"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

27 September, 2016

సామాజిక వాస్తవిక చిత్రాలు ( ప్రాతినిథ్య -2015 కథల సమీక్ష

(ప్రాతినిథ్య -2015 కథాసంకలనానికి రాసిన నాముందుమాటలోని కొంతభాగాన్ని నమస్తేతెలంగాణ పత్రిక వారు, 26 సెప్టెంబరు 2016 న సాహిత్యానుబంధం ‘చెలిమి’లో ప్రచురించారు.  పాఠకుల సౌకర్యార్థం  ‘నమస్తేతెలంగాణ’ పత్రిక వారి సౌజన్యంతో దీన్ని యథాతధంగా ఇక్కడ పునర్ముద్రిస్తున్నాను...దార్ల )

సమకాలీన సమాజాన్ని అర్థం చేసుకోవడం అంత సులభమైన విషయమేమీకాదు. భిన్న సంక్లిష్టతలతో నిండిన ఈ సమాజంలో భిన్నవైరుధ్యాలు కూడా ఉంటాయి. వీటిని అవగాహన చేసుకోవడానికి రకరకాల సాహిత్య ప్రక్రియలు మనకు సహకరిస్తుంటాయి. వాటిలో కథాసాహిత్యం ఒకటి. తెలుగు సాహిత్య చరిత్రను గమనించినట్లయితే, చాలా కాలం వరకు కథాసాహిత్యాన్ని గుర్తించకుండానే సాహిత్య చరిత్ర రచనా నిర్మాణం కొనసాగింది. కొంతమంది సాహిత్యాన్ని గుర్తించినా, మరికొంతమందిని ఉద్దేశపూర్వకంగానే విస్మరించారనేది జగమెరిగిన సత్యం. నేడు తెలుగు కథాసాహిత్యం కూడా ఆ మార్గంలో పయనిస్తున్న క్రమంలో ప్రాతినిధ్యముందుకొచ్చింది. అన్ని అస్తిత్వాలకు వేదికగా మారాలనే ప్రయత్నం చేస్తున్నది. దీనిలో భాగంగానే భిన్న సామాజికవర్గాలకు గొంతుగా మారుతున్నదని ప్రాతినిధ్య చేస్తున్న కథల ఎంపికను బట్టే తెలుస్తున్నది.
సమకాలీన సమాజంలో కనిపించే అనేక సమస్యల్ని ప్రాతినిధ్య-2015 కథల్లో రచయితలు, రచయిత్రులు వస్తువులుగా స్వీకరించారు. కొన్ని కాలాతీతమైన వైతే, మరికొన్ని సమకాలీన సామాజిక పరిస్థితుల్ని వివరించేలా ఉన్నాయి. భారతీయ సమాజాన్ని కేంద్రంగా చేసుకొని రాసిన కథలు కొన్నయితే, ప్రపంచ వ్యాప్త సమస్యల్ని చిత్రించినవి మరికొన్ని ఉన్నాయి. స్థానిక జీవి త స్పృహను కలిగిస్తూనే, విశ్వజనీనతను ప్రదర్శించే కథలు కూడా ఉన్నాయి. కథాసాహిత్య విమర్శకు కొత్త కోణాల్ని అందించే కథలు కూడా దీనిలో ఉన్నాయి. 

వస్తుపరంగా చూసినప్పుడు ఒకప్పుడు భారతీయ సమాజానికే చేటుకల్గించినప్పటికీ, నేడు విశ్వవ్యాప్తమై తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తున్న కుల ప్రభావాన్ని భిన్నపార్శ్వాల్లో పట్టుకున్నారు. మహిళల సమస్యల్ని శక్తివంతంగా చిత్రించిన అనేక కథల్ని ఈ ప్రాతినిధ్యలో తీసుకున్నారు. నిర్మాణపరంగా చూసినప్పుడు కొన్ని కథలు శాశ్వతమైన ప్రభావాన్ని వేయగలుగుతాయనిపిస్తున్నది. సంక్లిష్ట సమాజాన్ని సంక్లిష్టమైన నిర్మాణంతో చెప్పగలిగినప్పుడే ఆ కథ పాఠకుణ్ణి వెంటాడుతుంది. కథ రెండు మూడు పేరాల్ని చదవగానే కథలో చెప్పేదేమిటో తెలిసిపోతే, నిర్మాణపరంగా ఆ కథ పాఠకుని మనసుని జయించలేదు. పాఠకుని మనసును జయించే కథలు దీనిలో చాలా ఉన్నాయి.
 
భాషా దృష్టితో చూసినప్పుడు తెలంగాణ, రాయలసీమ భాషను సహజంగా ప్రయోగించిన కథలున్నాయి. తెలుగు, కన్నడ, ఆంగ్ల, హిందీ భాషల ప్రభావంతో వెలువడిన కథ కూడా ఒకటి ఉంది. అట్టడుగు జీవితాల వారి భాషలోని కమ్మదనాన్ని అందించిన కథలున్నాయి. క్రైస్తవ సంస్కృతిని ప్రతిబించించే కథలున్నాయి. భావజాలపరంగా చూసినప్పుడు కుల, మతాల ప్రభా వం వారి జీవితంపైనా, వారి ఆర్థిక స్థితిగతులపైనా ఎలా పనిచేస్తుందో చెప్పే కథలు ఎక్కువగానే ఉన్నాయి. వస్తువును పాఠకుడికి అందించడంలో రెండు, మూడు కథలు తప్ప మిగతావన్నీ కళాత్మక విలువలతోనే శోభిల్లాయి. రెండు కథలు రిపోర్టింగ్ టెక్నిక్ అనుసరించినా, దాన్ని కళాత్మకంగా మార్చగలగడంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకటి రెండు కథల్ని తిరిగి రాస్తే భావాభివ్యక్తిలో మరింత సహజత్వానికి దగ్గరగా ఉండేవనిపించింది. బాల్యం, యవ్వనం, వివాహం, వివాహానంతర జీవితం, వృద్ధాప్యం... ఇలా ఒక క్రమాన్ని చూడగలిగే కథలున్నాయి.
కథ, నవల అనేది హృదయ సంవేదనతో కూడిన వాస్తవిక సంఘటన గానీ, కొన్ని ఘటనల్నీ గానీ, చారిత్రకాంశాల్ని గానీ కథా కథన పద్ధతిలో వ్యక్తీకరిస్తుంటారు. అయితే, ఆ వ్యక్తీకరణ కళాత్మకంగా మారితేనే సృజన సాహిత్యమవుతుంది. దీనికి రెం డు అంశాలు దోహదపడుతుంటాయి.మొదటిది:హృదయ సంవేదనకు కారణమైన సంఘటన గురించి గానీ, అనేక సంఘటనల గురించి గానీ, అంతే సంవేదనను కలిగించేలా వ్యక్తీకరించగలగాలి. తాదాత్మ భావనతో కథనీకరించడం వల్ల ఈ లక్షణం అలవడుతుంది. రెండోది: కథా కథన పద్ధతిలో వివరించడం వల్ల వాస్తవంయథాతథంగా ఆవిష్కృతం కాదు.
కానీ, సత్యం అవగతమవుతుంది. ఫోటో తీసినట్లో, వీడియోలో చిత్రీకరించినట్లో ఉన్నది ఉన్నట్లు మరొకరికి తన అనుభవాన్ని కథనీకరించ డం అసాధ్యం. కాబట్టి అక్కడ సంభాషణాల్లోను, స్థల కాలాల్లోను కాల్పనికతచేరుతుం ది. అది కళాత్మకమైనప్పుడు శ్రోత ల్ని, పాఠకుల్ని ఆకర్షించి, వాళ్ల హదయాలపై శాశ్వత ముద్ర వేయగలుగుతుంది. అలా ముద్ర వేయ గలగడం అనే లక్షణమే సాహిత్యాంశం. దానిలోనే కాల్పనికాంశం ఉంటుంది. అంతేకానీ, వాస్తవాన్ని రిపోర్ట్‌లా కథనీకరిం చడం మాత్రమే కథ అనిపించుకోదని గుర్తించి రాసిన కథలు దీనిలో ఉన్నాయి.
ట్రాఫికింగ్ గురించిన వాస్తవ సంఘటనల సమాహారంగా వి. శాంతి ప్రబోధిని నిప్పులనడకలోంచి.. కళ్యాణి కథను అందించారు. నెరేటర్ కథను బాగా నడిపించారు. పెళ్ళిచేసుకున్నామె తన తొలి భర్తను వదిలేసి, ఒక రిక్షాఅతనితో వెళ్ళిపోవడం, అతనికో కొడుకు పుట్టినా, తనకు కావాల్సిందేదో ఆమెకు దొరక లేదు. అతను రిక్షాలాగుతూ, తాగుబోతవుతాడు. ఆమె వేశ్యగా మారిపోతుంది. తనకు మొదటి భర్తవల్ల పుట్టిన కూతుర్ని వేశ్యావాటికకు అమ్మేస్తుంది. తప్పించు కున్న ఆ అమ్మాయే కల్యాణి. ఆ కళ్యాణిని మరలా గుర్తించి, ఒక స్వచ్ఛంద సంస్థకు ఒప్పచెప్తాడు తండ్రి కాని కొత్త తండ్రి. ఆ సంస్థను నిర్వహించే యజమాని కళ్యాణిని చూసినప్పుడు తన ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయిన తన కూతుర్ని గుర్తుచే సుకుంటుంది. 
తెలంగాణ భాషలోని మాధుర్యం ఈ కథని మరింత పరిమళ భరితం చేస్తుంది.కథ చిన్నదే అయినా, ఖదీర్ బాబు రాసిన సెల్పీ గాఢమైన ప్రభావాన్నే వేస్తుంది. భార్యాభర్తలు ఉద్యోగాల్లో ఉన్నప్పుడు, అనివార్యమైన బదిలీల వల్ల వచ్చే తాత్కాలిక యెడబాటు, క్రమే పీ వాళ్ళనెలా శాశ్వతంగా దూరం చేస్తుందో చెప్తుంది. ప్రపంచీకరణ, మల్టీనేషనల్ కంపెనీలు జీవితంలో భాగమైపోయిన తర్వా త ఒంటరితనాన్ని వెంటేసుకొచ్చే వ్యాధులు, వాటివల్ల కలిగే శారీరక, మానసిక సంక్షోభాలెన్నింటినో స్ఫురింపజేస్తుందీ కథ. ఒకరు తన ఉన్నత చదువుల్లో పడి, అది పూర్తయిన తర్వాత తన కు తెలియకుండానే కుటుంబ బాధ్యతల్ని మోసి, మోసపోతున్న వైనాన్ని జి.వెంకట కృష్ణ ఉబ్బిన కన్ను కథలో వర్ణించాడు.
 
పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేకనో, తానో బానిసగా మారడానికిష్టంలేకనో సమాజంలోని పిల్లల్నే తనపిల్లలుగా భావిస్తూ, స్వేచ్ఛగా జీవించే జీవితం కూడా ఒకటి ఉంటుందని, పిల్లల్ని పెంచడం, భర్త కోసమే ఎదురుచూస్తూ, అన్నీ తానే అన్నట్లు జీవించడమే జీవితం కాదేమోననీ, అది క్రమేపీ మొనాటమీకి, ఒంటరి తనానికి దారితీసి, తననొక నిస్సహాయురాలిలా చేసే ప్రమాదముందని చెప్పేకథ పింగళి చైతన్య రాసిన తనదే ఆ ఆకాశం .
 
సమకాలీన సమాజంలోని సంక్లిష్టతలను అర్థం చేసుకోవడమెంత క్లిష్టమైందో సామాన్య తన శిల్పనైపుణ్యంతో నడిపించిన కథ అంతిమం. మనం చేసే పనుల్నీ, మన ఆలోచనల్నీ మన సమాజమెలా ప్రభావితం చేస్తుందో మనం గుర్తించలేనంతగా జీవిస్తున్నామని తెలుపుతుందీ కథ. మనిషి ప్రవర్తన.. ఆ చుట్టూ ఉండే సమాజం కల్పించే ప్రభావాన్ని బట్టి ఉంటుంది. కానీ, మొదట బాధితుడయ్యేదీ, బాధ్యుడయ్యేదీ మాత్రం వ్యక్తే. అలా వ్యక్తిగతంగా కనిపించే ప్రభావం వ్యవస్థని నాశనం చేసేదిశగా కూడా పోతుంది. దీన్ని గుర్తించమంటుందీ కథ. కథను నడిపించడంలో సామాన్య పరిణతి సాధించారనడానికి ఈ కథ గొప్ప నిదర్శనం. కథలో వస్తువు, పాత్రలు, సన్నివేశాలు, వాటిని నడిపించిన తీరు వ్యూహాత్మకం గా సాగాయి. పోటీతో ప్రారంభమైన ఈ కథలో ఒక కంపెనీ లో క్రియేటివ్ హెడ్ కోసం జరుపుతున్న పరీక్ష కొత్తపద్ధతిలో కొనసాగుతుంది. కథలో చెప్పిన నాలుగు చిత్రాలు, నాలుగు సామాజిక సమస్యలకు సంబంధించినవి. అత్యాచారం-ఉరి, పర్యావరణం-శాస్త్రవేత్తలు, మొబైల్ ఫోన్- యువతీయువకు లు, రచయితలు- నిబద్ధత వంటి అంశాల్ని కేంద్రీకరించే చిత్రాలుగా వాటిని సంక్షిప్తీకరించుకోవచ్చేమో. వీటిని వ్యాఖ్యానించిన అంశాలతో పాటు, సంగ్రహంగా చెప్పిన ఐదవ అంశం కథకంతా ప్రాణం. క్రియేటివ్ హెడ్‌గా ఎవర్ని ఎంపికచెయ్యాలో పాఠకుడే ఒక నిర్ణయానికి వస్తాడు.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచవ్యాప్తంగా కొనసాగిన పైశాచికత్వాన్ని కళ్ళముందుంచిన కథ మీరా (THE LAST FRAME). జ్యూయిష్ ప్రజలపై జరిగిన అరాచకత్వాల్ని చిత్రిస్తూ కొన్ని ఆంగ్ల సినిమాలు వచ్చినా, మన్నం సింధు మాధురి రాసిన ఈ కథ మాత్రం పాఠకుల మనసు తెరలపై నిత్యం కదిలాడేలా చేస్తుంది. కథంతా ఒక EPICలా అనిపిస్తుంది. సహజమైన భాషతో అలరిస్తూ, మానవత్వ పరిమళాలు వెదజల్లడానికి ప్రాం తాలు అతీతమనే దష్టిని కలిగిస్తుంది. టాగోర్ అన్నట్లు నిజమైన స్వేచ్ఛ దొరకిన చోటే మనిషి తన అస్తిత్వాన్ని నిలుపుకుంటాడు. దాన్నే తన శాశ్వత నివాసం చేసుకుంటాడు. మానవత్వానికి ముగ్దుడైతే, వాళ్ళకు తనను తాను అర్పించుకుంటాడు. మీరా అదే చేసింది. మీరా పాఠకుల్ని కదిలిస్తూ, కన్నీళ్ళు పెట్టిస్తుంది. ఈ కథ భారతదేశం పట్ల ప్రేమాభిమానాల్ని పెంచుతుంది. మీరా నివసించిన ప్రాంతమెక్కడుందో చూడాలనిస్తుంది. ప్రపంచీకరణ యుగంలో ఉన్న మనం డయాస్పోరా అనే పారిభాషిక పదాన్ని కేవలం జ్యూయిష్ తెగల అస్తవ్యస్థ జీవితాలనాధారంగా మాత్రమే చూస్తే సరిపోదు. వలసల్లోని తాత్త్వికతను అర్థంచేసుకోమంటుంది. నేడు ప్రాంతీయ వాదం, దేశభక్తిల గురించి చర్చోపచర్చలు చేసేవాళ్ళని ట్రాన్సనేషనలిజం (TRANSNATIONALISM) లో మానవుని అస్తిత్వాన్ని నిర్ణయించే ప్రమాణాల్ని సరిచూసుకోమంటుంది. వీటిన్నింటికీ అతీతమైన మానవీయ విలువల్ని గుర్తించమంటుంది.
స్త్రీ-పురుషుల మధ్య వివాహాలు నిష్కళంకమైన ప్రేమతో జరగాలి గానీ, సానుభూతితోనో, మరో ప్రయోజనాలతోనో జరిగితే అవి వారి మధ్య అంతరాల గోడల్ని పెంచడానికే తోడ్పడతాయి తప్ప, ప్రేమాభిమానాల్ని పెంచలేవని చెప్పే కథ సాయి పద్మగారి గాలికీ కులముంది కథ. కానీ, కథకు పెట్టిన పేరే వాచ్యం అయిపోయింది. అల్లం వంశీ రాసిన మిరకిల్ కథలో మూడుతరాల నుంచీ అమలవుతున్న రిజర్వేషన్ల తీరుతెన్నుల్ని కళ్ళముందుంచుతూనే, వాటిని అమలు చేసుకోవడంలో రావాల్సిన సంస్కరణల్ని సున్నితంగానే మనముందుంచారు.
 
కథలో కొంతమంది తమ వాదనల్ని, సిద్ధాంతాల్ని చొప్పిస్తుంటారు. కొన్ని సార్లు వాటి కోసమే కథలు కూడా రాస్తుంటారు. కానీ, ఆ రచన పాఠకుల్ని ఒక సృజన ప్రపంచంలో విహరించేలా చేయగలగాలి. దేనికోసం ఈ కథ రాసారో పాఠకులు పదే పదే ఆలోచించగలిగేలా ఉండాలి. ఇదంతా పాఠకుడిలో ముద్రించుకున్న దశ్యం ద్వారా జరగాలి. అలాంటి కథల్లో పి. విక్టర్ విజయ్ కుమార్ మూడ్రాల్ముక్రాయి ఒకటి. 
వనజ తాతినేని మర్మమేమి కథలో సమకాలీన సమాజంలో యువతులు స్కార్ఫ్, నఖాబ్‌లను ధరించడం, వాటి వెనుకున్న మర్మాల్ని విప్పి చెప్పే ప్రయత్నం చేయడానికి ఉద్దేశించిందనిపిస్తుంది. వస్తువు బలమైనదైనా, దాన్ని మరింత సమర్థవంతంగా చెప్తే బాగుండేది. 
నిప్పుల నడకలోంచి…కళ్యాణి, కట్ట, మనిషి పగిలిన రాత్రి, నేను తోలు మల్లయ్య కొడుకుని, మిరకిల్ మొదలైన వాటిని తాదాత్మభావనతో వెలువడిన కథలుగా చెప్పుకోవచ్చు. తనదే ఆ ఆకాశంలో ఫెమినిజమ్ లోని భిన్నపార్వ్వాల్ని చర్చించే ప్రయత్నం జరిగిందనిపిస్తుంది. ఈ కథతో పాటు గాలికీ కులముంది, ముదిమిసిమి, నేను తోలుమల్లయ్య కొడుకుని, చమ్కీపూల గుర్రం కథల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే వాటిని సిద్ధాంతాలకు అనుగుణంగా రాసినట్లుగా అనిపిస్తాయి. జీవితానుభవాల నుంచే సిద్ధాంతాల్ని పిండుకోవాల్సి ఉంటుందనే కథలు కూడా దీనిలో ఉన్నాయి. 
వీటిలో అంతిమం, మూడ్రాల్ముక్రాయి, ఉబ్బిన కన్ను మొదలైన కథలు వీటికి ఉదాహరణలుగా నిలుస్తాయి. మొత్తం మీద ప్రాతినిధ్య తీసుకొస్తున్న ఈ కథల న్నీ సమాజంలోని అట్టడుగు పొరల్లో కనిపించే వేదనల్ని దృశ్యీకరించిన సామాజిక వాస్తవిక చిత్రాలుగా అభివర్ణించవచ్చు. దీని లో భిన్న వర్గాలకు, భిన్న కులాలకు, భిన్న మతాలకు, భిన్న జెండర్స్‌కీ, తెలుగు భాషలోని భిన్న మాండలికాలకు ప్రాతినిధ్యం లభించింది. ఇలా...2015లో వచ్చిన మంచి కథల్ని ఎంపిక చేసి, సమాజంలో తమ గళం వినిపించడానికి స్పేస్ నోచుకోనివాళ్ల ఉమ్మడి స్వరంగా వీటిని ఒకచోట నినదించేలా చేస్తున్న సంపాదకవర్గాన్ని అభినందిస్తున్నాను.

-డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు, 

(2015 ప్రాతినిధ్య కథా సంకలనానికి రాసిన ముందు మాటలోంచి కొన్ని భాగాలు...)No comments: