(దీన్ని చదవాలనుకునేవారు దీనిపై మౌస్ ని పెట్టి, రైట్ క్లిక్ ఇచ్చి Open link in new window ని క్లిక్ చేయండి. పెద్దగా చేసుకొని చదవవచ్చు)
ఇండియాటుడే సౌజన్యంతో.....
పాత వస్తువునే కొత్త దృష్టితో చూద్దామా?
(ఏ విషయాన్నయినా స్థల, కాల, సందర్భాల చూపుతో చూడాలని ప్రతిపాదిస్తూ అవగాహన
కల్పించే వ్యాసాలు)
పునర్మూల్యాంకనం (వ్యాససంపుటి), రచయిత: దార్ల వెంకటేశ్వరరావు
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, చిక్కడపల్లి, హైదరాబాద్-20.
పేజీలు: 141; వెల: రూ.15)
దార్ల వెంకటేశ్వరరావు కొన్ని కీలకమైన సాహిత్య సంబంధియైన అంశాలను
ముందుంచుకుని, తనదైన దృష్టి కోణంలో
పరిశీలించారు. ఇప్పటికే ఆయా విషయాలపై ముద్రించుకు పోయిన అనేకానేక అభిప్రాయాలను, వాదనలను సహేతుకంగా విశ్లేషిస్తూ తన అవగాహన మేరకు
కొన్ని కొత్త విలువలను ప్రతిపాదిస్తూ, ఆపాదిస్తూ ఆ అంశాలనే మళ్లీ విలువగట్టి కొత్త దృష్టితో పునర్మూల్యాంకనం
చేయవలసిన అవసరమున్నదని ఒక అద్భుతమైన ఆలోచించ దగ్గ ప్రతిపాదన చేశారీ గ్రంథంలో. చరిత్రను
తవ్వుతూ తవ్వుతూ సత్యాన్ని ఆవిష్కరించాలనే తపనతో తహతహలాడే జిజ్ఞాసువులందరూ
వెంకటేశ్వరరావు ఆలోచననూ, కృషినీ
అభినందించాల్సిందే. దార్ల మొదటి నుంచీ పరిశోధన రంగంలో ప్రయోగాలు చేపడ్తున్న
వ్యక్తిగా, ఎందరో ఎం.ఫిల్., పిహెచ్. డి.
విద్యార్థులకు మార్గదర్శనం చేస్తూ ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో
అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తూ ఆధునిక సాహిత్యంపై విస్తృత అధ్యయనాలను
కొనసాగిస్తున్న వ్యక్తి. కాబట్టి, ఈ పుస్తకంలోని పదిహేను సాహిత్య వ్యాసాల్లో అధ్యయనశీలత
గల పాఠకుల కోసం విలువైన సమాచారాన్నీ, వివరణలనూ, విశేషాలనూ
ఆసక్తికరంగా అందించారు. కాగా, ఈ
వ్యాసాలన్నీ దాదాపు అత్యంతాధునికమైన సందర్భాలకు సంబంధించినవి కావడం వల్ల వాటికి
వర్తమానానికి వర్తించే అదనపు విలువ చేకూరింది. అయితే,
ఒక విషయం గురించి ఇప్పడు ఎలా విలువ కట్టాలి అన్నప్పడు. ఇప్పటి వరకు
అదే విషయం ఏ విలువలతో స్వీకరించబడుతోందో, పాఠకులు దాన్ని ఈ రోజు వరకు ఎలా చూసి అర్ధం చేసుకుంటున్నారో
స్పష్టంగా తెలియాలి. లేకుంటే తులనాత్మకత సాధ్యం కాదు. ఇది వెలుతురు అని
తెలుసుకోవాలంటే అది చీకటి అని తెలియాలి. ఈ కోణంలో చాలా స్పష్టమైన విశ్లేషణ, సోదాహరణమైన ఉటంకనలు,
వివరణలు, నేపథ్య చర్చలు, ప్రస్తావనలు ఈ వ్యాసాల్లో ఒక క్రమ పద్ధతిలో చోటు
చేనుకున్నాయి. అందువల్ల ఈ గ్రంథంలోని వ్యాసాలన్నీ పరిపూర్ణంగా, అర్థవంతంగా భాసిస్తున్నాయి.
ప్రధానంగా మైనారిటీ సాహిత్యం: మరో చూపు, ప్రపంచీకరణ అంటే ఏమిటి? భిన్న పార్శ్వాల్లో ప్రపంచీకరణ కవిత్వం, ప్రాంతీయ సాహిత్య విమర్శ, మాదిగ సంస్కృతిని
అంటనివ్వని అంటరానివసంతం, తొలి తెలుగు దళిత గేయం ఏది? వంటి వ్యాసాలు సీరియస్ గా అధ్యయనాశక్తి కలిగి, సూక్ష్మస్థాయిలో
సత్యాన్ని గ్రహించాలనే ఆసక్తిగల పరిశోధకులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ
వ్యాసాలన్నీ ఒక సరికొత్త కోణంలో వాస్తవాలను దర్శింపజేస్తూ,
నూతన ద్వారాలను తెరచి కొంగ్రొత్త వాకిళ్లను పరిచయం చేస్తాయి. పాఠకుని
ముందు అధ్యయన పరిధి విశాలమై పఠనానందాన్ని మిగుల్చుతుంది.
తొలి తెలుగు మాదిగ గేయం ఏది? అనే వ్యాసంలో శ్రమ నుండీ,
పని నుండీ పాట పుట్టిందన్న వాస్తవాన్ని రచయిత చాలా సరిగ్గానే
ప్రస్తావిస్తూ ప్రధాన శ్రమ కులాల్లో ముఖ్యమైన మాల,
మాదిగల గేయ రచనల గురించి జరిపిన అధ్యయనాల్లోంచి ఒక అజ్ఞాత కవి రాసిన మాలవాండ్ర పాటను 1909 సంవత్సర కృతిగా ఉటంకించారు. ఇవి చరిత్రకు
సంబంధించిన శోధనలు జాగ్రత్తగా, సాధికారంగా
వీటిని తడమాలి. ఈ దిశలో ఎన్నో పరిశోధనలు చేసిన ఇతర సాహిత్యకారులున్నారు. వాళ్ల
ప్రస్తావనలనుబట్టి మాదిగ కులాన్నుంచి చింతపల్లి దున్ను ఇద్దాసు లాంటి కవి
వచ్చినాడు. బహుశా ఇతడు తొలి దళిత కవి కావచ్చు. (చూడండి. ముంగిలి – డాక్టర్
సుంకిరెడ్డి నారాయణ రెడ్డి-తెలంగాణ ప్రాచీన సాహిత్యం- పుట: 151).
‘ప్రాంతీయ సాహిత్య విమర్శ’ అనే వ్యాసంలో దార్ల చెప్పినట్లుగా
ఇన్నాళ్లూ చరిత్రకారులు వక్రీకరించిన అనేక అతి ముఖ్యమైనముద్రలను పునర్మూల్యాంకనం
చేసి సవరించవలసి ఉంది. ముంగిలి లో నారాయణ రెడ్డి ఆధారాలతో సహా
చెప్పినట్టుగానే ఆదికావ్యంగా మహాభారతాన్నీ,
ఆదికవిగా నన్నయనూ తెలంగాణ సాహిత్య పరిశోధకులిప్పడు అంగీకరించడం లేదు. కవుల
ప్రాంతాల్ని గుర్తించి, ప్రాంతీయ
సాంస్కృతిక వారసత్వాన్నీ పునర్నిర్వచిస్తున్నారు. ఈ తరంలో అస్తిత్వ స్పృహ
హర్షించదగ్గ కృషే.
‘మన నేల ఒకటే
మన జాతి ఒకటే
అయితే
బతుకులొక్కతీర్గఎందుకు లెవ్వరా అయ్య’ అని
ప్రశ్నిస్తూ ‘నూతన ప్రాంతీయ అస్తిత్వ చైతన్యంతో ప్రాంతీయ భావనకు సశాస్త్రీయ
అవగాహనను కలిస్తున్న సోయి ఇప్పడవసరమే’ అని అనుభవాలు విప్పి చెబుతున్నాయి. ఆదే
విధంగా మాదిగ సంస్కృతిని అంటనివ్వని ‘వసంతం’ అన్న వ్యాసంలో జి. కల్యాణరావు
రాసిన అంటరాని వనంతం గూర్చి రచయిత విశ్లేషించారు. ‘దయచేసి మళ్లీ మళ్లీ మాదిగల్ని
సాహిత్యంలో మోసం చేయవద్దు. ఇలాంటి మాల వసంతంను అంటరాని వసంతంగా ప్రచురించుకున్నా, భవిష్యత్తులోనైనా స్పష్టంగా మాదిగ వసంతం
రాయాలనుకునే వాళ్ల ద్వారాల్ని ముందుగానే మూసేయొద్దు’
అని దార్ల విజ్ఞప్తి చేయడం సముచితంగానే ఉంది.
‘మా ముత్తాత చెప్పులు కుట్టేవాడు
మా తాత కూలీపనికెళ్లేవాడు
మా అయ్య అక్షరం కోసం ఆశగా
చూసేవాడు
నేనిప్పుడు కవిత్వం
రాస్తున్నాను
రేపు నా కొడుకు ప్రొఫెసరవుతాడు’
అని రచయిత తన సొంత కవితా పంక్తులను
ఉదాహరించి, అయిదు తరాల దళితులు సాధిస్తున్న అభివృద్ధి పరిణామాన్ని బలంగా
వ్యక్తీకరించడం బాగుంది.
గత సాహిత్యాన్నీ కీలకఘటనలనూ,
చారిత్రక సందర్భాలనూ కొత్తదృష్టితో,
పరిశోధక ఆధారాలతో, వర్తమాన
సాపేక్ష అవగాహనతో పునర్మూల్యాంకనం చేసి అవసరమైతే కొన్ని ముద్రలను
పునర్నిర్వచించాలి.
-రామా
చంద్రమౌళి
31
మే,
2011 ఇండియా
టుడే 4
Mobile:09390109993
ౌ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి