో ప్రభావితుడైన బోయి భీమన్న తన నాటకం రాగ వాసిష్టిం లో దళితులు కూడా ఆర్యులేనన్న విషయాన్ని చెప్పారంటారు రచయిత.
రెండవ వ్యాసంలో దళితులు, దళితేతరులు దళిత సమస్యలను చిత్రిస్తూ రాసిన కథల పరిశీలన జరిగింది." కొలకలూరి ఇనాక్, ఎండ్లూరి సుధాకర్, బోయి జంగయ్య, అల్లం రాజయ్యలు తాత్త్విక, సాంస్కృతిక, ఆర్థిక కోణాలను వారి కథల్లో చూపడంతో నిజమైన దళిత జీవితం ఈ కథల్లోన కనిపిస్తుంది. మాల, మాదిగల మధ్య సమస్యలకు అగ్రవర్ణాల వారే కారణమనడంలో కొంత వాస్తవమున్నా, అదే పరిపూర్ణ సత్యం అనుకోవడానికి వీల్లేదు''
అంటాడు దార్ల. ఈ మాటల్లో చాలా నిజముంది. ఇక, వర్గీకరణ వాదానికి శాస్త్రీయ దృక్పథం అన్న వ్యాసంలో "వర్గీకరణ అనేది అంబేద్కరిజంలో ప్రధాన అశయం' అంటాడు రచయిత. ఆచార్య కొలకలూరి ఇనాక్ కథల్లో వస్తు వైవిధ్యం, సామాజిక వాస్తవికత అన్న వ్యాసంలో ఇనాక్ కథల సమగ్ర పరిశీలన జరిగింది. సంపుటిలో చివరి వ్యాసాన్ని లండన్లో ఉంటున్న గుండిమెడ సాంబయ్య అనే దళిత మేధావి రాశారు. సాంబయ్య రాసిన ఈ వ్యాసంలో దళిత సమస్యలను గూర్చి దార్ల వెంకటేశ్వరరావు రాసిన వ్యాసాల పరిశీలన జరిగింది. ఈ వ్యాసాలన్నింటిలోనూ వర్గీకరణ జరిగి తీరాలన్న బలమైన వాదన కనిపిస్తోంది.
(30 మార్చి 2010,ఇండియా టుడే , తెలుగు , పుట: 51)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి